e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home బతుకమ్మ వర్ణచిత్రాల్లో మేటి.. చేర్యాల నకాశీ

వర్ణచిత్రాల్లో మేటి.. చేర్యాల నకాశీ

వర్ణచిత్రాల్లో మేటి.. చేర్యాల నకాశీ

ఆ చిత్రం చరితకు చిత్రిక. కుల చరిత్రలకు ప్రతీక. ఓ ఇరవై అడుగుల చిత్రరాజం ‘పటం కథ’ల పేరుతో తెలంగాణలోని పల్లెపల్లెనా పౌరాణిక జ్ఞానాన్ని పంచింది. సామాజిక స్పృహను నేర్పింది. పాలకులు, పాలితుల అభిమానాన్ని చూరగొన్నది. వివిధ కులాల ఆవిర్భావాన్ని, గొప్పదనాన్ని కుల పురాణాల పేరుతో వివరించే ఆశ్రిత కులాల వారికి జీవనోపాధిని చూపింది. అదే చేర్యాల నకాశీ చిత్రం.

చేర్యాల పెయింటింగ్స్‌, చేర్యాల స్క్రోల్‌ పెయింటింగ్స్‌, పట చిత్రాలు.. ఏ పేరుతో పిలిచినా కళ మాత్రం ఒక్కటే. తెలంగాణకే ప్రత్యేకమైంది నకాశీ చిత్రకళ. ఉమ్మడి వరంగల్‌ (ప్రస్తుత సిద్దిపేట) జిల్లాలోని చిన్న పల్లె అయిన చేర్యాలలో పురుడు పోసుకున్న ఈ కళ అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. ఈ పట చిత్రాలకు వందల ఏండ్ల చరిత్ర ఉంది. యాభై అడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పు ఉండే క్యాన్వాస్‌పై ఇంద్రధనుస్సు వాలినట్లుగా రంగురంగుల చిత్రాలు.. ఈ చిత్రాలే నేపథ్యంగా అనేక పౌరాణిక ఘట్టాలు.. అందులో వందల సంఖ్యలో పాత్రలు.. ఇలా ప్రతి విషయాన్నీ కళాత్మకంగా చూపించే చిత్రమాలిక చేర్యాల నకాశీ. ఆరడుగుల నుంచి అరవై అడుగుల పొడవున ఈ కళాత్మక చిత్రాలు అచ్చెరువు కలిగిస్తాయి. ఆ భారీ చిత్రాలను చాపలా చుట్టి భద్రపరుస్తారు. అందుకే, వీటిని ‘స్క్రోల్‌ పెయింటింగ్స్‌’ అనికూడా పిలుస్తారు. ఒకసారి గీసిన బొమ్మలు రెండు, మూడు దశాబ్దాలపాటు చెడిపోకుండా ఉంటాయి.

- Advertisement -

కుల పురాణాలకు ఆయువు
కొన్ని కులాలకు ప్రత్యేకనేపథ్య కథలు ఉంటాయి. వాటిని ‘కుల పురాణాలు’గా వ్యవహరిస్తారు. కులాల ఆవిర్భావం, వారి గొప్పదనాన్ని ‘కుల పురాణాలు’ వివరిస్తాయి. ఆయా కులాలవారికి, తమ కుల కథకులైన ఆశ్రిత కులాలవారు ఈ కథలు చెబుతుండేవారు. ఇందుకోసం నకాశీ కళాకారులు సదరు కుల పురాణాలకు సంబంధించిన ఘట్టాలను పటాలపై చిత్రించేవారు. ఆయా కథల్లోని పాత్రలు, సన్నివేశాలను చిత్రాలుగా వేసేవారు. కథకులు ఓవైపు కథలోని సన్నివేశాలను వివరిస్తుంటే, మరోవైపు నకాశీ కళాకారులు వాటిని చిత్రాల రూపంలోకి తీసుకొచ్చేవారు. ఈ పటాల ఆధారంగానే ఆశ్రిత కులాల కథకులు, గ్రామాల్లో సాయంకాలం కుల పురాణాలు చెప్పేవారు. నకాశీ చిత్రపటాలను చూపిస్తూ, కథకులు సదరు పురాణాన్ని ప్రేక్షకుల కండ్లకు కట్టేవారు. కథకు తగ్గట్లుగా నేపథ్య సంగీతమూ ఉండేది. ఇలా చెప్పే కథలను ‘పటం కథలు’ అని పిలిచేవారు. ఒక్కో చిత్రం వేయడానికి నెలల సమయం పట్టేది.

సహజమైన రంగులు
నకాశీ చిత్రపటాల నాణ్యతకు వాటి తయారీలో ఉపయోగించే సహజసిద్ధమైన రంగులే ఇందుకు కారణం. మొదటగా చిత్రానికి కావాల్సిన కొలతలతో తెల్లటి ఖాదీబట్టను సిద్ధం చేసుకుంటారు. గంజి, సుద్దమట్టి, బంకతో ఒక రకమైన ద్రావణాన్ని తయారు చేస్తారు. దీనిని ఖాదీబట్టపై కోటింగ్‌ వేసి గట్టి పడేలా చేస్తారు. తర్వాత ఆ బట్టపైనే కావాల్సిన బొమ్మను పెన్సిల్‌తో డ్రాయింగ్‌ (రఫ్‌ స్కెచ్‌) వేస్తారు. అనంతరం రంగురాళ్లను నూరుకొని రంగులు తయారుచేస్తారు. తిరుమని చెట్లనుంచి తీసిన బంకను మెత్తగానూరి నీళ్లు కలిపి ద్రావణం చేస్తారు. ఈ రెండిటినీ కొంచెం కొంచెంగా కలుపుతూ కాన్వాస్‌పై రంగులద్దుతారు. దీపానికి పట్టే మసి, శంఖం పొడి, కూరగాయలనుంచి తయారుచేసిన రంగులను కూడా నకాశీ చిత్రాలకోసం వాడుతారు. కుంచెలను కూడా కళాకారులే తయారు చేసుకుంటారు. మేక వెంట్రుకలతో, ఉడుత తోక వెంట్రుకలతో వీటిని రూపొందిస్తారు.

మ్యూజియాల్లోనూ స్థానం
హైదరాబాద్‌ సాలార్‌జంగ్‌ మ్యూజియంలో 17వ శతాబ్దం నాటి పటచిత్రాలున్నాయి. లండన్‌, ప్యారిస్‌ నగరాల్లోని మ్యూజియాల్లోనూ చేర్యాల చిత్రాలు కొలువు దీరాయి. బ్రిటిష్‌ మ్యూజియంలో ఓ పుస్తకం కవర్‌పేజీపైనా నకాశీ చిత్రం హొయలు పోతున్నది. n వరంగల్‌లోని హరిత కాకతీయ హోటల్‌, గోల్కొండ, లేపాక్షి, శిల్పారామం తదితర హస్తకళాకృతుల విక్రయ కేంద్రాలతోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌లోనూ ఈ పెయింటింగ్స్‌ లభ్యమవుతున్నాయి.

పేరులోని.. ప్రత్యేకత
నిజాం ప్రభువుల దగ్గర కొందరు కళాకారులు ఉండేవారు. అలంకరణ వస్తువులను అద్భుతంగా తయారు చేసేవారు. ఆ పనితనాన్ని మెచ్చిన ప్రభువు వారిని ‘నక్షి’ కళాకారులుగా పిలిచేవారు. ‘నక్షి’ అంటే ఉర్దూలో ‘ఫైన్‌ వర్క్‌’ అని అర్థం. అలా వారి పేరు కాలక్రమంలో ‘నకాశీ’గా మారిందనే కథనం ప్రచారంలో ఉంది.

-అరవింద్‌ ఆర్య ,7997 270 270

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వర్ణచిత్రాల్లో మేటి.. చేర్యాల నకాశీ
వర్ణచిత్రాల్లో మేటి.. చేర్యాల నకాశీ
వర్ణచిత్రాల్లో మేటి.. చేర్యాల నకాశీ

ట్రెండింగ్‌

Advertisement