ఆడపిల్లల అరచేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడంటారు. మంచి మొగుడి సంగతేమో కానీ గోరింట మాత్రం ఎక్కడున్నా మేలు చేస్తుందన్నది నిజం. ఇందులో ఔషధ గుణాలు పుష్కలం. గోరింట చెట్టులో రెండు రకాల జాతులున్నాయి. ఒకటి లాసోనియా ఇనెర్మిస్. మరోటి లాసోనియా ఒడొరట. గోరింట ఉత్తర ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో విస్తరించి ఉంది. పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతల్లో ఇది పెరుగుతుంది. పొదలాగా, ఉండే దీని కాండానికి ముళ్లుంటాయి. మన దేశంలో ప్రతి ఇంటా గోరింట చెట్టు ఉంటుంది. పండుగలప్పుడూ, పెండ్లికీ, ఆషాఢమాసంలోనూ గోరింటాకుని రుబ్బి, ఆ ముద్దని చేతులకు, కాళ్లకు పెట్టుకుంటారు. గోరింట ఎర్రగా పండి చేతులను, కాళ్లను అందంగా ముస్తాబు చేస్తుంది.
ఉత్తర భారతంలో పెండ్లికి ఒకరోజు ముందు ‘మెహందీ రస్మ (గోరింట పెట్టుకునే రోజు)’ సంబురం జరుపుకుంటాం. గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. అవి వానాకాలంలో పాదాలను ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఆపుతాయి. అలాగే కాళ్ల పగుళ్లను తగ్గిస్తాయి. ఇందులో ఉండే టానిన్లు చిన్నవయసులో జుట్టు తెల్లబడకుండా అడ్డుకుంటాయి. విటమిన్-ఇ జుట్టును మృదువుగా ఉంచుతుంది. ఆడవాళ్ల అరచేతి మధ్యలో గర్భాశయానికి సంబంధించిన ప్రధాన నాడులుంటాయి. అక్కడ గోరింటాకు పెట్టడం వల్ల వేడిని లాగేసి, గర్భాశయ దోషాలను తొలగిస్తుంది.
గోరింటాకు కడుపులోని అల్సర్లను తగ్గిస్తుంది. అందుకే దాన్ని ముద్దగా చేసి మాత్రల రూపంలో మింగే అలవాటూ కొన్ని చోట్ల ఉంది. ఇందులో ఎరుపు రంగును ఇచ్చే లాసన్ అనే ఆమ్లానికి క్యాన్సర్లను నివారించే గుణం ఉందట. పుండ్లు మానడానికీ, చుండ్రు, ఎగ్జిమాలాంటి చర్మవ్యాధుల నివారణకూ గోరింటను వాడతారు. జుట్టు రాలకుండా ఆపే స్వభావమూ ఉండటం వల్ల హెన్నా పొడిని అనేక సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క కొమ్మను కత్తిరించి నాటినా సులభంగా పెరుగుతుంది. ముళ్లు కలిగి ఉండి సులభంగా పెరిగే ఈ చెట్టుని రైతులు తమ పొలంలోకి పశువులు రాకుండా, చుట్టూ కంచెలా నాటుకుంటారు. లాభసాటి వాణిజ్య పంటగా కూడా ఈ గోరింటాకును సాగు చేస్తున్నారు. హెన్నా తయారీ కంపెనీలు రైతుల నుంచి సేకరిస్తున్నాయి. చేతులు ఎర్రగా పండించే గోరింట రైతుకు చేతినిండా పని, జేబునిండా డబ్బు కూడా ఇస్తున్నదన్నమాట.
– ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు