ఈ సృష్టికి మూలం అమ్మ. ఆ తల్లి అనుగ్రహమే ఇచ్ఛాశక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా దర్శనమిస్తుంది. ఇచ్ఛ అంటే కోరిక. ఆ కోరికను నెరవేర్చే విధానమే జ్ఞానం. నెరవేర్చే పనే క్రియ. ఈ మూడింటిని సక్రమంగా నిర్వహింపజేయాలంటే తల్లి అనుగ్రహం ఉండాలి. అఖండ కాంతి అమ్మవారి ఇచ్ఛ. దేవి అవ్యక్త స్వరూపమే కాంతి. అదే తేజస్సు. ఆ తేజస్సే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సృష్టి, స్థితి, లయ కార్యాలను అప్పగించింది. పరబ్రహ్మ స్వరూపిణిగా తల్లి ఈ పనులు నెరవేర్చడానికి శక్తిని ప్రదానం చేస్తూనే తాను కూడా భాగస్వామిని అయింది.
అందుకనే దేవి అనుగ్రహం లేకపోతే త్రిమూర్తులకు చైతన్యమే ఉండదు అంటుంది సౌందర్య లహరి. సమస్త సృష్టికీ మూలశక్తి అయిన అమ్మవారిని ఆరాధించే అద్భుత సందర్భం దేవీ నవరాత్రులు. ఆశ్వయుజ శద్ధ పాడ్యమి నుంచి విజయ దశమి వరకు దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. అమ్మవారు విజయదుర్గాదేవిగా, శ్రీ రాజరాజేశ్వరిగా పరిపూర్ణమైన నవదుర్గా స్వరూపిణిగా దర్శనమిస్తుంది.
శరదృతువులో జరుపుకొంటాం కాబట్టి దేవీ నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. శరత్కాలం ప్రశాంతతకు నిలయం. తెల్లగా మెరిసే మేఘాలు, చంద్రుని తెల్లని వెన్నెల ఈ రుతువుకు ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. అతిశీతలం, అతివేడిమి కాని సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది ఈ కాలంలో! వర్షరుతువు ఫలితంగా సరస్సులు, చెరువులు, నదులు జలకళతో కనువిందు చేస్తుంటాయి. శరత్కాలం స్వచ్ఛతకు సంకేతం.
దేవీ ఆరాధనకు అనువైన సమయం. ఈ ప్రశాంత సమయంలో తొమ్మిది రోజులపాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో కొలుచుకుంటాం. వివిధ సంప్రదాయాల్లో వివిధ రూపాలతో అమ్మను ఆరాధిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి ఇలా మొత్తంగా తొమ్మిది రూపాలలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఇందులో మొదటి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిగా, చివరి మూడు రోజులు సరస్వతిగా అమ్మను కొలుస్తారు.