ఏకాంత ప్రయాణం సోలో ట్రావెల్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి యాత్రల్లో అసాధారణమైన అనుభవాలు ఎదురవుతాయి. రాయాలనే కుతూహలం ఉన్నవాళ్లకు యాత్రల్లో ఎన్నో కథలు దొరుకుతాయి. అలాంటి అనుభవాలతో రచయిత్రి శ్రీఊహ ‘బల్కావ్ బ్యాక్‌ప్యాక్ కథలు’ సంకలనం తీసుకువచ్చారు. ఆసక్తికరమైన శీర్షికతో ఉన్న ఈ పుస్తకంలోని పది కథలూ రచయిత్రి చేసిన ప్రయాణ పరిమళాలను వెదజల్లుతాయి. బల్కావ్ అంటే పోర్చుగీసు భాషలో బాల్కనీ అని అర్థం.
గోవా నేపథ్యంగా సాగే ‘బల్కావ్’ కథలో నాయకుడు మార్టిన్ ఐస్‌క్రీం టేస్టర్. అతని కొడుకు, కోడలేమో ఆధునికతను ఒంటబట్టించుకున్నవాళ్లు. పాత ఇంటిని డెవలపర్‌కు ఇచ్చి కొత్తగా ఇంకెక్కడైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. దానికి మార్టిన్ అంగీకరించడు. ఈ సంఘర్షణలో ఓ రాత్రి మార్టిన్ మరణిస్తాడు. అతని నాలుక మీది రుచిమొగ్గలకు ఇన్సూరెన్స్ ఉండటంతో ఐస్‌క్రీం కంపెనీ వాళ్లు చెక్ ఇవ్వడానికి కొడుకు, కోడలు దగ్గరికి వస్తారు. దాంతో మార్టిన్ గొప్పతనం, వృత్తి నిబద్ధత వారికి తెలిసివస్తాయి. అదే ఇంటిని నవీకరించి ‘బల్కావ్’ పేరుతో రెస్టారెంట్ తెరుస్తారు. అలా చివరికి మార్టిన్ కోరికే నెగ్గుతుంది.
ఈ కథ శ్రీఊహ పరిశీలనాశక్తికి అద్దం పడుతుంది. మరో కథ ‘తరానా’ కాకతీయ ప్రతాపరుద్రుడి కాలపు వరంగల్లులో సాగుతుంది. గూఢచర్యం సాంస్కృతికంగా కూడా చేస్తారనే దృగ్విషయాన్ని ఈ కథ ద్వారా మధ్యయుగాల నాటి చరిత్రకారుడు, సంగీత విద్వాంసుడు అమీర్‌ఖుస్రూ పాత్రతో నడిపిస్తారు శ్రీఊహ. ఇక ‘ఆతీ’ కథ ఛత్తీస్‌గఢ్ గిరిజన సమాజంలో సల్వాజుడుం కల్లోలాన్ని కండ్లకు కడుతుంది.
రాజస్థాన్‌లోని బందర్ సింద్రీ నేపథ్యంగా సాగే ‘ఇంకా రాత్రి చీకట్లో’ కథ పడుపు వృత్తిలో మగ్గుతున్న నాట్ స్త్రీల విషాద జీవితాల్ని గురించి ఆర్ద్రంగా వివరిస్తుంది. హైదరాబాద్ శివారు గ్రామం కోకాపేట వేదికగా సాగే ‘కిట్టిపార్టీ’ కథ కిట్టిపార్టీల వికృతత్వాన్ని కండ్లకు కడుతుంది. ‘లడాయి’, ‘బర్కత్’ కథలు పాతబస్తీ కేంద్రంగా సాగుతాయి. హైదరాబాద్ జీవితంలో విభిన్న పార్శాలను మన ముందుంచుతాయి. ‘ముడుపు’ కథ భారతీయ
జమున తెహజీబ్ విశిష్టతను చాటుతుంది. విజయవాడలో సాగే ‘పరావర్తనం’ కథ పేద పురోహితుల అగచాట్లను అవగతం చేస్తుంది. అమెరికా నేపథ్యంగా సాగిన ‘కాసిన్ని పూలు’ కథలో ఓ భారతీయ యువతిలో జీవితాన్ని చూసే కోణం మారిన ఇతివృత్తం కనిపిస్తుంది. అయితే, ఈ ఇందులో నిగూఢంగా దాగిన అంశాలు ఉన్నాయి. వాటిని పాఠకుల ఊహకే వదిలిపెట్టారు శ్రీఊహ. పది వేర్వేరు స్థలాల్లో జరిగిన ‘బల్కావ్’ కథలు
పాఠకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.
రచన: శ్రీఊహ
పేజీలు: 148; ధర: రూ. 175
ప్రచురణ: అర్క పబ్లికేషన్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల దుకాణాలు