ఏ భాషా సాహిత్యమైనా కథలకు మంచి ఆదరణ ఉంటుంది. నిడివి తక్కువగా ఉండటం, ఎక్కువ మలుపులు లేకుండా సూటిగా నడవడం లాంటివి కథలంటే ఇష్టపడటానికి ప్రధాన కారణాలు. తెలుగు కథా సాహిత్యం విషయానికి వస్తే సుమారు నూట పాతికేండ్ల చరిత్ర దీని సొంతం. అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగులో ఎన్నో గొప్ప కథలు వెలువడ్డాయి. వీటిలో సాధారణ పాఠకులకు కొన్ని కథలు, అవీ కొంతమంది రచయితలవి మాత్రమే పరిచయం ఉంటాయి. చాలావరకు తెలియనివే ఉంటాయి. పైగా విభిన్న దశాబ్దాల్లో వచ్చిన మంచి కథలను వెతుక్కోవడం తలకుమించిన పనే.
ఎవరైనా వాటి వివరాలు చెబితే బాగుంటుంది అనుకుంటాం. రచయిత ఎమ్బీయస్ ప్రసాద్ ఆ ప్రయత్నమే చేశారు. తనకు గొప్పవి అనిపించిన కథా సంకలనాలు, ప్రసిద్ధ రచయితల ప్రసిద్ధ కథలను పరిచయం చేస్తూ ఆయన ‘కథా పరామర్శ’ పేరుతో పుస్తకం వెలువరించారు. ఇందులో ఏడు కథా సంకలనాల పరిచయంతోపాటు ఉద్దండులైన తెలుగు కథకులకు చెందిన 40 కథల పూర్వాపరాలను ప్రసాద్ వివరించారు. కథా పరామర్శ చదివితే పాత కథల నడకతోపాటు, కథకుల గొప్పతనం తెలుస్తుంది. కథలను ఎలా అర్థం చేసుకోవాలో అవగతమవుతుంది.
ఆధునిక భారతదేశ చరిత్రలో సంస్కరణ ఉద్యమాలది ఓ సువర్ణాధ్యాయం. సంస్కరణ అంటే మతపరమైన దురాచారాలు, మహిళల పట్ల వివక్ష, సమాజంలో గూడు కట్టుకున్న మూఢనమ్మకాలు మొదలైన వాటి నిర్మూలనతోపాటు ఆధునిక విద్యా విధానం ప్రవేశపెట్టడం ప్రధానంగా నడిచాయి. అయితే, పీడిత కులాలు, వృత్తి కులాల వెతల పట్ల తొలిసారిగా గొంతెత్తింది మాత్రం మహాత్మ జ్యోతిరావ్ ఫూలేనే. మహారాష్ట్రలో పూణే కేంద్రంగా ఆయన ప్రస్థానం సాగింది. విద్యతోనే అన్ని రంగాల్లో వికసిస్తామనే ఉద్దేశంతో ఆయన బ్రాహ్మణీయ భావజాలంపై తిరుగుబాటుగా ‘సత్యశోధక్ సమాజ్’ను స్థాపించారు. భార్య సావిత్రిబాయికి చదువు నేర్పి, ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. వారిద్దరూ కలిసి అణగారిన వర్గాలు, స్త్రీల విద్య, అభివృద్ధి కోసం కృషిచేశారు. అలా వర్ణ వివక్ష అంధకారంలో వేల ఏండ్లుగా మగ్గిపోయిన శూద్రులు, అతిశూద్రుల్లో చైతన్యం తీసుకువచ్చారు. భారత రాజ్యాంగ రచనలో కూడా డా. అంబేద్కర్ రూపంలో ఫూలే స్ఫూర్తి కనిపిస్తుంది. జ్యోతిరావ్ ఫూలే 197వ జయంతి సందర్భంగా ‘ధిక్కార’ పేరుతో ప్రసాదమూర్తి, జూకంటి జగన్నాథం, అమ్మంగి వేణుగోపాల్ తదితర కవులు రచించిన 150 పైచిలుకు కవితలతో నెలపొడుపు సాహిత్య సాంస్కృతి వేదిక సంకలనం ప్రచురించింది. డా.సంగిశెట్టి శ్రీనివాస్, వనపట్ల సుబ్బయ్య సంపాదకత్వంలో వచ్చిన ఈ పుస్తకంలో ప్రతి కవితలోనూ ఫూలే స్ఫూర్తి కనిపిస్తుంది.