భారత రాజ్యాంగంలో 4 A భాగంలో 51 A అధికరణలో ప్రాథమిక విధులను పొందుపర్చారు. దేశం కోసం, సమాజం కోసం పౌరులు నిర్వర్తించాల్సిన కొన్ని బాధ్యతలే ప్రాథమిక విధులు. వీటిని మూల రాజ్యాంగంలో పేర్కొనలేదు. 1976లో ‘42వ రాజ్యాంగ సవరణ’ ద్వారా చేర్చారు. వీటికి ఒకప్పటి సోవియట్ రష్యా రాజ్యాంగం స్ఫూర్తిగా నిలిచింది. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చాలని సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచించింది. ప్రస్తుతం మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 6ను ‘ప్రాథమిక విధుల దినోత్సవం’గా జరుపు కొంటాం.
దేశరక్షణకు కట్టుబడి ఉండాలి. దేశసేవకు అన్నివేళలా సంసిద్ధంగా ఉండాలి.
ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. హింసను, విధ్వంస విధానాలను త్యజించాలి.
దేశం అత్యున్నత స్థితిలో ఉండేలా అన్ని రంగాల్లో రాణించడానికి వ్యక్తిగతంగా, సమాజపరంగా ప్రయత్నించాలి.
భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను కాపాడాలి.
శాస్త్రీయ దృక్పథం, మానవత్వపు విలువలను పెంపొందించాలి.
6 నుంచి 14 ఏండ్ల వయసు పిల్లలు చదువుకోవడానికి పెద్దలు తగిన అవకాశం కల్పించాలి.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్య్ర పోరాట ఆదర్శాలను గౌరవించాలి.
పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఉన్నదానిని మరింత మెరుగు పర్చుకోవాలి.
రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. అందులో పేర్కొన్న ఆదర్శాలు, సంస్థలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించాలి.
సుసంపన్నమైన, వైవిధ్యభరితమైన భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలి.
దేశ ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించాలి. స్త్రీలను కించపరిచే పద్ధతులను విడిచిపెట్టాలి.
1976లో ప్రాథమిక విధులు 10 మాత్రమే ఉండేవి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారు. ఈమేరకు ప్రాథమిక హక్కుల్లో 21 A అధికరణను చేర్చారు. ఇందులో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించారు.
మరో విషయం ఏంటంటే.. ప్రాథమిక విధులను పాటించడంలో ఎవరూ బలవంతపెట్టరు. వీటిని అమలుచేయాలని న్యాయస్థానాలకు వెళ్లడానికి అవకాశం లేదు.