Christmas | కోరిన కానుకలిచ్చే శాంటాక్లాజ్ పండుగనాడు వస్తాడు. ఆ బహుమతి కోసం పిల్లలే కాదు, పెద్దలూ ఎదురు చూస్తుంటారు. క్రిస్మస్ పండుగంటే క్రిస్మస్ తాతతో పాటు చూడచక్కగా ముస్తాబు చేసిన చెట్టు, గిఫ్ట్‌బాక్స్‌లు, స్నోమాన్, జింకలు, రంగుల రిబ్బన్లలాంటివీ గుర్తొస్తాయి. అయితే ఇప్పుడివన్నీ కాంతులు విరజిమ్ముతూ లైట్ల రూపంలో కనువిందు చేస్తున్నాయి. క్రిస్మస్ పండుగ అలంకరణలో వీటిని చేరిస్తే అటు అందం, ఇటు కొత్తదనం రెండూ ఉన్నట్టే.
క్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్ పర్వదినంగా చేసుకుంటారు క్రైస్తవులు. తాము పవిత్రంగా భావించే ఒక చెట్టుతో పాటు, ఇంటినీ, ఇంటి ఆవరణనూ ముచ్చటగా అలంకరించుకుంటారు. ముఖ్యంగా వెలుగులు పంచే విద్యుద్దీపాలను అందులో భాగం చేస్తారు. ఇందులో ఎవరి అభిరుచి.. ఎవరి ప్రత్యేకత వారిది. తాము దేవుని బిడ్డలమని తెలిపేలా నక్షత్రాకృతిని పోలిన లైట్‌ను ఇంటి బయట వేలాడదీస్తారు.
క్రీస్తు ఆగమనాన్ని సూచించే నక్షత్రం వెలుగులు తమ ఇంటా విరజిమ్మాలని వాళ్ల ఆకాంక్ష. అందుకే క్రిస్మస్ సందర్భంగా నక్షత్రంతోపాటు మరెన్నో రకాల లైట్లను డెకరేషన్లో భాగం చేసుకుంటారు. క్రిస్మస్ తాత, ఆయన బండికి ఉండే జింకలు, మంచుతో చేసే స్నోమ్యాన్ లాంటివెన్నో చలికాలంలో వచ్చే ఈ పండుగకు సంకేతాలుగా కనిపిస్తుంటాయి. వీటన్నింటినీ లైట్ల రూపంలో తయారు చేస్తున్నారు నేటి తరం డిజైనర్లు. ఈ క్రిస్మస్ పండుగకు ఎంతో విభిన్నంగా కనిపించే ఈ కరెంటు దీపాలే కొత్త ట్రెండ్‌గా మారాయి.
ఎరుపు, ఆకుపచ్చ రంగులు కలగలిపిన శాటిన్ రిబ్బన్‌ను క్రిస్మస్ అలంకరణలో ఉపయోగిస్తారు. దాన్ని ముడి వేసి ‘బో’లా కనిపించేలా చేసి గోడలు, కంచెలు, టేబుళ్ల మీద అందంగా అమర్చుతుంటారు. అదే తరహాలో కనిపించే క్రిస్మస్ బో లైట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. అటు ముస్తాబు చేసినట్టు, ఇటు వెలుగులు అద్దినట్టు కనిపించడం వీటి ప్రత్యేకత. ఇక, జింకల బండి మీద వెళ్లే క్రిస్మస్ తాతతో పాటు ఆయన ఇచ్చే కానుకలు కూడా లైట్ల రూపంలో తయారవుతున్నాయి.
పొడి వాతావరణంలోనూ మంచుకురిసిన అనుభూతి కలగాలంటే స్నోమ్యాన్ లైట్లను ఇంటి ముందు పెడితే సరి! వెలిగే ఫౌంటెయిన్లు, తెలుపు, బంగారు రంగుల జింకలూ కూడా విద్యుద్దీపాల రూపం ఎత్తుతున్నాయి. ప్లగ్ సాయంతో కరెంటుకు అనుసంధానం చేసి వెలిగించేవి ఈ తరహా లైట్లలో కొన్నయితే, బ్యాటరీతో నడిచేవి, సోలార్ సాయంతో మెరిసేవీ మరికొన్ని. అంతేకాదు, వెలుగుతూ ఆరుతూ ఉండేలా, లైట్ల వరుసలు వేగంగా కదిలేలా వీటిలో సెట్టింగులూ చేసుకోవచ్చు. ఈ క్రిస్మస్ పండుగకు కొత్త వెలుగుల్ని ఇల్లంతా పరిచేయొచ్చు!