‘బాబూ.. క్షీరసాగర మథనాన్ని సైన్సు గుట్టుతో భలే కనిపెట్టావు. అయితే, అన్నీ సైన్సుతో పరిష్కరించలేవు. రేపు చనిపోబోతున్న ఈ చిన్నారిని కూడా ఇలాగే రక్షించగలవా?’ అంటూ నోట్లోంచి నురగకక్కుకొంటున్న ఓ ఐదేండ్ల చిన్నారిని చూపించాడు నారాయణాద్రుల స్వామి. దీంతో షాకైన ఇన్స్పెక్టర్ రుద్ర.. అక్కడే ఉన్న ఆ చిన్నారి తల్లిదండ్రులతో.. ‘హాస్పిటల్‌కు తీసుకుపోకుండా ఇక్కడికి తీసుకొచ్చి తమాషాలు చేస్తున్నారా?’ అంటూ మండిపడి అంబులెన్స్‌కు ఫోన్ చేయమని హెడ్‌కానిస్టేబుల్ రామస్వామిని పురమాయించాడు.
స్వామీజీ తమ బిడ్డను కాపాడతాడని, ఆయన చేయి పడితే తమ చిన్నారి బతుకుతుందని ఆ పాప తల్లిదండ్రులు అన్నారు. వారిని గట్టిగా మందలించిన రుద్ర.. ఇంతలో అంబులెన్స్ రాగానే చిన్నారిని, వాళ్ల తల్లిదండ్రులను హాస్పిటల్‌కు పంపించాడు. తర్వాత స్వామీజీ వైపునకు తిరిగిన రుద్ర.. ‘ఇంకెంత మందిని ఇలా మోసం చేస్తారు? డబ్బు కోసం ఇంతకు దిగజారాలా?’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. ‘బాబూ.. ఈ సృష్టిలో మంచి, చెడు ఉన్నట్టే.. దైవం, దెయ్యం..’ అంటూ స్వామీజీ ఏదో చెబుతూపోతుండగా.. ‘అయ్యా.. స్వామిజీ, మీ కథలు నాదగ్గర కాదు. మీ పాపాల పుట్టను పాల పొంగుతో ఇప్పుడే పటాపంచలు చేశా. అయినా.. మీకు ఇంకా సిగ్గుగా లేదా’ అంటూ మాటల తీవ్రతను పెంచాడు. దీంతో అంతెత్తున లేచిన స్వామీజీ.. ‘అదుపు అదుపు.. మాట పొదుపు. ఆఫీసరు గారూ.. ఇది మీ తప్పు కాదు. మీ నెత్తిమీద సైతాను కూర్చున్నాడు. వాడిని వెంటనే బయటకి పంపకపోతే మీ ప్రాణాలకే నష్టం’ అన్నాడు స్వామీజీ. ‘ఏం.. ఈ అమాయకులను మోసం చేసినట్టే, నన్నూ చేద్దామనుకొంటున్నావా? నీ మాటలకు నేను బెదరను’ అని రుద్ర అంటుండగానే.. ‘సైతాన్ మీతో ఆ మాటలు మాట్లాడిస్తున్నాడు. ప్రజలారా.. ఇతని ఒంట్లో సైతాన్ ఉందోలేదో.. ఇప్పుడే నిరూపిస్తా’ అంటూ రుద్రను, స్నేహిల్ను దగ్గరకు రమ్మని పిలిచాడు స్వామీజీ. ‘ఈ ఆఫీసరు నెత్తిమీద సైతాను కూర్చున్నాడు. వాడిని వదిలించకపోతే, ఈ ఆఫీసరు ప్రాణాలకే కాదు మన ఊరికి కూడా మంచిది కాదు..’ అంటున్న స్వామీజీ మాటలను రుద్ర అడ్డుకోబోతుండగానే.. మళ్లీ స్వామీజీ అందుకొని.. ‘ఉండు బాబూ.. నీ ఒంట్లో సైతాను ఉందో లేదో.. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే నిరూపిస్తా’నన్నాడు స్వామీజీ. సరేనంటూ కనుబొమ్మలెగరేశాడు రుద్ర.
‘బాబూ ఆఫీసరూ. నా దగ్గర ఉన్న వస్తువులపై నీకు నమ్మకం లేదు కదూ. అందుకే, నీకు నచ్చిన చోట నుంచి తెల్లని సున్నమో, ఇంకా ఏదన్ననో తీసుకొచ్చుకో. దాన్ని మీ ఇద్దరూ అరచేతుల్లో రాసుకోండి’ అని స్వామీజీ చెప్పగానే స్నేహిల్, రుద్ర పక్క షాప్‌లో దొరికిన ఓ సుద్ద ముక్క పొడిని తెచ్చుకొని అలాగే చేశారు. ‘భక్తులారా.. అందరూ చూస్తున్నారు కదూ.. ఈ తెల్లని పొడిని వాళ్లే తెచ్చుకొన్నారు. వాళ్ల పొడిని వాళ్లే చేతులకు రాసుకొన్నారు. నా ప్రమేయం ఏమీలేదు’ అన్న స్వామిజీ.. ‘ఇప్పుడు ఈ కాళికామాత ముందు ఉన్న ఈ శక్తిమంతమైన నల్లటి బొట్టును ఇద్దరూ నుదుటన పెట్టుకోండి’ అని స్నేహిల్, రుద్రకు సూచనలిచ్చాడు. దీంతో రుద్ర ఏదో అనబోతుండగా.. ‘బాబూ.. శక్తిమంతమైన ఈ బొట్టు ధరిస్తేనే, సైతాను జాడ తెలిసేది’ అంటూ చెప్పిన స్వామీజీ.. ‘నీకు అంతగా అనుమానం ఉంటే, నువ్వే నీ బొట్టు పెట్టుకో’ అని రుద్రను అన్నాడు. స్వామీజీ మీద అనుమానంతో రుద్ర తానే బొట్టు పెట్టుకొన్నాడు. స్నేహిల్‌కు స్వామీజీ బొట్టు పెడతానంటే వారించిన రుద్ర.. తన అన్నకు కూడా తానే బొట్టు పెట్టాడు.
కొన్ని మంత్రాలు చదివిన స్వామీజీ.. ఇద్దరిని కండ్లు మూసుకోమ్మన్నాడు. అరచేతుల్లోని పొడిని మళ్లీ రాపిడి చేయమన్నాడు. ‘ఓమ్.. భీమ్.. క్లీమ్.. ఫట్’ అంటూ గట్టిగా అరిచి.. ‘భక్తులారా.. సైతాన్ వచ్చింది. ఆఫీసర్ తెల్లని చేతులు రక్తపంకిలమయ్యాయి. యేరా సైతాన్.. నీ చేతులు చూపించు’ అని స్వామీజీ అనగానే.. వెంటనే కండ్లు తెరిచిన రుద్ర.. రక్తంలా ఎర్రగా మారిన తన చేతులను చూసి షాకయ్యాడు. పక్కనున్న స్నేహిల్ కెవ్వున అరిచాడు. స్వామీజీ చెప్పింది నిజమేనని అక్కడున్న వారు అందరూ అరవడం ప్రారంభించారు. తమ ప్రాణాలను తీయడానికి పోలీసు రూపంలో సైతాన్ వచ్చిందని నమ్మి.. రుద్రను రాళ్లతో కొట్టడానికి స్వామీజీ అనుచరులు సమాయత్తమయ్యారు. పరిస్థితులు చేజారుతుండటంతో ఏం చేయాలో స్నేహిల్, రామస్వామి, జయకు అర్థం కాలేదు. ఇంతలో స్వామీజీ కలగజేసుకొని.. ‘ఆగండీ.. ఈ సైతాన్ను ఏం చేయాలో నాకు తెలుసు’ అంటూ ఆశ్రమంలో నుంచి ఓ బిందెలో పసుపు నీళ్లు తీసుకొచ్చి రుద్ర ముందు పెట్టాడు.
‘ఏయ్ సైతాన్.. ఇక్కడితో నీ ఆటలు కట్టు’ అంటూ బిందెలోని నీటిని మీద పోయబోతున్న స్వామీజీని నిలువరించిన రుద్ర.. ‘ది గ్రేట్ స్వామీజీ గారూ.. కాస్త ఉండండి సార్.. నాకు ఇప్పుడే ఓ పజిల్ గుర్తొచ్చింది. అనగనగా ఓ కిల్లర్. వాడు ఓ ఇద్దరిని కిడ్నాప్ చేశాడు. ఇద్దరి ముందు రెండు మందు బిళ్లలు, రెండు గ్లాసుల నీళ్లు ఉంచాడు. ఒక మందు బిళ్లలో విషం ఉంది. మిగతా దాంట్లో లేదు. బిళ్ల వేసుకొని నీటిని తాగాలి. విషం లేని బిళ్ల వచ్చినవాళ్లు వెళ్లిపోవచ్చు అని ఆ ఇద్దరికీ ఆఫర్ ఇచ్చాడు. నిజమేనని ఆత్రంగా ఆ ఇద్దరూ ఒక్కో బిళ్లను వేసుకొని నీళ్లు తాగారు. అయితే, కిల్లర్ చెప్పినట్టుగా విషం ఉన్న మందు బిళ్ల తిని ఒకడు చనిపోయి.. మిగిలిన వాడు బయటపడాలి. కానీ, ఇద్దరూ చచ్చారు. ఎందుకు?’ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వినగానే స్వామీజీ ముఖం పాలిపోయింది. దీంతో తన అనుచరులకు సైగ చేశాడు. దీంతో ‘వీడికి నిజంగానే సైతాన్ పట్టింది. కొట్టి చంపండి’ అంటూ స్వామీజీ అనుచరులు మీదికి వస్తుండటంతో రివాల్వర్‌ను పేల్చాడు రుద్ర. దీంతో అందరూ ఒక్కసారిగా దూరం జరిగారు. మొత్తం నిశ్శబ్దం.
‘ఏయ్.. దొంగ స్వామీజీ.. నీ మనో నేత్రాన్ని అడిగి ఆ ఇద్దరూ ఎలా చనిపోయారో చెప్పూ..? హహ్హహ్హ’ అని నవ్విన రుద్ర.. ‘నేను చెప్పాలా??’ అంటూ ప్రారంభించాడు. ‘విషం కిల్లర్ ఇచ్చిన మందు బిళ్లల్లో లేదు. గ్లాసు వాటర్‌లో ఉంది. అందుకే, ఆ వాటర్ తాగిన ఇద్దరూ చనిపోయారు. ఇక, విషయానికి వద్దాం. నీ సైతాన్ డ్రామా.. తెల్లని పొడి.. నా చేతులు ఎర్రగా మారడం.. ఇలా ఆ గుట్టు అంతా ఎక్కడ ఉందో చెప్పాలా?’ అంటూ గట్టిగా గద్దించి అసలు రహస్యాన్ని చెప్పాడు రుద్ర. అది విన్న అక్కడివారు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. రుద్ర చెప్పినదాంట్లో నిజాన్ని గుర్తించి స్వామీజీని అనుమానంతో చూడసాగారు. ‘ఏం స్వామీజీ.. ఏసీబీ రైడ్స్‌లో పట్టుబడ్డ దొంగలా? ఆ ముఖమేంటీ?’ అంటూ రుద్ర అంటుండగానే.. ‘ఏయ్ ఆఫీసర్.. ఈ రంగు విషయంలో గెలిచానని మురిసిపోకు. కానీ, నేను చెప్పింది తప్పు కాలేదు. ఒకసారి టైమ్ చూడు.. అర్ధరాత్రి 12 గంటలు దాటింది. అంటే రోజు మారింది. ఆ నురగకక్కుకొన్న చిన్నారి ఇప్పుడే చనిపోయింది. కావాలంటే కనుక్కో’ అంటూ గట్టిగా అరిచాడు స్వామీజీ.
కంగారుగా హాస్పిటల్‌కు ఫోన్ చేసిన రుద్ర.. చిన్నారి ఇప్పుడే చనిపోయిందన్న వార్త తెలియగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అది పక్కనబెడితే, రుద్ర చేతులు ఎర్రగా ఎలా మారాయి? తెల్లని పొడి రాసుకొన్న స్నేహిల్ చేతులు ఎందుకు ఎర్రగా మారలేదు? ఆ గుట్టును రుద్ర ఎలా కనిపెట్టాడు? చివరకు ఏసీబీ రైడ్స్ అంటూ రుద్ర అనడానికి కారణమేంటీ? మీరు కనిపెట్టారా??
సమాధానం : రుద్ర చేతులు ఎర్రగా మారడానికి కారణం ఫినాఫ్తలిన్ పౌడర్. తెల్లని పౌడర్ లేదా సున్నంతో కలిస్తే అది ఎర్రగా మారుతుంది. కాళికామాత ముందున్న నల్లటి బొట్టులో దాన్ని స్వామీజీ ముందే కలిపి పెట్టాడు. బొట్టు పెట్టుకొనే క్రమంలో అది రుద్ర చేతికి చేరింది. సున్నంతో కలవడంతో ఎర్రగా మారింది. స్నేహిల్‌కు రుద్ర బొట్టు పెట్టడంతో స్నేహిల్ విషయంలో అది జరగలేదు. లంచం తీసుకొన్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఏసీబీ వాళ్లు ఈ ఫినాఫ్తలిన్ పౌడర్‌నే వాడుతారు. అది గుర్తొచ్చే రుద్ర ఏసీబీ ప్రస్తావన తెచ్చాడు. ఇక, కిల్లర్-కిడ్నాప్ స్టోరీ ద్వారా బొట్టులోనే గుట్టు అంతా ఉన్నదన్న విషయాన్ని పరోక్షంగా ఎత్తిచూపాడు.