e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home బతుకమ్మ రావణాయనం

రావణాయనం

రావణాయనం

మనలోని రావణుడిని ఓడించాలంటే..మనలోని రాముడిని గెలిపించాలి. శత్రువును నిలువరించాలంటే, శత్రువు బలహీనతలను తెలుసుకోవాలి.సైన్స్‌ విద్యార్థి నిలువుకోత పటం ద్వారా నాగుపాము నిజరూపాన్ని తెలుసుకున్నట్టు.. మనం రామాయణం ద్వారా దశకంఠుడి స్వరూప స్వభావాలను గ్రహించాలి. ఆ ప్రయత్నానికి ‘శ్రీరామనవమి’ని మించిన సందర్భం ఏం ఉంటుంది?
ఓ మేధావి దారి తప్పితే వ్యవస్థకు ఎంత ప్రమాదకరమో, ఓ శక్తిమంతుడు తన బలాన్ని దుర్వినియోగం చేసుకుంటే సమాజానికి ఎంత అరిష్టమో రావణాయనం వివరిస్తుంది.
ఆదికావ్యానికి మరోపేరు.. ‘రావణ వధ’!

మహా తేజస్విఅహోదీప్త్తో మహాతేజా రావణో రాక్షసేశ్వరః.. మహాసంగ్రామంలో ఆ నిలువెత్తు మనిషిని చూడగానే రామచంద్రుడే ఆశ్చర్యపోతాడు. ఆ అసుర రాజేంద్రుడు మధ్యందిన భానుడిలా ప్రకాశిస్తున్నాడు. ఆ మేనికాంతి ముందు ముక్కోటి దేవతల తేజస్సు చిన్నబోతున్నది.రాముడిలానే హనుమ సైతం లంకా దహన ఘట్టంలో స్పందించాడు. ‘అహో రూపమహో ధైర్యమహో
సత్త మహో ద్యుతిఃఅహో రాక్షసరాజస్యసర్వలక్షణయుక్తతా’.. అంటూనే, ‘అధర్మవర్తనే లేకుంటే, దేవేంద్రుడికి కూడా ప్రభువు అయ్యేవాడేమో’ అని బాధపడి పోయాడు.లంకేశ్వరుడు నడుస్తుంటే.. కదులుతున్న హోమగుండంలా అనిపించేవాడట! మండుతున్న సూర్యగోళం ముందుకు సాగుతున్న భావన కలిగేదట!

పరమ భక్తుడు
రావణుడి వంశ చరిత్రా ఘనమైందే. సాక్షాత్తు బ్రహ్మదేవుడి ముని మనవడు, ప్రజాపతులలో ఒకడైన పులస్త్యుడి మనవడు. విశ్రవసుడి తనయుడు. వేదవేదాంగాలను అధ్యయనం చేశాడు. సామవేద గానంతో పరమేశ్వరుడి సాక్షాత్కారాన్ని సంపాదించాడు. ఇంద్రియాలను బిగబట్టిన కఠోర సాధకుడు, మహా తపస్వి. ఓసారి కుబేరుడు తన వార్తాహరునిద్వారా రావణుడికి నీతిబోధ చేయించాడు. అంతే, అసురాధిపతికి ఆగ్రహం వచ్చింది. వార్తాహరుడిని హతం చేశాడు. అయినా కోపం చల్లారలేదు. కుబేరుడిమీద దాడికి తెగబడ్డాడు. పుష్పక విమానాన్ని లాక్కుని, ఆ రెక్కల రథం మీదే లంకకు బయల్దేరాడు. కానీ, ఓ చోట వాహనం మొరాయించింది. అది కైలాసమనీ, శివుడి స్థానమనీ అర్థమైంది. అయినా, తనంత వాడి ప్రయాణానికి ఆటంకమేమిటన్న అహంభావం. కండకావరంతో కైలాసాన్నే పైకెత్తాడు. ఆ ప్రకంపనలకు భూతగణం ఉలిక్కిపడింది.

నంది రంకెలేశాడు. పార్వతీదేవి భీతిల్లింది. ముక్కంటి కాలి బొటనవేలితో పర్వతాన్ని అణచివేశాడు. అంతే, ఆ ఒత్తిడికి రావణుడి చేతులు నలిగిపోయాయి. వెయ్యేండ్ల పాటూ బాధతో, ఉక్రోశంతో గర్జించాడు. ఆ తర్వాత, సామవేదంతో శివస్వామిని అర్చించాడు. పేగులే తంత్రులుగా వీణావాదనం చేశాడు. రావణుడిలో ఓ కవీ ఉన్నాడు. రావణాసుర విరచిత శివతాండవస్తోత్రం చదువుతుంటే తనువు పులకరిస్తుంది. ఆ ప్రతిభకు శంకరుడు పొంగిపోయాడు. ఆయువునిచ్చి, ఆయుధాన్నిచ్చి, ‘రావణ’ బిరుదాన్ని ఖరారు చేసి ఘనంగా సాగనంపాడు.

రెండు యుగాలవాడు
రావణుడు రెండు యుగాల పౌరుడు. కృతయుగం నాటికే ఉన్నాడు. వేదవతి వృత్తాంతం కృతయుగం నాటిదే. రామాయణ కథ జరిగింది త్రేతాయుగంలో. కృతయుగ కాలం 17,28,000 ఏండ్లు, త్రేతాయుగ కాలం 12,96,000 ఏండ్లు! దాదాపుగా ఆ కాలమంతా రావణుడు జీవించాడు. ఆ దీర్ఘాయువుకు కారణం..కఠోర తపస్సు, బ్రహ్మాదుల అనుగ్రహం.

శ్రీమంతుడు
లంక రావణుడి రెండో ప్రాణం. లంకానగర వైభోగానికి ఆంజనేయుడే అబ్బురపడ్డాడు. లంక చుట్టూ పద్మాలతో, కలువలతో నిండిన అగడ్త ఉంది. రాక్షస వీరులు అడుగడుగునా పహరా కాస్తున్నారు. అంతెత్తున ఉండటంతో, ఆకాశంలో నిర్మించారా అన్నట్టుగా అనిపించేది. దేవశిల్పి విశ్వకర్మ నిర్మాణ కౌశలమది. కుబేరుడి అలకాపురి, ఇంద్రుడి అమరావతి కూడా చిన్నబోవాల్సిందే. నివాస భవనాలైతే దేనికదే ప్రత్యేకం. ఏ ఇంట చూసినా వేదాధ్యయనాలు, రావణ స్ర్తోత్రాలే. రావణుడి నివాసం కాంతలతో, వజ్రవైఢూర్య కాంతులతో వెలిగిపోయేది.

బహుపరాక్‌!
లంకేశ్వరుడి వర్ణనకోసం బీభత్సభయానకాది రసాలను ఆశ్రయించాడు వాల్మీకి. ధగధగ్గాయమానంగా వెలిగిపోతున్న స్వర్ణ సింహాసనం మీద దర్పంగా ఆసీనుడైన రావణుడు.. సమృద్ధిగా నెయ్యిపోసిన అగ్నిలా.. భగభగ మండుతున్న హోమాగ్నిలా కనిపిస్తున్నాడట! పెద్దదైన ఆ నోరు మృత్యుద్వారంలా ఉందట! అతడి వక్షస్థలం మీద సురాసుర పోరాటం నాటి ఆనవాళ్లు, ఐరావతపు దంతాల ఒరిపిళ్లు, విష్ణుచక్రపు కోతలు. లంకేశుడి శౌర్య పరాక్రమాలు అనితర సాధ్యాలు. మేరుపర్వతంలా అతను సూర్యచంద్రులను అడ్డుకోగలడు. అతడి సమక్షంలో వాయుదేవుడు భయం భయంగా మందగమనం సాగిస్తాడు. అతడు అల్లంత దూరంలో ఉండగానే సముద్రపు అలలు నోటికి తాళం వేసుకుంటాయి. రావణుడు నోరెత్తితే చావు దండయాత్ర మొదలుపెట్టినట్టే. ఆ పలుకులు రణన్నినాదాలు.

పది తలల అహంకారం
ముల్లోకాలతో మూడు చెరువుల నీళ్లు తాగించడానికి ఒక రావణుడు చాలు. పది తలల రావణుడంటే లక్షమంది అసురులకు సరిసాటి. ప్రతి తలలో కోటి చెడు తలపులు. ఏ నిర్ణయమైనా ఏక పక్షమే! మంచిచెడుల మీమాంసకు ఆస్కారమే లేదు. ఘోరతపస్సుతో దివ్యతేజస్సును మూటగట్టుకున్న ప్రతిసారీ.. మహాభక్తితో వరాలను పొందిన వెనువెంటనే.. కండకావరం రంకెలేసేది. ఏదో ఓ పాపకార్యం వెలగబెట్టేవాడు. ఆ వెక్కిరింతలు భరించలేక, ‘నీ చావుకు నాలాంటి ఓ జంతువే కారణం అవుతుంది. వానరం నీ కావరాన్ని అణచివేస్తుంది’ అని శాపం పెట్టాడు నందీశ్వరుడు. ‘ఆడదానితోనే నీకు మూడుతుంది’ అని శపించింది పార్వతీదేవి. వేదవతిని జుట్టుపట్టుకుని లాగి మహాపాపం చేశాడు. ‘నేను అయోనిజనై పుట్టి, నీ గిట్టుకకు కారణం అవుతాను’ అని ప్రతిన పూనిందామె. బాధితుల జాబితాలో ఇక్షాకు వంశీకులూ ఉన్నారు.

రావణాయనం

‘మా వంశజుడి చేతిలోనే నీ చావు రాసిపెట్టి ఉంది’ అంటూ వారూ శాపం పెట్టారు. అలా తప్పుల కుప్ప పేరుకుపోయింది. పాపభారం కొండంత అయ్యింది. చివరికి, తన చెల్లె శూర్పణఖ భర్తనూ చంపేశాడు. ఆ దుఃఖంలో ఉన్న సోదరిని ఓదార్చి దండకారణ్యాన్ని ఏలుకోమని చెప్పాడు. అంతలోనే, అయోధ్యలో రాముడు జన్మించాడు. అవనిజ సీత జనక మహారాజుకు నాగటి చాళ్లలో లభించింది. రాకుమారులు విశ్వామిత్రుడి వద్ద సర్వశాస్ర్తాలూ అభ్యసించారు. యాగ సంరక్షణ ఘట్టంలో శివుడి విల్లును విరిచి సుకుమారి సీతను చేపట్టాడు శ్రీరామచంద్రుడు. కైకేయి వరాలు రాముడిని అడవుల బాట పట్టించాయి. మార్గమధ్యంలో అనేక క్షేత్రాలనూ ఆశ్రమాలనూ దర్శించుకుంటూ సీతారామలక్ష్మణులు.. శూర్పణక ఏలికలోని దండకారణ్యానికి చేరారు. జగన్నాథుడే నాయకుడిగా మొదలైన జగన్నాటకంలో.. మునులు, వానరులు,
సామాన్యజనులు ఎవరి పాత్ర వారు సమర్థంగా పోషించారు.

విగ్రహవాన్‌ అధర్మః
మర్యాదాయాం స్థితో ధర్మః – తనను తన పరిమితుల్లో ఉంచుకోవడమే ధర్మం. రావణుడు మాత్రం తన ఆలోచనలనూ, మాటలనూ, చర్యలనూ .. దేన్నీ పరిమితుల్లో ఉంచుకోలేదు. విశృంఖలత్వమే రావణతత్వం. ఎంత తోస్తే అంత మాట్లాడేస్తాడు. ఆ నాలుకకు ఎముకే కాదు, విజ్ఞతా లేదు. లేకపోతే, అంతటి శ్రీరాముడిని పట్టుకుని ‘ఆ మానవుడు దుర్వర్తనుడు, కఠిన హృదయుడు, జడుడు, దురాశాపరుడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు..’ అంటాడా! మహాకావ్యంలో అంత తీవ్రస్థాయిలో రామ దూషణకు పాల్పడిన ఘనత ఇద్దరికే.. ఒకరు మంథర, మరొకరు దశకంఠుడు. రాముడి కండ్లుకప్పి సీతను ఎత్తుకొస్తున్న వేళ జటాయు కూడా చాలా హితబోధ చేశాడు. ఎంత మేధావి అయితేనేం, మంచిచెడుల బేరీజులో రావణుడు ఘోరంగా విఫలమయ్యాడు. నిజానికి చెడు దిశగా అడుగులేస్తున్న ప్రతిసారీ ఏదో ఓ రూపంలో, ఎవరో ఒకరివైపు నుంచి హితవాక్కు వినిపించేది. అయినా రావణుడు పట్టించుకోలేదు. ‘రాముడితో శత్రుత్వమంటే మృత్యువుతో సహజీవనమే’ అని మారీచుడు చెప్పినా వినలేదు. ‘రామో విగ్రహవాన్‌ ధర్మః సాధుః సత్య పరాక్రమః – అన్న దివ్యవాక్కు మారీచుడి నోటి వెంట వచ్చిందే. చివరికి అతడు సువర్ణ మృగరూపం ధరించే వరకూ వదల్లేదు రావణుడు.

స్వోత్కర్ష.. పరనింద
రావణుడికి ఆత్మబుద్ధి తక్కువ. చెప్పుడు మాటలకు ఇట్టే ప్రభావితం అవుతాడు. తొట్టతొలి, చుప్పనాతి శూర్పణఖ రామలక్ష్మణుల మీద ఫిర్యాదు చేసినప్పుడే.. మంచిచెడుల విచారణ చేయాల్సింది. ‘అన్నా! సీతలాంటి స్త్రీని దేవ, గంధర్వ, యక్ష, కింపురుషులలోనూ చూడలేదు. ఆమె నీకు సరిజోడి. ఆమె పరిష్వంగన సుఖాన్ని అనుభవించినవాడు దేవేంద్రుడికంటే అదృష్టవంతుడు’ అని ఊరించినప్పుడైనా, ఉచ్ఛనీచాల గురించి ఆలోచించాల్సింది. అదీ చేయలేదు. రాముడిపట్ల అకారణ ద్వేషం పెంచుకున్నాడు. సీతమీద అర్థంలేని మోజు పెంచుకున్నాడు. రామలక్ష్మణులను మాయలేడి వెంట పరుగులు పెట్టించి, కపట సన్యాసి రూపంలో కుటీరానికి చేరుకున్నాడు. ఆ సమయంలో రావణుడు గడ్డితో కప్పేసిన పెద్ద గొయ్యిలా ఉన్నాడని వాల్మీకి వర్ణన. ‘నదీ ప్రవాహం ఒడ్డును కోసేసినట్టు, నువ్వు నా మనసును హరిస్తున్నావు బాలా’ అంటూ హరిప్రియ ముందు వగలుబోయాడు. ‘ఎవరి పేరు చెబితే సురాసురులకు చురుకు పుడుతుందో.. ఆ రావణుడిని నేనే’ అని స్వోత్కర్షమొదలుపెట్టాడు.

మదోన్మత్తుడై సీతను ఎత్తుకెళ్లాడు. అడ్డొచ్చిన జటాయు రెక్కలు ఖండించాడు. అశోకవనంలో సీతమ్మ ‘రావణా! నువ్వు సూదితో కండ్లు తుడుచుకుంటున్నావ్‌ జాగ్రత్త’ అని హెచ్చరించింది. ‘పంటలైనా పాపమైనా పండేందుకు సమయం పడుతుంది’ అని భవిష్యత్తును గుర్తుచేసింది. చివరికి, సుందరాచార్యుడు హనుమంతుడు కూడా లంకాదహన ఘట్టంలో రామతత్వాన్ని బోధించాడు. రావణుడికున్న ఇరవై చెవులూ సత్యవాక్కునూ, ధర్మసూక్ష్మాలనూ స్వాగతించడం ఎప్పుడో మానేశాయి. ఆ పది బుర్రలూ అప్పటికే చెత్తాచెదారంతో కలుషితమైపోయాయి. ‘అన్నా! ఈ విషయం నీతో చెప్పడానికి మంత్రులు సంశయిస్తున్నారు. రాముడిని గెలువడం అసాధ్యం. సీతను అప్పగించు’ అని విభీషణుడు చెవినిల్లు కట్టుకుని చెప్పాడు. కుంభకర్ణుడు కూడా నీతిమార్గం ఉపదేశించాడు. అర్ధాంగి మండోదరి సరేసరి. రామదండును కండ్లారా చూసొచ్చిన శుకసారణులు హనుమ, సుగ్రీవాదుల బలాలను బేరీజు వేసి చెప్పారు. అయినా వెనక్కి తగ్గలేదు.

రావణాయనం

న జానాతి పురా వీర్యం మమ యుద్ధే స రాఘవః ‘నా పరాక్రమం తెలియక రాముడు యుద్ధానికొస్తున్నాడు. సీతను వదిలిపెట్టే ప్రసక్త్తే లేదు’ అంటూ మంకుపట్టు పట్టుకుని కూర్చున్నాడు. ఓ దశలో మాతామహుడు మాల్యవంతుడు కూడా సన్మార్గం ఉపదేశించాడు. ఆ మొండితనమే రావణుడి బలమూ బలహీనతా. మొండివాడు రాజుకంటే బలవంతుడు. రాజే మొండివాడైతే? అందులోనూ రావణుడు రాజాధిరాజు, సార్వభౌముడు! తన మాటే శాసనమని అనుకుంటాడు. ఆ భ్రమతోనే ధనకనక వస్తు వాహనాల ఆశపెట్టి సీత మనసు మార్చాలనుకున్నాడు. బలవంతంగా తీసుకెళ్లి, తన అంతఃపుర వైభోగమంతా ప్రదర్శించాడు. విద్యుజ్జిహ్వ అనే అనుచరుడితో రాముడి పోలికలతో ఓ తలను తయారు చేయించి, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినట్టు నమ్మించబోయాడు. అన్ని ప్రయత్నాలూ విఫలం అయ్యాయి. సీత గడ్డిపరకతో సమానంగా చూసింది. గడ్డిపరకను అడ్డం పెట్టుకునే సంభాషించింది. నువ్వు గడ్డిపోచతో సమానమన్న పరోక్ష హెచ్చరిక చేసింది. చివరి వరకూ రావణుడు సీత స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోయాడు.

యుద్ధకాండ
రామసేన దండెత్తుకొచ్చింది. లంకకు వారధి కట్టింది. మేఘనాథ, కుంభకర్ణ.. ఇలా ఒక్కో అసురవీరుడూ కూలిపోయాడు. రావణుడొక్కడే మిగిలాడు. రామబాణానికి నేలకూలుతున్న సమయానికి అతడిలో కించిత్‌ పశ్చాత్తాపం కనిపించింది. ‘నా సాధన, నా తపస్సు ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఓ మానవమాత్రుడి చేతిలో ఓడిపోయానే..’ అని బాధపడిపోయాడు. ఆ తెలివిడి ముందే ప్రదర్శించి ఉంటే.. కథ మరోలా ఉండేది. ఒకప్పుడు లంకాజనులకు రావణుడు.. దేవుడితో సమానం. ప్రతి ఇంటా రావణ పూజలూ, దశకంఠ హోమాలూ చేసేవారట.
యుద్ధం ఆ విశ్వాసాన్ని చెరిపేసింది. శవాల దిబ్బలా మారింది లంక. బిడ్డలను కోల్పోయిన తల్లులు, భర్తలను కోల్పోయిన భార్యలు, తండ్రులను కోల్పోయిన కూతుళ్లు.. నేలరాలిన స్త్రీ కన్నీళ్లు వృథాగా పోవు. అశోకవనంలో రాలిన మొదటి కన్నీటి చుక్క లంకలోని ప్రతి కొంపకూ పాకింది. సముద్రం మధ్యలోని నగరం శోకసంద్రమైంది. ఇప్పుడు, తన వంతు వచ్చింది! మనోబలం నశించింది. అస్త్రశస్ర్తాలు అంతగా సహకరించలేదు. తడబడుతూనే తిరగబడ్డాడు.గగనం గగనాకారం సాగరః సాగరోపమఃరామరావణయోర్యుద్ధం రామరావణయోరివఆకాశానికి సాటి ఆకాశమే. సముద్రానికి సాటి సముద్రమే. రామరావణ యుద్ధానికి సాటి రామరావణ యుద్ధమే.రాముడు బ్రహ్మాస్ర్తాన్ని ప్రయోగించాడు.రావణబ్రహ్మ నేలకొరిగాడు. రావణాయనం పరిసమాప్తమైంది.

రావణుడి బంధుగణంలో ఒక్క పురుషుడూ మిగల్లేదు. ఉన్నదంతా.. వితంతు పరివారమే! అంత్యక్రియలు ఎవరు చేస్తారు? శ్రీరాముడు ఆ బాధ్యతను విభీషణుడికి అప్పగించాడు. ‘ఆ కుసంస్కారికి తుది సంస్కారాలెందుకు ప్రభూ?’ సున్నితంగా తిరస్కరించబోయాడు విభీషణుడు. రాముడు వారించాడు. మరణాన్తాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనమ్‌ క్రియతామస్య సంస్కారో మమాష్యేష యథా తవ.. వైరంతో మరణం సమసిపోతుంది. నీకే కాదు, నాకూ రావణుడు సోదర సమానుడే – రాముడి మాట, విలువల సారం! పది తలల శరీరం కాలిపోతున్న దృశ్యం.. మహారణ్యం తగులబడిపోతున్నట్టుగా ఉందట.ఇంద్రియాలను జయించి..ఇంద్రాదులను గెలిచినవాడుఇంద్రియాల చేతిలోనే..బందీగా మరణించాడు.
రాముడు మాత్రం..ఒక్క రావణుడినే గెలువలేదు. సత్యంతో దేవతలను, దానగుణంతో పేదలను, సేవతో గురువులను, శౌర్యంతో శత్రువులను జయించాడు.

-జయరామ్

ఇవీ కూడా చదవండి…

మండు వేసవిలో చెరువుల మత్తళ్లు

పారిశుద్ధ్యంపై మరింత అప్రమత్తం

నేడు టీకా బంద్‌

Advertisement
రావణాయనం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement