Health Tips | అపసవ్య జీవనశైలి కారణంగా వస్తున్న వ్యాధుల్లో రక్తపోటు (బీపీ) సర్వసాధారణంగా మారిపోయింది. అయితే, అధిక రక్తపోటు కాలక్రమంలో స్ట్రోక్ ముప్పును పెంచుతుందట. మిచిగన్ మెడిసిన్ నిర్వహించిన ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 18 ఏండ్లు ఆపై వయస్కులను నలభైవేల మందిని అధ్యయనం చేశారు.
రక్తపోటు కారణంగా మామూలు స్ట్రోక్తోపాటు ఇష్కిమిక్ స్ట్రోక్, ఇంట్రాసెరెబ్రెల్ హీమరేజ్ ముప్పూ ఎక్కువేనట. పైగా పరిశోధనలో పాల్గొన్నవారిలో ఎవ్వరికీ గతంలో స్ట్రోక్ వచ్చిన చరిత్ర లేదు. కాబట్టి. స్ట్రోక్ ముప్పు నివారించుకోవాలంటే అధిక రక్తపోటు పరీక్ష చేయించుకోవాలి. బీపీని నియంత్రణలో ఉంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
పూర్తిగా మొక్కల నుంచి వచ్చే పండ్లు, కూరగాయలు, గింజలు, ధాన్యాలు, బీన్స్ లాంటి వీగన్ ఆహారాన్నే తీసుకుంటే ఎనిమిది వారాల్లో మన వయసు ప్రస్తుత వయసు కంటే తక్కువగా అనిపిస్తుందట. మొక్కల ఆధారిత ఆహారానికి, మన జన్యువుల ప్రవర్తనలో మార్పులకు సంబంధం ఉండటమే దీనికి కారణమట. అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం ‘బయోమెడ్ సెంట్రల్’ జర్నల్లో ప్రచురితమైంది.
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 21 ఏకరూప కవలల జతను ఎంచుకున్నారు. ఈ జతల్లో ఒకరికి మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల ఆహారం, మరొకరికి పూర్తిగా మొక్కల నుంచి తయారుచేసిన ఆహారం ఇచ్చి ఎనిమిది వారాలపాటు పరిశీలించారు. కాగా, పరిశోధనలో పాల్గొన్నవారి సగటు వయసు నలభై ఏండ్లు. వీరిలో 77 శాతం మంది మహిళలు ఉన్నారు. ఎనిమిది వారాల తర్వాత వీగన్ ఆహారం తీసుకున్న వాళ్లలో గుండె, కాలేయం, ఇతర జీవక్రియల వ్యవస్థలు యవ్వనంగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు ఇతరులతో పోలిస్తే వీగన్ ఆహారం తిన్నవాళ్లు రెండు కిలోల బరువు తగ్గారట. కాకపోతే.. వీగన్ డైట్ తినేవారిలో విటమిన్ బి12, కాల్షియం లోపం తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు.