ప్రాణభయంతో పులికి చిక్కకుండా పరుగులు తీసే జింకకే కాదు.. తరిమితరిమి వేటాడే పులికి కూడా బతకాలనే ఆశ ఉంటుంది.
ప్రాణుల సహజ లక్షణమే ఇది. మనిషిలో ఆ ఆకాంక్ష మరింత ఎక్కువ. ఆ కోరిక ఈనాటిదేం కాదు. పురాణ కాలం నుంచీ ఉంది. అమృతాన్ని చిలకాలనే కోరిక తీరకపోయినా, మృత సంజీవినీ విద్యను సొంతం చేసుకోవాలనే ప్రయత్నం వీగిపోయినా.. ఆ వైపుగా అతని అడుగులు మాత్రం ఆగడం లేదు. ఏదో ఓ రూపంలో మరణాన్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ‘బయో హ్యాకర్స్’ అలాంటివే.
జీవిత కాలాన్ని పెంచడం.. సైన్స్ లక్ష్యాల్లో ఒకటి. ఆ ప్రయత్నంలో ఉన్నవారికి టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలను కానుకగా అందిస్తున్నది. బయోహ్యాకర్స్ కూడా ఆ కోవలోకే వస్తాయి. శరీర ధర్మాన్ని గానీ, మానసిక స్థితిని గానీ మార్చే తేలికైన మార్గాలనే ‘బయోహ్యాకర్’ అంటారు. ఒకప్పుడు కడుపులో నొప్పి, గుండెలో దడ, కళ్లు తిరగడం, కాళ్లు గుంజడం తదితర సమస్యలొస్తే.. లోతుగా పరిశీలించి ఒంట్లో ఇబ్బందుల్ని పసిగట్టేవాళ్లు. దానికి తగ్గట్టు ఎక్కువ తినడమో, తిండి తగ్గించడమో చేసేవాళ్లు. గృహవైద్యమో, ప్రకృతి చికిత్సో ఎంచుకునేవాళ్లు. ఇవన్నీ బయోహ్యాకర్లే. బిడ్డకు పట్టే వామునీళ్లు, పరగడుపునే తాగే వేడినీళ్లూ బయోహ్యాకర్స్ కిందికే వస్తాయి. ఈ సంప్రదాయ పద్ధతులకు తోడు సైన్స్ సరికొత్త బయోహ్యాకర్స్ను ఆవిష్కరించింది. కాబట్టే నొప్పి, బాధ కలిగినప్పుడే శరీరంలోని రోగ లక్షణాన్ని గుర్తించే స్థాయి నుంచి రోగం రాకముందే
విపత్తును ఊహించగలిగేంత ప్రగతిని సాధించాం. గ్లూకోజ్ స్థాయి, బీపీ, నాడి, బరువు, ప్రవర్తన.. మొదలైన బయోమార్కర్స్ (శరీర ఆరోగ్య స్థితిని సూచించే ప్రమాణాలు) ఆధారంగా భవిష్యత్తులో ఏ వ్యాధి రాబోతుందన్నది పసిగట్టడం సులభం అవుతున్నది. దీనిద్వారా ప్రాణాంతకమైన రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆహారంలో, అలవాట్లలో మార్పులు చేసుకోవచ్చు. ఇదంతా ఓ పద్ధతి. ఇక, టెక్నాలజీ సాయంతో అడ్డుకట్ట వేయడం రెండో విధానం.
లైఫ్ ైస్టెల్ గురు
డేవ్ ఆస్ప్రే అనే అమెరికన్ బయోహ్యాకర్ బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ, బుల్లెట్‌ప్రూఫ్ డైట్‌ను పరిచయం చేశాడు. ఆహార పద్ధతులకు సంబంధించి అయిదు పుస్తకాలు రాశాడు. ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన కంపెనీలు స్థాపించాడు. ‘మెన్స్ హెల్త్’ పత్రిక డేవ్ ఆస్ప్రేను ‘లైఫ్ ైస్టెల్ గురు’ అని అభివర్ణించింది. డేవ్ తన శరీర జీవక్రియలను సరి చేసుకునేందుకు ఒక్క ఏడాదిలోనే పదిలక్షల అమెరికన్ డాలర్లు ఖర్చుచేశాడు! శరీరంలోకి స్టెమ్ సెల్స్‌ను ఇంజెక్ట్ చేయించుకునేవాడు. విటమిన్లు, ఖనిజ లవణాల కోసం రోజుకు 100 సప్లిమెంట్లు తీసుకునేవాడు. కచ్చితమైన ఆహార నియమాలు పాటించేవాడు. ఇన్ఫ్రారెడ్ కిరణాల వెలుగుతో స్నానం చేసేవాడు. హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్లో గాలి పీల్చుకునేవాడు. కంప్యూటర్, ఫోన్, టీవీ.. ఏ స్క్రీన్ చూడాలన్నా ప్రత్యేకమైన కళ్లజోడు ఉపయోగించేవాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కాబట్టే, వయసును జయించాడు. జీవన సామర్థ్యాన్ని సాధించాడు. తెలుగు నేల మీద కూడా.. తమ మీద తాము ప్రయోగాలు చేసుకుని అందరి దృష్టినీ ఆకర్షించిన మంతెనలు, కీటో బాబాలు చాలామందే ఉన్నారు. ఇదోరకమైన తాత్కాలిక అమరత్వం. ‘బౌద్ధుల ధ్యాన పద్ధతులు కూడా బయోహ్యాకర్సే’ అంటున్నారు ట్విట్టర్ ఫౌండర్ జాక్ డార్సే. ఒత్తిడి నుంచి జీవితాన్ని కాపాడుకునేందుకు ఆయన విపశ్యన ధ్యాన విధానాన్ని ఆచరిస్తాడు. ఆ సమయంలో ఫోన్, టీవీ, పత్రికలు, పుస్తకాలు ముట్టుకోడు. రోజూ ఒక్కపూట మాత్రమే భోంచేస్తాడు. ఇలా సంప్రదాయ పద్ధతులతో ఆయువును పెంచుకోవడం సరికొత్త పాత పద్ధ్దతి.
పెద్దల మాట..
శారీరక ఆరోగ్యం బాగుంటేనే, మనసు సంతోషంగా ఉంటుందని ఆధునిక వైద్యులు నొక్కి చెబుతున్నారు. ఈ విషయాన్ని భారతీయత ఎప్పుడో గుర్తించింది. అందుకే ‘దేహమే ఆలోచనలకు కార్యక్షేత్రం’ అంటాయి ఉపనిషత్తులు. ‘కడుపు నొచ్చినోడే ఓము బుక్కుతడు’ అని తెలంగాణలో నానుడి. సమస్య ఎక్కడుంటే అక్కడే పరిష్కారం వెతుక్కోవాలని దీని పరమార్థం. కాలం మారింది. సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. నిన్నటి దాకా సైన్స్ సమస్యలకు పరిష్కారాలు చూపింది. ఇప్పుడు సమస్య వచ్చేదాకా ఎందుకు? రోగం రాకముందే.. రుగ్మతకు అడ్డకట్ట వేస్తూ కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తున్నది. సైన్స్ ఆధారంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ‘బయో హ్యాకింగ్’కు డిమాండ్ పెరుగుతున్నది. సోషల్ మీడియా వల్ల భారత్‌లో బయో హ్యాకింగ్‌కు ప్రాచుర్యం లభిస్తున్నది. నియమిత వేళల్లో భోంచేయడం, సేంద్రియ ఉత్పత్తులు వాడటం, జంక్‌ఫుడ్ జోలికి వెళ్లకపోవడం, తృణధాన్యాలను తినడం.. ఆయువును పెంచుకునే మార్గాలలో కొన్ని అని చెబుతున్నారు.
ఆక్సిజన్ చాంబర్లు
బయటి వాతావరణంతో పోలిస్తే.. ఆక్సిజన్ చాంబర్లో ఊపిరితిత్తులు రెట్టింపు ప్రాణవాయువును గ్రహిస్తాయి. ఆ ఆక్సిజన్ రక్తం ద్వారా శరీరంలోని కణాలన్నిటికీ సరఫరా అవుతుంది. హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్లో ఉన్నప్పుడయితే.. అవయవాలలో చిట్టచివరి కణానికి కూడా సరిపడినంతా అందుతుంది. దీనివల్ల జీవక్రియలు పుంజుకుని అవయవాల పనితీరు మెరుగవుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగినప్పుడు కణ జాలంలో ఆక్సిజన్ స్థాయి వృద్ధిచెందుతుంది. ఆ పెరుగుదల వల్ల కణజాలాల్లో సమస్యలు తొలగిపోతాయి. అందుకనే వివిధ రోగాలను తరిమికొట్టడానికి హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ చేయించుకోవాలని చెబుతారు పాశ్చాత్య వైద్యులు. మెదడులో కణుతులు, ఒంటిమీద కాలిన గాయాలు, రక్తహీనత, రేడియేషన్ ప్రభావం తదితర సమస్యలు ఉన్నవారికి కూడా ఆక్సిజన్ థెరపీని సిఫారసు చేస్తున్నారు. ఈ యంత్రాలేవీ లేని రోజుల్లోనే మన పెద్దలు ప్రాణవాయువు విలువను గుర్తించారు. శ్వాసపట్ల ఎరుకతో అద్భుతాలు సాధించవచ్చని తేల్చి చెప్పారు. ‘ప్రాణాయామం’ ప్రపంచానికి మనం అందించిన గొప్ప బయోహ్యాకర్.
మళ్లీ యవ్వనంలోకి
ప్లాస్మా థెరపీ కూడా బయోహ్యాకర్ లాంటిదే. ప్రతి కణంలో ఒక కేంద్రకం ఉంటుంది. అందులో నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ (NAD+) ఎంజైమ్ ఉంటుంది. ఇది కేంద్రక చర్యల (కణంలోని కేంద్రకంలో జరిగే జీవ రసాయన చర్యల)ను ప్రేరేపించే సహ ఎంజైమ్‌గా పనిచేస్తుంది. ఈ ఎంజైమ్ కణాలలో కొన్ని ఆవశ్యక మూలకాలను బంధించి ఉంచుతుంది. అందువల్ల ఈ ఎంజైమ్‌ను మత్తు పదార్థాలను మాన్పించే చికిత్సలో వాడతారు. వయోధికుల జీవకణాల్లో జీవరసాయన చర్యలు మరింత చురుకుగా జరిగేందుకు కూడా NAD+ను వినియోగించవచ్చని అధ్యయనాల్లో గుర్తించారు. యువకుల రక్తం నుంచి వేరుచేసిన ప్లాస్మాను వృద్ధుల రక్తనాళాల్లోకి ప్రవేశ పెట్టడం ద్వారా వారిలో వయసు పెరుగుదల వేగాన్ని తగ్గించేందుకు చికిత్స చేస్తున్నారు. ఈ NAD iv చికిత్స ద్వారా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను అడ్డుకోవడమే కాకుండా జీవితకాలాన్నీ పెంచుకోవచ్చని చెబుతున్నారు.
జెనెటిక్ కౌన్సెలింగ్
కొందరికి కొన్ని ఆహారాలు అమృతంలా పనిచేస్తాయి. మరికొందరికి విషంలా దుష్ప్రభావం చూపుతాయి. కొందరికి కొన్ని ఔషధాలు పడతాయి, కొన్ని బెడిసికొడతాయి. ‘వ్యూరూట్స్’ అనే జన్యుసేవల కంపెనీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ ఆహారం తీసుకోవాలన్నది సూచిస్తుంది. పరిసరాలే కాదు, జన్యువుల ప్రభావమూ మనిషి మనస్తత్వానికి ఓ ప్రధాన కారణం. ఈ రెండిటి కారణంగా ఏవైనా సమస్యలు వస్తే.. వాటిని ఎపిజెనెటిక్స్ ద్వారా రూపుమాపేందుకు వ్యూరూట్స్ సాయపడుతుంది. ఎవరికి ఏ ఆహార పదార్థాలు పడవు, ఎవరు ఎలాంటి మందులు తీసుకోవాలి.. అనే విషయాన్ని తూకం వేసినట్టు చెబుతుంది. ఎలాంటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరాన్ని దృఢంగా మార్చుకోవచ్చో సూచిస్తుంది. వచ్చే ఏడాదినాటికి ఢిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల్లో బయోహ్యాకింగ్ సెంటర్లను ప్రారంభిస్తామని బయోహ్యాకింగ్ నిపుణుడు సంజీవ్ నాయర్ చెబుతున్నారు.
న్యూరోహ్యాకింగ్
టింకూకు స్వీట్స్ చాలా ఇష్టం. మిఠాయిలు కనిపిస్తే చాలు నోరూరిపోతుంది. అయితే, తీపి పదార్థాలతో ఊబకాయం పొంచి ఉంటుంది. ఈ సమస్య రాకూడదంటే టింకూతో స్వీట్లు మాన్పించాలి. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా మానట్లేదు. ఏం చేయాలి? ఇలాంటివాళ్ల కోసమూ బయోహ్యాకర్స్ ఉన్నాయి. న్యూరోహ్యాకింగ్ ద్వారా జిహ్వచాపల్యాన్ని అధిగమించవచ్చు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి మెదడు తరంగాల ద్వారా అతని మనస్తత్వాన్ని అంచనా వేయడం సులభమే. ఈ పద్ధతిలో తలకు అమర్చిన సెన్సర్ల (చిప్స్) ద్వారా ఒక వ్యక్తి బ్రెయిన్ మ్యాప్‌ను ఆవిష్కరించి.. అతని అభిరుచులను తెలుసుకోవచ్చు. న్యూరోహ్యాకింగ్లో ఒకరికి ఇష్టమైన పదార్థాన్ని తీసుకువస్తారు. ఇష్టంలేని ఆహారమూ తెస్తారు. అప్పుడు ఆ వ్యక్తి మెదడులో న్యూరాన్ల స్పందన ఎలా ఉంటుందన్నది బ్రెయిన్ వేవ్స్ ద్వారా గుర్తిస్తారు. అంతేకాదు, బ్రెయిన్ మ్యాప్ ఆధారంగా ఒక వ్యక్తి అభిరుచులను విశ్లేషించవచ్చు. మెదడును అర్థం చేసుకోవడంతోపాటు ఓ మనిషి పాత అభిరుచుల్లో మార్పు తీసుకురావడమూ సాధ్యమేనంటారు నిపుణులు. ఈ పద్ధతిలో ఆరోగ్యానికి హానిచేసే ఆహారపు అలవాట్ల పట్ల వ్యతిరేకతనూ పెంచవచ్చు.
అందమైన పిల్లల కోసం
రూపురేఖల్లో పిల్లలు తల్లిదండ్రులను పోలి ఉండటం సహజమే. తెలివితేటలు, ప్రవర్తన, రోగాలు కూడా జన్యువుతో ముడిపడి ఉంటాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. మనిషి జన్యువుల్లో మార్పులు చేసి.. చెడు ప్రభావాలను అధిగమించవచ్చనీ, పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా తయారు చేయవచ్చనీ శాస్త్రవేత్తలు అంటున్నారు. కొన్ని జన్యువుల కారణంగా కొందరికి కొన్నికొన్ని వ్యాధులు సంక్రమించే ఆస్కారం ఎక్కువ. జన్యు విశ్లేషణ ద్వారా రాబోయే రోగాలను గుర్తించి.. బయోహ్యాకర్స్ సాయంతో ప్రాణాలను కాపాడవచ్చు. జన్యు సంబంధ వ్యాధులతో బాధపడే తల్లిదండ్రులు తమకు పుట్టబోయే పిల్లలు ఆ వ్యాధుల బారినపడకుండా జీన్ ఎడిటింగ్ సాయం కోరుతున్నారు. వీర్యకణాలు, అండకణంలోని జన్యువుల్లో డీఎన్ఏ అమరికలో మార్పులు చేస్తున్నారు. ఈ జీన్ ఎడిటింగ్‌తో ఆరోగ్యవంతమైన పిల్లల్ని ఆశించేవారు కొందరైతే, అందమైన పిల్లలు పుట్టాలని కోరుకునేవారు మరికొందరు! టెక్నాలజీ ఆధారిత బయోహ్యాకర్స్తో అమెరికా, ఐరోపా దేశాల్లో మార్కెట్ పెంచుకున్న వెల్నెస్ కంపెనీలు ఇప్పుడు భారత్‌పైనా కన్నేశాయి. భారతీయ స్టార్టప్‌లు కూడా కొత్త డివైస్‌లను, యాప్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. మొత్తానికి ఇదంతా ఆరంభమే. ఆయుర్వేదం నుంచి జెనెటిక్స్ వరకూ సకల శాస్ర్తాలూ ఏకమై.. మనిషికి పరిపూర్ణమైన ఆయువును, ఆయుర్దాయాన్నీ అందించే ప్రయత్నం చేస్తున్నాయి. బయోహ్యాకర్స్ సాయంతో అభయాన్ని ఇస్తున్నాయి.
ఇప్పటివరకూ పాత యంత్రాల స్థానంలో కొత్త యంత్రాలను, పాత టెక్నాలజీ స్థానంలో కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటున్న మనిషి.. అక్కడితో ఆగిపోవడం లేదు. యంత్రాల మీది నుంచి దృష్టిని తనవైపు మళ్లించుకున్నాడు. తనను తాను మరింత శక్తిమంతుడిగా, మరింత ఆరోగ్యవంతుడిగా, మరింత మేధావిగా తీర్చిదిద్దుకోవాలన్నది అతని తాజా ఆరాటం. అందుకు సాక్ష్యం.. బయోహ్యాకింగ్!
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ
డేవ్ ఆస్ప్రే టిబెట్‌లో పర్యటిస్తున్న సమయంలో.. బర్రెపాలతో చేసిన చిక్కని కాఫీని రుచి చూశాడు. ఆ కాఫీ రుచి అతనికి బాగా నచ్చింది. అమెరికా వెళ్లిన తర్వాత కొన్ని ప్రయోగాలు చేసి, వెన్న లేదా నెయ్యి, కొబ్బరినూనె కలిపిన పాలలో పంచదార వేయకుండా కాఫీ తయారుచేశాడు. అత్యధికంగా కొవ్వు, కొద్దిగా ప్రొటీన్లు, జీరో కార్బొహైడ్రేట్స్ ఉండే ఈ కాఫీకి ‘బుల్లెట్ ప్రూఫ్ కాఫీ’ అని పేరు పెట్టాడు. తన బ్లాగ్‌లో దీని గురించి ప్రచురించి.. ఎక్కువమందికి అలవాటు చేశాడు. దీనిని తాగడం వల్ల తన ఐక్యూ స్కోర్ 20 పాయింట్లు పెరిగిందని ప్రకటించాడు. అంతేకాదు ఈ కాఫీ శరీరంలోని నిల్వ కొవ్వును కరిగించి కీటోన్లుగా బయటికి పంపుతుందని నిర్ధారించాడు. ఆ ప్రచారంతో బుల్లెట్ ప్రూఫ్ కాఫీకి ప్రజాదరణ పెరిగింది. తెలుగు రాష్ర్టాల్లో కీటో డైట్‌ను ప్రమోట్ చేసే వాళ్లకే కాదు.. ప్రపంచంలోని ఎందరికో డేవ్ ఆస్ప్రేనే స్ఫూర్తి.
అద్భుతాల ఉంగరం
జీవక్రియలు ఏ సమయంలో ఏ స్థాయిలో ఉన్నాయో లెక్కిస్తుంది ఈ ఉంగరం. ప్రాణాధారమైన హృదయ స్పందనలు, రక్తపోటును ఎప్పటికప్పుడు లెక్కిస్తూ జీవక్రియలను బేరీజు వేస్తుంది. నిద్ర, ఆకలి, తిండి, శక్తి.. తదితరాలను కూడా లెక్కిస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు, పనిలో ఉన్నపుడు, నిద్రపోతున్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎలా ఉంది? గుండె ఎలా కొట్టుకుంటున్నది?.. అన్నది లెక్కగట్టి చెబుతుంది. అసాధారణమైన తేడా ఉంటే వెంటనే హెచ్చరిస్తుంది. ఏరోజుకారోజు లెక్కలు తీయడమే కాదు.. తరచూ గణాంకాలను విశ్లేషిస్తుంది. గ్రాఫ్స్ రూపంలో కళ్లకు కడుతుంది. టైటానియం, టంగ్స్టన్ కార్బైడ్‌తో ఈ రింగులను తయారుచేశారు. బ్యాటరీ లైఫ్ నాలుగు నుంచి ఆరు రోజులు. వివిధ రంగులలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మెటబాలిక్ స్కోరే మన ఆయువుకు ఆధారం!
ఫిట్నెస్ జర్నీ
గ్లూకోజ్ బయోమార్కర్స్ ఆధారంగా ఆహార నియమాలను, వ్యాయామ పద్ధతులను మెరుగుపరుచుకోవడానికి ‘అల్ట్రా హ్యూమన్ ఎం.1’ అనే బయో మార్కర్‌ను అభివృద్ధి చేశారు. ఇది రూపాయి నాణెం పరిమాణంలో ఉంటుంది. శరీరానికి అతుక్కుని ఉండేలా దీన్ని ఒక గుండ్రని పట్టీకి అమర్చుతారు. ఆ పట్టీ సాయంతో అల్ట్రా హ్యూమన్ ఎం.1 శరీరంలో గ్లూకోజ్ స్థాయిని లెక్కిస్తూ ఉంటుంది. దీనివల్ల శరీరంలో జీవక్రియల గురించి స్పష్టంగా తెలుస్తుంది. తీసుకోవాల్సిన బయోహ్యాకర్స్ గురించి ఓ అవగాహన వస్తుంది. ఇదే కాకుండా మనం వేసే అడుగులను, మన రక్తపోటును ఎప్పటికప్పుడు లెక్కించే డివైస్‌లు, స్మార్ట్ వాచ్‌లు మార్కెట్లో అనేకం అందుబాటులో ఉన్నాయి. కొన్నయితే, ప్రమాద సమయంలో అంబులెన్స్‌కూ సమాచారం అందిస్తాయి.
ద జీన్ బాక్స్
జన్యు పరీక్షల ఆధారంగా మనిషికి రాబోయే వ్యాధులను గుర్తించే కంపెనీ ఇది. లాలాజలం, రక్త నమూనాలు తీసుకుని డీఎన్ఏను విశ్లేషిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా జన్యు లోపాలను గుర్తిస్తారు. ఆ లోపాల వల్ల రాబోయే వ్యాధులేమిటో తెలిసిపోతుంది. వాటిని అడ్డుకునేందుకు ఏం చేయాలన్నది న్యూట్రిషనిస్ట్‌లు, స్పోర్ట్స్ సైంటిస్ట్‌లు సూచిస్తారు. తెలుగు ఆంత్రప్రెన్యూర్ ప్రణవ్ ఆనం ఈ కంపెనీని ప్రారంభించాడు.