కవిత్వం పేరుతో నాసిరకం భావాలు చెలామణి అవుతున్న ఈ రోజుల్లో అసలైన కవిత్వం అంటే ఏమిటో రుచి చూపించాడు మల్లారెడ్డి మురళీమోహన్! అతని తాజా పుస్తకం ‘నిశాచరుడి దివాస్వప్నం’లో ప్రతీ పుటా, ఇంకా చెప్పాలంటే ప్రతి పదబంధం ఓ ప్రబంధంలా అనిపించింది. పుస్తకం శీర్షికే రచయితకు కవిత్వంపై ఉన్న పట్టును చెప్పకనే చెప్పింది. ‘అస్తిత్వరహిత రహస్యాల్ని మోస్తున్న/ వేల సముద్రాల ఒరిపిడి- లోపలి నిశ్శబ్దం/ ఊబి కళ్ళనిండా రహస్యాంతర్గాముల/ యోజన ప్రయాణ రొద/ ప్రణాళికలన్నీ కాలనాళికలో/ భస్మమైపోయిన విభ్రమ… … …/ స్వప్నస్రావమైన రాత్రి గాయాలకి/ నిశి మలాముపూత..’ మరోచోట కవి ఇలా అంటాడు.. ‘లాంతరు కత్తెర/ చీకట్లను చింపుతోంది… పక్షిలాంటి బతుకు మీద/ ఆశ, అసూయ/ ఇటీవలి కొత్త నేరాలు…’ ఈ పుస్తకంలో ఏ పదం తీసుకున్నా, ఏ కవిత తీసుకున్నా కవిత్వంతో తడిసిన రసమలాయిలా కవిత్వ రసాస్వాదకులని మురిపిస్తుంది.. మైమరిపిస్తుంది. కవితా పిపాసకులకు గొప్ప కానుక ‘నిశాచరుడి దివాస్వప్నం’.