మా ఊర్లో వంట అయ్యగార్ల ఇళ్లు పెద్దగా లేవు. ఉన్న ఒకటి రెండు ఇళ్లల్లో మగవాళ్లు చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్లు లేదా వైష్ణవ ఆలయాల్లో పూజారులుగా ఉండేవాళ్లు. వాళ్లకు వ్యవసాయ భూములూ, మంచి ఇళ్లూ ఉండడంతో బయటివాళ్ల కోసం వంటలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు.
బమ్మెరలో ఎప్పుడూ వంటకూ, టిఫిన్లు చేయడానికి కూడా అయ్యగార్లు ఉండేవారు. ఆడవాళ్లకు పెద్దగా పని ఉండేది కాదు.నానమ్మ వాళ్ల ఊరు కూనూరులో అయిదారు అయ్యగార్ల ఇళ్లు ఉండేవి. అయ్యగార్లంటే మరెవరో కారు, తమిళనాడులో అయ్యంగార్లనే ఇక్కడలా అంటారని అమ్మ చెప్పింది. రామానుజాచార్య ప్రభావం వల్ల వైష్ణవం వ్యాపించి శ్రీరంగం, తిరుమల, భద్రాచలం, యాదగిరి గుట్ట లాంటి వైష్ణవ క్షేత్రాల్లో రామానుజ సంప్రదాయంలోనే ఆరాధనలు, పర్వదినాలు జరిపేవారు. ఈ అయ్యగార్లలో కొందరు పూజారులుగా, మరి కొంతమంది వంటలవాళ్లుగా ఉండేవారు. వీళ్లలో చాలా మంది కనీసం రోజూ తిండి దొరకడమే కష్టంగా గడిపేవాళ్లు. పేరుకే గొప్ప కులం కానీ .. చాలామందికి లాగానే వాళ్లకు ఎలాంటి ఆదాయమూ లేకపోయేది. గూనపెంకుల పాత ఇళ్లు, ఎవరైనా వడ్లో, బియ్యమో ఇస్తే వాటికి జతగా పెరట్లో కాసిన ఆకుకూరలో, పాదులకు కాసిన కాయగూరలో వండుకుని తినేవారు.
మా నాయనమ్మకు వంట చేయడం అంటే ఇష్టం ఉండేది కాదు. మిగతా పనులు ఎన్నైనా చేసేది గానీ వంటంటే చికాకు. ‘రోజూ ఎవరన్న ఒండితే.. వాండ్ల కాళ్లు కడిగి నెత్తిల చల్లుకుంట’ అనేది. అయితే.. ఆమెకు ఎప్పుడూ వంటకు ఓ అయ్యగారో, అమ్మగారో ఉండేవాళ్లు. ఎప్పుడైనా వాళ్ళల్లో ఎవరు లేకపోయినా ఆమె తెగ చిరాకుపడిపోయేది. అయ్యగార్ల కుటుంబాల్లో అండమ్మ గారు, భట్టర్ లక్ష్మయ్య గార్లది ఒక కుటుంబం. అండమ్మగారు రెండు మూడు రోజులకోసారి పొద్దున్నే ఇంటికి వచ్చి నాయనమ్మ దగ్గర చాయ్ తాగి, ఊరి మీద ముచ్చట్లన్నీ చెప్పేది. చూస్తూ ఉండగానే పదకొండు అయ్యేది. అప్పుడు అండమ్మగారు ‘బియ్యం ఎక్కడున్నయి దొరసానీ! ఎసరు గిన్నె ఎక్కడున్నది?! కూరగాయలు ఎక్కడున్నయి?! ఏం ఒండాలే?!’ అని అడిగేది.
మా నాయనమ్మ లోపల్లోపల ఎగిరి గంతేసినా, ‘ఎహె! ఎందుకు తియ్యమ్మ , నేను ఒండుకుంట’ అనేది. ‘అయ్యో , గదేందమ్మా ! నేను ఉండంగ మీరు ఒండుకునుడు ఏంది?! ఏందో మాట్లాడుకుంటు ఉంటె పదకొండాయె. ఇంత ఒండి మీకింత పెడ్త’ అనేది. మా నాయనమ్మకు కావాల్సింది కూడా అదే! సాయంత్రం దాకా ఉండి అప్పుడు కూడా చాయ్ తాగి ‘గిన్ని పెసళ్లు పెట్టరాదమ్మా … పండినట్టున్నయి గద! గా ఆనిగెపు కాయ ఒకటిస్తె ఒండుకుంటం’ అని ఎన్నో నిత్యావసర వస్తువుల్ని పట్టుకుపోయేది. నాయనమ్మ కూడా ‘పాపం, ఏదో అడుగుతున్నది. ఇస్తె ఏం బాయె’ అంటూ తాతయ్యకు తెలియకుండా ఇంట్లో ఉన్న ధాన్యమో, కూరగాయలో, ఏవైనా వస్తువులో ఇస్తూ ఉండేది. ఆ విధంగా నెలలో సగం రోజులు అండమ్మ గారు రావడం, వంటలు చేయడం జరిగేది.
ఆ తరువాత కొన్నాళ్లకు అండమ్మ గారు, ఆమె భర్త మా ఊరి మీదుగా ఏదో ఊరికి వెళ్తూనో, వస్తూనో మా ఇంటికి వచ్చేవాళ్ళు. అలా వచ్చినవాళ్లు వారం, పది రోజులు ఉండటం ఒక్కోసారి నెలకు పైగా ఉండటం మాకు అలవాటయిపోయింది. ఒక్కోసారి లక్ష్మయ్య గారూ, మరోసారి అండమ్మ గారూ ఒక్కరే వచ్చేవారు. అయితే … ఇద్దరూ వచ్చినప్పుడే ఉండేది అసలు కథ. వాళ్లిద్దరికీ క్షణం పడేది కాదు. ఏదో చిన్న విషయం మీద మొదలై ఒకళ్లనొకళ్లు తిట్టుకునేవాళ్లు.‘మీ ఇంట్లనే గింత, మీ వంశమే గింత! గయ్యాళి కొంపనించి పిల్ల ఒద్దన్నా మా ఓండ్లు ఇనలే!’ అనేవాడాయన. ‘ఆఁ నీకెవ్వడో పిల్లనిచ్చిన్రు! ఏండ్లు ఒచ్చి ముదిరిపోతె మీ నాయనమ్మ మా ఓండ్లను బతిలాడితె ఏదో పోనియ్యని ఇచ్చిన్రు. నాకంటె ఏడేండ్లు పెద్ద, కోతి మూతి మొకపోనికి ఎవరిద్దురు?! నా కుతికె కోసిన్రు!’ అని ఆవిడ మొదలుపెట్టేది. ‘నీ బొంద! మీ నాయినకు ఆడి సంతానం, పెండ్లిండ్లు జెయ్యలేక తిప్పలబడుతుంటె ఏదో మర్యాద, పెద్ద మనిషి, ఇల్లు దోసుకొని ఒచ్చిండని చేసుకున్నం. గింతపాటి ఎత్తు పండ్ల రంభ మాకు దొరుకక పోవునా?!’ అనేవాడు అయ్యగారు ఉక్రోషంగా. దాంతో గొడవ ఇక పరాకాష్ఠకు చేరుకునేది. ఆయన తోడబుట్టిన వాళ్లు, తల్లిదండ్రులు, పూర్వికులు కూడా ఆవిడ తాలూకూ తిట్ల నుండి తప్పించుకోలేక పోయేవారు. ఆయనా అంతే… కాకపోతే ఆమెను మాత్రమే తిట్టేవాడు. ఈ లోగా అమ్మ ఇద్దరికీ రెండోసారి చాయ్ ఇచ్చి ‘ఏమి లొల్లి ?! అందరు ఇంటున్నరు, ఇగ బంజేయండి. అయ్యగారూ! మీరన్న ఊరుకోండి!’ అనగానే గొడవ ఆపేసేవారు.
కాసేపటికి ఆయనే తొందరగా స్నానం చేసి ‘ఇగ ఏం ఒండాల్నో చెప్పండమ్మా!’ అమ్మతో అని, వంట మొదలుపెడుతూ ‘గా కూరగాయలన్న కోసియ్య రాదూ, జిడ్డు తీరుగ కూచోకపోతె! స్థానం (స్నానం) లేదు, ఏమి లేదు, నీకైతె చెడ చాదస్తం (బద్ధకం) అయ్యింది’ అని భార్యను అనేవాడు. ఇక మళ్లీ గొడవ మొదలయ్యేది. ‘ఉడుకుడుకు నీళ్ళన్ని నువ్వే చేస్తివి, నేనెప్పుడు జెయ్యాలె?! అయినా నేను ఒండుత తియ్యి. నువ్వు ఇంతలకు కూరగాయలు గొయ్యి. అయినా, నేను జేసినంత బాగ నువ్వు జేస్తవా ఒంట! గా తోటకూర తెంపు, బొగ్గుల పొయ్యి మీద పప్పేస్త, చామగడ్డ అంటు పులుసు జేసి, దోసకాయ తొక్కు నూరుత. ఎంతల ఐతది?! నేను పోపు పెట్టిన్నంటె ఊరంత గుప్పుమనాలె !’ అనేది అండమ్మగారు.
‘నీ పాడె ఒంట… ఒండినవు తియ్యి’ అంటూ ఆయన విసుక్కుని ఇప్పటి వాళ్లు మాటిమాటికీ’ డియర్, డాళింగ్ అనే పదాలు వాడినట్టుగా ‘నీ బొంద, నీ పాడె’ అంటూ ఆమెను తిట్టేవాడు. అది మరో ఇరాన్, ఇరాక్ యుద్ధంలా అలా సాగుతూనే ఉండేది. వాళ్లిద్దరూ సామరస్యంగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం నేనెప్పుడూ చూడలేదు. వీళ్లు భార్యాభర్తలా, శత్రువులా అనిపించేది. ఏమాటకామాటే చెప్పాలి, ఇద్దరూ బాగా వంట చేసేవాళ్లే!! ఆ రుచి ఇప్పటికీ మర్చిపోలేం!!