ఆరుబయట ఆనందం అనుభవించడానికి బర్డ్ వాచింగ్ ఓ మంచి హాబీ. రంగురంగుల పక్షులు, వాటి రకరకాల అరుపులు, ఆకాశానికేసి ఎగరడం, గాలిలో పల్టీలు కొట్టడం మొదలైనవి మనలో ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. మానసిక ఆరోగ్యానికి సాయపడతాయి. ఏకాగ్రత, మైండ్ఫుల్నెస్తోపాటు ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది. బర్డ్ వాచింగ్ మనసుకు ఓ రకమైన ప్రశాంతతను, ఉపశమనాన్ని ఇస్తుంది.
బాధలకు దూరంగా పక్షులను జాగ్రత్తగా పరిశీలించడమే బర్డ్ వాచింగ్. పక్షులను పరిశీలిస్తూ గడపడం మన మెదడుకు మంచి వ్యాయామం. ప్రకృతిలో సరదాగా గడిపేయడానికి ఇది ఓ మంచి ఎంపిక. ఎంతో ఏకాగ్రత అవసరమైన బర్డ్ వాచింగ్ మనల్ని ప్రాపంచిక బాధల నుంచి దూరంచేస్తుంది.
మెదడు చురుగ్గా బర్డ్ వాచింగ్ వల్ల పక్షుల ప్రవర్తన, వాటి అరుపులను అర్థం చేసుకోగల్గుతాం. దీనికోసం మన మెదడు చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. అలా మెదడు క్రియాశీలకంగా మారిపోతుంది. బర్డ్ వాచింగ్ మనలో ఎండార్ఫిన్, డోపమైన్ అనే హార్మోన్ల విడుదలకు దోహదపడుతుంది. ఇవి మనల్ని సంతోషంగా ఉంచుతాయి.
వర్తమానంలో బర్డ్ వాచింగ్ వల్ల మనలో ఒత్తిడి తగ్గుతుంది. ధ్యానంలాగే ఇదికూడా మనల్ని వర్తమానంలో ఉండేలా చేస్తుంది. రకరకాల పక్షుల కూతలతో మన మెదడు ఆలోచనా రహితమైపోతుంది. ఒక రకమైన ప్రశాంత స్థితికి చేరుకుంటుంది.
ప్రతికూలత దూరంగా బర్డ్ వాచింగ్ మన ఏకాగ్రత స్థాయులు పెరగడానికి దోహద పడుతుంది. చిత్రకళలానే పక్షుల పరిశీలన కూడా ప్రతికూల భావోద్వేగాల నుంచి మన మనసును మళ్లిస్తుంది. మెదడును సృజనాత్మకంగా మారుస్తుంది.
గుండె ఆరోగ్యం మెరుగ్గా బర్డ్ వాచింగ్ వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పక్షులను పరికించే క్రమంలో నెమ్మదిగా నడుస్తుంటాం. ఎత్తుపల్లాలను దాటుతుంటాం. అవసరాన్ని బట్టి వేగంగా నడుస్తుంటాం. వీటన్నిటి వల్ల రక్త పోటు (బ్లడ్ ప్రెషర్) నెమ్మదిస్తుంది. గుండెకు మేలు చేకూరుతుంది.