ఇప్పుడు చాలామంది అన్నిటికీ సప్లిమెంట్లపైనే ఆధారపడుతున్నారు. ఉదయం విటమిన్ గోళీ, భోజనం తర్వాత క్యాల్షియం, రాత్రి విటమిన్ డీ, నిద్రపోయే ముందు ఏదో ఒక హెర్బల్ క్యాప్సూల్.. ఇలా రకరకాల మాత్రలు వేసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటున్నారు. అయితే, ఇలా అనేక సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల శరీరానికి మంచి కన్నా.. హాని కలిగే ప్రమాదమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజులో నాలుగైదు సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఒకే పోషకం మోతాదుకు మించి శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉన్నది. ఈ క్రమంలో కొన్నిరకాల విటమిన్లు, ఖనిజాల స్థాయులు ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. ఓవైపు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకుంటూనే.. ప్రత్యేకంగా క్యాల్షియం, ఐరన్, విటమిన్ డి సప్లిమెంట్లు కూడా వాడుతుంటారు. అయితే, రెండు మాత్రల్లోనూ అవే పోషకాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో సమస్య మరింత క్లిష్టంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి, శరీరంలో లోపాలు, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు తీసుకుంటే.. ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే, రోగనిరోధక శక్తి, జుట్టు, ఎముకల బలం, ఫిట్నెస్ను మెరుగుపరుస్తాయని ప్రకటనలు చూసి, మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉన్నాయని.. సొంతంగా రకరకాల ఉత్పత్తులను తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదు. ఇక కొందరు సప్లిమెంట్లు తీసుకునేటప్పుడు.. ఎన్ని గోళీలు వేసుకుంటున్నామనే దానిపైనే దృష్టి పెడతారు. కానీ, వాటిలోని పదార్థాలు.. ఇతర సప్లిమెంట్లు, మందులతో కలిసి పనిచేస్తాయా? లేదా? అనే కాంబినేషన్ల గురించి ఆలోచించరు. క్యాల్షియం-ఐరన్ రెండూ ఒకేసారి తీసుకుంటే.. అవి రక్తంలో కలిసిపోవడానికి ఒకదానితో ఒకటి పోటీపడతాయి.
కాబట్టి, వాటిని వేర్వేరు సమయాల్లో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని రకాల సప్లిమెంట్లను ఏ సమయంలో తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే! అందులోనూ థైరాయిడ్, రక్తపోటు (బీపీ), మధుమేహం, గుండె జబ్బులు, రక్తాన్ని పల్చబరిచే మందులు వాడేవారు సమయ పాలన తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. ఇక కొన్ని మాత్రలను సుదీర్ఘకాలం పాటు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడం, ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, మల్టీవిటమిన్తోపాటు ఇతర సప్లిమెంట్లు, బలవర్ధక ఆహారాలు తీసుకునేవారు.. తమ రోజువారీ పోషకాల పరిమితిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.