e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home బతుకమ్మ క్యాబ్‌ టు క్యాబిన్‌!

క్యాబ్‌ టు క్యాబిన్‌!

క్యాబ్‌ టు క్యాబిన్‌!

ఇంజినీర్‌ కావాలని కలగన్నాడు ఆశిష్‌. కుటుంబ పరిస్థితేమో బాగాలేదు. ఎన్నో సమస్యలు అడ్డొచ్చాయి. అయినా తొణకలేదు, బెణకలేదు. ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూనే లక్ష్య సాధనలో విజయం సాధించాడు.

‘కలలు కనండి.వాటిని సాకారం చేసుకోండి’ అన్న కలాం మాటలు ఆశిష్‌ రాజ్‌ను ప్రభావితం చేశాయి. పేదరికాన్ని జయించి, గొప్పగా స్థిరపడాలనీ, ఇంజినీర్‌ కావాలని నిర్ణయించుకొన్నాడు. ప్రయత్న లోపం లేకున్నా, పరిస్థితులు చదువులకు ఆటంకం కలిగించాయి. వాటిని ఆశిష్‌ ఏ విధంగా ఎదుర్కొన్నాడు? లక్ష్య సాధనకు ఏం చేశాడు? .. అదో స్ఫూర్తిదాయక పోరాటం.

ఒక సెమిస్టర్‌ మాత్రమే
ఆశిష్‌ రాజ్‌ 24 ఏండ్ల యువకుడు. అతడిది బిహార్‌లోని ముంగేర్‌. ఇంజినీర్‌ కావాలన్నది లక్ష్యం. ఇంటర్‌ తర్వాత ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసేందుకు భోపాల్‌ వెళ్లాడు. ఆశిష్‌ వాళ్ల నాన్న సన్నకారు రైతు. ఏడాదంతా కష్టపడితే తిండికి, బట్టకే సరిపోయేది. దీంతో చదువులకు అవరోధాలు ఏర్పడ్డాయి. కిందామీదా పడి మొదటి సెమిస్టర్‌ వరకు లాక్కొచ్చాడు. ఆ తర్వాత, కనీసం పరీక్ష ఫీజు కట్టే స్థోమత కూడా కన్నవారికి లేదు. ‘నీ ఇష్టం బిడ్డా. మావల్ల అయితే కావడం లేదు. ఒకవేళ నీకు అంతగా చదువుకోవాలని ఉంటే ఏదైనా పనిచేసుకో. ఇంటి ఖర్చులకు ఇవ్వగా మిగిలిన డబ్బుతో చదువుకో. ఇంతకన్నా వేరే ఏమీ చేయలేం’ అని స్పష్టం చేశారు.

కాల్‌ సెంటర్‌ ఉద్యోగం
అడ్డంకులు ఎదురైనా ఆశిష్‌ లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు. తపన, ఉత్సాహం చంపుకోలేదు. ‘పనిచేస్తూ చదువుకో’ అన్నతల్లిదండ్రుల మాటలు గుర్తుకొచ్చి, ఒక కాల్‌సెంటర్‌ ఉద్యోగంలో చేరాడు. కాలేజీ యాజమాన్యానికి తన పరిస్థితి వివరించాడు. ఒప్పించాడు. సాయంత్రం వరకు కాలేజీ, తర్వాత కాల్‌సెంటర్‌లో నైట్‌ డ్యూటీ కొలువు. కనీసం సైకిల్‌ కూడా లేదు. రోజూ పన్నెండు కిలోమీటర్లు నడిచే వెళ్లేవాడు. దీంతో విశ్రాంతి కరువైంది. ఆ అలసట ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది. పైగా ఖర్చులు పెరుగుతున్నాయి. కాల్‌ సెంటర్‌లో జీతమూ అంతంతమాత్రమే. దీంతో, మరోసారి ఆలోచనలో పడ్డాడు ఆశిష్‌.

క్యాబ్‌ టు క్యాబిన్‌!

క్యాబ్‌ డ్రైవర్‌గా..
భోపాల్‌లో ఆశిష్‌తో పాటు వాళ్ల కజిన్‌ ఉండేవాడు. అతను క్యాబ్‌ డ్రైవర్‌. ‘ఆదాయం బాగా ఉంటుంది. రోజూ చేయాల్సిన పన్లేదు. వారాంతాల్లో నడిపినా సరిపోతుంది. క్యాబ్‌ డ్రైవర్‌ పనిచూసుకో’ అని సలహా ఇచ్చాడు. కానీ ఆశిష్‌కు డ్రైవింగ్‌ రాదు. కజిన్‌ సాయంతో చక్రం తిప్పడం నేర్చుకున్నాడు. రేయింబవళ్లు ఉబెర్‌ క్యాబ్‌ నడిపాడు. ఒక్కోసారి నిద్ర ఉండేది కాదు. తినాలంటే తీరిక దొరికేది కాదు. సంపాదించిన ప్రతీ పైసాను పొదుపుగా వాడేవాడు. ఆశిష్‌కు చిన్నప్పటి నుంచీ కంప్యూటర్‌ ఆపరేటింగ్‌లో నైపుణ్యం ఉంది. కోడింగ్‌లో మంచి నైపుణ్యం ఉంది. తన ప్రతిభకు మరింత పదును పెట్టడానికి వాయిదాల్లో ల్యాప్‌టాప్‌ కొనుక్కున్నాడు. ఆ పరికరం తనను లక్ష్యం వైపు తీసుకెళ్లింది. ఇంజినీర్‌ అనిపించుకున్నాడు.

వెబ్‌ ఎంగేజ్డ్‌ ఇంజినీర్‌
చేతిలో కంప్యూటర్‌ ఉంది. శోధించే ఓపిక ఉంది. ఏవైనా ఆన్‌లైన్‌ కోర్సులు ఉన్నాయేమోనని వెతికాడు. యూట్యూబ్‌ ట్యుటోరియల్స్‌ కోసం సెర్చ్‌ చూశాడు. కోడింగ్‌ గురించి సమచారం సేకరించాడు. గూగుల్‌ న్యూస్‌లో ‘మసాయి స్కూల్‌’ గురించి తెలుసుకున్నాడు. మసాయి స్కూల్‌ను 21వ శతాబ్దపు కెరీర్‌ సెంటర్‌గా పేర్కొంటారు నిపుణులు. అదో ఆశాదీపంలా కనిపించింది. పైగా ఎలాంటి రుసుమూ అవసరం లేదు. ఐడియానే పెట్టుబడిగా ఎంతోమంది విద్యార్థులకు జీవితాన్ని ఇస్తున్నది మసాయి. దీంట్లో కోర్స్‌ పూర్తిచేసుకుంటే ఐబీఎం, సామ్‌సంగ్‌, పేటీఎమ్‌, నో బ్రోకర్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్‌ లభిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌ వేదికగానే ప్రముఖ కంపెనీలకు ఆశిష్‌ ఇప్పుడు వెబ్‌ ఎంగేజ్డ్‌ ఇంజినీర్‌. మంచి జీతం. ఆఫీసులో తనకంటూ ఓ క్యాబిన్‌. అయినా, ఇక్కడితో ఆగిపోలేదు. ఓ కంపెనీ స్థాపించాడు. పదిమందికి కొలువులు ఇవ్వ బోతున్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క్యాబ్‌ టు క్యాబిన్‌!

ట్రెండింగ్‌

Advertisement