‘పరస్పర విరుద్ధ శక్తుల ఘర్షణ నుంచే చరిత్ర జన్మిస్తుంది’ అన్న కారల్ మార్క్స్ వర్గ సిద్ధాంతాన్ని తెలుగు నేలపైకి మొట్టమొదటగా ప్రవేశపెట్టిన సాంఘిక నాటకం ‘ముందడుగు’. శ్రామిక వర్గ ప్రజానీకంపై నాటకం ప్రభావం తిరుగులేనిది. కాబట్టి నాటకాల్లో వర్గ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాలన్న హిరేన్ ముఖర్జీ పిలుపుతో ప్రజానాట్యమండలి తొలిగా రూపొందించిన ఉద్యమ నాటకం ‘ముందడుగు’.
రైతుల నుంచి బలవంతంగా శిస్తు వసూళ్లతో నాటకం ప్రారంభమవుతుంది. పంటలు పండినా, పండకపోయినా కొంప, గొడ్డు అమ్మి, చివరికి పుస్తెలు అమ్మి అయినాసరే.. జమీందారుకు భూమి శిస్తు కట్టాల్సిందే! రైతుల చెల్లింపులకు రసీదులు ఇవ్వకుండా, లెక్కా-జమా చెప్పకుండా జమీందారీ గూండాలు జులుం చేసేవాళ్లు. వారి దౌర్జన్యాలకు భయపడి రైతులు వెట్టిచాకిరీ చేస్తూ ఉంటారు. ధనిక రైతు అచ్చయ్య గోడ మీద పిల్లిలా ఉంటూ జమీందారుకు కొమ్ము కాస్తుంటాడు.
కథానాయకుడు నారాయణరావు ప్రవేశించి ‘మనం మన పైవాళ్లను గుడ్డిగా నమ్ముతాం. వాళ్లేమో మన నెత్తికెక్కి తొక్కుతారు’ అంటూ రైతుల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. ‘వానల్లేవు. చెరువు మరమ్మతు చేయించమని జమీందారుకు ఎన్ని అర్జీలు పెట్టినా అతీగతీ లేదు. శిస్తు మినహాయించమని కోరినా వినడం లేదు. అప్పో సప్పో చేసి శిస్తు కడితే రసీదు ఇవ్వడంలేదు. దౌర్జన్యం చేస్తున్నారు. మరి మన సమస్యకు పరిష్కారం రైతు సంఘమే..’ అంటూ నారాయణ రావు ధ్వజమెత్తుతాడు. ‘రారా కర్షక వీరా రారా! భారత వీర కుమారా రారా! నీ హక్కుల కొరకై కదనమునకురకరా’ అని గొంతెత్తుతాడు. మిగతా రైతులు ఆయనతో గొంతు కలుపుతారు. రైతు సంఘానికి జై అంటారు.
జమీందారు చక్రధరరావు జల్సారాయుడు. మద్యం తాగడం, పేకాడటం ఆయన రోజువారీ పని. శిస్తు వసూళ్లకు నారాయణరావు ఆటంకంగా ఉన్నాడని, రౌడీలతో అతనిపై దాడి చేయాలని కుట్ర పన్నుతాడు జమీందారు. ఆ పథకం విఫలమవుతుంది. నారాయణరావు తల్లి శాంతమ్మ గాంధీ భక్తురాలు. రాట్నంపై నూలు వడుకుతూ ఉంటుంది. ఆ సందర్భంలో అక్కడికి వచ్చిన రైతు అచ్చయ్య కూతురు విమల ఆధునిక భావాలు కలిగిన యువతి. ‘స్వాతంత్య్రం, స్వేచ్ఛయూ, శాంతియూ… ఈ జగతిన లేదా స్త్రీలకు?’ అంటూ తన ఆవేదనను పాటలో వ్యక్తం చేస్తుంది. జమీందారు అక్కడితో ఆగక నారాయణరావు లేని సమయంలో తప్పుడు లెక్కలతో శాంతమ్మ ఇల్లును జప్తు చేయిస్తాడు. ‘దుర్మార్గుడు ఎంతటి అవినీతికైనా పాల్పడతాడు. ఎన్ని అక్రమాలకైనా ఒడిగడతాడు’ అంటూ తల్లిని ఓదారుస్తాడు నారాయణరావు. వారికి జనం అండ లభిస్తుంది. నారాయణరావును, ఆశ్రయమిచ్చిన మిత్రుడు పుల్లయ్యను జమీందారు తప్పుడు కేసుల్లో ఇరికిస్తాడు. వాళ్లను జైలుకు పంపిస్తాడు. గోర్కి అమ్మ నవలలో పాత్రలా పరిణితి చెందిన శాంతమ్మ ‘ఏమిటా అయోమయం. నా కంటేనా.. ఉన్న ఒక్కగానొక్క కొడుకు జైలుకెళ్లాడు. కొంపను జమీందారు లాక్కున్నాడు. 60 ఏళ్ల ముసలమ్మను తెగించి బతకడంలా… ఆమాత్రం ధైర్యం లేదా మీకు…’ అంటూ వలస పోదామనుకున్న కూలీలను నిలువరిస్తుందామె.
ఒకనాడు జమీందారు కాసిం ఒక్కడినే పిలిపించుకుని, ‘నాతో చేతులు కలిపితే మేలుచేస్తాన’ని ఊరిస్తాడు. విభజించు పాలించు సిద్ధాంతం పారదు. మరొక రోజు పెద్దదొర తద్దినం. ఆ రోజు ఊళ్లో జనం పాలు పంపాలని జమీందారు ఆర్డర్ వేశాడు. ఎండలకు నీళ్లు లేక, మేతలేక చాలా గొడ్లు చనిపోయాయి. ఉన్నవి గొడ్డు పోయాయి. ఇదే సంగతి జనం మొత్తుకుంటే.. ‘గొడ్లు లేకపోతే ఏమి? మనుషులు దగ్గర తీసుకు రండి. మాకు కావాల్సింది పాలే’ అంటాడు జమీందారు. ఆ మాటకు జనానికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. జమీందారుపై తిరగబడటానికి ప్రయత్నిస్తారు. ఇలా ఉండగా, విమలపై జమీందారు కన్నుపడుతుంది. ఆమెకు పూలు పంపుతాడు. వాటిని విమల కాలితో తన్ని తిరస్కరిస్తుంది. ఊళ్లో పరిస్థితులు నానాటికీ కఠినంగా మారుతుంటాయి. జైలు నుంచి వచ్చిన నారాయణరావు రానున్న ఉపద్రవాన్ని గమనించి రాత్రిళ్లు మిత్రులతో కలిసి ఊరంతా పహారా కాస్తుంటాడు. అయినా ముసుగు దొంగలు వచ్చి అచ్చయ్యను కట్టేసి విమలను ఎత్తుకు పోయేందుకు ప్రయత్నిస్తారు. నారాయణరావు అడ్డుపడటంతో విమలను వదిలి పారిపోతారు. ఈ సందర్భంలో నారాయణరావు గాయపడతాడు. విమల – నారాయణరావు ఒక్కటవ్వడం, రైతు సంఘం జెండాలతో జనం అంతా కదం తొక్కుతారు. జమీందారు బతుకుజీవుడా అంటూ ఊరి నుంచి పారిపోతాడు.
జమీందార్లు విలాసాల కోసం వసూలుచేసే శిస్తులు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు అడ్డుకోవాలంటే రైతులు ఐకమత్యంతో సంఘం పెట్టుకోవడం తప్ప మరో గత్యంతర లేదు. వారికి ఈ సత్యాన్నే చాటి చెప్పింది ముందడుగు నాటకం. అందుకే ఆనాడు ఈ నాటకం బ్రిటిష్ ప్రభుత్వ నిషేధానికి గురైంది. రవీంద్రభారతిలో ఏప్రిల్లో జరిగిన ‘సమాహార్-2025’ నాటకోత్సవాల్లో ఈ నాటకం ప్రదర్శితమైంది. 16 అంకాల నిడివిగల నాటకాన్ని గంటన్నరపాటు ప్రదర్శించారు. 80 ఏళ్ల క్రితం రాసిన నాటకానికి తగినట్టుగా రంగాలకరణ, వస్త్రధారణ, ఆహార్యంలో నవ్యతను కూర్చి ఆకర్షణ కలిగించారు. మనది రైతు భారతం. ఇది ఉద్యమ నాటకం. కనుక, ముందడుగు ఎప్పుడూ ముందడుగే.
నాటకం : ముందడుగు
రచన: సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు
దర్శకత్వం: రత్నశేఖర్
సమర్పణ: సమాహార్, హైదరాబాద్
పాత్రధారులు: నితీష్, వెంకటేశ్, సిరి, జాన్వా ప్రణవ్, భార్గవ్, అంకిత్ తదితరులు