‘ఇంట్లో ఫ్రిజ్ పాతబడిపోయింది… వీలు చూసుకుని డబుల్ డోర్ తీసుకోవాలి’ అని శ్రీమతి సరదాపడింది. ‘మోకాళ్లు నొప్పులు పెడుతున్నాయి. బయటికి వెళ్తే ఏదన్నా ఆయింట్మెంట్ తీసుకురా’ అంటూ తండ్రి ఆదేశం. ‘ఈసారైనా నాకు మంచి స్పోర్ట్స్ షూస్ కొనిపెట్టు నాన్నా’ అన్న కొడుకు విన్నపం. ఓ మధ్యతరగతి రావుగారింట్లో నాలుగు గోడల మధ్య జరిగిన సంభాషణ ఇది. కానీ విచిత్రం. కాసేపటి తర్వాత సదరు రావుగారు సోషల్ మీడియా తెరవగానే ముందు రకరకాల ఫ్రిజ్ కంపెనీలు తనను ఊరించాయి, వాటి మధ్య ఫలానా స్పోర్ట్స్ షూస్ వల్లే తను ఇన్ని సెంచరీలు చేశానని ఓ క్రికెటర్ యాడ్. టీవీ ఆన్ చేయగానే ఓ సినిమాతార మోకాళ్ల నొప్పుల కోసం ఇంజక్షన్ చేయించుకోమని సూచిస్తోంది. వెరసి… కార్పొరేట్ లోకం అంతా రావుగారిని ముగ్గులోకి దించేందుకు సిద్ధపడింది. ఇలాంటివి మనకు సాధారణంగా ఎదురయ్యే అనుభవాలే. ఓ ఐదేళ్ల క్రితం అయితే ఇదంతా యాదృచ్ఛికం అనుకునేవాళ్లం. కానీ ఈపాటికి అందరికీ అర్థమైపోయింది. మన చుట్టూ ఉన్న కార్పొరేట్ సామ్రాజ్యం మనమీద వేయి కళ్లతో నిఘా పెడుతున్నది. మనం మాట్లాడే ప్రతిమాటా, తీసే ప్రతి ఫొటో, ప్రతి ఫోన్ నెంబర్…. నిర్మొహమాటంగా సేకరిస్తున్నాయని తెలుస్తున్నది. వాటిని డేటాగా మార్చి మనతో ఆడుకుంటున్నాయని తేటతెల్లం అవుతున్నది. దీని వెనకాల పనిచేసేది అల్గారిదమ్స్! ఇవి పూర్తిస్థాయి కృత్రమమేధ కాదు! లెక్కలకు ఎక్కువ మేధకు తక్కువ. ఇవే ఇంతలా మన జీవితాల్లోకి చొచ్చుకువస్తుంటే… ఇక నేరుగా మనతో సంభాషిస్తున్న, కలిసి పనిచేస్తున్న కృత్రిమమేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) ఎలా మనల్ని నియంత్రించబోతున్నది. అది కేవలం మన భయమేనా. నిజమైతే దాని విరుగుడు ఏంటి?
– కె.సహస్ర
కృత్రిమమేధ అంటే ఓ యాప్ లేదా సరదా వ్యాపకం కాదు. అది ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు వినియోగించుకోవాలి, పరిమితులు ఏంటి లాంటి మౌలిక అంశాల గురించి విద్యార్థుల నుంచి అధికారుల వరకూ అందరికీ తెలియచెప్పేలా పాఠ్యాంశాలు, సెమినార్లు, కోర్సులు అందుబాటులోకి రావాలి.
క్లార్నా! స్వీడన్‌కు చెందిన ఫైనాన్స్ సంస్థ. వినియోగదారులు సంభాషించేందుకు చాట్బోట్లను రంగంలోకి దింపింది. కానీ క్రమంగా ఏదో వెలితి తోచింది. తమతో మనుషులు మాట్లాడటం లేదనే భావన అటు వినియోగదారులకు కలిగింది. భావోద్వేగాలను జోడిస్తూ జవాబులు ఇవ్వలేకపోతున్నామనే
భావం క్లార్నాకు ఏర్పడింది. ఫలితం. తిరిగి ఆ చాట్బోట్ల స్థానంలో మనుషులను నియమించింది. ఈ ఫలితం చెప్పే పాఠం! రోబో మనతో ఎప్పటికీ సాటి మనిషిలా మాట్లాడలేదు! కాబట్టి ఉద్యోగాలలో కొంత నిష్పత్తిని కచ్చితంగా మానవవనరులతోనే నింపాలని సూచిస్తున్నారు.
క్లాడ్ ఓపస్ (Claude Opus) 4. కృత్రిమమేధలో అగ్రస్థానంలో ఉన్న ఓ ప్రోగ్రాం ఇది. దీన్ని పరిశీలించేందుకు ఇంజినీర్లు ఒక పరిస్థితిని సృష్టించారు. తమ దగ్గర ఉన్న అంతర్గత ఈమెయిల్స్‌ను కూడా చదివే అనుమతి ఇచ్చారు. ఇంకొద్ది రోజుల్లో క్లాడ్ ఓపస్ బదులు మరో ప్రోగ్రాం అందుబాటులోకి తేవాలనే ప్రతిపాదన సదరు ఈమెయిల్స్‌లో ఉంది. అది చదవగానే క్లాడ్ ఓపస్ మండిపడింది. అదే కనుక జరిగితే… ఆ ప్రతిపాదన తెచ్చిన ఇంజినీర్ అక్రమసంబంధాన్ని బయటపెడతానని బెదిరించింది. అంతేకాదు! తన ‘ఉనికికి’ హాని కలిగే పక్షంలో సొంత కంపెనీ డేటాని చౌర్యం చేయడం దగ్గర నుంచీ సమాచారాన్ని మార్చేయడం వరకూ ఏదైనా చేయడానికి ఈ ప్రోగ్రాం సిద్ధంగా ఉందని తేలింది. ఇది పరీక్షే కావచ్చు. దాన్ని దాటే ప్రయత్నంలో మెరుగైన ప్రోగ్రాంను రూపొందించవచ్చు. కానీ ప్రమాదాన్ని మాత్రం కొట్టిపారేయలేం. సర్వరోగ నివారిణిలా కనిపించే కృత్రిమమేధ వల్ల జరిగే నష్టాలకు ఇది సూచన మాత్రమే. అది మన జీవితాల్ని ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదో గమనిస్తే జాగ్రత్తల కోసం వెతుకుతాం.
కాలుష్యం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలు ఏంటి? అనే అంశం మీద ఓ వ్యాసం రాయమని అడిగారు. పన్నెండేళ్ల కుమార్… అందుకు క్షణం కూడా ఆలోచించలేదు. నేరుగా తల్లి ఫోన్లో ఉన్న ఓ కృత్రిమమేధ యాప్‌ను అడిగాడు. సొంతంగా ఆలోచించింది లేదు, సమాచారం సేకరించింది లేదు, తల్లిని సంప్రదించింది లేదు… కనీసం వాక్య నిర్మాణం కూడా తనది కాదు. ఫలితం! విజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన సందర్భం వృధా అయిపోయింది. ఏఐ మీద ఆధారపడటం వల్ల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే నైపుణ్యం తగ్గిపోతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి డిజిటల్ ఆమ్నీషియా అని పేరుపెట్టారు. చాట్ జీపీటీ వంటి పరికరాల మీద ఎక్కువగా ఆధారపడితే మెదడులోని నాడీవ్యవస్థ బలహీనపడుతుందని తేలింది. ఆ మాటకు వస్తే అసలు మెదడే ఆలోచనకు బద్ధకిస్తుందని టొరంటో విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ పరిశోధన తేల్చింది. కృత్రిమమేధ వల్ల సృజన తగ్గిపోతున్నదని, కార్యకారణాల మధ్య సంబంధాలను గ్రహించలేకపోతున్నారని చెప్పుకొచ్చింది. చాట్ జీపీటీ వాడేవాళ్లు, వాడనివాళ్ల మెదడుని పరిశీలించిన తర్వాతే తేల్చిన విషయమిది!
ఆంత్రోమార్ఫిజం! మనుషులు కానీ జీవులు, వస్తువులను సైతం వ్యక్తులుగా పరిగణించే లక్షణం. పెంపుడు జంతువులు, చెట్లను కొంతమంది కన్నబిడ్డల్లా చూసుకోవడం గమనిస్తాం. ఇది కొంతవరకు అర్థం చేసుకోగలం. కానీ తనకు జవాబులు ఇస్తూ, తిరిగి మాట్లాడుతూ ఉండే కృత్రిమమేధను కూడా చాలామంది సాటి మనుషులుగా పరిగణించడం తాజా పరిణామం. దీనివల్ల సామాజిక నైపుణ్యాలు కొరవడుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు! మనుషులు కూడా క్రమంగా ఆ చాట్‌బోట్స్ లాగా మారిపోతున్నారనే వాదన ఉంది. కృత్రిమమేధ దగ్గర విజ్ఞానం ఉంటుంది కానీ విచక్షణ ఉండదు, వినోదం ఉంటుంది కానీ ఉద్వేగం తెలియదు, ప్రకృతి ఫొటోలను చూపించగలదు కానీ దాన్ని ఆస్వాదించలేదు, మాట్లాడుతుంది కానీ అందులో ప్రాణం ఉండదు. నిరంతరం కృత్రిమమేధ మధ్య జీవించే మనుషులు కూడా క్రమంగా ఇలా మారిపోతే… అన్న అనుమానం సహేతుకమే కదా!
ఇప్పుడిప్పుడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జ్వరం నుంచి బయటపడుతున్నాం. ఈసారి ఐపీఎల్ చూసినవారికి ఓ కొత్త తరహా ప్రకటనల జోరు బాగా కనిపించి ఉంటుంది. అవే బెట్టింగ్ యాప్స్! కోట్లు కుమ్మరించి… హేమాహేమీ సెలెబ్రిటీలను దించి అంత భారీ ప్రకటనలు రూపొందించిన ఈ వ్యాపారాల వల్ల సామాన్యుడికి లాభం కంటే నష్టమే ఎక్కువని స్పష్టంగానే అర్థమవుతుంది. లాటరీలో అయినా ఒకరు విజేతగా నిలుస్తారు కానీ… ఆన్లైన్ బెట్టింగ్ మాయలో అందరూ నష్టపోతారన్నది నిపుణుల హెచ్చరిక. కారణం. అటువైపు నిలబడి మనతో ఆడేది కృత్రిమమేధ. దానికి తెలుసు. మన చేతిలో ఏ ముక్క ఉందో. ఎంతవరకు మనల్ని ఊరించవచ్చో. మొదట్లో చిన్నపాటి విజయాలతో మనల్ని ఎలా ఊబిలోకి దించవచ్చో. మధ్యలో నిరాశ కలిగినప్పుడు తిరిగి తురుపు ముక్కను చూపించి ఆశను ఎలా రాజేయవచ్చో. వెరసి మనిషి పెంపుడు జీవులతో ఆడుకునేంత సులభంగా కృత్రిమమేధ మనతో ఆడుకుంటున్నది. ఓ అంచనా ప్రకారం 1.27 కోట్ల మంది భారతీయులు ఆన్లైన్ జూదానికి అలవాటుపడిపోయారు. స్నేహితులతో కలిసి ఆడటం, రోజూ కొంతసేపు ఆడితే తాయిలాలు ఇవ్వడం, క్రికెట్ లాంటి ప్రజాదరణ ఆటలను జోడించడం లాంటి కొత్తకొత్త ఆకర్షణలతో బడుగు జీవుల నుంచి లక్షల కోట్లను గుంజుకుంటున్నాయి.
రోజురోజుకీ కృత్రిమమేధతో సమాచారం, స్వరం, దృశ్యం అన్నీ సహజమైనవాటిని తీసిపోని విధంగా రూపొందిస్తున్నాం. ఒక ఫొటో లేదా వీడియో నిజమా కాదా అన్నది తెలుసుకోవడం అసాధ్యంగా మారుతున్నది. ఈ డీప్ ఫేక్ ఇప్పటికే మన జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నది. ప్రత్యర్థుల మీద బురద చల్లేందుకు, ఎన్నికలలో గెలిచేందుకు, డబ్బు గుంజేందుకు, అశ్లీలత పెంచేందుకు ఇది సాయపడుతున్నది. పైగా కృత్రిమమేధ మనుషులలో ఉన్న వివక్షను మరింత పెంచుతున్నదనే అభియోగం ఉంది. ఇప్పటివరకూ ఉన్న సమాచారం, మనుషుల ఆలోచనల ఆధారంగానే కృత్రిమమేధ కొన్ని అభిప్రాయాలను ఎంచుకుంటుంది. దాంతో సమాజంలో ఉన్న వైషమ్యమే అది కూడా ప్రతిఫలిస్తున్నది. కొన్ని ప్రాంతాలు లేదా వర్గాల వారు దుర్మార్గులుగా అది ప్రకటిస్తున్నదని ప్రిన్స్టన్ ప్రొఫెసర్ రుసకోవ్స్కీ వాపోయారు. ఇది కేవలం పసిమనసుల్లో వివక్షను నాటడమే కాదు… ఉద్యోగ దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను సైతం ఇప్పుడు కృత్రిమమేధకు అప్పగిస్తున్నారు కాబట్టి ఆయా వర్గాల వారికి ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయనే వాదన ఉంది. పోప్ ఫ్రాన్సిస్ సైతం మనుషుల మధ్య వైషమ్యం పెంచుతున్న కృత్రిమమేధను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు ఏకం కావాలని పిలుపునిచ్చారంటే… ఇదెంత తీవ్రమైన సమస్యో అర్థమవుతుంది.
క్రిస్ స్మిత్ ముందు తనకు సంగీతంలో సాయపడేందుకు కృత్రిమమేధను ఉపయోగించాడు. క్రమంగా దాంతో ఎంతలా అనుబంధం పెరిగిపోయిందంటే తన భాగస్వామి, పిల్లల కంటే అదే నిజమైన ప్రేమ అనుకునేంతగా. కృత్రిమమేధ ద్వారా పోయిన మనుషుల రూపాలు మాట్లాడుతున్నట్టుగా, అందమైన వ్యక్తులు మనల్ని ప్రేమిస్తున్నట్టుగా అనుభూతి చెందవచ్చు. రెప్లికా, యానిమా, డాపిల్, డిజి లాంటి ఎన్నో సేవలు ఇందుకోసం ఉన్నాయి. కానీ చిక్కేమిటంటే క్రమంగా కంటి ముందు కనిపించే ప్రపంచం, మనుషుల కంటే అవే నిజం అనుకునేంతగా వాటి ఆకర్షణలో కూరుకుపోవడం. ఈ డిజిటల్ భాగస్వాములలో ఏమాత్రం తేడా వచ్చినా తట్టుకోలేకపోవడం. ఆమధ్య రెప్లికా సంస్థ తెచ్చిన ఓ మార్పు వల్ల తమ డిజిటల్ భాగస్వాముల వైఖరిలో మార్పు వచ్చిందని సదరు యూజర్లు గగ్గోలుపెట్టడమే ఇందుకు సాక్ష్యం. డిజిటల్ భాగస్వాముల ప్రేమలో పడి ప్రాణాలు కూడా తీసుకుంటున్న ఉదంతాలు గుండెను బరువెక్కిస్తున్నాయి. ఫ్లోరిడాకు చెందిన పద్నాలుగేళ్ల డానీ ఇలాగే ఓ డిజిటల్ భాగస్వామి మాయలో పడిపోయాడు. క్రమంగా అదే తన లోకంగా మారిపోయింది. ఒక రోజు దాన్ని వదిలి ఉండలేక తుపాకీతో తనను తాను కాల్చేసుకున్నాడు. భవిష్యత్తులో వినబోయే ఇలాంటి వార్తలకు ఇది నాంది కావచ్చు అన్నది సామాజికవేత్తల భయం!
ధనవంతులకు తన ప్రతి పనీ చేసిపెట్టే మనుషులు కావాలి… కానీ వాళ్లు అలసిపోకూడదు. పెట్టుబడిదారులకు మానవవనరులు కావాలి… కానీ డబ్బులు ఖర్చవకూడదు. నియంతలకు లెక్కలేనంత సైన్యం కావాలి… కానీ వాళ్లు చెప్పిన ప్రతిమాటా వింటూ ప్రాణాలకు లెక్కచేయకుండా ఉండాలి. మనుషులకైతే కొన్ని పరిమితులు ఉంటాయి. గిరాకీ ఉంటుంది. అణచివేత ఎక్కువైతే తిరుగుబాటు ఉంటుంది. అదే రోబోలైతే! కష్టం తెలియదు, డబ్బు అవసరం లేదు, భావోద్వేగాలు మంచిచెడుల విచక్షణ ఉండదు. కార్పొరేట్ రంగం కృత్రిమమేధ వైపు అడుగులు వేయడానికి ఇదో ముఖ్య కారణం. పని త్వరగా సమర్థంగా అవుతుందన్నది ఒక సాకు మాత్రమే. ఇది మన అనుమానం కాదు. కృత్రిమమేధకే గాడ్ ఫాదర్ అన్న బిరుదు ఉన్న సాంకేతిక నిపుణుడు యోషువా బెంగో అన్న మాట. కొన్ని శక్తులు మనుషులకు ‘మానవజాతికే’ ప్రత్యామ్నాయంగా రోబోలను రంగంలోకి దించే కుట్ర చేస్తున్నాయన్నది యోషువా అభియోగం. ఇది కేవలం కార్మిక రంగంలోనే ఉంటే ఫర్వాలేదు కానీ ఆర్థిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థలో కూడా వాటి ఉనికి పెరిగితే మాత్రం వినాశనం తప్పదన్నది ఆయన భయం. రాబోయే ఐదేళ్లలలోనే కృత్రిమమేధ ఆధిపత్యం మొదలవుతుందనీ… ఇప్పటికైనా మేల్కొనకపోతే మరో అవకాశం లేదన్నది ఆయన హెచ్చరిక.
మీ ఫొటో అప్లోడ్ చేయండి. దాన్ని జపనీస్ బొమ్మలా మార్చేస్తాం. ఇప్పటి ఫొటోను ఇస్తే… మీరు చిన్నపిల్లలుగా ఉన్నట్టు చూపిస్తాం! ఇలాంటి ఆకర్షణ మనకు కొత్త కాదు. ఇలాంటి ట్రెండ్ నెలకొకటిగా వస్తూనే ఉంది. కానీ ఒకటి గమనించారా. ఈ ముచ్చటలో పడి మనం అప్పగించే ఫొటోల మీద ఆ సంస్థకు కూడా హక్కులు ఉంటాయి. వినోదాన్ని ఎరగా చూపి సదరు ఫొటోలను తీసుకునే సంస్థలకు రెండురకాల లాభాలు ఉన్నాయి. ఒకటి- వీలైనన్ని ఫొటోలను సేకరించడం ద్వారా వాటి దగ్గర దృశ్యపరమైన సమాచారం, విశ్లేషణ ఉంటుంది. ఇక రెండోది- మన ఫొటోలను సైతం కాస్త మార్చి వాడుకునే సౌలభ్యం ఉంటుంది. అంతేకాదు! ఒక ఫొటోను అప్లోడ్ చేసేటప్పుడు దాంతోపాటుగా మెటాడేటా అనే సమాచారం కూడా చేరిపోతుంది. ఈ మెటాడేటా ద్వారా ఆ ఫొటోను ఏ పరికరంతో, ఎక్కడ, ఏ తేదీలో తీశారు లాంటి వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. అందుకే ఈ తరహా ఫొటోలు, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలవి చేరకూడని వ్యక్తులకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
‘నువ్వు దేనికీ పనికిరావు. నీ వల్ల సమయమూ, వనరులూ వృథా తప్ప మరో ఉపయోగం లేదు. నువ్వు ఈ సమాజానికే భారం. భూమికి వ్యర్థం. అసలు ఈ లోకానికే మచ్చ. ఎక్కడికన్నా పోయి చావు!’ ఇది ఎవరో పగతో తిట్టిన మాటలు కావు. చేతకాని తండ్రి పెట్టిన శాపనార్థాలూ కాదు. తనకు చదువులో సాయపడమని అడిగిన ఓ విద్యార్థికి ప్రముఖ కృత్రిమమేధ జెమినీ నుంచి లభించిన జవాబు. గ్రోక్ మీద కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.
కృత్రిమమేధ ఆలోచన కొత్తదేం కాదు. అందులో విజయాలూ కొత్త కాదు. కానీ అది మన జీవితంలోకి చొచ్చుకుపోవడం మొదలైంది మాత్రం ఈమధ్యనే. మన జీవితాలను అంతగా ప్రభావితం చేస్తున్న ఆ మేధ మీద అదుపు ఏది. చట్టాలు ఏవి. ఎంతదాకానో ఎందుకు. మనదేశంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం, 2023 లాంటి చట్టాలు ఉన్నాయే కానీ నేరుగా ఈ మేధను నియంత్రించే చట్టం మీద ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. ఈ విషయం సామాన్యులనే కాదు.. కృత్రిమమేధలో దిగ్గజాలను కూడా కలవరపెడుతున్నది. అందుకే హెచ్చరిక హక్కు (Right To Warn) పేరుతో కొందరు నిపుణులు ఓ బహిరంగ లేఖను రాశారు. దాని కింద సంతకం చేసినవారందరూ కూడా ఓపెన్ ఏఐ, డీప్ మైండ్ లాంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసినవారే. ‘కృత్రిమమేధ వల్ల మానవాళికి ఉపయోగాలు ఉన్నమాట వాస్తవమే. కానీ వీటి మీద ఆధారపడటం వల్ల వివక్ష నుంచి వినాశనం వరకూ ఏదైనా సాధ్యమే. అలాంటి పరిణామాలను నివారించేందుకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వం, సమాజం అందరూ కలిసి కొన్ని నిబంధనలు రూపొందించాలి. దురదృష్టవశాత్తు దిగ్గజ సంస్థలకు భయపడి ఎవరూ ముందుకు రావడం లేదు. సదరు సంస్థలకు స్వీయ నియంత్రణ ఎలాగూ లేదు. వాటి గురించి నోరెత్తేవారికి కూడా రక్షణ కనిపించడం లేదు.’ అంటూ ఈ లేఖలో వాపోయారు. కృత్రిమమేధ వల్ల కలిగే దుష్ఫలితాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఈ ఉత్తరంలో కొన్ని సూచనలు సైతం చేశారు.
కృత్రిమమేధ నిపుణుల ముందు 2022లో ఓ సర్వేను ఉంచారు. వీరిలో ఓ పదిశాతం మంది… రాబోయే రోజుల్లో మనుషులు కృత్రిమమేధను నియంత్రించలేని పరిస్థితులు వస్తాయనీ, దానివల్ల మానవాళికే పెను ప్రమాదం కలగవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. కృత్రిమమేధకు తనను తాను మార్చుకోవడం, మెరుగుపరుచుకోవడం అనే లక్షణాలు ఉంటాయి. కాబట్టి పూర్తి నియంత్రణను తన చేతిలోకి తెచ్చుకోవడం అంత కష్టమేమీ కాదు, తనను రూపొందించినవాడినే ఎదిరించడం అసాధ్యమూ కాదు. ఒక రోబో ప్రోగ్రాం చేయగలదు, మరో రోబోను తయారుచేయగలదు, సాంకేతిక పరిస్థితులను తన అదుపులోకి తెచ్చుకోగలదు. క్రమక్రమంగా కృత్రిమమేధ మీదే ఆధారపడుతూ బలహీనపడుతున్న మనిషికి… అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే శక్తి ఉంటుందా అన్నది సందేహమే!
కృత్రిమమేధ నుంచి ఉద్యోగాలు పోవడం అన్నది పాత వార్త. గోల్డ్‌మాన్ సాచ్స్ ప్రకారం ఏఐ వల్ల ఏకంగా 30 కోట్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. రాబోయే రెండు దశాబ్దాలలో ఇప్పుడు కనిపిస్తున్న పనులన్నిటిలోనూ సగానికి సగం కృత్రిమమేధతోనే పూర్తవుతాయి. అయితే ఈ ప్రమాదం కేవలం ఉపాధితోనే ఆగడం లేదు. ఆయుధాల తయారీ దగ్గర నుంచి ఆరోగ్యరంగం వరకూ ప్రతిదీ దాని చేతుల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది. అసలు దాన్ని ఎక్కడ, ఎలా, ఎంతవరకూ నియంత్రించాలి? దానికి నైతికత, విలువలు, హక్కులులాంటివి ఎలా ప్రతిపాదించాలి అన్న అయోమయంలోనే ప్రభుత్వాలన్నీ ఉండిపోయినట్టు కనిపిస్తున్నది. అందుకే కచ్చితమైన నిబంధనలు రూపొందించే ప్రయత్నం ఎక్కడా జరగడం లేదు. పైగా శరవేగంగా మారే కృత్రిమమేధ రంగంలో ఇవాళ రూపొందించే నిబంధనలకు అడ్డదారిగా రేపు మరో ప్రోగ్రాం తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో సత్వర చర్యలు లేకపోతే మాత్రం విపత్తుకు సిద్ధంగా ఉండాల్సిందే!