e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home బతుకమ్మ కలియుగ ద్రోణుడు

కలియుగ ద్రోణుడు

కలియుగ ద్రోణుడు

కొమ్మల్లో కుకూలు.. కొండల్లో ఎకోలు..కేరళ వయనాడ్‌ పరిసరాల్లో వనదేవత వినిపించే రాగాలు.ఈ రాగాలకు ఆయన వింటినారి వంత పాడుతుంది. విల్లు వీడిన అంబు సంబురంగా కోరస్‌ అందిస్తుంది.ప్రకృతి లయ విన్యాసానికి శ్రుతి కలిసిన జీవితం ఆయనది. అడవినేలిన ఈ ఏకలవ్య గురువు కథ చదవండి.

కనుచూపు మేరలో చిక్కగా పచ్చదనం. పారేటి సెలయేళ్లు, దూకేటి లేళ్లు, మందగమన మత్తేభాలు. ప్రకృతి సౌందర్యానికి ఆలవాలం పడమటి కనుమలు. వనదేవత హరిత కిరీటంలో పొదిగిన మరకత మణిలా మెరిసిపోతూ ఉంటాయి వయనాడు పరిసరాలు. ఆ వనసీమలో మరింత చిక్కగా పరుచుకున్న పచ్చదనంతో మిడిసిపడుతుంటుంది.. అంబలవాయల్‌ ప్రాంతం. అక్కడికి దూరంగా నట్టడవిలో ఉంటాడు గోవిందన్‌. వయసు 71 ఏండ్లు. ఇప్పటికి ధనుస్సు ఎత్తాడంటే పైలాపచ్చీస్‌ వ్యవహారమే! గురి చూశాడంటే ఎంతటి లక్ష్యమైనా ఛేదించాల్సిందే!!

వేటకు స్వస్తి

- Advertisement -

ఆదివాసీ కుటుంబంలో పుట్టాడు గోవిందన్‌. ముత్తాతలు, తాతలు గొప్ప విలుకాండ్రు. అడవిలో జంతువులను వేటాడి పొట్టపోసుకునేవాళ్లు. దాడి చేయడానికి వచ్చిన క్రూరమృగాలను తోకముడుచుకునేలా చేసేవారు. తాతల వారసత్వంగా వచ్చిన చిన్న ఇల్లు, గొప్ప విల్లు.. గోవిందన్‌ జీవితాన్ని బాల్యంలోనే ప్రభావితం చేశాయి. పదేండ్లు కూడా నిండకుండానే తండ్రితో కలిసి కొజి కోడ్‌లో జరిగిన ఓ పోటీల్లో లక్ష్యాన్ని గురి కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పెద్దయ్యే కొద్దీ విలువిద్యలో ఆరితేరాడు గోవిందన్‌. కోదండానికి దండం పెట్టందే గడప దాటేవాడు కాదు. కొంతకాలానికి విల్లంబులు ఆయన భుజకీర్తులుగా మారిపోయాయి. ఎంత అడవితల్లి ఒడిలో ఉంటే మాత్రం కందమూలాలు తిని బతకలేరు కదా! అందుకే వేటకెళ్లేవాడు. కుందేళ్లు, పక్షులు ఇలా వాటిని వేటాడి ఇంటికి తెచ్చేవాడు. ఓ రోజు ‘నేను అడవిలో బతుకుతున్నాను. ఆ జంతువులూ అడవినే నమ్ముకున్నాయి. వాటిని వేటాడటం ఎంత పాపం’ అనుకున్నాడు. మరుక్షణం వేటకు స్వస్తి పలికాడు.

పర్యాటకంతో ప్రాభవం

అనుకున్నంత తేలికగా వేటను వదులుకున్నాడు కానీ, కాలే కడుపును నింపుకోలేకపోయాడు గోవిందన్‌. కుటుంబ పోషణ భారమైంది. పిల్లల పరిస్థితి దారుణమనిపించింది. అయినా మాట తప్పలేదు. తన ఆకలిపై కోపాన్ని ప్రదర్శించేవాడు కానీ, మూగజీవాలపై చాపాన్ని ఎత్తింది లేదు. తన నీడన బతుకుతున్న పశుపక్ష్యాదులకు రక్షగా నిలిచిన గోవిందన్‌ను అడవితల్లి నిండుమనసుతో ఆశీర్వదించింది. పర్యాటకం ఆయన పాలిట వరమైంది. టూరిజం అధికారులు గోవిందన్‌ను ప్రోత్సహించారు. వనవిహారానికి వచ్చే పర్యాటకులకు విలువిద్యా విన్యాసాలు చూపాల్సిందిగా కోరారు. నెల్లరాచల్‌ వ్యూపాయింట్‌కు వచ్చే పర్యాటకులంతా తప్పకుండా అంబలవాయల్‌ సమీపంలోని గోవిందన్‌ ఇంటికి వెళ్తుంటారు. అక్కడ, ఆయన స్వయంగా తయారు చేసిన రకరకాల ధనుర్బాణాలను చూసి ఆశ్చర్యపోతారు. గంటో, అరగంటో ఆయన దగ్గర విలువిద్యలో శిక్షణ తీసుకుంటారు. గురువు పెట్టిన పరీక్షలో సరదాగా పాల్గొంటారు. బాణం లక్ష్యానికి తగిలిందా ఎగిరి గంతేస్తారు. అస్త్రం గురి తప్పిందా ఏడుపు ముఖం పెట్టేస్తారు. గడ్డం సవరించుకుంటూ, వారి విన్యాసాలను చూస్తూ మురిసిపోతుంటాడు గోవిందన్‌. సంతోషంగా వాళ్లిచ్చిన గురుదక్షిణను రొంటికి చెక్కుకొని తృప్తి చెందుతుంటాడు. ఈ కలియుగ ద్రోణుడిని కాపాడుకోవడం మన బాధ్యత.

భావితరాలకు చెబుతూ..

దేశదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు ఈ సవ్యసాచి విన్యాసాలు చూసి ముక్కున వేలేసుకుంటారు. చెట్టు గుబురు కొమ్మల్లో దాగున్న పండును ఠపీమని కొట్టేస్తాడు. కోమలి సుతారంగా కుసుమాన్ని తుంచినట్టు నిటారుగా నిల్చొని చిటారుకొమ్మను చటుక్కున తెగ్గొడతాడు. తరచూ రకరకాల విల్లులు తయారు చేస్తూ ఉంటాడు. ఆయన ఇంటి వాకిట్లో పదేసిరకాల ధనుస్సులు కనిపిస్తాయి. ఈ ప్రయత్నం కేవలం పొట్టపోసుకోవడానికి కాదు, తాతల కాలం నుంచి వస్తున్న విలువిద్య గొప్పదనాన్ని భావితరాలకు తెలియజేయడానికే గూడెంలోని పసిపిల్లలకూ వింటినారిని సంధించడం నేర్పుతున్నాడు. ఈ కలియుగ ద్రోణుడికి జోహార్లు పలకాల్సిందే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కలియుగ ద్రోణుడు
కలియుగ ద్రోణుడు
కలియుగ ద్రోణుడు

ట్రెండింగ్‌

Advertisement