కొబ్బరి ఆకులతో చేసిన ‘బూరలు’ ఊది ఆనందించడం బాల్యంలో అందరికీ అనుభవమే. కొబ్బరి చెట్టుని దేవతా వృక్షం అంటారు. కొబ్బరి ఆకుల అమరిక కళాకారులకు స్ఫూర్తి. వివాహ, శుభకార్యాల్లో కొబ్బరి ఆకులతో పందిళ్లను అలంకరిస్తారు. కొబ్బరి చెట్టు ప్రపంచమంతా పెరుగుతుంది. గోదావరి జిల్లాలు కొబ్బరితోటలకు ప్రసిద్ధి. దక్షిణ భారత రాష్ర్టాల్లో కొబ్బరిని విరివిగా ఉపయోగిస్తారు. ఆలయాల్లో కొబ్బరికాయ కొడతారు. కొబ్బరిని నైవేద్యంగా పెడతారు. కొబ్బరి చెట్టులోని అన్ని భాగాలూ ఉపయోగపడతాయి.
కొబ్బరి ఆకుల ఈనెలతో చీపుర్లు తయారుచేస్తారు. ఎండిన ఆకులతో విసనకర్రలు, చాపలు అల్లుతారు. కొబ్బరికాయ పీచుతో తాళ్లు, పగ్గాలు నేస్తారు. కొబ్బరి చెట్టు పడిపోతే, దాని కాండాన్ని గుడిసెలకు దూలంగా వాడతారు. కొబ్బరిని అనేక విధాలుగా తింటున్నారు. దేవుడికి నైవేద్యంగా పెట్టి యథాతథంగా తినవచ్చు. లేత కొబ్బరి, ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె వంటల్లో ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకుపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వడదెబ్బ నుంచి కోలుకుంటారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
బరువు తగ్గించుకునేందుకు ఆహార నియమావళి పాటించేవాళ్లు కొబ్బరి నీళ్లు తాగాలి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. ఉపవాసాలు, ప్రయాణాల్లో అలసటను తగ్గిస్తాయి. కేశ సౌందర్యం కోసం కొబ్బరి నూనె వాడతారు. కొబ్బరి సాగు లాభసాటి పంట. మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్న ఈ కొబ్బరి చెట్లపై అనేక ప్రయోగాలు చేసి పది అడుగుల ఎత్తులోనే కాయలు కాసే కొబ్బరి రకాలను సృష్టించారు. ఇసుక నేలల్లోనే కాకుండా నల్లరేగడి నేలల్లో కూడా అతి సులభంగా పెంచుకోవచ్చు. వ్యవసాయంలో కోకోపిట్ కలిపిన ఎరువు శ్రేష్ఠమైనది. ఇలా చేయడం వల్ల విత్తనం సులభంగా మొలకెత్తుతుంది. ఏడాదంతా కొబ్బరికాయల అవసరం ఉంటుంది. కాబట్టే, కొబ్బరి వ్యాపారాలు కూడా వెలిశాయి.
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు