Restaurants | సందర్శకులకు సరికొత్త అనుభూతులను అందించడానికి ప్రపంచంలోని కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేకంగా ముస్తాబు అవుతున్నాయి. ఇందులో ఒకటి చాలా ఎత్తయినదైతే, మరొకటి పక్కా బొందలగడ్డ. కాఫీ టేబుల్‌ను శవపేటికలా తయారు చేశారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయ్. కావాలంటే చదవండి.
డిన్నర్ ఇన్ ది ైస్కె (బెల్జియం)
160 అడుగుల ఎత్తులో.. గాల్లో తేలాడే టేబుల్-కుర్చీలపై సేదతీరుతూ రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. దాదాపు 22 మంది అతిథులను సేఫ్టీ బెల్ట్స్ కుర్చీల్లో 60 అడుగుల ఎత్తు వరకు తీసుకెళ్తారు. భోజనం చేస్తూ అక్కడి నుంచి మొత్తం నగరాన్ని వీక్షించవచ్చు. కాకపోతే, డైనింగ్ సీట్లో కూర్చోవడానికి ముందు బీమా పాలసీపై సంతకం చేయాలి. ఈ రెస్టారెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా బ్రాంచీలున్నాయి.
డిజాస్టర్ కేఫ్
ఈ రెస్టారెంట్ సందర్శకులను భూకంపాలు భలేగా ఆకర్షిస్తాయి. రాత్రిపూట ఇక్కడ కృత్రిమ కంపనాలు సంభవిస్తాయి. సిబ్బంది సేఫ్టీ క్యాప్స్ ధరించి కనిపిస్తారు. డ్రోన్ ద్వారా ఆహారం, మద్యం సరఫరా చేస్తారు.
నయోటైమోరి (టోక్యో)
జపాన్ రాజధాని టోక్యోలో ఈ రెస్టారెంట్ సుప్రసిద్ధం. ఇక్కడ ఆహారాన్ని స్త్రీ ఆకారంలో తీర్చిదిద్ది.. టేబుల్ ముందు ఉంచుతారు. తినడానికి కత్తులు, ఫోర్క్‌లకు బదులుగా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తారు. ఆడబొమ్మలోని నచ్చిన భాగాన్ని కత్తితో కోసుకుని తినొచ్చు. ఈ దృశ్యం చూడటానికి కొంత భయానకంగానే ఉంటుంది.
మగ్ హౌస్ పబ్ (ఇంగ్లాండ్)
రాతిపై నిర్మించిన ఈ అందమైన రెస్టారెంట్‌కు చేరుకోవడానికి శ్మశానవాటిక గుండా నడవాలి. ఇక్కడ భోజనం చేస్తున్నప్పుడు కొన్ని భయానక శబ్దాలు వినిపిస్తుంటాయి. ఎవరినో కొరడాతో కొడుతున్నట్టు ఏడుపులు కూడా.
డేన్స్ లే నోయిర్ (న్యూయార్క్)
చీకట్లో తినడాన్ని మించిన భయంకర అనుభవం ఏం ఉంటుంది? న్యూయార్క్‌లోని డాన్స్ లే నోయిర్ రెస్టారెంట్లో లైటింగ్ పరికరాలు నిషేధం. సెల్‌ఫోన్ లైట్ కూడా ఆన్ చేయనివ్వరు. చిమ్మచీకట్లో తింటూ ఆనందించాలి. మరో ఆసక్తికరవిషయం ఏమిటంటే.. ఏ అపరిచితుడి పక్కనో కూర్చొని ఆహారాన్ని రుచి చూడాలి. ఇది డార్క్ థీమ్ రెస్టారెంట్.
ఫోర్టెజా మెడిసియా (ఇటలీ)
ఇటలీలోని ప్రసిద్ధ రెస్టారెంట్. పదిహేనేండ్ల నుంచీ అతిథులకు సేవలు అందిస్తున్నది. ఈ భవంతిని 1474లో నిర్మించారు. ప్రస్తుతం ఇదో జైలు. ఇక్కడి ఖైదీలే చెఫ్‌లుగా మారి రుచికరమైన ఆహారాన్ని వండుతారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్లాస్టిక్ పాత్రలలో మాత్రమే ఆహారాన్ని అందిస్తారు. అయినా డిమాండ్ ఎక్కువే. కొన్ని వారాల ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవాలి. పియానో సరిగమల మధ్య రుచికరమైన విందులు ఆస్వాదించవచ్చు.
…? పసుపులేటి వెంకటేశ్వరరావు