అజయ్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెలకు లక్ష రూపాయల జీతం. వాట్సాప్‌లో ఓ ఫ్రెండ్ పంపిన లింక్ ఓపెన్ చేశాడు. ‘రూ.500 పెట్టి ఆడండి, రూ. 5,000 గెలుచుకోండి!’ అనే యాడ్ ఆకర్షించింది. మొదటి రౌండ్లో నిజంగానే రూ.5,000 వచ్చాయి. రెండోసారి రూ.10,000 పెట్టాడు మళ్లీ వచ్చాయి. అలా వారంలో అజయ్ ఖాతాలో రూ.5 లక్షలు డిపాజిట్ అయ్యాయి. కానీ, ఓ రోజు అప్పు తెచ్చి మరీ బిగ్బెట్ కట్టి అంతా పోగొట్టుకున్నాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో!! బెంగళూరులో ఓ కాలేజీ స్టూడెంట్ ఇలా బెట్టింగ్ కట్టి తన తండ్రి ఖాతాలో ఉన్న రూ.12 లక్షలు ఖాళీ చేశాడు. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి రూ.30 లక్షలు అప్పు చేసి బెట్టింగ్‌లో పెట్టి ఓడిపోయాడు. అప్పులవాళ్ల ఒత్తిడి తట్టుకోలేక చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వింటున్నాం.
అందుకేనేమో.. రెండు తెలుగు రాష్ర్టాల్లో బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోషన్స్ హాట్ టాపిక్‌గా మారింది. వివిధ సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన కొంతమంది ఇన్ఫ్లూయెన్సర్లు కూడా సులువుగా డబ్బులు సంపాదించడం కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. దీని ప్రభావంతో యువత ఆర్థికంగా నష్టపోవడం, అప్పుల ఊబిలో కూరుకుపోవడం, చివరికి ప్రాణాలు తీసుకోవడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తప్పవంటూ ఆదేశాలిచ్చింది!! ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నందుకు కొందరు యూట్యూబర్స్‌పై కేసు నమోదైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల మీద కూడా కేసులు నమోదు అవుతున్నాయి. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకుండా, బెట్టింగ్ యాప్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.
ఈ బెట్టింగ్ యాప్స్‌లో రిజిస్టర్ అవ్వగానే.. ఫ్రీ బోనస్ లభిస్తుంది. మొదట కొన్ని గేమ్స్ తేలిగ్గా గెలిచేస్తారు. ‘సింపుల్ టెక్నిక్.. ఫాలో అయితే డబ్బు వస్తుంది’ అనే మాయమాటలు వినిపిస్తాయి. అంతేనా.. ‘మేం ఇంత గెలుచుకున్నాం.. అంత సంపాదించాం..’ అంటూ ఫేక్ సక్సెస్ స్టోరీలు ఊరిస్తాయి. ‘ఈ యాప్ ద్వారా నేను యాభై వేలు గెలిచాను’ అన్న స్క్రీన్షాట్లు సోషల్ మీడియా వాల్స్‌పై దర్శనమిస్తాయి. అందరికీ డబ్బులు వస్తున్నాయి కదా అని.. ఈ ఊబిలో దిగితే, మళ్లీ పైకి రావడం కల్ల. ఈ మాయదారి జూదంలో పోగొట్టుకున్నవాళ్లే ఎక్కువ!
ఆన్లైన్ గేమ్స్ రెండు రకాలు. ఒకటి నైపుణ్యంతో కూడినవి రమ్మీ, పోకర్ లాంటివి (వీటిపై రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ ఉంటుంది). అంతేకాదు.. ఆడే వ్యక్తి తెలివి ఆధారంగానే గెలుపోటములు ఉంటాయి. రెండు.. అదృష్టాన్ని నమ్ముకొని ఆడేవి. క్రికెట్ బెట్టింగ్, లాటరీలు లాంటివి.. ఈ కోవలోవే! అందులోనూ స్పోర్ట్స్ బెట్టింగ్ మరింత ప్రమాదకరం! ఒకసారి గెలిస్తే, ఇక వదలరు. మరింత పెట్టమంటారు. లావాదేవీలు ఓ ఇంటర్నేషనల్ అకౌంట్లో జరుగుతాయి. గెలిస్తే తీసుకోవడం కష్టమే, కానీ ఓడిపోతే మాత్రం నూటికి నూరు శాతం అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం.
కొంతమంది ఇన్ఫ్లూయెన్సర్లు సులువుగా డబ్బులు సంపాదించడం కోసం బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఫాలోవర్లను మోసం చేసి అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. ఆయా యాప్‌లపై నమ్మకం కలిగించేలా మాట్లాడుతున్నారు. ‘నేను ఈ రోజు ఇలా ఫైనాన్షియల్‌గా బలంగా ఉన్నానంటే కారణం ఈ యాప్‌లే’ అని నమ్మబలుకుతున్నారు. అంతేకాదు.. డిస్కౌంట్లు, గిఫ్ట్‌లు అంటూ ఆయా బెట్టింగ్ యాప్స్‌లో రిజిస్టర్ అయ్యేలా చేస్తున్నారు. అందుకు ప్రత్యేక లింక్‌లను పెడుతున్నారు. వాటిపై క్లిక్ చేసిన ఫాలోవర్లు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇంకొందరైతే.. బెట్టింగ్ గేమ్స్ ఎలా ఆడాలో పాఠాలే చెబుతున్నారు, సక్సెస్ స్టోరీలు చేస్తున్నారు. ఇదంతా సదరు ఇన్ఫ్లూయెన్సర్లు చేస్తున్న దందా అని ఫాలోవర్లు గ్రహించలేకపోతున్నారు.
యాప్‌ల అల్గారిథం పూర్తిగా ఆటగాళ్లను మోసం చేయడానికే క్రియేట్ చేస్తారు. మొదట చిన్న మొత్తం గెలిపిస్తారు. ఆపై నెమ్మదిగా లావాదేవీలు మార్చి, ఆటను తమకు అనుకూలంగా మారుస్తారు. ఎక్కువ డిపాజిట్ చేయించేలా కొత్త ఆఫర్లు చూపిస్తారు. ఎందుకంటే.. ఈ బెట్టింగ్స్ యాప్స్‌కి అధికారిక అడ్డా అంటూ ఏదీ ఉండదు. రిజిస్టర్ అయ్యాక కొన్ని యాప్‌లు అనుకోకుండా షట్‌డౌన్ అయిపోతాయి. మరో కొత్త పేరుతో మళ్లీ పుట్టుకొస్తాయి. కొన్ని యాప్స్ కేవలం వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకే ఉంటాయి. వ్యక్తిగత వివరాలతో లాగిన్ అయ్యాక.. అవి పనిచేయవు. పేమెంట్స్ విషయంలోనూ మోసమే! మీరు పెద్ద మొత్తంలో గెలుచుకుంటే క్రెడిట్ అయ్యేందుకు టెక్నికల్ సమస్యలు సృష్టిస్తారు. అదే మీరు పోగొట్టుకుంటే.. క్షణాల్లో అకౌంట్ ఖాళీ అయిపోతుంది. అంతేకాదు.. మీరు నిశితంగా చూస్తే ఎక్కడా కూడా కామెంట్స్, ఫీడ్‌బ్యాక్ లాంటివి కనిపించవు. కస్టమర్ కేర్ నంబర్ కనిపించదు. ఉన్నా.. వాటిలో ఎక్కువ శాతం ఫేక్ నంబర్లే ఉంటాయి.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రభుత్వం ఎందుకు నివారించలేకపోతున్నది? అనే సందేహం వస్తుంది. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ఈ యాప్స్ ఆఫ్‌షోర్ లైసెన్స్‌తో నడుస్తాయి. అంటే విదేశాలు కేంద్రంగా ఈ దందాలు సాగుతాయి. దీనికితోడు స్మార్ట్ టెక్నాలజీతో వీపీఎన్‌లు, క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బును మాయం చేస్తారు. అయితే, ఇప్పటికే ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాయి! అంతేకాదు, 2023లో 138 బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేసింది. ఎంతచేసినా, మనదేశంలో బెట్టింగ్‌కు సంబంధించిన చట్టాలు ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే గేమ్ ఆఫ్ స్కిల్స్, గేమ్ ఆఫ్ చాన్స్ మధ్య స్పష్టమైన వ్యత్యాసం లేదు. బెట్టింగ్ చేయడం చట్ట విరుద్ధం! చట్ట భద్రత లేనప్పుడు ఏ యాప్‌నైనా ఎప్పుడైనా బ్యాన్ చేయొచ్చు! ఈ క్రమంలో వీటి జోలికి వెళ్లడం ద్వారా పొందేది ఏమీ ఉండకపోగా, ఊహించని నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. అన్నిటికన్నా ప్రధానం.. వ్యక్తిగత క్రమశిక్షణ. బెట్టింగ్‌కు దూరంగా ఉండటం ముఖ్యమని గ్రహించండి. ఎక్కడైనా ఇలాంటి మోసాల్ని మీరు గమనించినా, మీరే మోసానికి గురైనా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి.