Digital Arrest | అర్జున్ ఫోన్ రింగ్ అయింది. చూస్తే ఓ ప్రముఖ కొరియర్ సర్వీసు. ‘నేనేం ఆర్డర్ పెట్టలేదే!!!’ అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల వైపు వ్యక్తి చాలా ప్రొఫెషనల్‌గా ‘నేను మాట్లాడుతున్నది అర్జున్‌తోనేనా?’ అని అడిగాడు. ‘అవును చెప్పండి’ అన్నాడు అర్జున్. అవతలి వ్యక్తి ‘మీ పేరు మీద ఓ పార్సిల్ వచ్చింది. కానీ, ఆ కొరియర్ అనుమానాస్పదంగా అనిపించింది. చూస్తే దాంట్లో డ్రగ్స్ ఉన్నాయ్? దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీరేదైనా చెప్పాలనుకుంటే పోలీసులతో మాట్లాడండి. మీ కాల్ని మేం పోలీసులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం’ అన్నాడు. ఆ మాటలు వినగానే అర్జున్ ఒళ్లంతా చెమటలు పట్టాయి. అంతలోనే ‘టూ టౌన్ పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రణ్వీర్ను మాట్లాడుతున్నా. మత్తు పదార్థాల స్మగ్లింగ్ నేరానికి పాల్పడినందుకు గానూ.. మీపై యాక్షన్ తీసుకుంటున్నాం’ అన్న మాటలు వినిపించాయి. అర్జున్‌కి కాళ్ల కింద భూమి అదిరినట్టు అనిపించింది.
రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయిన అర్జున్.. కాస్త తేరుకుని ‘నాకేం తెలియదు..’ బాగా బతిమాలుతున్నట్టుగా అన్నాడు. అవతలి వ్యక్తి ఇంకా గంభీరంగా.. ‘ఈ అడ్రస్ నీదేగా?’ అని.. టపటపా అడ్రస్ చదివాడు. ‘మర్యాదగా నువ్వు మాతో సహకరిస్తే సరి! లేదంటే వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది’ అన్నాడు. అర్జున్ బెంబేలెత్తిపోయాడు. కంగారులో అతని మాటలు తడబడసాగాయి. అర్జున్ భయపడుతున్నాడని అవతలి వ్యక్తికి అర్థమైంది. అతన్నుంచి తనకు కావాల్సిన వివరాలన్నీ అడగడం మొదలుపెట్టాడు. అన్నిటికీ సమాధానం చెబుతూ పోయాడు అర్జున్. ‘మాతో ఇలా సహకరిస్తే.. ఈ కేసు నుంచి నిన్ను తప్పిస్తా! లేదంటే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది’ అని కఠినంగా అన్నాడు. కస్టమ్స్ వాళ్లు వేసిన ఫైన్, కోర్టు ఫీజులు అంటూ రూ.10 లక్షలు డిమాండ్ చేశాడా వ్యక్తి. కంగారులో కేసు నుంచి బయటపడితే చాలు అనుకొని అడిగిన మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడు అర్జున్. ‘వెరీ గుడ్! నువ్వు సేఫ్. మళ్లీ కాల్ చేస్తాను’ అని ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. తర్వాత నో కాల్, నో కేస్! అర్జున్ అరెస్ట్ సంగతేంటని ఆరా తీస్తే.. ‘డిజిటల్ అరెస్ట్ స్కామ్’ అని తెలిసింది. ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్దీ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ నేరాలలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ (Digital Arrest Scam) ఒకటి. వీరి లక్ష్యం ఒకటే.. అయితే డబ్బు లేదంటే బాధితుల వ్యక్తిగత వివరాలు దోచుకోవడం. స్కామర్ల మాయమాటలు నమ్మితే.. మీ డిజిటల్ అరెస్ట్‌కు మీరే వారెంట్ ఇచ్చినట్టు అవుతుంది.
బాధితుణ్ని రక్షిస్తామంటూనే.. అతని బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలు తీసుకుంటారు. కొన్నిసార్లు బాధితుడి నుంచి వాళ్లు అడిగిన మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. క్రిప్టోకరెన్సీ రూపంలోనూ వసూలు చేస్తారు.
ఈ డిజిటల్ అరెస్ట్ దశల వారీగా సాగుతుంది. మొదటిది.. సంప్రదింపుల ఘట్టం (The First Contact). బాధితుడికి కాల్ చేసి.. ఫెడెక్స్, డీహెచ్ఎల్.. వంటి ప్రముఖ కొరియర్ కంపెనీల నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మిస్తారు. పార్సిల్లో అనుమానాస్పదమైనవి ఉన్నట్టు భయపెడతారు. ఈ కాల్స్ చాలావరకు ఆటోమేటెడ్వే ఉంటాయి. నంబర్స్ ప్రెస్ చేయడం ద్వారానే సంభాషణ సాగుతుంది. పోలీసులకు కాల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనడంతో మొదటి దశ ముగుస్తుంది. రెండోది భయపెట్టడం (Escalation of the Threat). ఆందోళనలో ఉన్న బాధితుడిని ఓ నకిలీ పోలీసు భయపెడతాడు. స్మగ్లింగ్, నల్లడబ్బు లాంటి నేరాలతో లింక్ పెడతారు. బాధితుడి వివరాలు తెలుసుకుంటూ.. ఉచ్చు మరింత బిగిస్తారు. తర్వాత మూడో ఘట్టంలో బాధితుడిని మానసికంగా ఒత్తిడికి (Psychological Manipulation) గురిచేస్తారు. తమకు సహకరించకపోతే అరెస్టు చేస్తామని బెదిరిస్తారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో ఈ విషయం గురించి మాట్లాడవద్దని హెచ్చరించి వారిని ఒంటరిని చేస్తారు. ఆ తర్వాత చివరి ఘట్టమైన ఆర్థిక దోపిడీకి (Financial Extortion) పాల్పడతారు. బాధితుణ్ని రక్షిస్తామంటూనే.. అతని బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలు తీసుకుంటారు. కొన్నిసార్లు బాధితుడి నుంచి వాళ్లు అడిగిన మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. క్రిప్టోకరెన్సీ రూపంలోనూ వసూలు చేస్తారు.
ఈ డిజిటల్ యుగంలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ తరహా మోసానికి గురైతే, వెంటనే తగు చర్యలు తీసుకోండి.
1. గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేస్తే వారిని గుడ్డిగా నమ్మొద్దు. పరిచయం లేని వ్యక్తులు మాట కలిపితే.. వెంటనే ఫోన్ కట్ చేయాలి. లేదంటే.. అవతలి వ్యక్తి పన్నిన ఉచ్చులో మీరు చిక్కుకునే ప్రమాదం ఉంది.
2. స్కామ్ కాల్ అనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అందుకు cybercrime.gov.in సైబర్ పోర్టల్ ఉంది. అలాగే, 1930కి కాల్ చేయొచ్చు.
3. మీరేదైనా సైబర్ మోసాల్లో ఇరుక్కున్నారని అనుమానం వస్తే.. వెంటనే మీ బ్యాంకులను సంప్రదించండి. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయాల్సిందిగా కోరండి.
4. సోషల్ మీడియా అకౌంట్లను సురక్షితం చేసుకోండి. పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మార్చడంతోపాటు, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోండి.
5. నిజమైన పోలీసులు ఎప్పుడూ ఫోన్లో డబ్బులు, బ్యాంకు ఖాతాల సమాచారం అడగరు. అలా అడిగారంటే ఫేక్ అని గుర్తించండి.
6. మీ వ్యక్తిగత సమాచారాన్ని భద్రం చేసుకోండి. అందుకు తగిన సైబర్ సెక్యూరిటీ టూల్స్, టెక్నిక్స్ ఉపయోగించండి. దీంతో ఏవైనా మాలిషియస్ లింకుల్ని క్లిక్ చేసినా అవి అడ్డుకుంటాయి.
– అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్