మొదట్లో మాకు ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగానే తెలుసు. అన్ని సబ్జెక్టుల్లానే.. దాన్నీ చూసేవాళ్లం, చదివేవాళ్లం! రానురానూ అది రాజులకే రాజు అని తెలియవచ్చింది. ఏడో తరగతికి వచ్చేసరికి కొందరు పిల్లలు ఇంగ్లిష్‌లో ఫెయిల్ అయ్యేవారు. క్లాసులో సార్ మార్కుల లిస్టు చదువుతూ.. ఒక్కొక్కళ్ల పేపరులోని జవాబులను పైకి చదివేవారు.
అందులోని హైలైట్స్‌ను పెద్దగా స్టీరియో ఫోనిక్ సౌండ్‌తో చెప్పేవారు. దాంతో ఆ పిల్లల్లో కొందరు తలలు నేలకేసి పిచ్చి చూపులు చూసేవారు. మరికొందరు చేసేదేమీ లేక.. మిగతా వారితోబాటు కలిసి నవ్వేవారు. ఇంగ్లిష్ పాఠాలు అంటేనే.. నాకు బాగా గుర్తొచ్చే విషయాలివి. ఇక ఇంగ్లిష్‌లో అందరికన్నా ఎక్కువ మార్కులొచ్చిన వాళ్లను దేవతల్లా చూడటం కూడా నాకు అనుభవమే. చాలాసార్లు ఆ సూపర్‌స్టార్ ఇమేజ్ నేను కూడా పొందాను లెండి!
‘ఓర్నీ! ఇంగ్లిష్‌కు గింత ఖదర్ ఉండుడు ఏంది?!’ అనిపించేది. అంతకన్నా ఎక్కువ లెక్కలకు, ఆ వరుసలోనే సైన్సుకు కూడా విలువ ఉన్నా.. ఇంగ్లిష్ సంగతే వేరు. రాత్రిపూట తొమ్మిది గంటలకు రేడియోలో ఇంగ్లిష్ వార్తలొచ్చేవి. అందులో ‘దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో. ద న్యూస్ రీడ్బై లతికా రత్నం’ అని మొదలవగానే.. చెప్పరాని ఆనందం కలిగేది. ‘అరే.. ఎప్పటికైనా గీమె తీరుగ ఇంగ్లిష్ మాట్లాడాలె!’ అనుకొని ఆ మాటలకు అర్థం తెలియకున్నా.. అచ్చం అలాగే అనుకరించేదాన్ని. ఆ మాటలను మళ్లీ మా క్లాసులో లీజర్ పీరియడ్‌లో నోటికి చదువుతుండేదాన్ని. మా దోస్తులందరకూ పరమానందపడి.. “అబ్బ! రమకు ఎంత ఇంగ్లిషొచ్చో! ఏం చదువుతున్నది పో!” అనేవారు. అప్పుడు సంబరంగానే ఉండేది గానీ.. ఆ తరువాతే నా రోగం కుదిరింది. మా క్లాస్మేట్స్ ఇంగ్లిష్‌లో ఏ డౌట్ వచ్చినా నన్నే అడిగేవారు. “పీయూటీ.. పుట్ అయితే, సీయూటీ.. కట్ ఎట్ల అయితదబ్బా?!”అనీ, “సీ అక్షరాన్ని ఒకసారి ‘స’ పలుకుతరు, ఒకసారి ‘క’ పలుకుతరు. ఎందుకబ్బా?!” అని ప్రశ్నలతో నన్ను చుట్టుముట్టేవారు. ఆ ఇంగ్లిష్ రూల్స్ నేనే కనిపెట్టినట్టు అడుగుతుంటే.. ఏం చేయాలో తోచక.. “ఎమ్మోనోయ్! నాక్కూడ తెల్వదు. కనుక్కోని చెప్త!” అని సాయంత్రం అమ్మను అడిగేదాన్ని. అమ్మ నవ్వి.. “నాకు ఇంగ్లిష్ ఎక్వ తెల్వదు బిడ్డా! ఏదో చిన్న చిన్నవి చెప్త!” అనగానే.. ‘మా అమ్మకు కూడా తెలియని విషయం ఉంటుందా!?’ అని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేదాన్ని. చాలారోజుల వరకు ఆ ప్రశ్నలకు సమాధానాలను నాకు ఎవరూ వివరంగా చెప్పలేకపోయేవారు.
నేను తొమ్మిదో తరగతిలో ఉండగా బళ్లో మా ఆడపిల్లల మధ్య ఓ ఒప్పందం జరిగింది. అందుకు మూల కారణం మా కజిన్ వకుళక్క. వాళ్ల మామయ్యల్లో ఒకాయన బ్యాంకు మేనేజర్, ఒకాయన ఇంజినీర్, మరొకాయన డాక్టర్.. ఇలా పెద్ద ఉద్యోగాల్లో ఉండటం వల్ల తను ఎక్కువగా హైదరాబాద్‌కూ, ఇతర నగరాలకూ వెళ్తుండేది. అలా వెళ్లి వచ్చినప్పుడల్లా ఓ కొత్త విషయం పట్టుకొచ్చేది. ఈసారి రాగానే.. “ఏయ్.. మన గర్ల్స్ అందరం ఇంగ్లిష్‌లోనే మాట్లాడుకుందాం. అట్లయితె మనకు మస్తు ఇంగ్లిష్ ఒస్తది!” అన్నది. “మనకు అస్సలుకే ఇంగ్లిష్రాదు గదబ్బా! ఏమి రాంది ఎట్ల మాట్లాడుత?! ఇన్నోల్లు అందరు నవ్వుతరు” అన్నది.. మా ఫ్రెండ్స్‌లో ఓ అపశకున పక్షి. “ఎహె! ఏం కాదు తియ్యి. నవ్వేటోండ్లేమన్న పండితులా?!” అన్నది మా కజిన్. ఆ క్షణం నుంచీ మేం ఏం మాట్లాడినా.. వచ్చీ రాని ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలని శిఖరాగ్ర సమావేశంలో నిర్ణయించారు. ఇక చూస్కోండి.. ఒక్కొక్కళ్ల ప్రతాపం ఒక్కో మాదిరిగా చూపించడం మొదలుపెట్టారు. “నువ్వు ఒస్తున్నవా?!” అనేదానికి.. “యూ కమింగ్?” అనీ, “నేను నీళ్లు తాగుతున్నా” అనేందుకు.. “అయామ్ వాటర్ డ్రింకింగ్” అనీ.. ఇలా ఇంగ్లిష్‌కి వేరే డిక్షనరీనే మొదలు పెట్టారు. ఓసారి ఇలాగే మాటల మధ్యలో కంకులను ఇంగ్లిష్‌లో ఏమంటారో నాకు అస్సలు గుర్తు రాలేదు. కంకులంటే మాకు మక్కజొన్న కంకులే! వెంటనే అక్కను అడిగాను. తను తడుముకోకుండా చెప్పింది. “అయ్యో! గదిగూడ తెల్వదా?! కంక్స్ అంటరు” అన్నది. ఆ తరువాత ‘మెయిజ్’ అన్నమాట గుర్తొచ్చి ఇద్దరం పడీపడీ నవ్వుకున్నాం. మాకు నైంత్లో వాసుదేవ రావు సర్, టెంత్‌లో ఎమాన్యూల్ సర్ ఇంగ్లిష్ ఎంత బాగా చెప్పేవారంటే.. నాకు నేనే ఇంగ్లిష్ పాఠం కింది ప్రశ్నలకు జవాబులు రాసుకొచ్చేదాన్ని. అది చూసి ఒకట్రెండు కరెక్షన్స్ చెప్పి.. మొత్తం క్లాసుకంతా అవే జవాబులు రాయించేవారు.
అమ్మాయిల బ్యాచ్ ఇంకొక సిస్టం ప్రవేశపెట్టింది. ప్రతివాళ్లకూ ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండాలనీ, వాళ్లని ‘డూ’ అనాలని ఆ తీర్మానం ఉద్దేశం. ‘ఒకళ్లకు ఒక్కరే దగ్గరి ఫ్రెండు ఎట్ల ఉంటరు?! కనీసం ఇద్దరు ముగ్గురు ఉండాలె గానీ!’ అనేది నా అభిప్రాయం. ఎవరి క్లోజ్ ఫ్రెండైనా ఓరోజు స్కూలుకి రాలేదంటే ఆమె ఫ్రెండును.. “ఏందోయ్.. మీ డూ ఏది?!” అనడిగేవారు. ఆ మధ్య ప్రభాస్ ఏదో సినిమాలో ఫ్రెండ్స్‌ని సంబోధిస్తూ.. “డ్యూడ్’ అంటుంటాడు. అది చూశాక మేము స్కూలు రోజుల్లో ‘డూ’ అని పిలుచుకున్నది గుర్తొచ్చి.. ‘అరె.. మేం అప్పుడే గింత దూరం ఆలోచించినమా?!’ అనిపించింది. నేను హైదరాబాద్ రెడ్డి కాలేజీలో ఇంటర్ చదివేటప్పుడు మొదటిసారి ఇంగ్లిష్ మీడియంలో చదివిన వాళ్లను చూశాను. వాళ్లు చూడ్డానికి మాలాగే మామూలు మనుషుల్లాగే ఉన్నారు గానీ, మహా టెక్కు ఉండేది. తెలుగు మీడియంలో చదివేవాళ్లను పురుగుల్లాగా చూసేవారు. అది చూసి మా క్లాసులో ఉన్న రజనీ పద్మకుమారి అనే అమ్మాయి.. “మనం వీళ్లను దెబ్బ కొట్టాలంటే ఇంగ్లిష్తోబాటు మిగతా సబ్జెక్ట్స్‌లో వాళ్లకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలోయ్! అప్పుడే వాళ్ల పొగరు అణుగుతుంది” అనేది. ఆ పిలుపు మేరకు నిజంగానే క్వార్టర్లీ ఎగ్జామ్స్‌లో నేను, అనిత అనే అమ్మాయి టాపర్స్‌గా వచ్చాం. అప్పట్లో మార్కులెక్కువ వేసేవారు కారు. కానీ, ఇంగ్లిష్‌లో నాకు 92 మార్కులొచ్చాయి. మా ఇంగ్లిష్ లెక్చరర్ రత్నాకరం మేడమ్ చాలాబాగా పాఠాలు చెప్పేవారు. మొత్తానికి ఇంగ్లిష్ మీడియం వాళ్లు కొంచెం తగ్గారు. ఆ తరువాత కొన్నేళ్లకు బ్యాంకులో చేరాకే నేను ఇంగ్లిష్ బాగా నేర్చుకున్నాను. నేర్చుకోవడమే కాదు.. కొత్తవాళ్లకి, జూనియర్స్‌కి ట్రయినింగ్ క్లాసులు కూడా తీసుకోగలిగాను. అందుకు మా బ్యాంకుకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.