వాళ్లంతా యువకులు. అందరూ 40లు దాటని వారే. గత దశాబ్దకాలంగా సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను అందిపుచ్చుకుని వినియోగదారులకు వినూత్న సేవలు అందిస్తున్నారు. మరోవైపు పెట్టుబడి దారులకు లాభాల రుచి చూపిస్తున్నారు. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగం కావచ్చు, నేరుగా కస్టమర్లకు సేవలందించే డీ2సీ రంగం కావచ్చు. రంగమేదైనా ఈ ఆంత్రప్రెన్యూర్లు వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ‘ఔరా!’ అనిపిస్తున్నారు. అప్పటికే నడుస్తున్న వ్యాపారానికి కొత్త హంగులు జోడిస్తున్న కొందరు ఆంత్రప్రెన్యూర్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు కొంతమంది సృష్టించిన మెరుపులే ఇవి…
దేశంలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్నది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల నుంచి రెడీ టు ఈట్ ఫుడ్ వరకూ వస్తువుల అమ్మకాలు వృద్ధి చెందుతున్నాయి. తమను తాము అప్డేట్ చేసుకోని సంస్థలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టగలిగిన వారే వ్యాపారంలో రాణిస్తున్నారు. అలాగే మొబైల్ ఫోన్ల వాడకం, ఇంటర్నెట్ విజృంభణ లాంటి వాటివల్ల ఇ-కామర్స్ రంగం విపణిలో దూసుకుపోతున్నది. కొత్త యాప్‌ల సృష్టికి వీలు కల్పిస్తున్నది. ఎఫ్ఎమ్సీజీ, డీ2సీ, ఫిన్‌టెక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో యువ పారిశ్రామికవేత్తల విజయాలు అబ్బురపరిచే స్థాయిలో ఉన్నాయి.
ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో పెట్టుబడులను సమీకరించటం ఒక సవాలు. ఇన్వెస్టర్ల సెంటిమెంట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని యువ పారిశ్రామికవేత్తలు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఓటమిని పాఠాలుగా, అవరోధాలను అవకాశాలుగా మలుచుకుంటూ వ్యాపారానికి కొత్త రెక్కలు తొడుగుతున్నారు. దేశ, విదేశాల్లో మెరుపులు మెరిపిస్తున్నారు. భారతీయ పాల ఉత్పత్తుల పరిశ్రమల రంగంలో పరాగ్ మిల్క్ ఫుడ్స్ లాంటి సంస్థలు సాధిస్తున్న విజయాలు అబ్బురపరిచేలా ఉన్నాయి.
ఇక చంటిపిల్లల సంరక్షణ కోసం ఎన్నో కొత్త ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అందులో డైపర్స్కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తల్లిదండ్రులు మార్కెట్లో ఎప్పటినుంచో ఉన్నవాటిని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త బ్రాండ్స్ కోసం చూస్తున్నారు. ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. ఒకప్పుడు మహానగరాల్లోనే పిల్లలకు డైపర్ల వాడకం ఎక్కువగా కనిపిస్తే ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ వీటి వాడకం పెరిగింది. దాంతో ప్రస్తుత డైపర్స్ మార్కెట్ 1.6 అమెరికన్ బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2032 నాటికి 3 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇక్కడ ఉండే మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని చాలామంది ఔత్సాహికులు ఈ రంగంలోకి వస్తున్నారు. ఈ క్రమంలో ఎకో ఫ్రెండ్లీ డైపర్స్ వంటివీ వచ్చిచేరుతున్నాయి. ‘ఆల్టర్’ బ్రాండ్ భారతదేశంలో మొట్టమొదటి సస్టెయినబుల్, రాష్ ఫ్రీ డైపర్లను విడుదల చేసింది.
దేశం మొత్తం డిజిటల్ కోర్టు రూమ్‌లను దర్శించడానికి మనం ఇక ఎన్నో రోజులు ఎదురుచూడనవసరం లేదనిపిస్తున్నది. చట్టానికి, సాంకేతికత తోడై న్యాయవ్యవస్థలో సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తున్నది. న్యాయవ్యవస్థను ప్రస్తుతం పీడిస్తున్న అనేక సమస్యల్లో కేసుల పరిష్కారంలో అపరిమితమైన జాప్యం ఒకటి. దీనివల్ల పేద వర్గాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. న్యాయమూర్తులు, న్యాయవాదులపైన భారం పడుతున్నది. ఈ సమస్యకు అదాలత్ ఏఐ చక్కని పరిష్కారం చూపుతున్నది. కేసుల సత్వర పరిష్కారానికి, వేగంగా న్యాయం అందటానికి దోహదం చేస్తున్నది. ఇప్పటికే ఢిల్లీ, కర్నాటకల్లో హైకోర్టులు, కొన్ని జిల్లా కోర్టుల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కోర్టులు దీని సేవలు అందిపుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2020లో ఢిల్లీకి చెందిన సురభి రిటైల్ హెల్త్, పర్సనల్ కేర్ బ్రాండ్‌గా ‘ఆల్టర్’ ను ప్రారంభించారు. చంటిపిల్లలకు ప్రస్తుతం మార్కెట్లో దొరికే డైపర్స్కి భిన్నమైన కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తెచ్చారు. ఈ డైపర్ చిన్నారుల సున్నితమైన చర్మానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తుంది. భారతదేశపు మొట్టమొదటి రాష్ ఫ్రీ డైపర్ అని సంస్థ ప్రకటించింది. ఇది సూపర్ హిట్ అయ్యింది. ప్రారంభించిన తక్కువ కాలంలో లాభాల పట్టాలు ఎక్కింది. అంతేకాదు గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేపట్టింది. “సంస్థ ప్రారంభించినప్పటి నుంచి యేటా రెట్టింపు పెరుగుతూ వచ్చాం. 2024 చివరినాటికి నికర ఆదాయం రూ.25 కోట్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేశాం. అలాగే ఆఫ్‌లైన్ మార్కెట్లో దూకుడుగా వెళుతున్నాం. యూఏఈ, సింగపూర్ లాంటి విదేశీ మార్కెట్లపైన దృష్టి పెట్టాం” అని చెబుతున్నారు సురభి. షార్క్ ట్యాంక్ ఇండియా ఈ వెంచర్లో పెట్టుబడి పెట్టింది. ఆల్టర్ రూపొందించిన ప్యాంట్ మోడల్ డైపర్‌ని ‘అమెజాన్ చాయిస్’గా పేర్కొంది. దీనికి అంతర్జాతీయంగా కూడా డిమాండ్ వచ్చింది.
– సురభి బఫ్నా గుప్తా, ఫౌండర్ సీఈఓ, ఆల్టర్
న్యాయశాఖల్లో సామర్థ్యాన్ని పెంచటానికి అదాలత్ ఏఐ దోహదం చేస్తుంది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా పనిచేస్తుంది. ఉత్కర్ష్ సక్సేనా, అర్ఘ్య భట్టాచార్య దీన్ని కనుగొన్నారు. ఎమ్ఐటీ, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో దీన్ని రూపొందించారు. “మేం న్యాయవాదులకు, స్టెనోగ్రాఫర్ల కోసం మాత్రమే కాదు. సాక్ష్యాల నమోదు, కోర్టు ఉత్తర్వుల కచ్చితత్వాన్ని పెంచటానికి ఈ టూల్ రూపొందించాం” అని సక్సేనా అంటున్నాడు. ఏఐ ఆధారిత సాధనాల వినియోగం దేశవ్యాప్తంగా అన్నిట్లోనూ విస్తరిస్తున్నది. దేశంలోని కొన్ని కోర్టులు కూడా దీనిని విస్తృతంగా ఉపయోగించుకోవటం మొదలుపెట్టాయి. దేశంలో పది నుంచి 20 శాతం కోర్టుల్లో అదాలత్ ఏఐని ఏర్పాటు చేయాలనేది మా లక్ష్యం. నైజీరియా, కెన్యా వంటి ఇతర దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు. “రాబోయే రోజుల్లో ఏఐ నుంచి పాలనాపరమైన సహకారం అందుతుంది. న్యాయమూర్తులకు చట్టపరమైన పరిశోధనలకు, వేగంగా, న్యాయంగా తీర్పులను అందించగలుగుతారు” అని సక్సేనా చెప్పుకొచ్చారు.
– ఉత్కర్ష్ సక్సేనా, సీఈఓ, సహవ్యవస్థాపకుడు, అదాలత్ ఏఐ
లింక్డ్ఇన్ మాదిరిగా అన్‌స్టాప్ కూడా ఓ టాలెంట్ పూల్. కంపెనీలు అభ్యర్థుల విద్యార్హతలను, వారు చదివిన విద్యాసంస్థలను మాత్రమే పట్టించుకోకుండా వారికి ఉన్న ఇతర నైపుణ్యాలను సామర్థ్యాలను గుర్తించి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో అంకిత్ అగర్వాల్ ఈ స్టార్టప్‌ని ప్రారంభించాడు. నియామకాల్లో నైపుణ్య ఆధారిత మదింపు ఉండాలనేది తన ఉద్దేశం అంటున్నాడు అంకిత్. ఆగస్టు 2023లో ఈ సంస్థ 5 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. మైనావి, జపాన్ హెచ్ఆర్ టెక్ ఫర్మ్ జాబ్ బోర్డు వంటి సంస్థలు ఫండింగ్ రౌండ్లో పాల్గొన్నాయి.
– అంకిత్ అగర్వాల్, ఫౌండర్, సీఈఓ అన్‌స్టాప్
క్రీడల ప్రేమికులందరినీ ఒక చోట చేర్చేందుకు ‘స్పోర్ట్స్ యారీ’ ప్లాట్‌ఫాం పనిచేస్తున్నది. దీన్ని 2021లో సుశాంత్ మెహతా ప్రారంభించాడు. ప్రస్తుతం క్రీడల్లో రాణిస్తున్న అథ్లెట్లు, సాధారణ ఆటగాళ్లు, కొత్తగా ఆటల్లోకి ప్రవేశించాలనుకునే ఉత్సాహవంతులందరూ ఈ సైట్ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. చిన్నవాళ్లు పెద్దవాళ్లు అనే తేడా లేకుండా అందరూ తమ అభిప్రాయాలను పంచుకుంటారు. చర్చల్లో పాల్గొంటారు. వాటితోపాటు నిపుణుల వ్యాసాలు, టిప్స్, ఇన్సైట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అంతా ఒక ఇంటరాక్టివ్ కమ్యూనిటీగా ఉంటారు.
“మేం యువతకు ప్రాధాన్యం ఇస్తాం. మా యాంకర్లు, ప్రజెంటర్లు, ఆఖరికి బ్యాక్ ఎండ్‌లో పనిచేసేవాళ్లంతా కొత్తవాళ్లే. ఇందులో గ్రామీణ ప్రాంతాల వారితోపాటు, పట్టణ ప్రాంతాలవారు కూడా ఉంటున్నారు” అంటాడు సుశాంత్. ఈ వ్యాపారంలో 50 శాతం పైగా మార్జిన్స్ సంపాదిస్తున్నారు. వ్యక్తిగత అభివృద్ధి, కమ్యూనిటీ బిల్డింగ్, సంపూర్ణ సంక్షేమానికి క్రీడలు దోహదం చేసే ప్రపంచాన్ని ఆయన కలగంటున్నారు. “ప్రస్తుతం డిజిటల్ మీడియాగానే ఉన్నాం. కానీ త్వరలోనే లీగ్ లోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నాం” అని తన భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నాడు.
– సుశాంత్ మెహతా. సీఈఓ, స్పోర్ట్స్ యారీ
అభిజిత్ నాయకత్వంలో ‘అబ్ కాఫీ’ సంస్థ భారతీయ కాఫీ రంగంలో మార్కెట్ లీడర్‌గా ఓ గుర్తింపు తెచ్చుకుంది. కేవలం 20 నెలల కాలంలో 40 అవుట్లెట్లు ఏర్పడ్డాయి. 200 మంది ఉద్యోగులతో 50 కోట్ల నిధులను సేకరించగల స్థాయికి చేరింది. ఈ సంస్థ నెలవారీగా 20 నుంచి 25 శాతం రెవెన్యూ గ్రోత్ సాధిస్తూ.. స్టార్టప్ విభాగంలోనే ఒక ప్రత్యేకత సాధించింది. ఈ సంస్థ వార్షిక ఆదాయం.. 2 మిలియన్ డాలర్లకు చేరింది. ఈ సంస్థ స్థాపించటానికి ముందు అభిజిత్ ఇంధన రంగంలో ప్రసిద్ధ సంస్థ ష్కులమ్ బెర్గర్లో ఎనిమిదిన్నర సంవత్సరాలపాటు పనిచేశాడు. ఆ తర్వాత ఆహార పానీయాల రంగంలో ప్రవేశించాడు. ఒంటి చేత్తో నిధుల సమీకరణ చేసుకున్నాడు. రెండేళ్లలో ఆరు మిలియన్ డాలర్లు సేకరించగలిగాడు.
– అభిజిత్ ఆనంద్, ఫౌండర్, సీఈఓ, అబ్ కాఫీ
పాత వ్యవసాయ విధానాలకు, ఆధునిక వ్యవసాయ వాణిజ్యానికి మధ్య వారధిగా ‘గ్రామ్ శ్రీ అగ్రి సర్వీసెస్’ నిలుస్తున్నది. బీహార్‌లో వ్యవసాయ సమాజాన్ని సాధికారత దిశగా నడుపుతున్నది. ఇక్కడ గ్రామ్ అగ్రి బిజినెస్ సెంటర్లు శిక్షణ కేంద్రాలుగా ఉన్నాయి. రైతులకు అవసరమైన వ్యవసాయ సూచనలను, సలహాలను అందిస్తున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన మార్కెటింగ్ విషయాలపైన అవగాహన పెంచుతున్నాయి. సెంట్రల్ వేర్ హౌసింగ్ సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మైక్రో బిజినెస్ సెంటర్లను ప్రారంభించాలని ఈ స్టార్టప్ ఆలోచిస్తున్నది. అలాగే ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అసోం, అరుణాచలప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో కూడా సంస్థను విస్తరించాలని సంస్థ వ్యవస్థాపకురాలు ఆస్తాసింగ్ భావిస్తున్నారు.
– ఆస్తా సింగ్, ఫౌండర్, సీఈఓ, గ్రామ్ శ్రీ అగ్రి సర్వీసెస్)
గ్లోబల్ మీడియా అనేది మొబైల్ ఫోన్ అడ్వర్టయిజింగ్ కంపెనీ. గేమ్స్, కస్టమర్ల వయసు, ఆసక్తుల ఆధారంగా ఇందులో సేవలు ఉంటాయి. ఏఐ ఆధారిత అల్గారిదమ్స్, యాప్‌లను ఉపయోగిస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకుడు భవేశ్ తల్రేజా చెబుతున్నాడు. దీనివల్ల పెట్టిన పెట్టుబడికి తగినన్ని లాభాలు రాబట్టటం సులువవుతున్నదని ఆయన అంటున్నాడు. త్వరలోనే రష్యా, బ్రెజిల్ దేశాలకు తమ వ్యాపారం విస్తరించనున్నారు. యూరప్‌లో కూడా కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. అడ్వర్టయిజింగ్, ఈ కామర్స్, యుటిలిటీ తదితర రంగాల్లో సేవలు అందిస్తున్నది.
– భవేశ్ తల్రేజా, ఫౌండర్ సీఈఓ, గ్లోబల్ మీడియా
చిన్నప్పటి నుంచి అభిషేక్ చంద్రకు వినూత్నంగా ఆలోచించడం అలవాటు. తన తోటివాళ్లంతా కాలేజీలో ఉన్నత చదువులు చదవటానికి వెళితే, అతను కంపెనీల ఏర్పాటులో బిజీగా ఉండేవాడు. స్టార్టప్‌ల కాలం ప్రారంభంకాక మునుపే అతను ఆ దారిలో ప్రవేశించాడు. మొబిక్విక్ని సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేర్చటంలో కీలక పాత్ర పోషించాడు. మార్కెటింగ్, సేల్స్, రెవెన్యూలలో రాణించేలా చూశాడు. వ్యాపారులకు వాలెట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంస్థ మొబిక్విక్ అనేది తెలిసిందే. అప్పటికి అభిషేక్ వయసు 23 ఏళ్లు. హెల్త్ టెక్ కంపెనీ డాక్విటీ రెవెన్యూ పెంచటంలోనూ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం గోక్విక్ కంపెనీ సీఆర్ఓగా ఈ కంపెనీని లాభాల పరుగులు పెట్టిస్తున్నాడు. 10 వేలకు పైగా బ్రాండ్లు ఈ సేవలను పొందుతున్నాయి. 39 నెలల కాలంలోనే ఇ-కామర్స్ విభాగంలో మార్కెట్ బేస్‌ను 2వేల బ్రాండ్ల స్థాయికి చేర్చాడు.
– అభిషేక్ చంద్ర, చీఫ్ రెవిన్యూ ఆఫీసర్, గోక్విక్
డెయిరీ వ్యాపారంలో ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందించటమే కాదు. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో కొత్తపుంతలు తొక్కుతున్నది పరాగ్ మిల్క్ ఫుడ్స్ సంస్థ. ఏడాదికి పది శాతం లాభాలతో దూసుకుపోతున్నది. ముందు త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో నెయ్యి విభాగంలో 13 శాతం, చీజ్ సెగ్మెంట్లో 15 శాతం లాభాలు వచ్చాయి. అలాగే కొత్త ఉత్పత్తుల విభాగం 51 శాతం పురోగతి సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ.750 కోట్లు ఉంటే, అది ఈ ఏడాది అది రూ.758 కోట్లుగా నమోదైంది. ఇన్నొవేషన్ మా డీఎన్ఏ అంటున్నారు ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అక్షాలి షా. దేశీయంగా, విదేశాల్లోనూ రిటైల్ అవుట్లెట్లను ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలకు పెంచాలని చూస్తున్నారు. ఈ సంస్థ కొత్తగా ప్రారంభించిన కాజు కట్లీ, కేసరి పేడాకు మంచి డిమాండ్ ఉంది. రాబోయే రోజుల్లో పరాగ్ సంస్థ ఈ రంగంలో ఒక చరిత్రను సృష్టించనుంది.
– అక్షాలి షా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,పరాగ్ మిల్క్ ఫుడ్స్
యూట్యూబ్ అనేది సమాచారం, ఎంటర్టైన్మెంట్.. ఇన్ఫోటైన్మెంటుకి మాత్రమే పరిమితం కాదు. ఆయా బ్రాండ్లు కస్టమర్లతో అనుసంధానం కావడానికీ దోహదం చేస్తుంది. అంతర్జాతీయంగా ఎక్కువమంది వీక్షించే అతిపెద్ద వేదిక యూట్యూబ్. దాంతో ప్రేక్షకుల ఆసక్తుల ఆధారంగా కార్యక్రమాలను రూపొందించటం అనేది ఇందులో కీలకం అంటున్నారు గూగుల్ ఇండియాలో గ్లోబల్ సొల్యూషన్ అసోసియేట్ లీడ్‌గా ఉన్న అంకిత. ట్యుటోరియల్స్ నుంచి వ్లాగ్స్ వరకూ ప్రయోగాలు చేయటం ద్వారా బ్రాండ్లు ప్రేక్షకులతో అనుసంధానాన్ని పెంచుకోగలుగుతాయని ఆమె చెబుతున్నారు. గూగుల్ ట్రెండ్స్ వంటి టూల్స్‌ని ఉపయోగించుకోమని ఆమె సలహా ఇస్తున్నారు. ఆడియన్స్ సక్రమంగా అర్థం చేసుకోగలిగితేనే డిజిటల్ మార్కెటింగ్‌లో రాణిస్తామన్నది ఆమె సూచన.
– అంకిత సురేశ్ బాప్నా, గ్లోబల్ సొల్యూషన్స్ అసోసియేట్ లీడ్ గూగుల్ ఇండియా
– డాక్టర్ పార్థసారథి చిరువోలు