రైళ్లన్నీ గమ్యం చేరుస్తాయి. ఇది ఆకలి కూడా తీర్చే రైలు! రైలు రాక ఆలస్యమవుతుందేమో.. కానీ, వచ్చిన రైలులో ప్రయాణికులకు పదార్థాలు వడ్డించడంలో ఆలస్యం ఉండదు. జనంతో కిక్కిరిసే రైలులో ప్రయాణికులు ఇబ్బంది పడతారేమో.. కానీ, అంతమంది ఆకలి తీర్చడం భారమనుకోరు. రూపాయి తీసుకోకుండా రైలు యాత్రికుల ఆకలి తీరుస్తున్న నిస్వార్థ, నిరంతర సేవకులను మెచ్చుకోవాల్సిందే! మూడు దశాబ్దాల ఆ రైలు ప్రయాణం గురించి తెలుసుకోవాల్సిందే!
జీవితంలో ఒక్కసారైనా హర్మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం)లో జరిగే ప్రార్థనల్లో పాల్గొనాలని ప్రతీ సిక్కు కోరుకుంటాడు. ఇలా భక్తులతో బయలుదేరే రైళ్లు దేశం నలుమూలల నుంచి అమృత్సర్ చేరుకుంటాయి. వాటిలో ఒకటి సచ్‌ఖంద్ ఎక్స్‌ప్రెస్. ఇది నాందేడ్ నుంచి బయలు దేరి అమృత్సర్ చేరుకుంటుంది. సిక్కుల పదో మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ నాందేడ్‌లో కన్నుమూశారు. అందువల్ల నాందేడ్‌లోని హజూర్ సాహిబ్ గురుద్వార నుంచి హర్మందిర్ సాహిబ్ గురుద్వార ఆధ్యాత్మిక యాత్ర సిక్కుల్లో ఎంతో ప్రముఖమైనది. సచ్‌ఖంద్ ఎక్స్‌ప్రెస్ రైల్ (12715) ప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరుతుంది. పలుకరింపులు, పాటలు, సరదా మాటలతో రైలు ప్రయాణం సాగుతూ ఉంటుంది. అక్కడక్కడా స్టేషన్లలో ఆగుతూ వెళ్లే ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నానికి జాలనా స్టేషన్ చేరుకుంది. రైలు ఆగిందే ఆలస్యం! పెద్ద పెద్ద బాక్సుల్లో అన్నం, రొట్టెలు, కూరలు పట్టుకున్న వాళ్లు బిలబిలా రైల్లోకి వచ్చేస్తారు. వాళ్లు వచ్చేలోగా ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లోంచి కంచాలు బయటికి తీసి పట్టుకుంటారు. అంతే.. రోటీ కావాల్సిన వాళ్లు రోటీ కోసం, అన్నం కావాల్సినవాళ్లు అన్నం కోసం పళ్లెం ముందుంచుతారు. అడిగింది లేదనకుండా వాలంటీర్లు చకచకా వడ్డిస్తారు. అడిగిన వారికి లేదని చెప్పరు. తిన్నవారిని రూపాయి అడగరు. ప్రయాణికుల అవసరాలు వడ్డించేవారికి, వడ్డించేవాళ్ల ఇష్టాలు ప్రయాణికులకు ముందే తెలిసినట్టుంది! మాటల్లేకుండా వడ్డించడం, ఆరగించడం సూపర్‌ఫాస్ట్‌గా జరిగిపోతుంది! చూస్తేనే తిన్నంత హాయిగా ఉంటుంది ఆ లంగర్!
నాందేడ్‌లో బయలుదేరి అమృత్సర్ చేరుకునే సచ్‌ఖంద్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే యాత్రికులకు ఆకలి బాధ లేకుండా, ఎవరూ ఇబ్బంది పడకూడదని గురుద్వారా ఆధ్వర్యంలో లంగర్ తయారు చేశారు. రైలు వచ్చే సమయానికి భోజనాలను ప్లాట్‌ఫామ్ మీదకు చేరుస్తారు. రైలు రాగానే అన్నదానం చేస్తారు. నాందేడ్‌లో బయలుదేరిన రైలు మధ్యాహ్న భోజన సమయానికి జాలనా చేరుతుంది. ఆ తర్వాత రాత్రి భోజన సమయానికి ఏ స్టేషన్లో ఉంటుందో ఆ స్టేషన్లో కూడా లంగర్ సిద్ధంగా ఉంటుంది. ఆ పని ఆ ఊరి గురద్వార బాధ్యులు చూసుకుంటారు. తెల్లవారే సరికి రైలు మధ్యప్రదేశ్ దాటి ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అందరూ కాలకృత్యాలు తీర్చుకుని పరగడుపునే ఉండి.. ఝాన్సీ రైల్వే స్టేషన్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ స్టేషన్‌కు చేరుకోగానే.. సచ్‌ఖంద్ ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురుచూస్తున్న గురుద్వార వలంటీర్లు రానే వస్తారు. అల్పాహారం ఇచ్చి, వేడివేడి తేనీటితో పసందు చేస్తారు. అక్కడి నుంచి బయలు దేరిన రైలు మధ్యాహ్నానికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్న భోజనం ముగించుకుంటే రాత్రి లంగర్ గురించి ఆలోచించకుండా యాత్రికులంతా హాయిగా ప్రయాణం చేస్తుంటారు.

నాందేడ్‌కు తిరుగు పయనం కట్టిన యాత్రికులతో అమృత్సర్ జంక్షన్ నుంచి సచ్‌ఖంద్ ఎక్స్‌ప్రెస్ (12716) ప్రతి రోజూ ఉదయం అయిదు గంటలకు బయలుదేరుతుంది. గంటలు గడిచేకొద్దీ స్టేషన్లు దాటుతూ రైలు వేగంగా దూసుకుపోతూ ఉంటుంది. వేగంతోపాటు దూరం తగ్గుతున్నట్టే కాలంతోపాటు శక్తీ సన్నగిల్లుతుంది. ఆకలి బాధ తెలిసేలోగా మళ్లీ ఏదో ఒక స్టేషన్లో గురుద్వార వలంటీర్లు మధ్యాహ్న సమయానికి లంగర్ ఏర్పాట్లు చేసి వడ్డిస్తారు. ప్రతిరోజూ నాందేడ్ నుంచి అమృత్‌సర్‌కి, అమృత్సర్ నుంచి నాందేడ్ మధ్య నడిచే రైళ్లలోని ప్రయాణికుల కోసం ఆరు స్టేషన్లలో లంగర్ ఉంటుంది. నిర్వహించేది సిక్కుల కోసమే అయినా అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా! అందరికీ దేవుడు ఒక్కడే కాబట్టి, సర్వమతాల వారికీ లేదనకుండా వడ్డిస్తారు. ఏసీ బోగీల్లో, జనరల్ బోగీల్లోని ప్రయాణికుల్లో ఒకరికి ఎక్కువ కాకుండా, మరొకరికి తక్కువ చేయకుండా ఆహారం అందజేస్తారు. రోటీ తుంచుకుని ఆలూపట్టాని ఓ పట్టుపట్టి ఆబగా తినే పెద్దలు, పెరుగుతో చేసిన కఢీ చావల్ ఆరగించే పిల్లలతో ప్రతి లంగర్ సందడిగా ఉంటుంది. భారత దేశంలో మధ్య భాగంలో ఉన్న నాందేడ్ నుంచి దేశ సరిహద్దున ఉన్న అమృత్‌సర్‌కి సాగే ముప్పై మూడు గంటల ప్రయాణంలో ఇదో మధురానుభూతి.
మూడు దశాబ్దాల క్రితం.. నాందేడ్ నుంచి అమృత్‌సర్‌కి వారానికి ఒకసారి సచ్‌ఖంద్ ఎక్స్‌ప్రెస్ నడిపేవాళ్లు. సిక్కుల రెండు ఆధ్యాత్మిక కేంద్రాల మధ్య నడిచే ఈ రైలులో ప్రయాణించేవారందరికీ దారిపొడవునా ఉన్న గురుద్వారాలు లంగర్ (భోజనం) వడ్డిస్తున్నాయి. ఇరవై ఏళ్ల క్రితం సచ్‌ఖంద్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రతి రోజూ నడుపుతున్నారు. అప్పటి నుంచి ప్రతి రోజూ లంగర్ వడ్డిస్తున్నారు. రైలులో ప్రయాణించే రెండు వేల మందికి కష్టం అనుకోకుండా కడుపు నింపుతున్నారు. ఈ సేవకు ప్రయాణికుల నుంచి రూపాయి అడగరు. రైల్వే నుంచి సహాయం తీసుకోరు. ఏదైనా అవాంతరం వల్ల రైలు ఆగిపోతే వీళ్ల సేవ ఆగిందేమో కానీ, ముప్పై ఏళ్ల నుంచి ఈ సేవ కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో ఉచితంగా భోజనం పెట్టే ఓ ప్రత్యేకమైన సదుపాయం సచ్‌ఖంద్ ఎక్స్‌ప్రెస్‌లో తప్ప మరెక్కడా లేదు. అమృత్సర్ చూసేందుకే కాదు ఈ లంగర్ సేవ చూసేందుకూ ఓ సారి ఈ రైలు ఎక్కొచ్చు! దేశంలోని రైళ్లన్నీ గమ్యం చేరుస్తాయి. ఇదొక్కటే ముప్పూటలా ఆకలి తీరుస్తుంది!