‘డీసీపీ గారు ఉన్నారా?’ ఓ కేసు విషయమై కానిస్టేబుల్‌ను అడిగాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ‘లేరు సార్. డీసీపీ గారి తమ్ముడికి, ఆయన భార్యకు ఏదో ప్రమాదం జరిగిందట. సార్ ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు’ చెప్పాడు కానిస్టేబుల్. వెంటనే హాస్పిటల్‌కు బయల్దేరాడు రుద్ర. ఐసీయూ ముందు కంగారుగా ఉన్న డీసీపీ సత్యనారాయణను కలిసిన రుద్ర.. ఏమైందంటూ ఆరా తీశాడు.
‘ఏం చెప్పమంటావ్ రుద్ర? మతిస్థిమితం కోల్పోయిన నా తమ్ముడు, వాడి భార్య సూసైడ్ చేసుకోబోయారు. కీర్తన్ ఫోన్ చేయడంతో వెంటనే హాస్పిటల్లో చేర్చాం. బాల్కనీ మీద నుంచి దూకేయడంతో ఇద్దరి తలలకూ బలమైన గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ జరుగుతున్నది. ఏమవుతుందో ఏమో??’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు సత్యనారాయణ. ఇంతలో అక్కడికి వచ్చిన కీర్తన్.. ‘పెదనాన్న. మీరే అలా అయిపోతే, చిన్నవాడిని నా పరిస్థితేంటి?’ బాధగా అన్నాడు.
డీసీపీ సత్యనారాయణ తమ్ముడు రాఘవేంద్ర. పై చదువులకు అమెరికా వెళ్లి 20 ఏండ్లపాటు అక్కడే ఉండి బాగా సంపాదించాడు. అయితే, కుటుంబసభ్యులతో ఉండాలన్న ఉద్దేశంతో భార్య రాగిణి, అప్పటికి ఎనిమిదేండ్లు నిండిన కొడుకు కీర్తన్తో 2015లో ఇండియాకు తిరిగొచ్చాడు. వచ్చిన నెలవ్యవధిలోనే ఓ కారు ప్రమాదంలో తలకు గాయాలై భార్యాభర్తలు ఇద్దరూ మతిస్థిమితం కోల్పోయారు. ముళ్లపొదల్లో పడ్డ కీర్తన్‌కు ముఖమంతా గాయాలై ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సివచ్చింది. అప్పటినుంచి రాఘవేంద్ర, రాగిణి, కీర్తన్ల బాగోగులను డీసీపీ సత్యనారాయణే చూసుకొంటున్నాడు. అయితే, ఇప్పుడు కీర్తన్ ట్యూషన్‌కు వెళ్లిన సమయంలో బాల్కనీ నుంచి దూకి ఇద్దరు దంపతులు ఆత్మహత్యకు యత్నించారు.
రాఘవేంద్ర కుటుంబం గురించి తెలుసుకొన్న రుద్ర ఒకింత ఉద్వేగానికి గురయ్యాడు. కీర్తన్‌కు ధైర్యం చెప్తూ.. ‘కీర్తన్.. నువ్వు ట్యూషన్‌కు వెళ్లినప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు?’ ప్రశ్నించాడు రుద్ర. ‘ఎవరూ లేరు’ అన్నాడు. ‘అదేంట్రా.. పనిమనిషి లక్ష్మి, తోటమాలి రామయ్య ఉండాలిగా’ మధ్యలో అందుకొని ప్రశ్నించాడు సత్యనారాయణ. ‘ఒంట్లో బాగోలేదని లక్ష్మీ ఆంటీ, మనుమడిని బడి నుంచి తీసుకురావాలని రామయ్య తాత వెళ్లిపోయారు. నాకు ట్యూషన్ టైమ్ అవుతుందని డాడీకి చెప్పేసి నేను కూడా వెళ్లిపోయా’ సమాధానమిచ్చాడు కీర్తన్. దీంతో ఈ కేసులో ఏదో చిక్కుముడి ఉందని భావించిన రుద్ర.. కానిస్టేబుల్స్‌ను పురమాయించి పనిమనుషులిద్దరినీ తీసుకురమ్మన్నాడు.
‘కీర్తన్.. నువ్వు డాడీ వాళ్లను ఎప్పుడు చూశావ్?’ ప్రశ్నించాడు రుద్ర. ‘ట్యూషన్ అయ్యాక ఇంట్లోకి వచ్చి చూడగానే హాల్లో తలకు దెబ్బతగిలి మమ్మీ, డాడీ కనిపించారు. బాల్కనీ నుంచి దూకేశారేమో అనుకొన్నా. వెంటనే పెదనాన్నకు ఫోన్ చేశా’ ఏడుస్తూ చెప్పాడు కీర్తన్. ఇంతలో ఐసీయూ నుంచి వచ్చిన డాక్టర్.. ‘సార్.. ఇద్దరి కండిషన్ క్రిటికల్‌గానే ఉంది. చాలా రక్తం పోయింది. మా దగ్గర అందుబాటులో ఉన్న రక్తంతో మేనేజ్ చేస్తున్నాం. అయితే, ఇంకాస్త అవసరపడొచ్చు. ఓ గ్రూప్, ఏ బ్లడ్ గ్రూప్ రక్తం కావాలి. మీలో ఎవరికైనా ఆ బ్లడ్ గ్రూప్ ఉందా?’ అడిగాడు డాక్టర్. లేదన్నట్టు తలూపాడు సత్యనారాయణ. ఇంతలో రుద్ర కలగజేసుకొంటూ.. ‘కీర్తన్ నీది ఏ బ్లడ్ గ్రూప్?’ ప్రశ్నించాడు. ‘బీ’ కీర్తన్ సమాధానం. ‘నేను వేరేవారిని ట్రై చేస్తాను’ అంటూ సత్యనారాయణ చెప్పడంతో డాక్టర్ లోపలికి వెళ్లాడు.
ఇంతలో పనిమనుషులు ఇద్దరూ వచ్చారు. ‘ఏం లక్ష్మీ.. నీ ఒంట్లో బాగోలేనప్పుడు నాకు చెప్పి వెళ్లాలిగానీ, పిల్లాడిని, సార్ వాళ్లను అలా వదిలేసి వెళ్లడమేంటి?’ కాస్త చిరాగ్గా అన్నాడు సత్యనారాయణ. ‘సారూ. మీకు చెప్తానన్నాను. అయితే, కీర్తన్ బాబే ‘నేను చెప్తాలే!’ అంటూ నన్ను వెళ్లమన్నారు’ భయంగా బదులిచ్చింది లక్ష్మి. ‘వాడు పిల్లాడు. ఏదో చెప్తాడు. నీకు బుద్ధి ఉండక్కర్లేదా. రామయ్యా కనీసం నీకైనా ఉండాలిగా’ కోపంగా అన్నాడు సత్యనారాయణ. ‘పెదనాన్నా! ఇప్పుడేం చేయగలం. ఏదేమైనా ఇదంతా నా తప్పే. నేనే డాడీమమ్మీలను విడిచి వెళ్లాల్సిందికాదు’ అంటూ భోరుమన్నాడు కీర్తన్.
ఇంతలో ఐసీయూ నుంచి వచ్చిన డాక్టర్.. ఇద్దరూ కోలుకొంటున్నారని, తలకు దెబ్బతగలడంతో గతం జ్ఞప్తికి వచ్చే అవకాశం కూడా ఉన్నదని చెప్పడంతో అందరి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ ఆనందంలో తన పర్సులోనుంచి 2 వేల నోటును తీసిన కీర్తన్.. ‘డాడీ.. యాక్సిడెంట్ జరగడానికి గంట ముందు నువ్వు ఇచ్చిన ఈ నోటే నన్ను ఇన్నాళ్లూ ధైర్యంగా ఉండేలా చేసింది’ అంటూ తనలో తాను మాట్లాడుకొంటున్నాడు. ఇంతలో ‘ఏంటా నోటు ప్రత్యేకత?’ అంటూ రుద్ర అడిగాడు. సత్యనారాయణ కూడా జాగ్రత్తగా వినసాగాడు. ‘సార్.. యాక్సిడెంట్ జరుగడానికి ముందు ‘నెవర్ గివప్’ అని ఈ నోటుపై రాసి డాడీ నాకు ఇచ్చారు. ఇన్నేండ్లు డాడీ-మమ్మీ నన్ను గుర్తుపట్టకపోయినా.. డాడీ రాసిచ్చిన ఈ నోట్ చూసుకొనే ధైర్యం తెచ్చుకొనేవాడిని’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యాడు.
ఇంతలో.. కీర్తన్‌ను దగ్గరకు తీసుకోవడానికి వెళ్తున్న సత్యనారాయణ చెవిలో రుద్ర ఏదో గుసగుసలాడాడు. సత్యనారాయణ ముఖం మొత్తం మారిపోయింది. వెంటనే కీర్తన్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చి తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో తాను అసలు రాఘవేంద్ర, రాగిణిల కొడుకును కానేకాదని, యాక్సిడెంట్లో ముఖంపై గాయాలపాలైన అసలు కీర్తన్‌ను మార్చేసి.. తాను ఇక్కడికి చేరానని నకిలీ కీర్తన్ అలియాస్ సూరి ఒప్పుకొన్నాడు. 18 ఏండ్లు నిండిన తర్వాత తనకు ఆస్తి దక్కుతుందని, అందుకే ఇన్నాళ్లూ నాటకమాడానని, మొన్న 18 ఏండ్లు నిండటంతో మతిస్థిమితంగా లేని రాఘవేంద్ర-రాగిణిని చంపి ఆస్తిని కాజేయాలనుకొన్నట్టు చెప్పాడు. తన నిజమైన తండ్రి సోమ్రాజ్ డైరెక్షన్లోనే ఇదంతా చేసినట్టు చెప్పాడు. అసలైన కీర్తన్ మూడేండ్లపాటు కోమాలో ఉన్నాడని, అతణ్ని అనాథ శరణాలయంలో చేర్పించినట్టు తెలిపాడు. దీంతో సూరిని, అతని తండ్రి సోమ్రాజ్ను అరెస్ట్ చేసిన రుద్ర టీమ్.. అసలైన కీర్తన్‌ను ఇంటికి చేర్చారు. రుద్ర సాయానికి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతకీ, సూరి నకిలీ కీర్తన్ అని రుద్ర ఎలా కనిపెట్టాడు?
సమాధానం
సూరి చెప్పిన రెండు విషయాల ద్వారా అతని మోసాన్ని రుద్ర కనిపెట్టాడు. ఒకటి.. తన బ్లడ్ గ్రూప్ కాగా, రెండోది 2 వేల నోటు. తల్లిదండ్రుల బ్లడ్ గ్రూప్ ఓ, ఏ ఉన్నప్పుడు.. వారి బిడ్డలకు ఈ రెండిట్లో ఏదో ఒక బ్లడ్ గ్రూప్ వస్తుంది. అయితే, డాక్టర్ అడిగినప్పుడు తన బ్లడ్ గ్రూప్ ‘బీ’ అని సూరి చెప్పాడు. ఇక, యాక్సిడెంట్ 2015లో జరిగింది. ఆ యాక్సిడెంట్ కంటే ముందే తన తండ్రి తనకు 2 వేల నోటు ఇచ్చినట్టు సూరి చెప్పాడు. అసలు 2 వేల నోటు ప్రింట్ అయ్యిందే 2016 తర్వాత. అలా.. సూరి చెప్పిన ఈ రెండు విషయాలు వాస్తవదూరంగా ఉండటంతో అతనిమీద రుద్రకు అనుమానం కలిగింది. కాగా, ఈ కుట్ర చేస్తున్నప్పుడు తాను దొరికిపోయే ప్రతీ సందర్భంలో తనను తాను మోటివేట్ చేసుకోవడానికి తన అసలు తండ్రి రాసిచ్చిన ‘నెవర్ గివప్’ అనే కోట్‌ను చూసుకొని ధైర్యం తెచ్చుకోవడం సూరికి అలవాటు. ఇప్పుడు ఆ అలవాటే పొరపాటై రుద్రకు దొరికిపోయాడు.
-రాజశేఖర్ కడవేర్గు