ఇప్పటి పిల్లలు ఎప్పుడూ స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్ తెరలకే అతుక్కుపోతున్నారు. దీనివల్ల వారికి దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా చూడలేని సమస్య హ్రస్వదృష్టి (మయోపియా) తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను రోజూ కాసేపైనా ఆరుబయట ఆటలు ఆడేలా చూడాలి అంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఫిట్నెస్ మెరుగుపడుతుంది.
ముఖ్యంగా కంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పిల్లలు ఔట్‌డోర్ గేమ్స్ ఇష్టపడేలా చేయడానికి పెద్దలకు నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. మొదట పెద్దలే పిల్లలను పార్కులు, ఆటస్థలాలకు తీసుకువెళ్లాలి. బడి విడిచిన తర్వాత, వారాంతాల్లో పిల్లలు తమ పరిసరాలను గమనించడానికి అవకాశం ఇవ్వాలి. డిజిటల్ పరికరాలతో గడిపే సమయాన్ని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇంట్లో కూడా క్యారమ్స్, చెస్ లాంటి ఆటలకు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది.
కోపం మన గుండె ఆరోగ్యం మీద గణనీయమైన ప్రభావం చూపుతుందని ఓ తాజా పరిశోధనలో వెల్లడైంది. తరచుగా కోపం రావడం, దీర్ఘకాలంపాటు చేదు భావనలు గూడుకట్టుకుపోవడం, ఆగ్రహం మొదలైన వాటివల్ల గుండెజబ్బు, స్ట్రోక్, గుండె రక్తనాళాల వ్యాధుల ముప్పు పెంచుతాయట. కోపం వచ్చినప్పుడు మన శరీరం ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి రక్తపోటును పెంచుతాయి. గుండెజబ్బులు, గుండెపోటుకు అధిక రక్తపోటు ఓ కారణమనేది తెలిసిన విషయమే.
అంతేకాదు కోపం మన గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. దీర్ఘకాలం పాటు కోపం, ఒత్తిడి వల్ల రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. పైగా కోపం, ఒత్తిడి మనల్ని ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల బారినపడేసే ప్రమాదమూ ఉంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కోపం వచ్చే పరిస్థితుల్లో నియంత్రించుకోవడానికి దీర్ఘంగా శ్వాసించాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతమవుతుంది. కోపం తీవ్రత తగ్గిపోతుంది. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా కోప్పడే గుణం తగ్గకపోతే నిపుణుల్ని సంప్రదించాలి.
ఇయర్‌ఫోన్స్ ఇప్పుడందరికీ తప్పనిసరి వస్తువులైపోయాయి. సంగీతం, పాడ్‌కాస్ట్స్, సినిమాలు, ఫోన్లో మాట్లాడటం ఇలా వివిధ అవసరాల కోసం రకరకాలైన ఇయర్ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది సంతోషకరమైన విషయమే అయినప్పటికీ… ఇయర్ఫోన్లు మన వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయట. ఎక్కువ ధ్వనితో వినడం వల్ల కర్ణభేరి దెబ్బతింటుంది.
కొన్ని రకాల ఇయర్ఫోన్లు మనకు పరిసరాల శబ్దాలు వినపడనీయవు. వీటివల్ల చెవి శబ్దాన్ని గ్రహించే సామర్థ్యం దెబ్బతింటుంది. ఎక్కువసేపు చెవిలో పెట్టుకుంటే హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. చెవిలో గుబిలి కూడా పెరిగిపోయి సమస్యగా మారుతుంది. ఎక్కువ శబ్దంతో పెట్టుకోవడం వల్ల చెవుల్లో టినిటస్ అనే శబ్ద సమస్య తలెత్తుతుంది. కాబట్టి అవసరం మేరకే ఏదైనా వాడాలని గుర్తుపెట్టుకోవాలి.