COVID-19 | కొవిడ్ వైరస్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఫలితంగా రక్తంలో గడ్డలు ఏర్పడతాయి. ‘ డైసల్ఫిరమ్ ( Disulfiram )’ అనే ఓ తాతలకాలం నాటి మందు ఇందుకు విరుగుడుగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. డైసల్ఫిరమ్ గురించి 1881లోనే పరిశోధనలు జరిగాయి. ఈ రసాయనాన్ని రబ్బరు తయారీలో వాడేవారు. ఆ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు తాగి వచ్చినప్పుడు, వాళ్ల మీద ఈ రసాయనం ప్రతికూలంగా పనిచేయడాన్ని గమనించారు. దాంతో మద్యాన్ని మాన్పించే మందుగా ప్రసిద్ధికెక్కింది. తర్వాత కాలంలో చర్మ వ్యాధులకు, కడుపులో పురుగుల నివారణకు దీన్ని వాడుతూ వచ్చారు. కొవిడ్ రోగుల్లో ఊపిరితిత్తుల పనితీరు మందగించేలా.. ఆ భాగంలో NET అనే కణజాలం అభివృద్ధి చెందుతుంది. NET కారణంగా ఊపిరితిత్తులలో నీరు పేరుకోవడంతో పాటు, రక్తం గడ్డలు కట్టే ప్రమాదమూ ఉంటుంది. డైసల్ఫిరమ్ ఈ ప్రక్రియను సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు తేలింది. వైరస్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటున్న ఎలుకల మీద ఈ మందును ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారు కూడా!