ఎండకాలం సెలవుల్లో మా నానమ్మవాళ్ల ఊరికి వెళ్లేవాళ్లం. మా మేనత్తలు, చిన్నాయనల పిల్లలూ జతయ్యేవాళ్లు. అందరిలో ఆడపిల్లలం పదకొండు మందిమి.. పదమూడు మంది మగపిల్లలతో మొత్తం రెండు డజన్ల మందిమి ఉండేవాళ్లం. అందరం కలిసి ఎన్నో ఆటలు ఆడేవాళ్లం.
మా గ్యాంగ్‌లో ఒక అక్క, ముగ్గురు వదినలు పెద్దవాళ్లు. అప్పటికే పెళ్లయినవాళ్లు కూడా. మిగతా వాళ్లం ఇంచుమించు ఐదారేళ్ల వయసు తేడా ఉన్నవాళ్లం. ఆడపిల్లల్లో నా నెంబర్ కింది నుంచి మూడు, పైనుంచి ఎనిమిది. కాబట్టి ఎప్పుడైనా నాకు పెద్దగా శాసన నిర్ణయాధికారం ఉండేది కాదు. పైవాళ్లు ఏది నిర్ణయిస్తే ఆ పోర్ట్‌ఫోలియో తీసుకోవాల్సిందే! ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడాల్సిందే ! ఇక మగపిల్లల్లో నాకన్నా ఆరుగురు పెద్ద, ఏడుగురు చిన్న. కానీ, వాళ్ల ఆటలు వేరుగా ఉండేవి. వాళ్లలో మరీ పెద్దవాళ్లు ముగ్గురు తప్ప.. మిగతా వాళ్లు మాకు చెప్పకుండా స్కూలు గ్రౌండుకెళ్లి క్రికెట్ ఆడేవాళ్లు. ఒక్కోసారి ఇంటి వాకిట్లో ఆడినప్పుడు మాత్రం నాలాంటి ఒకరిద్దర్ని జట్టులో చేర్చుకునేవారు. మహిళలకు క్రీడారంగంలో సమాన ప్రాతినిధ్యం కల్పించి.. మా ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నారని అనుకునేవాళ్లం. కానీ, వాళ్లకు సరిపడా మెంబర్లు లేకపోవడం వల్లే మమ్మల్ని జట్టులోకి తీసుకున్నారనే నిజాన్ని గ్రహించలేకపోయాం. అయితే ఎంతసేపూ బంతి దూరంగా పోతే వెతికి తెచ్చివ్వడం, ఫీల్డింగ్ చేయడం, అప్పుడప్పుడూ డ్రింక్స్ బ్రేక్‌లో మంచినీళ్లు అందించడం వంటి పనులకే మమ్మల్ని పరిమితం చేశారన్న కఠోర సత్యాన్ని తెలుసుకోవడానికి మాకు ఎక్కువ కాలం పట్టలేదు. దాంతో నిరసనకు దిగాం. మాకు బ్యాటింగ్, బౌలింగ్‌లో అవకాశాలు కల్పిస్తే తప్ప.. ఫీల్డింగ్ చేయబోమని కచ్చితంగా చెప్పేశాం. దాంతో వాళ్లు దిగి వచ్చారు. ‘పోరాడితే పోయేదేముంది.. మంచినీళ్లు మోయడం తప్ప!’ అన్న సామెతను నిరూపించాం. ఆ తరువాత నేను బ్యాటింగ్‌లో ఎడాపెడా సిక్స్‌లు కొడుతుంటే.. వాళ్లు అందుకోలేక పరిగెత్తుతూ “అబ్బో.. రమ సూపర్ బ్యాట్స్‌వుమన్! రమక్క బ్యాటింగ్ కొస్తె వివ్ రిచర్డ్స్ ఒచ్చినట్టే!” అని ఎంకరేజ్ చేసేవారు. రమ మా టీంలో ఉండాలంటే.. మా టీంలో అని ఉత్సాహం చూపేవారు. ఇక పద్మ బౌలింగ్‌లో ఎక్స్‌పర్ట్‌గా ఉండేది. “బుజ్జీ.. స్పిన్ బౌలింగ్ మాయాజాలం చూపిచ్చు! కమాన్!” అని అరిచేవారు. అలా మా ఇద్దరికి మాత్రమే జట్టులో స్థానం లభించింది.
ఆ అనుభవాన్ని ఉపయోగించి, మా ఊరికి రాగానే నాన్న వెంటపడితే.. ఆయన వడ్రంగిని పిలిచి మా కోసం ఓ క్రికెట్ బ్యాటూ, వికెట్లు చేయించారు. అవి బొడ్డుమల్లె కర్రతో చేసినవి అవడం వల్ల తెల్లగా ఉండి, చక్కగా మెరుస్తూ తేలికగా ఉండేవి. అలా అని రోజూ ఆడేవాళ్లం కాదు. ఆదివారాల్లోనో, సెలవుల్లోనో.. అంతే! పైగా మేం బ్యాడ్మింటన్, రింగు, క్యారమ్స్ వంటి ఎన్నో ఆటలు ఆడేవాళ్లం కనుకా.. జట్టుకు సరిపడా ప్లేయర్స్ దొరక్క క్రికెట్ ఆడటం తరచూ కుదిరేది కాదు.
అమ్మ వైపు మా కజిన్స్లో ఎవ్వరూ పెద్దగా క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపేవారు కాదు. అందుకని మేము మా ఊర్లోనే నలుగురైదుగురం కలిసి ఆడేవాళ్లం. మా చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు మేము క్రికెట్ ఆడుతుంటే చూడటమే కాదు.. బాల్ దూరంగా వెళ్తేచాలు పరిగెత్తుకు వెళ్లి తెచ్చేవాళ్లు. ఎప్పుడైనా వాళ్లు బంతిని బౌండరీ అవతలైనా సరే.. క్యాచ్ పట్టినప్పుడు వాళ్ల ఆనందం చూడాలి. గ్యాలరీలో ఉండి మ్యాచ్ చూసే అభిమానుల్లా కేరింతలు కొట్టేవారు. అలా మాకు మంచి స్పెక్టేటర్స్ దొరికారన్నమాట. మేమూ వాళ్లకు బిస్కెట్లో, చాక్లెట్లో పంచేవాళ్లం.
ఆ తర్వాత రోజుల్లో నేను ఓ పక్క డిగ్రీ చదువుతూ.. మరో పక్క కొన్నాళ్లు తొమ్మిది, పదో తరగతి పిల్లలకి ట్యూషన్స్ చెప్పినప్పుడు చదువు చెప్పడం అయిపోగానే.. మా స్టూడెంట్స్‌తో క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడేదాన్ని. నాకన్నా ఆ పిల్లలు నాలుగైదేళ్లే చిన్నవాళ్లు అవడం వల్ల భయం లేకుండా నాతో ఆటలాడేవారు. వాళ్లు ఆటల కోసమే వచ్చేవారేమో కూడా! అయితే, నేను ఆడుతూనే చిన్నచిన్న ప్రశ్నలు వాళ్ల సబ్జెక్టు బుక్స్లోంచి అడిగేదాన్ని. ఎవరైనా సిక్సో, ఫోరో కొడితే చాలు.. “ఇది బాగనే ఉంది గానీ.. మరి పాఠాలెందుకు చదువుత లేవ్?!” అని అదను చూసి వెక్కిరించేదాన్ని. తెల్లారి ఆ పిల్లగాడే బాగా చదువుకుని వచ్చి జవాబులు చెప్పేవాడు.
నా పెళ్లయ్యాక కూడా మా ఆయన, మా కజిన్స్‌తో కలిసి క్రికెట్ ఆడేవాళ్లం. అలాగని మిగిలిన ఆటలు పక్కన పెట్టలేదు. క్యారమ్స్, షటిల్ ఎక్కువగా ఆడేవాళ్లం. నేను ఉద్యోగంలో చేరాక మా ఆటలన్నీ బంద్ అయ్యాయి. మా పెళ్లయిన కొత్తలో మా ఆయన రేడియోలో క్రికెట్ కామెంట్రీ తప్పక వినేవాడు. తనకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. 1984 అక్టోబర్ 31న ఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య పాకిస్తాన్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు తను ట్రాన్సిస్టర్‌లో కామెంట్రీ వింటున్నాడు. సడన్‌గా.. ‘ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అసాసినేటెడ్’ అని వార్త రావడంతో ఆ మ్యాచ్ రద్దయింది. అలా ఇందిరాగాంధీ మరణవార్త కూడా క్రికెట్ మ్యాచ్ మధ్యలోనే తెలిసింది. 1984లోనే మేము టీవీ కొన్నాం. అప్పటినుంచి మ్యాచులు లైవ్ టెలికాస్ట్ చూడటం మొదలుపెట్టాం.
మా బాబు పుట్టినప్పుడు 1990 జనవరిలో ఆస్ట్రేలియాలో ‘బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్’ వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అప్పుడు నేను మెటర్నిటీ లీవ్‌లో ఉన్నాను. టీవీ ఉన్న హాల్లో మా వాడి ఊయల పక్కన ఈజీ చైర్లో కూర్చొని.. టీవీలో తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చే మ్యాచ్ చూడటం ఒక జ్ఞాపకం. అప్పుడు శ్రీకాంత్, గవాస్కర్ ఓపెనర్స్. రవిశాస్త్రి వన్‌డౌన్‌లో వచ్చేవారు. వాళ్లలాంటి ప్లేయర్స్ వల్ల మన టీం కప్పు గెలిచింది.
“ఊరికే అలా టీవీ చూస్తే కండ్లు పచ్చి జేస్తయి. చెవులు గడలు పడుతయి. బాలింతవు.. చెవులల్ల దూది పెట్టుకో! నెత్తికి బట్ట కట్టుకో!” అని నానమ్మ చెబుతూ ఉండేది. ఇక అమ్మయితే.. “నీకు కొడుకు పుట్టిండు. ఇంక చిన్న పిల్లవానే?! ఏం క్రికెట్టు?! నిద్ర పోకుండ చూస్తున్నవు?! పండుకో పో!” అనేది. అంతలోనే నాన్న.. “అది ఇప్పుడు లీవులనే ఉండె. మళ్ల బ్యాంకుల చేరినాక ఏం జూస్తది?! ఇప్పడు పండుకోకుంటె పగటిపూట పండుకుంటది. పోనియ్యరాదుండి!” అంటూ నా రెస్క్యూకి వచ్చేవాడు. అయితే, నేనలా ఉన్నా.. వాళ్లు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించేదాన్ని.
మనం మారినంత వేగంగా చుట్టూ ఉన్న ప్రపంచం మారదు. ఎంత కాదన్నా మగవాళ్లకు కుదిరినట్టు ఆడవాళ్లకు తీరిక కుదరదు కదా! తరువాతి రోజుల్లో ఒక పక్క ఉద్యోగం, మరో పక్క ఇల్లు – సంసారం, పిల్లల పెంపకం.. వీటన్నిటితో క్రికెట్కానీ మరో ఆటైనా కానీ పూర్తిగా చూడటం కుదరకపోయేది. అయినా కూడా చాలామటుకు ఆదివారం నాడు కానీ, సెలవుల్లో కానీ టీవీలో వచ్చే క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, హాకీ ఇలాంటివి తప్పకుండా చూసేదాన్ని. ఒలింపిక్ గేమ్స్ కూడా నేను చాలా ఇష్టంగా చూస్తాను. మహిళలు ఆడే ఆటలన్నీ కూడా ఆసక్తిగా అందరూ చూసే రోజు రావాలని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.