Bhagyashree Borse | ముంబయి భామలు ఎందరో తెలుగు చిత్రసీమలో వెలిగిపోయారు. బాలీవుడ్లో పుట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మరో ముంబయి అందం భాగ్యశ్రీ బోర్సే. అరంగేట్రంతోనే మాస్ మహారాజా రవితేజ సరసన చాన్స్ కొట్టేసింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘మిస్టర్ బచ్చన్’ను మెప్పించిన ఈ సుందరి.. వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది. హాట్‌బ్యూటీ భాగ్యశ్రీ పంచుకున్న ముచ్చట్లు..
మొదటి సినిమాతోనే ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ పొందడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. వరుసగా అవకాశాలు పలకరిస్తున్నాయి. ప్రస్తుతానికి తెలుగులో మరో రెండు పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నా. ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ, వెబ్ సిరీస్‌లో నటిస్తున్నా. అభిమానుల ఆదరణ, ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటే మరిన్ని సినిమాల్లో నటించి అందరినీ అలరించేందుకు కృషి చేస్తా.
సినిమాల్లో నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించడం, ఆ కథకు ప్రాణం పోసి ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రేకెత్తించడం భలే ఆసక్తిగా గమనించేదాన్ని. నన్ను నేను ఆయా పాత్రల్లో ఊహించుకునేదాన్ని. ఆ అభిరుచే నటనను కెరీర్‌గా ఎంచుకోవడానికి స్ఫూర్తినిచ్చింది.
చిన్నప్పటి నుంచే కళల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అందుకే ముంబయి యూనివర్సిటీ నుంచి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశాను. చదువుతోపాటు నటన, డ్యాన్స్‌లోనూ రాణించడానికి ప్రత్యేక కోర్సులు తీసుకున్నా. అవి నటనలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి ఎంతగానో దోహదం చేశాయి. వెండితెరపై నటిగా రాణించేందుకు నన్ను సిద్ధం చేశాయి.
స్కూల్ డేస్ నుంచే డ్యాన్స్ అంటే ఆసక్తి ఉండేది. కల్చరల్ ఈవెంట్స్‌లో పోటీ పడేదాన్ని. నాటకానుభవం కూడా ఉంది. స్టేజ్ ముందు కూర్చోవడం కన్నా స్టేజ్ మీద నటించడాన్నే ఇష్టపడేదాన్ని. దాంతో నటన నా జీవితంలో భాగంగా మారింది. ఆ ఆసక్తితోనే సినిమాల్లో అడుగుపెట్టా. క్లాసిక్ బాలీవుడ్ సినిమాలు చూడటం బాగా అలవాటు. చిన్నప్పటినుంచీ చూసిన సినిమాలే నన్ను వెండితెర వైపు అడుగులు వేయించాయేమో!
ఏ పని చేసినా మీ పట్ల, మీ అభిరుచి పట్ల నిజాయతీగా ఉండాలి. పరిశ్రమ సవాలుగా ఉండవచ్చు, కానీ పట్టుదల, అంకితభావం కీలకం. ఆర్టిస్టుగా నేర్చుకుంటూ ఎదగాలి. రిస్క్ తీసుకోవడానికి భయపడొద్దు. కలల్ని వదులుకోకుండా నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా అనుకున్నది సాధిస్తారు.
ఒక సినిమా ప్రేక్షకులను మెప్పించడం అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. కథ బలంగా ఉండాలి. కథనం ఆసక్తికరంగా సాగిపోవాలి. నటీనటులు ప్రాణం పెట్టి నటించాలి. పాటలు ఆకట్టుకోవాలి. సంగీతం మైమరిపింపజేయాలి. ఇలా అన్నీ సమపాళ్లలో కుదిరినప్పుడే సినిమా ప్రేక్షకులను రంజింపజేస్తుంది. వీటిలో దేని ప్రత్యేకత దానిదే!
రవితేజతో పనిచేయడం గొప్పగా అనిపించింది. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు ఉదారమైన వ్యక్తి కూడా. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా ఓ అద్భుతమైన లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంకితభావం,
ప్రొఫెషనలిజం కలిగిన వ్యక్తి. మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్లో ఆయన్ను గమనించడం ద్వారా నేను చాలా
విషయాలు నేర్చుకున్నాను.
నటనతోపాటు చదవడం, ట్రావెలింగ్ అంటే ఇష్టం. బుక్ రీడింగ్ వల్ల చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రపంచాన్ని అన్వేషించడానికి చదువు సాయపడుతుంది. ప్రయాణం కొత్త సంస్కృతులు, సంప్రదాయాలు, రుచులను పరిచయం చేస్తుంది. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం కల్పిస్తుంది. పెయింటింగ్ అంటే ఇష్టం. నన్ను నేను భిన్నంగా వ్యక్తీకరించుకోవడానికి పెయింటింగ్ ఒక మార్గంగా భావిస్తాను.