సీపీతో ఫోన్లో మాట్లాడుతున్న ఇన్స్పెక్టర్ రుద్రకు తన క్యాబిన్ బయట ఏదో వాగ్వాదం జరుగుతున్నట్టు లీలగా అనిపిస్తున్నది. దీంతో ఫోన్ సంభాషణ ముగియగానే బయటకొచ్చి చూశాడు. 25-28 ఏండ్ల వ్యక్తి హెడ్‌కానిస్టేబుల్ రామస్వామితో ఏదో వాదిస్తున్నాడు. విషయమేంటని? అడిగాడు రుద్ర. ‘సార్.. ఎవరో అమ్మాయి చనిపోయినట్టు ఇతను చెప్తున్నాడు. విషయమేంటని ఆరా తీద్దామంటే, తనను జైల్లో వేయరు కదా! అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు’ విసుగ్గా చెప్పాడు రామస్వామి. తన క్యాబిన్లోకి పంపించమని సైగ చేశాడు రుద్ర. సదరు వ్యక్తితోపాటు రామస్వామి కూడా లోపలికి వెళ్లాడు.
‘చెప్పండి అసలు మీరు ఎవరు? ఏం జరిగింది?’ గ్లాస్‌తో మంచినీళ్లు అందిస్తూ అడిగాడు రుద్ర. ‘సార్! నా పేరు శివ. నేను ఫ్లోరిస్ట్‌ను. బర్త్‌డే, పెండ్లి ఇలా ప్రత్యేక సందర్భాలకు ఫ్లవర్ బొకే, పూలదండలను రెడీ చేసి డోర్ టూ డోర్ సర్వ్ చేస్తుంటాను. నిన్న ఫోన్లో నాకు ఓ ఆర్డర్ వచ్చింది. ఇక్కడికి దగ్గర్లోనే ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ అమ్మాయి ఒక బొకే ఆర్డర్ ఇచ్చింది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు డోర్ డెలివరీ చేయమని చెప్పింది. దీంతో ‘డెలివరీ మార్నింగ్ 7 టు నైట్ 11 లోపే’ అని చెప్పాను. ‘అయితే, లేదు.. మార్నింగ్ 4 గంటలకే బొకే కావాలి అంటూ ఆమె పదేపదే రిక్వెస్ట్ చేయడంతో కాదనలేక సరే అన్నాను’ అంటూ శివ ఆగిపోయాడు. ‘ఆ తర్వాత..?’ ప్రశ్నించాడు రుద్ర.
‘సార్..! ఆమె చెప్పినట్టే, ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లా. తలుపు ఎంత కొట్టినా మేడం తీయలేదు. ఫోన్లో ట్రై చేశా. లిఫ్ట్ చేయలేదు. అసలే చలికాలం. మంచుకురుస్తుంది. అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయా. 15 నిమిషాలపాటు వెయిట్‌చేసి వెనక్కి వస్తుంటే ఒక కిటికీ కనిపించింది సార్. లోపల ఎవరైనా ఉన్నారా? అని చూద్దామనుకొన్నా. మంచు కురవడంతో కిటికీ అద్దం బయట మొత్తం మసగ్గా మారింది. లోపల ఏమీ కనిపించట్లేదు. దీంతో చెయ్యితో అద్దాన్ని తుడిచా.. అప్పుడు.. అప్పుడు..’ వణికిపోతున్నాడు శివ. ‘ఆ.. అప్పుడు??’ ఆత్రుతగా అడిగాడు రామస్వామి. ‘అక్కడో యువతి నేలపై రక్తపు మడుగులో పడి ఉంది సార్’ భయపడుతూ చెప్పాడు శివ.
‘ఆ తర్వాత?’ అడిగాడు రుద్ర. ‘అది చూడగానే, నాకు కాళ్లు, చేతులు వణికిపోయాయి సార్. నన్ను అక్కడ ఎవరైనా చూస్తే, నేనే చేశానని అనుకుంటారని భయపడుతూ పరిగెత్తుకొచ్చా. అయితే, ఆ వీధి చివర్లో ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో నేను పడ్డట్టు గమనించా. ఎలాగో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మీ దగ్గరికి వస్తుంది. అందుకే, చేయని నేరానికి నన్ను ఎక్కడ హంతకుడిగా అనుకొంటారేమోనని నేనే జరిగిందంతా చెప్పడానికి స్టేషన్‌కు పరిగెత్తుకొచ్చా’ ఆగిపోయాడు శివ. ‘సరే.. ముందు నువ్వు కాస్త స్థిమితపడు’ అంటూ శివకు ధైర్యం చెప్పిన రుద్ర.. ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా? అంటూ కానిస్టేబుల్స్‌ను ఆరా తీశాడు. లేదని చెప్పడంతో.. శివను స్టేషన్లోనే ఉండమని చెప్పిన రుద్ర.. తన సిబ్బందితో క్రైమ్ జరిగిన ప్రాంతానికి వెళ్లాడు. శివ చెప్పినట్టే తలుపులు వేసే ఉన్నాయి. మెట్ల దగ్గర ఫ్లవర్ బొకే పడి ఉంది. డోర్ ఆటోమెటిక్ లాక్ చేసి ఉండటంతో సిబ్బంది సాయంతో తలుపులను బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. శివ చెప్పినట్టే రక్తపుమడుగులో అమ్మాయి పడి ఉంది. తెల్లవారుజామునే ప్రాణం పోయినట్టు అర్థమవుతున్నది. క్రైమ్ జరిగిన విధానాన్ని పరిశీలిస్తే, హత్యేనని రుద్ర నిర్ధారణకు వచ్చాడు. ఫోరెన్సిక్ వాళ్లు క్రైమ్ స్పాట్లో సాక్ష్యాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. శివ చెప్పిన కిటికీ తలుపులు మూసే ఉన్నాయి. బయటినుంచి కిటికీగుండా చూస్తే, క్రైమ్ స్పాట్ క్లియర్‌గా కనిపిస్తుంది. వీధి చివర్లో సీసీటీవీ ఫుటేజీ తీసుకురమ్మని ఓ కానిస్టేబుల్‌ను పురమాయించిన రుద్ర.. తిరిగి స్టేషన్‌కు ప్రయాణమయ్యాడు. క్రైమ్ స్పాట్లో ఒక విషయం లాజిక్కు దూరంగా ఉన్నట్టు రుద్ర గుర్తించాడు. అదేదో తేల్చుకొందామని తీర్మానించుకొన్నాడు. ఇంతలో స్టేషన్ రానే వచ్చింది.
కుర్చీలో కూర్చున్న శివ దగ్గరికి వచ్చాడు రుద్ర. ‘సార్.. హంతకుడు ఎవరు?’ భయంతో అడిగాడు శివ. ‘కాసేపట్లో వాడెవడో ఇట్టే దొరికిపోతాడు’ నిశ్చయంగా చెప్పాడు రుద్ర. గంట గడిచింది. సీసీటీవీ ఫుటేజీని తన క్యాబిన్లో ఒకటికి రెండుసార్లు పరిశీలించారు రుద్ర, రామస్వామి. ఆ తర్వాత శివను లోపలికి రమ్మన్నారు. ‘మిస్టర్ శివ! హత్య తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగినట్టు అర్థమవుతుంది. ఆ సమయంలో మీరు తప్ప ఇంకెవ్వరూ ఆ ఇంటి పరిసరాల్లోకి వెళ్లినట్టు సాక్ష్యాలు లేవు. అంటే..’ ఆగిపోయాడు రుద్ర. ‘అంటే?? నేనే ఆ హత్య చేసినట్టా సార్?! ఒకవేళ, నేనే హత్య చేసినట్లయితే, స్టేషన్‌కి వచ్చి ఇవన్నీ ఎందుకు చెప్తా? అయినా, అసలు హంతకులను పట్టుకోవడం చేతకాని మీరు.. మాలాంటి అమాయకులనే కదా కేసులో ఇరికించేది’ ఉక్రోషంతో ఊగిపోయాడు శివ. ‘హలో బాబూ.. కొంచెం ఉండు. నిన్ను ఇరికించాలన్న సరదా ఇక్కడ ఎవ్వరికీ లేదు’ కోపంగా అన్నాడు రామస్వామి. ‘బాబాయ్.. మీరు ఊరుకోండి. జరిగిందేంటో అతనే చెప్తాడు. హంతకుడినీ అతడే పట్టిస్తాడు’ అంటూ చిన్నగా నవ్వుతూ శివ వైపు తీక్షణంగా చూశాడు రుద్ర.
‘మిస్టర్ శివ. తెల్లవారుజామున 4 గంటలకు .. అదీ మంచు కురిసే చలిలో ఆ అమ్మాయి చనిపోయినట్టు కిటీకీ అద్దంలో నుంచి చూసి కన్ఫర్మ్ చేసుకొన్నావా? అదీ బయటి నుంచి మసగ్గా ఉన్న అద్దాన్ని తుడిచి మరీ&’ సూటిగా అడిగాడు రుద్ర. ‘అవును’ అన్నాడు శివ నిబ్బరంగా. అది విన్న రుద్ర వెంటనే.. ‘అరెస్ట్ హిమ్.. ఇతనే హంతకుడు’ అని తేల్చేశాడు. ఎలా?
సైన్స్ నియమం ప్రకారం.. బయట వాతావరణం చల్లగా ఉంటే అద్దానికి వెనుకవైపున మసగ్గా ఓ పొర ఏర్పడుతుంది. అంటే, బయటినుంచి అద్దాన్ని ఎంత తుడిచినా లోపల ఏం ఉందో కనిపించదు. ఇక, ఈ కేసులో లోపల హత్యను తాను బయట కిటికీ అద్దంలోంచి చూసినట్టు శివ పోలీసులకు చెప్పాడు. ఇది అసాధ్యం. తనే ఆ అమ్మాయిని చంపి ఏమీ తెలియనట్టు శివ పారిపోవాలనుకొన్నాడు. అయితే, వీధి చివర్లో సీసీటీవీలో తాను పడినట్టు గుర్తించిన శివ.. ఆ వెంటనే తానే స్వయంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి అమాయకుడిగా నాటకమాడాడు. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతోనే ఈ హత్య చేసినట్టు శివ తర్వాతి విచారణలో ఒప్పుకొన్నాడు.