అలా ఫోన్ చూస్తూ కూర్చుంటే మెదడు పుచ్చిపోతుంది అనే తిట్లు ప్రతి ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయి. ఫోన్ ఎక్కువ సేపు చూస్తున్నావంటూ పెద్దలు.. పిల్లల్ని తిట్టినప్పుడల్లా ‘హోంవర్క్ కోసం’ అని వాళ్లు సర్దిచెప్పే ప్రయత్నం చేయడం కామన్. ‘నువ్వు కూడా ఫోన్ చూస్తున్నావ’ని పిల్లలు పెద్దల్ని నిలదీసినప్పుడు ‘అది ఆఫీసు పని మీద అని మభ్యపుచ్చడమూ’ చూస్తున్నాం! ఒక్క మాట మాత్రం వాస్తవం. లోకం అంతా ఇప్పుడు ఫోన్ అనే వ్యసనంతోనే జీవిస్తున్నది. డేటా చవకగా మారిపోవడంతో… ఆ వ్యసనం నానాటికీ విస్తరిస్తున్నది. ఇంతకీ ఈ తెలిసిన విషయాన్నే మళ్లీ గుర్తుచేసుకోవడానికి ఓ కారణం ఉంది. ఆంగ్ల నిఘంటువుల్లో తలమానికం అయినా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ… సోషల్ మీడియా వల్ల కలిగే అనర్థాన్ని సూచించే ‘బ్రెయిన్ రాట్’ అనే పదాన్ని ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది.
నిఘంటు నిర్మాణంలోనో, భాష చుట్టూ అల్లుకునో పనిచేసే చాలా సంస్థలు ఏటా ఒక ముఖ్యమైన పదాన్ని ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటిస్తుంటాయి. దాదాపు 50 ఏళ్ల క్రితం మొదలైన ఆనవాయితీ ఇది. కేంబ్రిడ్జ్, కొలిన్స్, వెబ్స్టర్లతోపాటుగా ఆక్స్ఫర్డ్ కూడా ఏటా ఈ ప్రక్రియ చేపడుతుంది. గత ఏడాదిలో ఆ పదాన్ని ఉపయోగించిన తీరు, భావప్రకటన సంస్కృతులను అది ప్రతిబింబించిన విధానం ఆధారంగా ఈ పదాన్ని నిర్ణయిస్తారు. ఆక్స్ఫర్డ్ కోసం నిష్ణాతులైన సంపాదకులు, భాషా నిపుణులు ఉన్నప్పటికీ వేల మంది పాఠకుల నుంచి వచ్చిన ఓటింగ్ ఆధారంగానే ఈ పదాన్ని నిర్ణయిస్తారు. డెమ్యూర్, డైనమిక్ ప్రైసింగ్, స్లాప్, లోర్ లాంటి ఎన్నో పదాలను దాటుకుని ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్ కిరీటాన్ని’ అందుకుంది బ్రెయిన్ రాట్.
2000 సంవత్సరం తర్వాత పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకానికి దీన్ని అన్వయించడం మొదలుపెట్టారు. 2023తో పోలిస్తే గత ఏడాది ఈ పదం వాడకం 230 శాతం పెరగడం గమనించారు. దీన్ని కేవలం ఓ నిందగానే కాకుండా, సోషల్ మీడియా వల్ల కలిగే అనర్థాలను సూచించడానికి కూడా వాడటం మొదలుపెట్టారు. అందుకే ఈ పదం వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.
బ్రెయిన్ రాట్ అనే పదాన్ని ఈమధ్య కాలంలో విస్తృతంగా వాడుతున్నారు కానీ, దీనికి 170 ఏండ్ల చరిత్ర ఉంది. ప్రముఖ రచయిత, తత్వవేత్త హెన్రీ డేవిడ్ థోరో తన వాల్డెన్ పుస్తకంలో ఈ పదాన్ని ఉపయోగించారు. ఆలోచనా స్థాయి రోజురోజుకీ దిగజారడానికి సూచనగా ఈ పదాన్ని వాడారు. అయితే 2000 సంవత్సరం తర్వాత పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకానికి దీన్ని అన్వయించడం మొదలుపెట్టారు. 2023తో పోలిస్తే గత ఏడాది ఈ పదం వాడకం 230 శాతం పెరగడం గమనించారు. దీన్ని కేవలం ఓ నిందగానే కాకుండా, సోషల్ మీడియా వల్ల కలిగే అనర్థాలను సూచించడానికి కూడా వాడటం మొదలుపెట్టారు. అందుకే ఈ పదం వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.
ఏమీ తోచడం లేదనో, చేతిలో ఫోన్ ఉందనో, అలవాటు మానుకోలేకనో… సోషల్ మీడియాను అలా గంటల తరబడి చూస్తూ ఉండిపోవడం నేటి తరం రివాజుగా మారింది! ఎలాంటి ఆలోచనలూ, అనుభూతులూ లేకుండానే… ఫోన్ మీద వేలును ఆడిస్తూ స్తబ్ధుగా ఉండిపోవడం పిల్లల నుంచి పెద్దల వరకూ అలవాటైంది. ఎంత పనిలో ఉన్నా.. ఒక్కసారి రీల్స్‌లోకి తలదూరిస్తే.. అరగంట స్వాహా! నిద్ర ముంచుకొచ్చే వేళ ఒక్క షార్ట్ కంటపడిందా.. ఇక అంతే సంగతులు. స్మార్ట్ స్క్రీన్ మీద వేలు తైతక్కలాడటమూ, షార్ట్స్ పరంపర కొనసాగటమూ పరిపాటుగా మారింది. దీని వల్ల పనికిరాని కంటెంట్ కూడా మెదడులోకి చేరిపోతున్నది. ప్రతికూల విషయాలూ మనసును కబళించేస్తున్నాయి. అది వ్యక్తుల ఆరోగ్యం మీద, సమాజం పోకడ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న భయాన్ని ప్రకటించేదే ఈ బ్రెయిన్ రాట్. ఆక్స్ఫర్డ్ ప్రకటించే వర్డ్ ఆఫ్ ది ఇయర్‌కి ఓ ప్రత్యేకత ఉంది. అది కేవలం ప్రచారంలో ఉన్న పదం మాత్రమే కాదు. సమాజంలో వస్తున్న మార్పులకు కూడా చిహ్నంగా నిలుస్తుంది. అందుకే ైక్లెమెట్ ఎమర్జెన్సీ, గోబ్లిన్ మోడ్, రిజ్… ఇలా ఏటా ప్రకటించే ఆక్స్ఫర్డ్ పదాలను లోకం జాగ్రత్తగా గమనిస్తుంది. ఆ విషయంలో కాస్త అవగాహన మొదలవుతుంది. అలా బ్రెయిన్ రాట్ కూడా డిజిటల్ వ్యసనం గురించి అందరినీ హెచ్చరిస్తుందని భావిద్దాం. బ్రెయిన్ రాట్ నుంచి బయటపడి శారీరకంగా, మానసికంగా రాటుదేలాలని ఆశిద్దాం!!