మనం ప్రతిరోజూ తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. హెల్తీఫుడ్, జంక్‌ఫుడ్ అని వేరుచేస్తాం. కానీ, రోజూ గంటల తరబడి మన మెదడులోకి పంపిస్తున్న డిజిటల్ కంటెంట్ గురించి ఆలోచిస్తామా? అస్సలు లేదు. సోషల్ మీడియా ఫీడ్స్‌లో మనకు వడ్డించే కంటెంట్ ఎంత ప్రమాదకరమో తెలుసా?
మనం ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం.. ఒక్క ఐదు నిమిషాలు చూసి క్లోజ్ చేద్దాం అనుకుంటాం. కానీ, గంటలు నిమిషాల్లా గడిచిపోతుంటాయి. స్క్రీన్ నుంచి కళ్లు అస్సలు తిప్పుకోలేం. అసలు మనకు నచ్చిన వీడియోలే ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తున్నాయి? మనం ఏది కొనాలి, ఏం చూడాలి, ఆఖరికి ఏది నమ్మాలి అనేది కూడా ఎవరో డిసైడ్ చేస్తున్నారా? అవును.. దీని వెనుక ఉన్నది ‘అల్గారిథమ్’ అనే ఓ అదృశ్య శక్తి. ఈ డిజిటల్ వల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? లేదంటే.. ఈ ‘విషపు’ కంటెంట్‌కి అందరం బలవుతాం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ అల్గారిథమ్స్ ముప్పును చెప్పేందుకు కొందరు భిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నారు. యూకేలో ఈ మధ్యే చోటు చేసుకున్న ఓ మూమెంట్ అందుకు ఉదాహరణ. ఈ అసాధారణమైన క్యాంపెయిన్ లో ఫిక్షనల్ ఫుడ్ బ్రాండ్ క్రియేట్ చేశారు.
పేరు అల్గారిథమ్..
ఈ బ్రాండ్ కింద వారు తయారు చేసింది ఏంటంటే.. ‘రేసిస్ట్ వైట్ బ్రెడ్’ (జాత్యహంకార తెల్ల రొట్టె), ‘మిసోజినిస్టిక్ ఎగ్స్’ (స్త్రీద్వేషపూరిత గుడ్లు) వంటి ప్రొడక్ట్స్. ఇవి నిజమైన ఫుడ్ ప్యాకేజింగ్‌తో యూకే అంతటా డెలివరీ చేశారు. లండన్‌లోని టెస్కో సూపర్మార్కెట్లో ప్రదర్శించారు. కొందరు రాజకీయ నాయకుల నివాసాల దగ్గరా ప్రదర్శించారు. పాలసీ మేకర్లు, జర్నలిస్టులు, ఇన్ఫ్లూయెన్సర్లకు బాక్సులు డెలివరీ చేశారు. చూసిన వారు మొదట షాక్ అయ్యారు. తర్వాత అసలు మెసేజ్ అర్థమైంది! అదేంటంటే.. మనం ఆన్లైన్లో కన్జ్యూమ్ చేసే కంటెంట్ కూడా ఇలాంటిదే అని. మన అనుమతి లేకుండా, మన మెంటల్ హెల్త్‌కు హానికరమైన కంటెంట్‌ను సోషల్ మీడియా అల్గారిథమ్స్ ఫీడ్ చేస్తున్నాయి. ‘మనం తినే ఆహారం మన ఫిజికల్ హెల్త్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో, అదే విధంగా మనం ఆన్లైన్లో కన్జ్యూమ్ చేసే కంటెంట్ మన మెంటల్ హెల్త్‌ను ప్రభావితం చేస్తుంది’ అని పలువురు సైకాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.
16 సెకన్లలోనే..!
దీనిపై సర్వే చేసిన ఓ సంస్థ తమ నివేదికలో షాకింగ్ నిజాలు వెల్లడించింది. అడల్ట్ యూజర్లకు కేవలం 16 సెకన్లలో హార్మ్‌ఫుల్ కంటెంట్ ప్రజెంట్ అవుతుంది. ఇక పిల్లల విషయంలో అయితే అది మరింత క్విక్‌గా రెస్పాండ్ అవుతుంది. కేవలం 8 నిమిషాల్లో ఎట్రాక్ట్ చేసేస్తున్నది. ఇందుకోసం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అంతా అల్గారిథమ్స్ మాయ. ఎవరేం చేస్తున్నారో.. ఏది వారిని ఆకట్టుకుంటుందో క్షణాల్లో అంచనా వేసి.. అందుకు తగిన కంటెంట్‌ని హాట్.. హాట్‌గా వడ్డించేస్తున్నాయి. దీంట్లో రేసిజం, స్త్రీ ద్వేషం, హింస వంటి కంటెంట్ మన ఫీడ్స్లోకి ఎలా వస్తుందో ఈ ఆల్గారిథమ్స్ పని చూస్తే అర్థం అవుతుంది. పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఈ ఉచ్చుని ఎలా బిగిస్తున్నది అనేది యూజర్లకు తెలియని చిదంబర రహస్యం.
అల్గారిథమ్ ఎలా పని చేస్తుంది?
మనం ఒక పోస్ట్‌ను ఎంతసేపు చూస్తున్నాం, దేనికి లైక్ కొడుతున్నాం అనే ప్రతి చిన్న అంశాన్ని ఈ అల్గారిథమ్స్ గమనిస్తాయి.
ఎకో చాంబర్స్: మనకు నచ్చిన విషయాలనే మళ్లీ మళ్లీ చూపించడం ద్వారా మనం ఒకే రకమైన ఆలోచనా ధోరణిలో ఉండిపోయేలా చేస్తాయి. దీనివల్ల వాస్తవాలు తెలియకుండా, ఒక భ్రమలో బతికే ప్రమాదం ఉంది.మానసిక ఒత్తిడి: ఇతరుల విలాసవంతమైన జీవితాలను, ఎడిట్ చేసిన ఫొటోలను పదే పదే చూపించడం వల్ల యువతలో ఆత్మన్యూనతా భావం, ఒత్తిడి పెరుగుతున్నాయి.
రక్షణ కవచం మన చేతుల్లోనే!
అల్గారిథమ్స్ నుంచి మన డిజిటల్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.ఆటో-ప్లే ఆఫ్ చేయండి: ఒక వీడియో అవగానే మరో వీడియో ప్లే అయ్యే ‘ఆటో-ప్లే’ ఆప్షన్‌ను ఆపేయండి. దీనివల్ల మీరు ఎంతసేపు చూడాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
నోటిఫికేషన్లకు దూరం: ప్రతి చిన్న యాప్ పంపే నోటిఫికేషన్లను అనుమతించకండి. అవసరమైన వాటికే ప్రాధాన్యం ఇవ్వండి.
సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయండి: అప్పుడప్పుడు మీ బ్రౌజర్ హిస్టరీని, యాప్ సెట్టింగ్స్‌లోని ‘పర్సనలైజ్డ్ యాడ్స్’ను రీసెట్ చేయడం వల్ల అల్గారిథమ్ మిమ్మల్ని ట్రాక్ చేయడం కష్టమవుతుంది.
మన జాగ్రత్తలే శ్రీరామరక్ష!టెక్నాలజీ మనల్ని నియంత్రించకూడదు, మనమే దాన్ని వాడుకోవాలి.డిజిటల్ డిటాక్స్: వారంలో కనీసం ఒక్క రోజైనా సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.అన్ని కోణాల్లో ఆలోచించండి: సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వార్త నిజం కాదు. ఒక విషయాన్ని నమ్మే ముందు ఇతర సోర్సెస్ ద్వారా కూడా చెక్ చేసుకోండి.మనపై ఆధిపత్యం వద్దు: సోషల్ మీడియా అనేది ఒక అద్భుతమైన సాధనం, కానీ అది మనపై ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవడం మన బాధ్యత. అల్గారిథమ్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుంటే, వాటి మాయలో పడకుండా మన డిజిటల్ లైఫ్‌ని ప్లాన్ చేయొచ్చు.
మెంటల్ హెల్త్ = ఫిజికల్ హెల్త్
మనం సోషల్ మీడియా లాగిన్ చేయడం మన చాయిస్. కానీ అక్కడ మనకు ఏం సర్వ్ అవుతుందో మన కంట్రోల్లో లేదు. ఎంగేజ్మెంట్ కోసం డిజైన్ చేసిన అల్గారిథమ్స్ మనల్ని అడిక్ట్ చేసేలా పని చేస్తాయి. మనం ఒక వస్తువును వాడటం లేదు.. ఆ వస్తువే మనల్ని వాడుకుంటున్నది అని తెలిసినప్పుడు మనం అప్రమత్తం కావాలి. యూజర్లకు అల్గారిథమ్స్‌పై పూర్తి కంట్రోల్ ఇవ్వాలి. ‘ఈ టైప్ పోస్ట్స్ తక్కువ చూపించండి’ అన్నది సరిపోదు. హార్మ్‌ఫుల్ కంటెంట్‌ను పూర్తిగా బ్లాక్ చేసే పవర్ ఉండాలి. అల్గారిథమ్ కంట్రోల్‌ను బేసిక్ యూజర్ రైట్‌గా చట్టబద్ధం చేయాలి. అంతేకాదు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ కంటెంట్ రావాలో నియంత్రించగలగాలి. పిల్లలకు స్మార్ట్‌ఫోన్స్ ఇచ్చే ముందు ఆలోచించండి. పేరెంటల్ కంట్రోల్స్ యాక్టివేట్ చేయండి. వాళ్లతో ఆన్లైన్ సేఫ్టీ గురించి మాట్లాడండి. దీంతో పాటు.. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అల్గారిథమ్స్ ఎలా పని చేస్తాయో స్పష్టంగా వెల్లడించాలి.
-అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్