భోజనం చేసిన తర్వాత ఒక్కోసారి కడుపులో గ్యాస్, ఉబ్బరం, అజీర్తి, గుండెలో మంట లాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా ఫైబర్ ఉన్న ఆహార పదార్థాల వల్ల గ్యాస్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యలు రావద్దంటే రాత్రి భోజనం చేసిన తర్వాత వీలునుబట్టి ఓ గంట నడకకు వెళ్లాలి. దీంతో మన పొట్ట ఆహారాన్ని వీలైనంత వరకు జీర్ణం చేసేస్తుంది. పొట్టకు తేలికపాటి వ్యాయామం జరగడంతో శరీరంలోంచి అపానవాయువు బయటికి వెళ్లిపోతుంది. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఈ నడక గుండె ఆరోగ్యానికి, బరువు నిర్వహణకు, మానసిక ఆరోగ్యానికి, కీళ్ల ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు, జీర్ణ వ్యవస్థకు మేలుచేస్తుందని నిపుణుల మాట.
పేదరికంలో గడపడానికి మానసిక రుగ్మతల మధ్య సంబంధం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఈ రెండు అంశాల మధ్య లంకె ఉంటుందని అధ్యయనాలు గతంలోనే తేల్చాయి. అయితే, కచ్చితమైన కారణాన్ని మాత్రం తాజా అధ్యయనంలో పరిశోధకులు కనుక్కొన్నారు. మానసిక రుగ్మతలైన షిజోఫ్రేనియా, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ లాంటివి పేదరికానికి కారణమవుతాయి.
అలానే పేదరికం కారణంగా కుంగుబాటు, షిజోఫ్రేనియా లాంటి రుగ్మతలు వస్తాయని నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యాం యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకుడు ఒకరు వెల్లడించారు. ఇక పరిశోధకులు తమ అధ్యయనంలో పాల్గొన్న వారి కుటుంబ ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం, వాళ్లు నివాసం ఉండే ప్రదేశాలు, సామాజిక వెలివేత మొదలైన అంశాల ఆధారంగా పరిశోధన చేపట్టారు. కాబట్టి, విధానాలు రూపొందించేవాళ్లు ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.