ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. భూమి జడపదార్థం. నీరు ప్రాణాధార శక్తి. ఈ రెండు పదార్థాలు కలవటం వల్ల అంటే.. జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లతో చేరినప్పుడు ప్రాణశక్తి కలుగుతుంది. తద్వారా ఆహార పదార్థాలు, ఓషధులను మనకు అందిస్తుంది. ఈ విధంగా ప్రాణాధార, జడశక్తుల కలయికతో సృష్టి సాగుతున్నదని చెప్పడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేసి, ఆ మృణ్మయ మూర్తిని పూజించే విధానం ఏర్పడింది.
మట్టి గణపతిని పూజించటంలో యోగశాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి. మానవ శరీరంలో ఉండే షట్చక్రాల్లో మొదటిది మూలాధార చక్రం. ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవత గణపతి. మూలాధారం పృథ్వీ తత్త్వం కలిగి ఉంటుంది. పృథ్వి అంటే భూమి. కాబట్టి, భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి, మూలాధారానికి అధిదేవత అయిన గణపతిని అర్చించాలి. దీనివల్ల గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుంది.