వింధ్య పర్వత సానువుల్లో ఉన్న సుందర ప్రదేశం మాండూ. ఈ చారిత్రక నగరి మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణం ఇండోర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో.. పచ్చని ప్రకృతితో అలరారుతోన్న మాండూ ఒకప్పుడు మాల్వా రాజ్యానికి రాజధానిగా ఉండేది. మాండూకు మరోపేరు ‘ఆనంద నగరం’. కళలకు నెలవు, ప్రేమకు చిరునామా ఈ ప్రాంతం. మాండూ చివరి స్వతంత్ర మహారాజు బాజ్ బహద్దూర్, రాణి రూపమతి ప్రేమకు చిహ్నం రూపమతి మహల్.
ఇదొక్కటే కాదు ఇలాంటి భవంతులు, కోటలు ఇక్కడ కోకొల్లలు. దాదాపు 60 అద్భుతమైన మహళ్లును చూడొచ్చు. ఒక్కో భవనం వెనుక ఒక్కో గాథ. రెండు కోనేరుల మధ్య కొలువై.. ఓడను తలపించే జహాజ్ మహల్, హిండోలా మహల్, ధార్ కోట, మాండవ్ కోట, బాజ్ బహద్దూర్ ప్యాలెస్ ఇలా ఎన్నో ఎన్నెన్నో! అరుదైన వృక్ష సంపద మాండూ ప్రత్యేకత. ఆఫ్రికాలో పెరిగే బావోబాబ్ వృక్షాలు మాండూ పరిసరాల్లో కనిపించడం విశేషం. వర్షాకాలంలో మాండూలోని కొలనులన్నీ జలకళ సంతరించుకుంటాయి. అందమైన కోటల ప్రతిబింబాలు అలలపై తేలిపోతూ.. అలా అలరిస్తాయి. చల్లటి వాతావరణం గిలిగింతలు పెడుతుంది.
మాండూకు సమీపంలో ఇండోర్ రైల్వే స్టేషన్ ఉంది. హైదరాబాద్ నుంచి ఇండోర్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇండోర్ నుంచి బస్సులు, ట్యాక్సీలో మాండూకు వెళ్లొచ్చు. భోపాల్ నుంచి మాండూ 288 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గంలో మాండూకు చేరుకోవచ్చు.