‘దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను’ అని అందరూ సత్యమే చెబుతారనుకుంటే అంతకంటే వెర్రితనం ఉండదు. కానీ, వెనుకబడిన గ్రామాల్లో ప్రమాణం చేస్తే సత్యమే పలుకుతారన్న నమ్మకం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇందులో ఎలాంటి శాస్త్రీయత ఉండదు. కాబట్టే కొంతమంది పెద్దలు తమ స్వార్థం కోసం ఇప్పటికీ ఆ ప్రజల నమ్మకాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నారు. ‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అన్న ‘శాస్త్రంగా’ పెద్దల దుష్టబుద్ధిని నాటకీయంగా బయట పెట్టింది ఈ ‘అ-సత్యం’ నాటిక.
తెరతీయగానే… ఊళ్లో సత్తెమ్మ తల్లి ఎదుట, ఊరి పెద్దలు, ప్రజల ఎదుట.. ‘బుచ్చమ్మ గారి చిన్నబ్బాయి దగ్గర, తొలకరి జల్లుల్లో లక్ష రూపాయల రొక్కం చేబదులు తీసుకున్న మాట నిజం. తర్వాత రెండు నెలలకే నేను ఆ సొమ్ము చిన్నబ్బాయికి తిరిగి ఇచ్చేసాను. ఇది సత్తెం. ఇది సత్తెం. ఇది సత్తెం’ అని వెంకట్రావు అనే సామాన్య రైతు ప్రమాణం చేసి దీపం ఆర్పుతాడు. వెనువెంటనే పక్షవాతంతో మెలితిరిగిపోతూ కూలబడిపోతాడు. వెంకట్రావు అబద్ధం చెప్పాడు కనుకనే ఇలా అయిపోయాడని ఊరి జనమంతా అనుకుంటారు. కానీ, శివయ్య అనే పెద్ద మనిషికి వెంకట్రావు నిజాయతీ తెలుసు. కాబట్టి చిన్నబ్బాయే మోసం చేసి ఉంటాడని భావించాడు.
చిన్నబ్బాయి అన్న పెద్దబ్బాయి భార్య గర్భవతి అవుతుంది. పెద్దబ్బాయి కాస్త అమాయకుడు. అతని భార్య మూగ. దీన్ని ఆసరాగా చేసుకొని యావదాస్తినీ చిన్నబ్బాయే అనుభవిస్తుంటాడు. ఇప్పుడు అన్నకు కొడుకు పుడితే, తన పెత్తనానికే ఆటంకం ఏర్పడుతుందని, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందన్న బాధ పట్టుకుంటుంది. అమాయకురాలైన వదినపై లేనిపోని అభాండాలు వేస్తాడు చిన్నబ్బాయి. ‘ఇంత పెద్ద వయసులో గర్భం దాల్చడమేంటి?’ అని నానా పుకార్లు పుట్టిస్తాడు. ఈ దుష్ట పన్నాగంలో చిన్నబ్బాయికి ఊరి సర్పంచ్ మొదటి నుంచి సహకరిస్తుంటాడు.
చిన్నబ్బాయి పుకార్లతోనే ఆపకుండా, ఓ అర్ధరాత్రి వేళ… అన్నలేని సమయంలో ముసుగు వేసుకుని వచ్చి వదినపై పెట్రోలు పోసి నిర్దాక్షిణ్యంగా సజీవ దహనం చేస్తాడు. ఆమె హాహాకారాలు చేస్తూ మరణిస్తుంది. ఆ సమయంలో చిన్నబ్బాయి మొలలోని తాళాల గుత్తి అక్కడ పడిపోతుంది. ఆ కంగారులో ఆయన ఈ విషయాన్ని గుర్తించకుండానే పారిపోతాడు. అభాండాలు తట్టుకోలేక వదిన ఆత్మహత్యకు పాల్పడిందని చిన్నబ్బాయి ప్రచారం చేస్తాడు. భార్య మరణాన్ని తట్టుకోలేక ఊరు విడిచిపోవాలని నిర్ణయించుకుంటాడు పెద్దబ్బాయి. ఓ రోజు అర్ధరాత్రి శివయ్య ఇంటికి వచ్చి తన బాధనంతా చెప్పుకొని బావురుమంటాడు.
‘ఆస్తి చాలా పాపిష్టిది మావా! అయిన వాళ్లను కూడా పొట్టన పెట్టుకుంటుంది. ఇవి నా పొలం కాగితాలు. నీ వద్దే ఉంచు. ఇవి మా ఇంటి బోషాణం పెట్టి తాళాలు. తీసుకో, మనం కలుసుకున్నట్టు ఎవరికీ తెలియకూడదు. రహస్యంగానే ఉండాలి. మళ్లీ తిరిగి వచ్చినప్పుడే ఇవి తీసుకుంటాను. అప్పటివరకు నా ఆస్తి నీదే’ అంటూ భార్యను తలుచుకుంటూ ఏడుస్తూ ఎటో వెళ్లిపోతాడు పెద్దబ్బాయి.
శివయ్యకు విషయం అంతా బోధపడింది. ఇక తను కథను నడిపిస్తాడు. పెద్దబ్బాయి పొలం కాగితాలు తన వద్ద తాకట్టుపెట్టి పాతిక లక్షలు అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బు తిరిగి ఇస్తే పొలం కాగితాలు ఇస్తానని చిన్నబ్బాయికి కబురు చేస్తాడు శివయ్య. చిన్నబ్బాయి కాగితాలు చూసి నిర్ఘాంతపోతాడు. తన అన్న అప్పు తీసుకున్నట్టు శివయ్య ఊరి జనం సమక్షంలో సత్తెమ్మ తల్లి వద్ద ప్రమాణం చేయాలని చిన్నబ్బాయి అడుగుతాడు. శివయ్య సరేనంటాడు. అన్నట్టే ప్రమాణం చేసి డబ్బు తీసుకుంటాడు. అప్పుడు తాళాల గుత్తి కూడా చిన్నబ్బాయికి ఇస్తాడు. తన దుర్మార్గ రహస్యం బయటపడటంతో చిన్నబ్బాయికి ఆందోళనతో పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోతుంది. ఆయన ఇచ్చిన పాతిక లక్షల సొమ్మును తను వాడుకోకుండా ఇంటి పక్కనే ఉండే ఓ కూలీకి ఇస్తాడు. ఆ కూలీ పసిబిడ్డ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఉచితంగా ఇస్తాడు. ‘పెద్దబ్బాయి మూగ భార్య కడుపులో కాలిపోయిన పసిగుడ్డు, ఈ పసివాడి నవ్వులో జీవం పోసుకోవాలి’ అంటుండగానే తెరపడుతుంది. ‘సాటి ప్రాణులకు ఏది మంచిదో అదే సత్యం’ అన్న సందేశంతో నాటిక ముగుస్తుంది.
అజో – విభో – కందాళం వారు, జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్తంగా ఇటీవల విజయవాడలో నిర్వహించిన 2025 కథా నాటికల పోటీలో ఈ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. నాటిక ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగడానికి సంగీతం ప్రాణంగా నిలిచింది. ఉత్తమ ప్రదర్శనతోపాటు ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సంగీతం బహుమతులను కూడా ఈ నాటిక గెలుచుకున్నది.
నాటిక పేరు : అ-సత్యం
మూల కథ : సుధ మోదుగు
నాటకీకరణ : పిన్నమనేని మృత్యుంజయరావు
ప్రదర్శన : చైతన్య కళా స్రవంతి, ఉక్కునగరం, విశాఖ
సంగీతం : లీలా మోహన్
దర్శకత్వం : బాలాజీ నాయక్
పాత్రధారులు : బాలాజీ నాయక్, రామారావు, అనిల్ కుమార్, వాసు, థామస్, మాధవి తదితరులు
-కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు