నవరసాల్లో హాస్యరసం విశిష్టమైనది. ప్రేక్షకుల్ని ఉల్లాసపరుస్తుంది. ఉత్సాహపరుస్తుంది. నాటకాన్ని కొండకచో నవనవోన్మేషంగా ముందుకు నడిపిస్తుంది. అందుకే ‘హాస్యం పండించడం అంత హాస్యం కాదు’ అని భమిడిపాటి వారు ఏనాడో సెలవిచ్చారు. అంతటి కష్టసాధ్యమైన హాస్యాన్ని పండించే చిరు ప్రయత్నమే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నాటిక. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆధునిక జీవనశైలిని హాస్యభరితంగా చూపించడంలో సఫలమైన ప్రయోగం ఇది!
సుధీర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. లేటుగా మ్యారేజ్ చేసుకున్నాడు. భార్య సౌమ్య ఓ మధ్య తరగతి కుటుంబంలో గారాబంగా పెరిగిన పిల్ల. ఆమెకు వంట చేయడం రాదు. ప్రతి చిన్నదానికీ కంగారుపడుతుంది. భయపడుతుంది. ఒక్కోసారి అలా నటిస్తుంది కూడా. సుధీర్‌కు వంట చేయడం వచ్చు. భార్య అంటే అమితమైన ప్రేమ. భార్య భయాన్ని, కంగారును, అప్పుడప్పుడు వచ్చే ఏడుపును పోగొట్టేందుకు తెగ తంటాలు పడుతుంటాడు. ఆఫీస్ పని (వర్క్ ఫ్రమ్ హోమ్), వంటపనులతో ఇంట్లో సర్కస్ చేస్తుంటాడు.
సౌమ్య ప్రతి చిన్న విషయాన్ని సెల్ఫోన్లో అమ్మకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆమెకు అలా చేయడం ఆనందం. ‘అందము, అమాయకత్వమూ ఉన్న పల్లెటూరి పిల్ల నాకు భార్యగా వస్తుందంటే… ఇక నా పంట పండినట్లే! ఆమె వండిన వంట తింటూ, ఆమె ఒళ్లో తలపెట్టుకుని పడుకుంటే, ఆ థ్రిల్లే వేరనుకున్నా! అలా లైఫ్ అంతా లాగించేయవచ్చు అనుకుంటే? భగవంతుడు ఇలా ట్విస్ట్ ఇస్తాడని అస్సలు ఊహించలేదు’ అని సుధీర్ వాపోతుంటాడు. ‘పెళ్లిచూపుల్లో నాకు పెట్టిన స్వీట్లు, ఫలహారాలు… అన్నీ నువ్వే స్వయంగా చేశావని చెప్పి, కుటుంబం కుటుంబం అంతా కుట్రపన్ని, అబద్ధం చెప్పి నా గొంతు కోశారుగదటే’ అని సుధీర్ గొడవపడితే, ‘వంద అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు కదా పెద్దలు.
మా అమ్మవాళ్లు ఆడిన ఒక్క అబద్ధానికే మీరు ఇలా ఇదైపోతే ఎలా?’ అని సౌమ్య గోముగా గోకుతూ బదులిస్తే.. సుధాకర్ మళ్లీ ఐస్ అయిపోతుంటాడు.
టామ్ అండ్ జెర్రీల్లా సుధీర్, సౌమ్య దాంపత్యం కొనసాగుతూ ఉంటుంది. కానీ, సుధీర్ వండే వంటలు, కాఫీ, టిఫిన్లు ఎప్పటికప్పుడు సెల్ఫోన్లో వీడియోలు చేస్తూ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది సౌమ్య. ఆమెకు ఫేస్బుక్ ఫ్రెండ్స్ పెరుగుతారు. వంటల్లో సందేహాలున్నాయని, నివృత్తి కోసం వాళ్లు సరాసరి ఇంటికే వస్తుంటారు. సుధీర్ వంటలు తినిపించాలని సౌమ్య అక్క, అక్క పిల్లలు, మామగారు ఒక్కొక్కరు వచ్చిపోతుంటారు.
ఆఫీస్ వర్క్‌లో చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడని, ప్రాజెక్టులు ఇన్‌టైమ్‌లో కంప్లీట్ చేయలేకపోతున్నాడని బాస్ దగ్గర్నుంచి సుధీర్‌కి మెమోలు, తిట్లు వస్తుంటాయి. వేగలేక సుధీర్ జాబ్‌కు రిజైన్ చేస్తాడు. చివరకు తన సమస్యను ఫేవర్‌గా మార్చుకుంటాడు. ‘సౌమ్యాలక్ష్మి హోమ్ ఫుడ్స్’ పేరుతో కొత్త వ్యాపారం మొదలుపెడతాడు. ఆన్లైన్ ఆర్డర్స్‌కి డోర్ డెలివరీ ఇవ్వాలని భావిస్తాడు. అందుకు భార్య సౌమ్య కూడా సంతోషిస్తుంది. మధ్యమధ్యలో రకరకాల చిన్న చిన్న ట్విస్టులతో నాటిక నవ్వుల పువ్వులు పూయిస్తుంది.
తెలుగు నాటకానికి కొత్త ప్రేక్షకుల్ని రప్పించాలనే సంకల్పంతో డ్రామా సమూహం చేస్తున్న కృషిలో భాగంగా గచ్చిబౌలి రంగభూమిలో జూన్ 21న ఈ నాటిక ప్రదర్శించారు. సాఫ్ట్వేర్ రంగం వారి కోసమనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రదర్శించారు. రూ.200 టికెట్ డ్రామాగా ప్రదర్శించడం గమనార్హం. నవ్వించడం ఓ యోగం. నవ్వడం ఓ భోగం. నవ్వలేకపోవడం ఓ రోగం. జంధ్యాల సూక్తి సదా స్మరణీయమే.
నాటికపేరు: వర్క్ ఫ్రమ్ హోమ్
(హాస్య నాటిక)
మూలకథ: శ్రీమతి కె. కె. భాగ్యశ్రీ
నాటకీకరణ: అద్దేపల్లి భరత్‌కుమార్
దర్శకత్వం: డి.మహేంద్ర
ప్రదర్శన: సహృదయం
నటీనటులు: లహరి, మహేంద్ర, శివరాం, హరిబాబు, షఫీ, నాగేశ్వరరావు
-కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు