రోజులో కథ రాసే ధీరుడు.. నెలలో షూటింగ్ అంతా పూర్తిచేసే యోధుడు.. ఆయన. ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు. అతగాడి డైరెక్షన్లో నటించడానికి అగ్రహీరోలు సైతం తహతహలాడేవారు. ఇదంతా గతం..
ఇప్పుడు సీను మారింది. హిట్టు మీద హిట్టు కొట్టిన ఆ దర్శకుడు ఇప్పుడు ఫ్లాప్‌లకు కేరాఫ్‌గా మారిపోయాడు.
గతంలో అచ్చొచ్చిన థాయ్ తీరం ఇప్పుడు ఆయనకు కలిసి రావడం లేదేమో! అందుకే కాబోలు.. హీరోలు ఎవరూ అతని కాంపౌండ్ ఛాయలోకి వెళ్లడానికి కూడా జంకుతున్నారు.
ఈ దర్శక దిగ్గజం గత వైభవాన్ని తలుచుకుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. ఎన్నెన్ని హిట్స్ ఇచ్చాడు. హీరోయిజానికి కొత్త నిర్వచనం చెప్పాడు. అంతలోనే ఏమైందో ఏమో కానీ, హీరోయిజం పాళ్లు భరించలేనంతగా పెంచేయడంతో కథలు కకావికలం అవ్వడం మొదలైంది. కథనం అతుకుల బొంతగా తయారుకాసాగింది. ఎంత పబ్లిసిటీ చేసినా.. మొదటి ఆటతో సినిమా సూపర్ ఫ్లాప్ అనే టాక్ వైరల్ అవ్వడం మొదలైంది. వరుస వైఫల్యాలు అతని పంథాను ఇసుమంతైనా మార్చకపోవడం శోచనీయం.
ఇస్మార్ట్ వర్క్ చేస్తారన్న పేరున్న అతను.. డబుల్ ఇస్మార్ట్‌గా వ్యవహరించడమే అతని వైఫల్యానికి కారణమని మరో విశ్లేషణ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నది. మానవ జీవితంలో గెలుపు, ఓటములు సహజం. సినిమా ఇండస్ట్రీలో అయితే అతి సహజం. సహనం ఉన్నంత వరకూ పతనం మనిషిని చేరదు. ఓటమిని అర్థం చేసుకోకపోతే.. గెలిచే మార్గం తోచదు. ఈ దర్శకుడి పనితీరుకు తాను అసూయ పడతానని ఓ ప్రఖ్యాత సినీకథా రచయిత పబ్లిక్‌గా ప్రకటించాడు.
అదే సమయంలో ఆ దర్శకుడు రాసుకున్న కథ తెరకెక్కించే ముందు తనకు ఒకసారి చెబితే.. పరాజయం అతని ఇలాఖాలోకి రాకుండా చేస్తానని కూడా పేర్కొన్నాడు. ఈ మాటలు.. ఆ దర్శకుడి చెవికి చేరే ఉంటాయి! అయినా, ఆ ప్రయత్నం చేసినట్టయితే ఎక్కడా వార్తలు రాలేదు. అందుకే కాబోలు ఇంకా ఫ్లాప్‌ల బాటలోనే నడుస్తున్నాడు. తక్కువ నసతో, ఎక్కువ పసతో సినిమాలు తీసే సదరు దర్శకుడు ఒక్కసారి సంయమనం పాటిస్తే.. అతని ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ పడటం పెద్ద కష్టమేం కాదు! దెబ్బ కొట్టిన ప్రతిసారీ దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాలని ఆయన బ్లైండ్‌గా ఫిక్సవ్వకపోతే చాలు. విజయం ఆయన కాలింగ్ బెల్ నొక్కడానికి ఎన్నో రోజులు పట్టవు!