‘సెప్టెంబర్ మాసం.. పాత బాధలు తలెత్తనీయం’ అన్నారో కవి! అదెలాగో చెప్పలేదాయన! ఇప్పుడెలా అంటారా? ఈ సెప్టెంబర్ మంచి రిమెంబర్ కావాలంటే.. కర్ణాటకలోని సండూరుకు వెళ్లండి. పాత బాధలన్నీ మాయం.. కొత్త సంతోషాలు ఖాయం. 1934 సెప్టెంబర్ నెలలో దేశ పర్యటనలో భాగంగా మహాత్మ గాంధీ కర్ణాటక సందర్శించారు. ఒక్కో ఊరినీ ఉత్సాహపరుస్తూ సాగిపోతున్నారు. ఒక్కో పల్లెను తట్టిలేపుతూ వెళుతున్నారు. ఓ చోటు.. బాపూజీ మనసునే ఉత్సాహపరిచింది. ఆయనలోని పర్యాటకుడిని తట్టిలేపింది. కొండ, కోన, వాగు, వంక అన్నీ గాంధీజీని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ ఊరు పేరే సండూరు. అక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధులైన బాపూ.. ‘సీ సండూరు ఇన్ సెప్టెంబర్ (సండూరును సెప్టెంబరులో చూడండి) అన్నారట.
అదే సండూరు పర్యాటక నినాదమైంది. ప్రకృతి ప్రేమికులకు ఓ విధానంగా మారింది. అంతులేని ఖనిజ సంపదకు నెలవైన బళ్లారి జిల్లాలో ఉంటుంది సండూరు. గనుల మధ్య చెక్కు చెదరని అందాలతో తన ప్రత్యేకతను చాటుకుంటున్నదీ ప్రాంతం. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తయిన పర్వతాలు, అందమైన లోయలు, చిక్కగా పచ్చదనం, అరుదైన ఔషధ మొక్కలు, సెలయేళ్లు, అబ్బురపరిచే వన్యప్రాణులు, పురాతన ఆలయాలతో అడుగడుగునా అద్భుతాలతో పర్యాటక ప్రియులను అలరిస్తున్నది సండూరు.
‘బళ్లారిలో ఉండేది రెండే కాలాలు! ఒకటి ఎండాకాలం.. మరొకటి తీవ్రమైన ఎండాకాలం’ అని ఓ కన్నడ కవి అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ సూత్రీకరణ సండూరుకు వర్తించదు. ఇక్కడ ఏడాది పొడుగునా ఒకే కాలం ఉంటుంది. అది చల్లనికాలం. ప్రతి మదీ మెచ్చే కాలం. అందులోనూ సెప్టెంబరు వచ్చిందంటే చాలు.. వానలు వెలిసి, పుడమి మురిసి, పసరిక పరిచి మరో లోకాన్ని మరిపిస్తాయి సండూరు పరిసరాలు. జనవరి మాసాంతం వరకూ ఈ అద్భుతాలు అలరిస్తూనే ఉంటాయి.. సండూరును ఉత్తర కర్ణాటక మాలెనాడుగా, స్కాట్లాండ్ ఆఫ్ కర్ణాటకగా పిలుచుకుంటారు. ఇంతకీ ఇదెక్కడుందో చెప్పలేదు కదూ! చారిత్రక నగరి హంపికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ పర్యాటక కేంద్రం ఉంటుంది.