e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home బతుకమ్మ విశ్వ వ్యాప్తంగా పేరుగాంచిన హల్వా

విశ్వ వ్యాప్తంగా పేరుగాంచిన హల్వా

విశ్వ వ్యాప్తంగా పేరుగాంచిన హల్వా


పండుగ, పెండ్లి.. శుభకార్యం ఏదైనా నోటిని తీపి చేసే మిఠాయిలు ఉండాల్సిందే. లడ్డు, జిలేబీ, బాదుషా.. ఎన్ని స్వీట్స్‌ ఉన్నా హల్వా ప్రాధాన్యమే వేరు. నోట్లో వేసుకోగానే కరిగిపోతూ కమ్మదనాన్ని పంచే పసందైన తీపి వంటకమిది. సాటిలేని రుచితోపాటు నిండైన పోషకాలు కలిగిన హల్వా సంగతులేమిటో చూద్దాం..

ఎక్కడి వంటలకైనా స్థానికతను జోడించడం మనకు అలవాటే. హల్వానూ అలానే అక్కున చేర్చుకున్నాం. కాబట్టే ఒక్కో సందర్భంలో, ఒక్కో రుచితో.. ఒక్కో ప్రాంతంలో, ఒక్కో
పేరుతో పలకరిస్తుంది హల్వా. కమ్మటి నేతి వాసనతో, లేత పసుపు రంగులో దర్శనమిచ్చే రవ్వ (సూజి) హల్వా ఉత్తరాదిన కర్తా ప్రసాదంగా, దక్షిణాదిన కేసర్‌ బాత్‌గా పేరు గాంచింది.
రుచి చూడగానే ‘క్యా బాత్‌ హై!’ అనాల్సిందే

- Advertisement -

హల్వా అంటే ఫలానా వాటితోనే చేయాలనే నియమమేం లేదు. ఇంట్లో ఏ పదార్థాలు అందుబాటులో ఉంటే.. వాటికే కాస్త నెయ్యి, చక్కెర లేదా బెల్లం, డ్రైఫ్రూట్స్‌ జత చేసి వండుకోవచ్చు. సందర్భాన్ని, సీజన్‌నుబట్టి గోధుమ, పెసరపప్పు, బేసన్‌, మైదా, సగ్గుబియ్యం, బ్రెడ్‌, జీడిపప్పు, బాదం, అంజీర్‌, కొబ్బరి, ఖర్జూర, గుమ్మడి, క్యారెట్‌, బీట్‌రూట్‌, సొరకాయ, స్వీట్‌ పొటాటో వంటి పదార్థాలు, కూరగాయలతోనే కాకుండా మామిడి, పైనాపిల్‌, యాపిల్‌, పుచ్చకాయ, ఆరెంజ్‌ తదితర పండ్లతోనూ హల్వా చేస్తారు. అంతేకాదు, కొన్ని ముస్లిం కుటుంబాల్లో వండే ‘అండా హల్వా’ కూడా నోరూరిస్తుంది. ఇందులో చాలావరకూ స్థానిక ఆవిష్కరణలే.

విశ్వ వ్యాప్తంగా పేరుగాంచినవి బాంబే కరాచీ హల్వా, ఢిల్లీ సుహాన్‌ హల్వా, కేరళ కోజికోడ్‌ హల్వా, బెంగాల్‌ చోలర్‌దాల్‌ హల్వాలతోపాటు దక్షిణాదిని ప్రత్యేకంగా నిలిపే పెసరపప్పు హల్వాకూడా విశ్వవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నది. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభించే బ్లాక్‌ హల్వా ప్రాచీనకాలపు వంటకంగా ప్రసిద్ధిగాంచింది. దీన్ని నానబెట్టిన బియ్యపు
పిండితో చేస్తారు. నేపాల్‌లో తయారుచేసే క్యారెట్‌, బార్లీ హల్వాలు ఎంతో ప్రత్యేకమైనవి.

పేరును బట్టి హల్వాను అరబ్‌ దేశాలనుంచి దిగుమతైన వంటకమని తేల్చారు పరిశోధకులు. ప్రాచీనకాలంలో అరబ్‌ దేశాల్లో ఖర్జూరాలతో హల్వా చేసేవారు. వేడుకల్లో బంధువుల నోరు తీపి చేసే మిఠాయిగానూ పేరు గడించింది. స్టార్చ్‌, గుడ్లు, నెయ్యి, చక్కెర లేదా బెల్లం, డ్రై ఫ్రూట్స్‌తో చేసే ‘ఓమ్ని హల్వా’ అక్కడి ప్రత్యేకత. కమ్మని హల్వా తయారు కావాలంటే, కనీసం రెండు గంటల సమయం పడుతుంది. ఎటువంటి రిఫ్రిజిరేషన్‌ లేకున్నా నాలుగు నెలలపాటు రుచి మారకుండా నిల్వ ఉంటుంది హల్వా.

హల్వా పోషకాల్లోనూ అమోఘమే. దీని తయారీలో వాడే నెయ్యి, చక్కెర, పాలు, డ్రైఫ్రూట్స్‌.. ఇలా ప్రతి పదార్థం శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి నోళ్లూరించే హల్వా శరీరాన్ని దృఢంగా, ఎముకలను పటిష్టంగా ఉంచే విటమిన్లు, మూలకాల సమాహారం. మరెందుకు ఆలస్యం, మీరూ హల్వా తినేసి వహ్వా అనేయండి.

తమిళులకంటూ ప్రత్యేకమైన ఓ హల్వా ఉంది. ఇటీవలే అక్కడి ‘తిరునెల్వేలి హల్వా’కు భౌగోళిక గుర్తింపు దక్కింది. దాదాపు 200 ఏండ్లుగా రుచికరమైన హల్వాను తయారు చేస్తున్న
‘ఇరుత్తుకుడై’ మిఠాయి దుకాణం మాత్రమే, తిరునెల్వేలి హల్వాను తయారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. స్వచ్ఛమైన గోధుమపిండి ప్రధాన దినుసుగా ఈ హల్వాను వండటానికి మూడు రోజుల సమయం పడుతుంది.

మిరపకాయలతోనూ హల్వా చేస్తారు. హరీ మిర్చి, లాల్‌మిర్చి హల్వాలకు పుణె ప్రసిద్ధి. క్యారెట్‌ (గాజర్‌), సొరకాయ (కద్దూ) హల్వాలకు హైదరాబాద్‌ పెట్టింది పేరు. నవాబుల కాలం నుంచీ హైదరాబాద్‌ గాజర్‌ హల్వాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలంగాణలోని అనేక ఆలయాల్లో రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా భక్తులకు పంచుతారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విశ్వ వ్యాప్తంగా పేరుగాంచిన హల్వా
విశ్వ వ్యాప్తంగా పేరుగాంచిన హల్వా
విశ్వ వ్యాప్తంగా పేరుగాంచిన హల్వా

ట్రెండింగ్‌

Advertisement