మనిషి అద్భుతాల కోసం చాలా చోట్లే తిరుగుతాడు… చాలా విషయాలే శోధిస్తాడు. మంచిదే! కానీ ప్రకృతిలోనే అన్నిటికంటే గొప్ప అద్భుతం మన శరీరం అన్న విషయాన్ని మాత్రం గుర్తించడు. ఇంత అరుదైంది కాబట్టే.. విశ్వమంతా వెతికినా మనిషిలాంటి పరిపూర్ణమైన జీవి ఎక్కడా కనిపించలేదు.
దేవుడున్నాడా, లేడా అన్న సందేహం పక్కన పెడితే.. ఆయన ఉన్నా కూడా తను సృష్టించిన వాటిలో పరిపూర్ణమైనదీ, అద్భుతమైనదీ మానవ శరీరమేనేమో! కంటిచూపు నుంచి కాలిగోరు వరకూ మన ఒంట్లో అణువణువూ కోట్ల సంవత్సరాలుగా పరిణామం చెందిన తీరే ఓ మహత్తు. కాకపోతే మనిషి మనసుకి ఓ సమస్య ఉంది. అయాచితంగా లభించే దేనికీ అది విలువ ఇవ్వదు. అలా గాలి, నీరు, మట్టి… లాగే మన శరీరాన్ని కూడా చులకనగానే తీసుకుంటుంది.
శరీరం కూడా నిజంగా మన మీద జాలితో చాలానే సహిస్తుంది. కానీ, అది తట్టుకోలేని సందర్భంలో మాత్రం గట్టిగా హెచ్చరిస్తుంది. ఎండాకాలంలో వినిపించే అలాంటి ఓ హెచ్చరిక శరీరం నుంచి వస్తుంది.
మనం తీసుకునే ఆహారం పోషకాలుగా మారుతుందన్నది తెలిసిన విషయమే. కానీ, జీవక్రియలన్నీ సాగాలంటే, పోషకాలు ఒక్కటే ఉంటే సరిపోదు కదా. ప్రతి అవయవానికీ ఓ నిర్దుష్టమైన పని ఉంటుంది. మెదడు నాడీ వ్యవస్థ ద్వారా శరీరం మొత్తానికీ సంకేతాలు ఇస్తుంది, గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది, కండరాలు కదులుతుంటాయి.. ఇదంతా కూడా చిన్నపాటి విద్యుత్ ప్రకంపనల ద్వారానే జరుగుతుంది. ఆ శక్తిని అందించే రసాయనాలే ఎలక్ట్రోలైట్స్. కొన్ని ఖనిజాలు ద్రవంలో కరిగిపోయినప్పుడు విద్యుత్ ప్రసరిస్తాయి. ఉదాహరణకు ఉప్పు శాస్త్రీయ నామం సోడియం క్లోరైడ్ కానీ అదే ఉప్పును నీటిలో కరిగించేస్తే సోడియం, క్లోరైడ్‌గా విడిపోతుంది. ఈ రెండింట్లో ఒకటి ధనాత్మకం (పాజిటివ్) అయితే రెండోది రుణాత్మకం (నెగెటివ్) అవుతాయి. సహజంగానే ఈ భిన్నధృవాల మధ్య విద్యుత్ జనిస్తుంది.
మన శరీరంలో ఉన్నదే 60 శాతం నీరు కదా. అందులో కలిసిన ఖనిజాలే శరీరాన్ని నడిపిస్తాయి. ఏ వ్యవస్థ ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, బైకార్బోనేట్, ఫాస్పేట్ మన ఒంట్లో ఉండే ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్.

మన తీసుకునే రోజువారీ ఆహారంలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగానే లభిస్తాయి. ఒకవేళ వాటి సరఫరా కాస్త తగ్గినా, శరీరం ఎలాగోలా నెట్టుకొస్తుంది. తీవ్రమైన కిడ్నీ, లివర్ వ్యాధులు ఉన్నప్పుడు ఎలక్ట్రోలైట్స్ సమస్య వస్తుంది. కొన్ని రోజువారీ సందర్భాల్లో కూడా ఈ ఎలక్ట్రోలైట్స్ స్థాయి ఒక్కసారిగా పడిపోవచ్చు. అప్పుడు మాత్రం ఒక్కసారిగా బతుకుబండిని బోల్తా కొట్టించేస్తుంది. అలాంటి కొన్ని పరిస్థితులు ఇవి!

ఎలక్ట్రోలైట్స్ స్థాయి తీవ్రంగా పడిపోయినప్పుడు తరచూ కనిపించే లక్షణాలు ఇవి..
అయోమయం, చిరాకు, వికారం.
మలబద్ధకం లేదా వాంతులు, విరేచనాలు.
విపరీతమైన నీరసానికి తోడుగా తలతిరుగుడు, తలనొప్పి.
అతివేగంగా కానీ.. లయబద్ధత లేకుండా కొట్టుకునే గుండె (arrhythmia)
కండరాలు నొప్పిగాను బలహీనంగానూ ఉండటం, పటుత్వం లేకపోవడం, తిమ్మిర్లు!
వీటిలో అన్ని లక్షణాలూ కనిపించితీరాలని లేదు. ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా అది ఎలక్ట్రోలైట్ సమస్య అనుకోవడానికీ లేదు. కానీ, వాటిని అశ్రద్ధ మాత్రం చేయకూడదు. మరీ ముఖ్యంగా ఓ రోజు కనిపించిన లక్షణం క్రమంగా బలపడుతుంటే. ఉదాహరణకు ఓ రోజు కాస్త నలతగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, క్రమంగా మాట తడబడటం, తూలిపోవడం.. లాంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటే వెంటనే వైద్యుడికి చూపించాలి. మరీ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నవారి విషయంలో అశ్రద్ధ పనికిరాదు.

చాలామంది ఎలక్ట్రోలైట్స్ లోపించిన లక్షణాలను తేలికగా తీసుకుంటారు. అదే సర్దుకుంటుందిలే అనే భావనతో వైద్యుడిని సంప్రదించరు లేదా సొంత వైద్యంతో సరిపెట్టుకుంటారు. కానీ, అతిచిన్నగా తోచే ఈ సమస్య ప్రాణాంతకం కావచ్చు. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఒంట్లో కీలకమైన ఎలక్ట్రోలైట్స్ లోపించడం వల్ల ఒంట్లో ద్రవాలు అదుపులో ఉండవు. ఫలితంగా వాంతులు, విరేచనాలు, మూత్రం రూపంలో మరిన్ని ఎలక్ట్రోలైట్స్ కోల్పోతాం. వీటి ప్రాథమిక లక్షణాలను దాటేస్తే కోమా, గుండెపోటు, ఫిట్స్, మెదడు శాశ్వతంగా దెబ్బతినడం లాంటి సమస్యలు వస్తాయి. మరణం సంభవించవచ్చు లేదా జీవచ్ఛవంలా మారిపోవచ్చు.

ఎలక్ట్రొలైట్స్లో ఏదన్నా తగ్గితే అది హైపోగా పేర్కొంటారు. హైపోనాట్రీమియా (సోడియం), హైపోకాలమియా (పొటాషియం).. ఇలా! అయితే అవి ఎక్కువైనా కూడా కష్టమే. ఆ స్థితిని హైపర్ అంటారు. కొద్దిగా మోతాదు మించిన ఎలక్ట్రోలైట్స్ సాధారణంగా మూత్రం లేదా చెమట రూపంలో బయటపడిపోతాయి. కానీ, మరీ పరిమితులు దాటితే మాత్రం… అవి కూడా ప్రమాదంగా మారతాయి. ఎలక్ట్రోలైట్స్ తగ్గినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో, పెరుగుదలలో కూడా ఇంచుమించు అవే లక్షణాలు ఉంటాయి. వాటికి తోడు విపరీతమైన దాహం (సోడియం ఎక్కువైతే), కీళ్ల నొప్పులు (క్యాల్షియం ఎక్కువైతే), ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది (అధిక మెగ్నీషియం).. లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని పట్టించుకోకపోతే ప్రాణాంతకం అవుతాయి.

ఎలక్ట్రోలైట్స్ తక్కువున్నాయా, ఎక్కువా.. లేక వేరే సమస్యల వల్ల ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా అని నిర్ధరించడం వైద్యుడి పని. కానీ వాంతులు, విరేచనాలు, ఎండలో తిరగడం, వ్యాయామం, జ్వరం.. లాంటి సందర్భాల్లో ఈ లక్షణాలు కనిపించినప్పుడు అది ఎలక్ట్రోలైట్స్ క్షీణత వల్లే అని మనకే అర్థమైపోతుంది. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక ఉపయోగపడాయి.
ఎండాకాలంలో ఈ ఎలక్ట్రోలైట్స్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఎండ వేడికి ఒంట్లో నీరు ఆవిరైపోతూ ఉంటుంది. ఇక బయట తిరిగితే చెమటతో మరింత నీటిని కోల్పోతాం. వడదెబ్బ కారణంగానో, ఫుడ్ పాయిజనింగ్ వల్లో వాంతులు, విరేచనాలు ఎండాకాలంలోనే ఎక్కువ. మరీ ముఖ్యంగా సున్నితంగా ఉండే పిల్లలు, రోగనిరోధక శక్తి తగ్గిపోయిన వృద్ధులు వీటి బారిన పడతారు. కాబట్టి రాకుండా అప్రమత్తంగా ఉండటం, లక్షణం కనిపించగానే తగిన చిట్కాలు పాటించడం, పరిస్థితి ఏమాత్రం చేయి దాటుతున్నా వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి!
మన శరీరంలో ఎక్కువగా కనిపించే ఎలక్ట్రోలైట్ సోడియం. మన ఒంట్లోని ద్రవాల స్థాయిని శాసించేది ఇదే! సోడియం స్థాయి పెరిగితే ప్లాస్మా స్థాయి పెరుగుతుంది. ధమనుల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలికంగా అధిక రక్తపోటుకు దారితీస్తుంది. కణాలకు పోషకాలు అందేందుకు కూడా సోడియమే కీలకం.
మన శరీరంలో కణాలకు రెండు ఎలక్ట్రోలైట్లు కీలకం. సోడియం, పొటాషియం. ఓ కణంలో ఈ రెండింటి నిష్పత్తి తేడా వస్తే సమస్యే. పొటాషియం గుండె వేగాన్ని కూడా నియంత్రిస్తుంది. పొటాషియం హెచ్చుతగ్గులు నేరుగా గుండె మీద పనిచేస్తాయి. కండారాల కదలికకు, నాడీవ్యవస్థకు సాయపడుతుంది.
పళ్లు, ఎముకలకు ఈ క్యాల్షియం ఎంత అవసరమో తెలిసిందే. రక్తం గడ్డకట్టడంలోనూ దీనిదే ముఖ్య పాత్ర. పొటాషియంలాగానే క్యాల్షియం కూడా గుండె, నాడీవ్యవస్థ, కండరాల పనితీరుకు చాలా కీలకం. హార్మోన్ల ఉత్పత్తిలో క్యాల్షియం అవసరం చాలా ఉంటుంది.
ఇది దాదాపు 300 జీవక్రియలకు సాయపడుతుందని అంచనా. ఇతర ఎలక్ట్రోలైట్స్ లాగే గుండె, కండరాలు, నాడీవ్యవస్థకు సాయపడటంతో పాటు క్యాల్షియం, పొటాషియంలు కణాలకు అందేలా చూస్తుంది. అంతేకాదు! కణాలకు అందే పోషకాలు శక్తిగా మారేందుకు మెగ్నీషియం కీలకం. దీన్నే ATP synthesis అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే మెగ్నీషియం లేకపోతే మన డీఎన్ఏ కుప్పకూలిపోతుంది. కణవిభజనే ఆగిపోతుంది.
శరీరంలోకి ఉప్పు చేరగానే అది సోడియం, ఇంకా క్లోరైడ్ అనే రెండు ఎలక్ట్రోలైట్స్‌గా మారుతుంది. క్లోరైడ్ కూడా సోడియంలాగానే ఒంట్లో ద్రవాల స్థాయిని నియంత్రించడంతో పాటు.. రక్తంలో ఆక్సిజన్ ప్రసారానికి తోడ్పడుతుంది. అంతేకాదు! మన రక్తంలోని ఆమ్ల-క్షార నిష్పత్తిని (Ph) నియంత్రిస్తుంది. 7.357.45 మధ్య ఉండాల్సిన ఈ Ph స్థాయిలో ఏమాత్రం మార్పు వచ్చినా అనర్థమే.
ఈ అయిదు కాకుండా ఫాస్పేట్, బైకార్బొనేట్ అనే మరో రెండు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ కూడా ఉన్నాయి. కణాల శక్తికి ఫాస్పేట్ సాయపడితే, జీవక్రియలకు అండగా బైకార్బొనేట్ నిలుస్తుంది.

సమతుల ఆహారంతో పాటు ఏ కాలంలో దొరికే పళ్లు, కూరలు అప్పుడు తీసుకోవడంతో ఎలక్ట్రోలైట్స్ స్థిరంగా ఉంటాయి. అయితే కొన్ని పదార్థాల్లో వీటి శాతం సమృద్ధిగా ఉంటుంది.
అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం చాలా ఎక్కువ. అందుకే ఆటగాళ్లు కండరాలు పట్టేసే సమస్య (క్రాంప్స్) రాకుండా ఉండటానికి ఆట మధ్యలో వీటిని తీసుకుంటారు. ఇందులోని చక్కెర తక్షణ శక్తిని కూడా ఇస్తుంది.
మొక్క తన జీవం కోసం నేల నుంచి ఖనిజాలను గ్రహించి వాటిని ఆకుల్లో దాచుకుంటుంది. అందుకే ఆకుకూరల్లో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా లభిస్తాయి. మరీ ముఖ్యంగా పాలకూరలాంటి పదార్థాల్లో మెగ్నీషియం, పొటాషియం తదితర ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి.
భారతీయుల్లో చాలామంది జీవనశైలి పొద్దున పాలతో మొదలై రాత్రికి పెరుగుతో పూర్తవుతుంది. అది మంచిదే! పాలపదార్థాల్లో క్యాల్షియం ఉంటుందని ఎలాగూ తెలుసు. వాటితో పాటు పొటాషియం, పాస్ఫరస్, మెగ్నీషియం కూడా ఉంటాయి.
ఇవే కాదు! పప్పు దినుసులు, బాదం పప్పులు, నారింజ, దానిమ్మ, కోడిగుడ్లు, మాంసం, ఊరగాయలు, టామాటాలు, ముడిబియ్యం, తేనె.. ఇలా చాలా ఆహారాల్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అందుకే సమతుల ఆహారం తీసుకున్నప్పుడు వాటికి లోటు రాదు.
ఎలక్ట్రోలైట్స్ అన్నది ఈ రోజు మనం పెట్టుకున్న పేరు కావచ్చు. కానీ ఈ లక్షణాలను మన పెద్దలు ఎప్పుడో గ్రహించారు. ఒంట్లో తగినంత నీరు, ఆహారం నుంచి వచ్చే లవణాల అవసరాన్ని వేల ఏళ్ల క్రితమే గుర్తించారు. ఉప్పు ఆరోగ్యంలోను, ఆహారాన్ని నిలువ ఉంచేందుకు ఎలా వాడాలో తెలుసుకున్నారు. ఎలక్ట్రోలైట్స్ వల్ల ఏర్పడే నిస్సత్తువ పిత్త, వాత దోషాల వల్ల ఏర్పడుతుందని ఆయుర్వేదం తేల్చింది. ఒంట్లో ముఖ్యమైన లవణాలు ద్రవరూపంలో కోల్పోయినప్పుడు కొబ్బరినీరు, రాతి ఉప్పు కలిపిన మజ్జిగ, గంజి, ఉసిరి, ధనియాలు నానబెట్టిన నీరు లాంటివి సూచిస్తుంది. నిమ్మరసం, రాతి ఉప్పు, బెల్లం కలిపిన నీరు లవణాలను భర్తీ చేస్తుందని చెబుతారు.
ఎలక్ట్రోలైట్స్ అన్న పదం గ్రీక్ నుంచి వచ్చింది. విద్యుత్‌ని విడదీయడం అన్న అర్థంగా దీన్ని చెప్పుకోవచ్చు. ప్రముఖ రసాయన శాస్త్రవేత్త మైఖెల్ ఫారడేతో ఈ ఎలక్ట్రోలైట్స్‌ను గుర్తించడం మొదలైంది. Electrolysis అనే చర్య ద్వారా కణాలలో ఉండే అయాన్లు (IONs) అనే పదార్థం తీరు మారుతుందని నిరూపించాడు ఫారడే. ఇది విద్యుత్ రంగంలో ఓ సంచలనం. విద్యుత్ ఉత్పత్తి దగ్గర నుంచి బ్యాటరీల తయారీ వరకూ ఈ పరిశోధన కీలకంగా మారింది. ఈ సిద్ధాంతానికి ఇంకాస్త స్పష్టత ఇచ్చాడు స్వాంతె అరెనస్ అనే స్వీడిష్ శాస్త్రవేత్త. కొన్ని లవణాలు నీటిలో కరిగినప్పుడు అవే అయాన్లుగా మారి.. వాటంతట అవే విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయని నిరూపించారు. శరీరంలో జరిగే ఈ విద్యుత్ అద్భుతాన్ని కళ్లకు కట్టారు.
ఒంట్లో నిస్సత్తువగా ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా అది ఎలక్ట్రోలైట్స్ లోపం అనే అనుమానం ఉన్నప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు.
నీరసంగా ఉన్నప్పుడు చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతారు. అందులో ఉండే కెఫిన్ వల్ల తాత్కాలికంగా ఉత్తేజం కలిగినట్టు తోచినా… కెఫిన్ డైయురెటిక్లా
పనిచేస్తుంది. అంటే మూత్రం ఎక్కువ చేస్తుంది. దీనివల్ల మరింతగా ఎలక్ట్రోలైట్స్‌ని కోల్పోతాం.
కాఫీ, టీ, మద్యం ఇవి కూడా డైయురెటిక్స్ విభాగంలోకే వస్తాయి. వీటిని తీసుకోవడంతో ఎలక్ట్రోలైట్స్ నష్టం ఉంటుంది.
అతిగా చెమట పట్టినప్పుడు మంచినీరు అతిగా తాగేస్తారు. దాంతో సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. అధికంగా తీసుకున్న నీరు వెళ్తూ వెళ్తూ ఉన్న కాస్త సోడియంను కూడా లాక్కువెళ్తుంది. అలాంటి సమయాల్లో ఉత్త నీరు కాకుండా కొబ్బరి బొండాం, పళ్లరసాలు, మజ్జిగ, ORS లాంటివి తీసుకోవాలి.
ఎలక్ట్రోలైట్స్ పెంచేందుకు లేదా తగ్గించేందుకు రకరకాల మందులు ఉంటాయి. మన లక్షణాలు చెప్పగానే మందుల షాపులో కుర్రాళ్లు వాటిని ఇవ్వొచ్చు. ఇలాంటి సొంత వైద్యం వల్ల పరిస్థితి ఇంకా విషమిస్తుంది.
వ్యాయామం చేసేవారు, క్రీడాకారులు తక్షణ శక్తి పేరుతో కనిపించే ఎనర్జీ డ్రింక్స్‌ని ఎడాపెడా తాగేస్తుంటారు. వీటిలో ఉండే గ్లూకోజ్, కెఫిన్, కృత్రిమ ఎలక్ట్రోలైట్స్ వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరగవచ్చు. అందుకని తరచు ఇలాంటివి తాగే అలవాటు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

వాంతులు, విరేచనాలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అవి తీవ్రమైన ఎలక్ట్రోలైట్స్ లోటుకు దారితీస్తాయని తెలిసిందే. పేద దేశాల్లో కలరా లాంటివి సోకినప్పుడు పిల్లల ఒంట్లో లవణాలన్నీ పోయి లక్షల సంఖ్యలో మరణించేవారు. ఈ సందర్భంలో ORS లాంటి ద్రవాల ద్వారా తగనంత శక్తిని అందించడమే Oral rehydration therapy. అతి సులభంగా, ఏమాత్రం ఖర్చు లేకుండా గ్లూకోజ్, పొటాషియం, క్లోరైడ్ సిట్రైట్ పదార్థాలతో చేసే ORS మనుషుల పాలిట అమృతంగా చెప్పుకోవచ్చు. ఈ ఫార్ములాను తొలిసారిగా పరిచయం చేసింది హేమేంద్రనాథ్ అనే భారతీయుడు. 1953లో లాన్సెట్ వైద్య జర్నల్‌లో హేమేంద్ర ప్రచురించిన వ్యాసమే ORSను లోకానికి పరిచయం చేసింది. రోగుల మీద దీన్ని విస్తృతంగా వాడి.. ఖరీదైన, సంక్లిష్టమైన IV ఫ్లూయిడ్స్ చికిత్స కంటే ORS మెరుగ్గా పనిచేస్తుందని నిరూపించింది మరో భారతీయుడైన దిలీప్ మహలోనిబస్. దీంతో ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే విస్తృతంగా ORS తయారుచేసే పొడిని పంచడం మొదలుపెట్టింది. విరేచనాల సమయంలో ఈ ORS వల్ల ఏకంగా 93 శాతం మరణాలు తగ్గించవచ్చని ఓ అంచనా! అందుకే 20 శతాబ్దంలోనే అతి ముఖ్యమైన వైద్య ఆవిష్కరణగా ORSను భావిస్తుంటారు. దురదృష్టం ఏమిటంటే కోట్ల ప్రాణాలు కాపాడిన అదే పేరును ఉపయోగించుకుని కార్పొరేట్ కంపెనీలు చక్కెరతో నింపేసిన టెట్రా పాకెట్లతో మెడికల్ షాపులను నింపేశాయి. అలాంటి డ్రింక్స్ జోలికి పోకుండా WHO నిర్ధరించిన ORS ప్యాకెట్లకే మొగ్గు చూపాలి!
– కె.ఎల్.సూర్య