వైద్యశాస్త్రం పురోగమిస్తున్నది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. టీకాలు, యాంటీబయాటిక్స్ ప్రాణాలను కాపాడుతున్నాయి. వీటన్నిటి కారణంగా ఆయుఃప్రమాణంలో అనూహ్యమైన పెరుగుదల వచ్చింది. విజ్ఞానం ఇలాగే వృద్ధి చెందుతూ వెళితే మనకు మరణమే రాదనిపిస్తోంది కదా! అది సాధ్యం కాకపోయినా వృద్ధాప్యాన్ని మాత్రం అడ్డుకోవచ్చనే ఆశ చాలామందికి ఉంది. ‘కానీ ఇది అసాధ్యమని’ అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతి జీవిలోనూ నిర్ణీతమైన వేగంలో వృద్ధాప్యం వచ్చి తీరుతుందని, ఆ వేగాన్ని మార్చడం అసాధ్యమనీ వారు చెబుతున్నారు. మరణాల సంఖ్య తగ్గడం వల్ల, మనుషుల ఆయుష్షు పెరిగినట్టు కనిపిస్తోందే కానీ, ముసలితనంలో మాత్రం మార్పు రాలేదని తేల్చారు. 14 దేశాలలో 30 రకాల జీవులను పరిశీలించాక ఈ విషయంలో స్పష్టత వచ్చింది. వేర్వేరు పరిస్థితుల వల్ల వాటి ఆయువులో మార్పు వచ్చింది కానీ, కణజాలం నశించే వేగం మారనే లేదని గుర్తించారు.