యాత్రా ప్రియులకు చైనా విశేషాలు ఎంత చెప్పినా తరగనివి. వాటిని అక్కడికి వెళ్లి, కండ్లారా చూసి, ఆ ప్రజల నుంచి చెవులారా వినవలసిందే తప్ప చెప్పడం సాధ్యం కాదు! భారతదేశంలా చరిత్ర, సంస్కృతులలో సుసంపన్నమైన ఆ దేశం, ఆధునిక అభివృద్ధి రీత్యా కూడా శరవేగంతో ముందుకు వెళ్తూ యావత్ ప్రపంచాన్ని సంభ్రమపరుస్తుంది. ఇక్కడ ఉండి ఎంత చదివినా, ఎన్ని వీడియోలు చూసినా, అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా చూడటానికి సాటిరావని అర్థం కావడంతో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ప్రస్తుత ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, అంతర్జాతీయ జలవనరుల నిపుణుడు డా॥ జి.భిక్షం, నేను కలిసి గతనెలలో రెండువారాల పాటు చైనాను సందర్శించాం. ఆ విశేషాలే ఇవి…
మా విమానం హైదరాబాద్ నుంచి హాంకాంగ్ మీదుగా 14 గంటల పాటు ప్రయాణించి, చైనా రాజధాని బీజింగ్ చేరింది. అక్కడి నుంచి చైనా ప్రాచీన రాజధాని షియాన్, ఆర్థిక రాజధాని షాంఘై మీదుగా మా యాత్ర సాగింది. ఆ విధంగా ప్రస్తుత రాజకీయ, పరిపాలనా రాజధానిని, చారిత్రక, సాంస్కృతిక రాజధానిని, ఆర్థిక రాజధానిని కూడా చూడటం, స్థానికులతో మాట్లాడటం వల్ల మాకు చైనాకు సంబంధించి వేర్వేరు విషయాలపై ఒక స్థూలమైన అవగాహన కలిగినట్లయింది. సాధారణ యాత్రికుల్లా అక్కడి ఆకర్షణీయ ప్రదేశాలను, వింతలూ విడ్డూరాలను చూడటంతోపాటు, వారి అభివృద్ధి, సమాజం, సంస్కృతుల గురించి కూడా కొంత తెలుసుకోవాలన్నది మా ఉద్దేశం. అందుకే..
మా యాత్రను అదే ప్రకారం సాగించాం.
బీజింగ్ అందమైన, ఆధునికమైన ప్రపంచస్థాయి నగరం. విమానాశ్రయం వేర్వేరు విభాగాలతో కొన్ని వేల ఎకరాలలో విస్తరించి ఉంది. అక్కడి నుంచి హోటల్ చేరేవరకు ప్రతి ప్రధాన రహదారి, దానిని అనుకుని వెళ్లే ఇతర దారులు, సర్వీస్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు సహా చాలా వైశాల్యంతో కనిపించాయి. ప్రతి విభాగానికీ మధ్య చెట్ల వరుసలు, పూల మొక్కలు ముచ్చటగొలిపాయి. రోడ్డుకు రెండువైపులా బహుళ అంతస్తుల అందమైన భవనాలున్నాయి. ఇవి ఒక ఎత్తయితే దేశవిదేశాల కార్లు తమ తమ లైన్లలో క్రమశిక్షణగా సాగిపోతూ కనిపించాయి. దాదాపు అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే కావడంతో కాలుష్యమనే ప్రసక్తే లేదు. ఒకప్పుడు కాలుష్యంలో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు కడిగిన అద్దంలా మెరిసిపోతున్నట్టు అనిపించింది. ఏ రోడ్డుకు చూసినా సైకిళ్లు వాడేవారు పెద్ద సంఖ్యలో కనిపించారు. వీధుల్లో శుభ్రత, ఎక్కడా చిన్న గుంట గాని, పగులు గాని లేని దారుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఈ విషయాలు ఇంతగా వివరించడం ఎందుకంటే, మొదటి రోజున కేవలం ఒక్కపూటలో చూసిన ఈ పరిస్థితులు, వాతావణం, క్రమశిక్షణలే మాకు తర్వాత రోజులన్నింటిలో ప్రతిచోటా కనిపించాయి. కోటలు, ప్రాచీన నిర్మాణాలు, మ్యూజియంల నిర్వహణ, పరిశుభ్రత, యాత్రికులకు సదుపాయాలను గమనిస్తే సంబురమనిపించింది. ఇటువంటి అంశాలలో శ్రద్ధ చూపటం కూడా సంస్కృతిలో భాగమే. ఈ దృష్టి లేనప్పుడు ఇతరత్రా అభివృద్ధిపై దృష్టి పెట్టలేరు. సాధించలేరు కదా!
బీజింగ్ కేంద్రంగా మేము చూసిన మొదటి వింత అందరికీ తెలిసిన గ్రేట్ వాల్. వేర్వేరు పర్వతాలను కలుపుతూ సుమారు 13,000 మైళ్ల మేర నిర్మించిన గోడ అది. యునెస్కో గుర్తింపు పొందింది. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే గానీ.. ఎవరూ రాసినట్లు కనిపించని ఒక విశేషం ఇక్కడ పంచుకోవాలి. గ్రేట్ వాల్ ప్రవేశపు హాలును ఫైవ్‌స్టార్ హోటల్‌లా, ఆ తర్వాత మెట్ల వరకు గల ప్రదేశాన్ని ఒక బృందావనంలా తీర్చిదిద్దారు. ఒక నీటి కొలనులో మొదటిసారిగా నల్లహంసలను చూశాం. చైనా వాల్ పైకెక్కి అది కొండల మీదుగా వ్యాపిస్తూ పోయిన తీరును కనుచూపుమేర గమనించడం ఒక అద్భుతంగా తోచింది. ఆ తర్వాత మూడు రోజులపాటు, ఒకప్పుడు చక్రవర్తులు నివసిస్తుండిన ఫర్బిడెన్ సిటీ (నిషిద్ధ నగరం)ని (ప్రస్తుతం అందులో చైనా అగ్రశేణి నాయకులు, అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా నివసిస్తారు), బీజింగ్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్సిటీ (బిసు)ని, బీజింగ్ నార్మల్ యూనివర్సిటీని, ఎలక్ట్రికల్ కార్ల కంపెనీని, సమ్మర్ ప్యాలెస్‌ను, ప్రాచీన కాలపు టెంపుల్ ఆఫ్ హెవెన్ను, స్థానిక రాజులు నిర్మించిన ఓల్డ్ సిటీని, చరిత్రకెక్కిన తియానన్మెన్ స్క్వేర్ను, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (పార్లమెంట్) తదితర భవనాలు చూశాం. అక్కడ ఆ స్క్వేర్లోకి తప్ప భవనాలలోకి ప్రవేశం ఉండదు.
చైనాలో తావో, కన్ఫ్యూషియస్, బుద్ధుడి ప్రభావాలు కనిపిస్తాయి. బుద్ధుడిని ఆరాధించడం ఎక్కువ. తన ఆరామాలు, పగోడాలు, ఆలయాలు, బౌద్ధ మ్యూజియంలు, శిల్పాలు, చిత్రాలు విరివిగా కనిపిస్తాయి. బుద్ధుడికి స్థానికులు, సందర్శకులు భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లడం అంతటా చూస్తాము. తనను ఇక్కడ బుద్ధుడి పేరుతోకన్నా శాక్యమునిగా ఎక్కువగా వ్యవహరిస్తారు. గమనించిదగినది ఏంటంటే బుద్ధుడు, ఇతర గురువుల బోధనల ప్రభావం ప్రజల విశ్వాసాలపై, జీవితాలపై ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మేము పర్యటించిన ప్రతి చోటా గమనించాం.
స్కేర్ వద్ద ఒక భవనంపై మావో చిత్రం ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంది! ‘బిసు’ యూనివర్సిటీలో చైనా మొదటి ప్రధాని, విదేశాంగమంత్రి అయిన చౌ ఎన్ లై బస్ట్ సైజ్ విగ్రహం ఉంది. ఈ రెండు కాకుండా ఆ ఇద్దరు నాయకులవి గాని, మరే నాయకులవి గాని చిత్రాలు, విగ్రహాలు మరెక్కడా కనిపించలేదు. రోడ్లకు, నిర్మాణాలకూ వాళ్ల పేర్లు కూడా లేవు. చైనా కరెన్సీ యువాన్‌పై మాత్రం మావో చిత్రం ఉంటుంది. మావోపట్ల, జాతీయ పతాక అయిన ఎర్రజెండా పట్ల ప్రజలకు గల విపరీతమైన గౌరవాభిమానాలు. స్కేర్‌లో ఏవో ప్రత్యేక దినాలలో గాక, ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు జెండా ఎగురవేసి, సాయంత్రం 5 తర్వాత దించుతారు. రెండు వేళల్లో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో కుటుంబాలతో సహావచ్చి ఉత్సాహంగా ఫొటోలు తీస్తుంటారు. అయితే నినాదాలు చేయరు.
మా రెండో గమ్యమైన షియాన్ నగరం బీజింగ్ నుంచి 1200 కి.మీ.ల దూరంలో ఉంటుంది. అక్కడికి గంటకు 350 కి.మీ.ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైలులో వెళ్లాం. మొత్తం ప్రయాణం నాలుగు గంటల్లో పూర్తయ్యింది. అక్కడ హైస్పీడ్ రైళ్లన్నీ ఎలివేటెడ్ కారిడార్లపైనే నడుస్తాయి. మరొక రూటులో గంటకు 450 కి.మీ. వేగంతో వెళ్లే రైళ్లు నడుస్తున్నాయి. మేము హైదరాబాద్ తిరిగి వచ్చిన రెండు రోజులకే విన్న వార్త.. 600 కి.మీ.ల రైలు ప్రయోగం విజయవంతమైందని. అంటే, కొన్నిరకాల విమానాల కన్నా.. ఎక్కువ వేగమన్నమాట.
షియాన్ నగరం చైనాకు చారిత్రక రాజధాని. సంస్కృతీ నిలయం. మొత్తం 13 రాజ వంశాలు ఇక్కడినుంచి ఆ దేశాన్ని పాలించాయి. దానిని బట్టే.. అది చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా ఎంత ముఖ్య కేంద్రమో గ్రహించవచ్చు. వర్తక-వాణిజ్యాల పరంగా కూడా ప్రసిద్ధి. చరిత్రకెక్కిన సిల్క్‌రోడ్ ఇక్కడినుంచే ఆరంభమై.. రోమన్ సామ్రాజ్యం వరకూ వెళ్లింది. అంతేకాదు.. చూసేందుకే విస్మయాన్ని కలిగించే టెర్రకోటా సైన్యం కూడా ఇదే ప్రాంతంలో ఉంది. చైనా మొట్టమొదటి చక్రవర్తి చిన్ షి హువాంగ్.. తన మరణానంతరం కూడా తన భద్రత కోసమంటూ సుమారు 8,000 మంది నిలువెత్తు సైనికుల మట్టి విగ్రహాలను తయారుచేయించాడు. వాటిని ఆయనతోపాటే ఖననం చేశారు. ఒక రైతు పొలంలో బావి తవ్వుతుండగా.. ఆ విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. చైనాను సందర్శించే విదేశీ ప్రముఖులందరూ అక్కడికి తప్పకుండా వెళుతుంటారు. షియాన్ నగరంలో సాంస్కృతిక సంబంధమైన చిహ్నాలు, ప్రదర్శనలు అనేకం. అక్కడ చారిత్రకమైన మసీదు, ముస్లిం క్వార్టర్స్, సిటీ వాల్, బుద్ధిస్ట్ పగోడా, షియాన్ మ్యూజియం, కన్ఫ్యూషియస్ మ్యూజియం, సిల్క్‌రోడ్ నృత్య నాటకం లాంటి ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి.
మా చివరి మజిలీ అయిన షాంఘై నగరం అడుగడుగునా ఆర్థికాభివృద్ధితో కళ్లు చెదిరేలా ఉంటుంది. నగరంలో మెలికలు తిరుగుతూ సాగే హువాంగ్ పూ నది, ప్రపంచంలోనే మూడో పెద్దదైన యాంగ్జీ నదిని కలిసి.. తూర్పు చైనా సముద్రంలో కలిసేది ఇక్కడే. ప్రపంచంలో మూడో ఎత్తయినదైన షాంఘై టవర్ (128 అంతస్తులు, 632 మీటర్లు), ప్రపంచంలోనే అన్నిటికన్న పెద్దదైన ఓడరేవు, లెక్కలేనన్ని ఫ్లై ఓవర్లు, నగరం నడిమధ్యలో 30 కి.మీ.ల భూగర్భ రోడ్డు మార్గం, 800 కి.మీ.ల భూగర్భ మెట్రో రైళ్లు, ఆకాశ హర్మ్యాలు, షాపింగ్ మాల్స్, పారిశ్రామిక కేంద్రాలు గల ఆ నగరం గురించి ఎంత రాసినా తక్కువే. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. చైనా కమ్యూనిస్టు పార్టీ ఇంకా నిషేధంలో ఉండినపుడు మావో నాయకత్వాన 1923లో షాంఘైలోని ఒక భవనంలో మొదటిసారిగా రహస్యంగా సమావేశమైంది. ఇప్పుడా భవనం ఒక మ్యూజియం. అక్కడికి మామూలు చెప్పులతో వెళ్లిన నన్ను వాళ్లు లోనికి వెళ్లనివ్వలేదు. చెప్పులతో వెళ్లటం, అసభ్యకర వస్త్రధారణ వంటివి ఆ ప్రదేశపు గౌరవ మర్యాదలకు భంగకరమని అక్కడి ఓ బోర్డుపై ఉంది. దాంతో, మిత్రులు వెళ్లివచ్చేవరకు ఆగి, ఒకరి షూస్ వేసుకొని లోపలికి ప్రవేశించగలిగాను.
చివరగా చెప్పాల్సిన విషయాలు, విశేషాలు కొన్నున్నాయి. చైనాలో యాత్రికులు స్వేచ్ఛగా ప్రయాణించలేరన్నది కేవలం అపోహ మాత్రమే. ఎవరు ఎటైనా వెళ్లి చూడవచ్చు. గ్రామాలను సందర్శించవచ్చు. ఇక్కడి గ్రామాలు ఆర్థిక సంపత్తితో తీర్చిదిద్దినట్లు కనిపించాయి. అయితే, చైనాలో ఇంగ్లిష్ తెలిసిన గైడ్ లేకుండా ఎటూ వెళ్లలేం. శాకాహారులు సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఇండియన్ రెస్టారెంట్లు, బుద్ధిస్ట్ రెస్టారెంట్లు పలు నగరాలలో ఉన్నాయి గానీ, ఎక్కువగా లేవు. షాపింగ్‌లో ఎక్కడైనా బేరాలు ఆడవచ్చు. గ్రూపులుగా వెళ్తే ఖర్చు తక్కువ అవుతుంది. మెట్రోలు, ట్రామ్ బస్సులు, ట్యాక్సీల టికెట్లు చవకే. స్థానికులు ఎక్కడైనా మర్యాదగా ఉండి సహకరిస్తారు. ఒక ముఖ్యమైన విషయం.. ఇక్కడ మన ఫోన్లు ఎంతమాత్రం పనిచేయవు. వేరే కనెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. నేరాల భయం ఎంతమాత్రం లేదు. దర్శనీయ స్థలాలలో ఏవో కొన్నింటికి తప్ప.. చాలాచోట్ల ప్రవేశాలు ఉచితం. ఫొటోగ్రఫీపై ఎక్కడా ఆంక్షలుగానీ, ప్రత్యేక ఫీజులుగానీ ఉండవు. వాతావరణం మన దగ్గర ఉన్నట్లుగానే ఉంటుంది.
మొత్తంమీద ఈ చైనా యాత్ర ఒక మరచిపోలేని అనుభవంగా మిగిలింది మా బృందానికి. ఇది అది అనిగాక.. అన్ని విధాలుగా కూడా. నిజానికి చూడదగినవి మరెన్నో ఉన్నాయి. మరొకసారి వెళ్లగలిగితే బాగుంటుంది గదా! అనే ఆలోచనతో తిరిగి వచ్చాం.