‘ఎన్నాళ్లీ కొలువులు.. సరైన పెట్టుబడి ఉంటేనా నేనూ వ్యాపారం చేసి కోట్లు గడించేవాణ్ని’ ఇది సగటు ఉద్యోగి మదిలో మాట. ‘ఏదో పొడుస్తానని కోట్లు కుమ్మరించాను. ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నా.. అదేదో మంచి ఉద్యోగం చేసుకున్నా ఉన్నంతలో ప్రశాంతంగా బతికేవాణ్ని’ ఇది ఓ వ్యాపారి అంతరంగం. ‘దూరపు కొండలు నునుపు’ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఉద్యోగం చేస్తారా? వ్యాపారంలోకి దిగుతారా? అన్నది తేల్చుకోవడానికి ముందు తర్కించాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉన్నవాళ్లు ఏం చేసినా రాణిస్తారన్నది నిర్వివాదాంశం.
తెలివితేటలు పెట్టుబడిగా చేసేది ఉద్యోగం. సమయపాలన ఉండాల్సిన గుణం, కష్టపడే తత్వం అదనపు అర్హతలు. ఈ మూడూ ఉన్న వ్యక్తులు ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదగడం ఖాయం. కానీ, ఉద్యోగుల్లో చాలామంది అసంతృప్తితోనే కాలం వెళ్లదీస్తుంటారు. కారణం నెలంతా కష్టపడితే సాలరీ మెసేజ్ వచ్చేది ఒక్కసారే! సాలరీ క్రెడిట్ అయిన తర్వాత వచ్చే బ్యాంకు మెసేజులన్నీ డెబిట్ ఫ్రమ్ యువర్ అకౌంట్ బాపతువే! వారం తిరిగే సరికి ఐదంకెల అకౌంట్ బ్యాలెన్స్ కాస్తా నాలుగు అంకెలకు చేరుకుంటుంది. మరో పదిరోజులు గడిచేసరికి క్రెడిట్ కార్డు వాడకం మొదలవుతుంది. ఈ పరిస్థితుల్లో జీవితంలో అనుకున్నది ఏదీ సాధించలేని ఓ వ్యక్తి మోటివేషనల్ స్పీకర్ అవతారంలో ప్రత్యక్షమవుతాడు. ‘ఎన్నాళ్లు ఒకరికింద పనిచేస్తారు..’ అని ఉపదేశం చేయడం మొదలుపెడతాడు. ‘జీతం తీసుకోవడం కాదు.. పదిమందికి జీతం ఇచ్చే రేంజ్‌కు ఎప్పుడు చేరుకుంటావ్?’ అని నిలదీస్తాడు. ప్రతి దానికీ వక్రభాష్యం చెప్పే సదరు ప్రయోక్త ప్రవచనాలు విని ఉన్నది కాస్తా ఊడగొట్టుకునే ఉద్యోగులు కోకొల్లలు. మీ బలహీనతనే తన వ్యాపార సూత్రంగా ఎంచుకున్న స్వయం ప్రకటిత మేధావులే మోటివేషన్ స్పీకర్లు. వారి మాటలకు బోల్తా పడితే అన్నవస్ర్తాలకుపోతే ఉన్న వస్ర్తాలు ఊడిపోయే పరిస్థితి రావొచ్చు.
వ్యాపారం చేయడం నేరం కాదు. బిజినెస్ చేయాలనుకోవడం పాపమూ కాదు. కానీ, ఎందుకు చేయాలి అన్నది ప్రధానం. బీటెక్ ఫ్రెండ్ టీ కొట్టు పెట్టి రోజుకు గల్లాపెట్టె నిండా నోట్లు చూస్తున్నాడని ఐటీ ఉద్యోగానికి రాం రాం చెబితే ప్రమాదం. ఉద్యోగం ఊడిపోతే పోయేది నెల జీతం మాత్రమే! నాలుగు నెలలు మరో ఉద్యోగం రాకపోతే ఆ కాలానికి మాత్రమే జీతం ఉండదు. అదే ఆనూపానూ తెలియకుండా వ్యాపారంలోకి దిగితే అడుగడుగూ ప్రమాదమే! తేడా కొడితే జీవితమే కోల్పోవచ్చు. ఉద్యోగాలు చేస్తూ వ్యాపారులకు దీటుగా సంపాదించే వ్యక్తులు ఉన్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వ్యాపారులు కాదు కదా! ఉద్యోగులుగానే ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈ రోజుల్లో కాస్త ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులందరూ చిన్న తరహా వ్యాపారులే! ఆరంకెల జీతం అకౌంట్లో వచ్చి పడుతుంది. పలు కంపెనీలు ఉద్యోగులకు బోనస్ కింద షేర్లు కూడా ఇస్తున్నాయి. అంటే కంపెనీలో పిసరంతో, అణువంతో వాటా ఉన్నట్టే కదా! అంటే మీరు ఉద్యోగి కమ్ వ్యాపారి అన్నట్టే కదా! వచ్చిన జీతాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పొదుపుగా ఖర్చు చేస్తూ, మినిమమ్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వృత్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేయడం మంచిపద్ధతి. అంతేకానీ, ఉన్న కొలువును వదిలి, ఏదో పొడిచేస్తానంటూ వ్యాపారంలోకి దిగాలనుకుంటే మాత్రం కష్టనష్టాలను తట్టుకునే స్థాయికి చేరుకున్న తర్వాతే అని గుర్తుంచుకోండి.
ఉద్యోగాన్ని వ్యాపారంలా భావించాలి. వ్యాపారాన్ని ఉద్యోగంలా చేయాలి. ఇదేం తిరకాసు మాట అనుకోకండి. అన్ని అర్హతలు ఉన్నాక కూడా.. మీ జీతం గొర్రె తోక బెత్తెడే అనిపించిన మరుక్షణం తెలివైన వ్యాపారిలా ఆలోచించాలి. ఒకచోట జరిగిన నష్టాన్ని.. మరోచోట కలిగిన లాభాలతో పూడ్చుకోవడం మంచి వ్యాపారి లక్షణం. అలా.. పనికి తగిన గుర్తింపు, వేతనం లేదనిపించినప్పుడు ఉద్యోగం మారే ప్రయత్నం చేయాలి. ఊరు మారాలి. అవసరమైతే దేశమే మారిపోవాలి. మీ ప్రతిభకు తగిన వేతనం ఎక్కడ దొరుకుతుందో అక్కడ వాలిపోవాలి. అంతేకానీ, ఎప్పటికైనా పెంచుతారులే అని దశాబ్దాల తరబడి ఒకే సంస్థకు అంకితమైతే.. చివరికి అనుభవం తప్ప ఏదీ మిగలదు.
వ్యాపారాన్ని ఉద్యోగంగా చేయడం పెద్ద విద్యేం కాదు. ఉద్యోగికి కనీస భరోసా వేతనం. ఆ భరోసా కుటుంబానికి కల్పించాల్సిన బాధ్యత వ్యాపారి ప్రథమ కర్తవ్యంగా భావించాలి. మీ కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఇతర బాధ్యతలు వీటన్నిటినీ బేరీజు వేసుకొని.. మీ లాభాల్లోంచి కొంత మొత్తం జీతంగా ప్రతినెలా తీసుకుంటూ ఉండాలి. వచ్చిన లాభాన్ని మళ్లీ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ వస్తుందని కొందరి భావన. కానీ, ఈసారి లాభం తెచ్చిపెట్టిందే ఎప్పుడైనా అనుకోని నష్టాన్ని కలిగిస్తే.. రోజు గడవడం ఎలా? అని ప్రశ్నించుకోవాలి. అందుకే, వ్యాపారంలో భారీగా ఇన్వెస్ట్ చేసినా.. లాభాల్లో మీ వేతనం పక్కగా తీసుకోవాలి. దాన్ని మీ మేధస్సు ఖర్చు చేసినందుకు గానూ.. మీకు మీరు ఇచ్చుకునే జీతంగా భావించాలి. వ్యాపారంలో ఒడుదొడుకులు వచ్చినా మీ కుటుంబం, మీరు హైరానా పడాల్సిన అవసరం ఉండదు.