ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘త్రిఫల చూర్ణ’ మిశ్రమాన్ని ఉసిరికాయ, తానికాయతోపాటు కరక్కాయ పొడిని తగుపాళ్లలో కలిపి తయారుచేస్తారు. కరక అత్యంత ప్రధానమైన ఔషధ మొక్క. అడవిలో ఈ జాతి చెట్లు విస్తారంగా కనిపిస్తాయి. మన రాష్ట్రంలో శ్రీశైలం నుంచి వచ్చే దారిలో నల్లమల అడవిలో ఇలాంటి అనేక మూలికా ఔషధ ఫలాలను చూడొచ్చు. గుత్తులు గుత్తులుగా కనిపిస్తాయి.
ఇది ఐదు నుంచి ఆరు మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కరక్కాయలు పచ్చగా దొండకాయ ఆకారంలో కొంచెం పెద్దగా ఉంటాయి. దోరగా ఉన్నప్పుడు పసుపు రంగులో ఉంటాయి. పండుతున్న కొద్దీ బ్రౌన్ రంగులోకి మారతాయి. ఎండిన కరక్కాయల పెచ్చు గరుకుగా ఉంటుంది. పువ్వులు లేత ఆకుపచ్చ రంగులో నక్షత్ర ఆకారంలో అందంగా ఉంటాయి. చెంచులు, గోండులు అడవిలోని కరక్కాయలు సేకరించి సంతల్లో అమ్ముతారు.
కరక్కాయ త్రిదోష హరమైనది. దగ్గు, ఊబకాయం, తలనొప్పి, కండ్ల ఎరుపు, ఎక్కిళ్లు, క్రిమి రోగం, విష జ్వరం, పాండు రోగం మొదలైన రోగాల నివారణకు ఆయుర్వేదంలో కరక్కాయ దివ్యౌషధం. విజయ కరక్కాయ అనే రకమైన కరక్కాయ సర్వరోగ నివారిణి అంటారు. భోజనం తర్వాత సైంధవ లవణం, శొంఠి, పిప్పలి, తేనెలో కరక్కాయ పొడి కలుపుకొని తింటే అజీర్తి సమస్యలు పోతాయి.
చలికాలం రాత్రిళ్లు ఎవరన్నా దగ్గుతో బాధపడుతుంటే మా అమ్మ కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొమ్మని ఇచ్చేది. వగరుతో కలిసిన చేదు ఉండేది. మందు తియ్యగా ఉండదు కదా! కరక్కాయలోనే కాదు చెట్టు బెరడులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కాలంలో ఆయుర్వేద దుకాణాల్లోనే కాకుండా సూపర్ మార్కెట్లలో కరక్కాయ చూర్ణం దొరకుతున్నది.
కరక్కాయను సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తారు. వస్ర్తాల రంగుల అద్దకంలో (టెక్స్టైల్ పరిశ్రమలో) కూడా కరక్కాయను వాడతారు. వావిలాల గ్రామంలో ఖాదీ ప్రతిష్టాన్లో ఈ అద్దకం చూడముచ్చటగా ఉంటుంది. కరక్కాయ దంచి కషాయం కాచి, ఆ కషాయంలో తెల్లని వస్త్రం ముంచితే పసుపు రంగులోకి మారుతుంది. ఈ కషాయంలో ఇనుప చిలుము కలిపితే నలుపు రంగు ఇస్తుంది. మా పీవీ ఔషధ వనంలో రెండు కరక్కాయ చెట్లు పెరుగుతున్నాయి.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు