చీకటిలో హఠాత్తుగా పడిపోయిన విక్కిరునికి ఒక కృష్ణ సర్పం ఎదురుగా బుసకొడుతూ కనిపిస్తుంది. ఈసాణుడు జయసేనుణ్ని రెండు ప్రశ్నలు అడుగుతాడు. కటిలుడు తాను మారిపోయినానని రాయహత్థితో అంటాడు. ‘స్వసుఖం కన్నా, ప్రేమ కన్నా కర్తవ్యం గొప్పది!’ అంటాడు పోటిసుడు. ఆ తర్వాత..
మనిషిని చంపినంత తేలిక కాదు పామును చంపడం! ఖడ్గం కదిలించేలోపు కాటేసేటంత చేరువలో ఉన్నది ఆ సర్పం! మరొకపక్క పక్కటెముక గాయానికి సంబంధించిన నొప్పి ఇబ్బంది పెడుతున్నది. ‘విజయమో! వీర స్వర్గమో!’ అని తెగించేటంత సాహసం కలిగిన యోధుడు విక్కిరుడు కానీ.. ఆ సమయంలో తెగింపును మించిన తెలివి అవసరం! ఏమైతే అది అయిందని చేతిలోని కత్తిని కదిలించబోయినాడు. సరిగ్గా అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో మెరుపును తలదన్నే వేగంతో ఒక డేగ! క్షణంలో సగం వంతు సమయంలో ఆ కృష్ణ సర్పాన్ని తన్నుకొని పోయింది. ఆశ్చర్యం! భయం!! అద్భుతం!!! కాసేపటికి గుండె వేగం యథాస్థితికి వచ్చి, హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు విక్కిరుడు. కానీ, గాయం బాధ తీవ్రం కావడంతో పైకి లేవడం సాధ్యం కాలేదు అతనికి. ‘కువిందు తాతా! నీవు నాకు అప్పగించిన పని పూర్తి చేయగలనన్న నమ్మకం క్షణక్షణానికీ సడలిపోతున్నది. నేను నా శక్తికొద్దీ ప్రయత్నిస్తున్నాను, చేతకావడం లేదు తాతా!’ అనుకుంటుంటే దుఃఖం ఆగలేదు విక్కిరునికి. శరీర బాధను మించిన నిస్సహాయత అతణ్ని మరింత బలహీనుణ్ని చేసింది. గాయం నుంచి రక్తస్రావం కూడా అధికం కావడంతో అతని కళ్లు మూసుకొని పోసాగినాయి.. క్రమంగా స్పృహ కోల్పోయినాడు. ఎవరూ చూడకుంటే అతనికి ఈ భూమ్మీద మరొక గడియలో నూకలు చెల్లిపోయేవే! విక్కిరుని అదృష్టం బాగున్నది! ఆ తెల్లవారుజామున ఒక పెళ్లి బృందం అటుగా వెళుతూ, అతను అక్కడ పడి ఉండటం చూసింది. వాళ్లు సోలిపురం వెళుతున్నారు. ఆ బృందంలోని పెద్దాయన విక్కిరుని గాయానికి చికిత్స చేసి, స్పృహలోకి వచ్చేటట్లు చేసినాడు. తమతోపాటు అతణ్ని తీసుకొని వెళ్లినారు వాళ్లు.
గది దాటి వెళ్లబోతున్న ఈసాణుడు జయసేనుని మాటతో ఆగి, వెనుకకు వచ్చినాడు. “ఏమిటా అరుపు? బందీవి, నిస్సహాయుడవు నాలుకను అదుపులో పెట్టుకోకపోతే..” ఈసాణుడి మాట పూర్తి కాలేదు. “ఏం చేస్తావ్?” మరింత పౌరుషంగా అన్నాడు జయసేనుడు. అనూహ్యమైన అతని ప్రవర్తనకు అప్రతిభుడయినాడు ఈసాణుడు. అతను ఏదో అనేంతలో మళ్లీ ఇట్లా అన్నాడు జయసేనుడు.. “నీవు ఏమీ చేయలేవు! రాజ్యం వీరభోజ్యం! నీలాంటి వంచకులు, పిరికిపందలు, అవకాశవాదులు వెలిగి ఆరిపోయే ఉల్కల వంటి వాళ్లు! తనది కాని సంపద కోసం ఆరాటపడటం; పరాయి స్త్రీల మీద ఆశపడటం; ధర్మ విరుద్ధమైన సుఖాన్ని కోరుకోవడం నీచుల లక్షణం! నీ దురాశ, దురుద్దేశం, దుర్లక్షణం నిన్ను పతనం వైపు పరుగులు పెట్టిస్తాయి! అది ఎంతో దూరంలో లేదు..” రక్తం మరిగిపోయిన ఈసాణుడు ఇంక తట్టుకోలేక ఒరలో నుంచి కత్తిని తీసి, తటాలున జయసేనుని గుండెపైన ఎడమ నుంచి కుడి వైపునకు సర్రున ఝళిపించినాడు. అది అతని అంగీని చీలుస్తూ, చర్మాన్ని కూడా కోసింది. రక్తం చివ్వున ఎగిసి పడ్డది. అయినా జయసేనుడు ఆగలేదు.. “ఇదే! ఇదేరా నీవు చేయగలిగింది! నిస్సహాయుల మీద నీ ప్రతాపం చూపించడం కాదు!
నీవు నిజంగా మగాడివైతే.. నా కట్లు విప్పి నాతో ద్వంద్వ యుద్ధానికి రా! అప్పుడు నీవు వీరుడవని ఒప్పుకొంటా!” అన్నాడు మరింత ఆవేశంగా. సహించలేక పోయినాడు ఈసాణుడు. “వీణ్ని తీసుకొనిపోయి ఆ చీకటి కొట్లో పారేయండి! అరచి గీపెట్టినా; చావుకేకలు పెట్టినా; మనసు కరిగేటట్లు ఏడ్చి గగ్గోలు పెట్టినా పిడికెడు మెతుకులు గానీ, చుక్క నీళ్లు గానీ ఇవ్వద్దు!” గదిగోడలు దద్దరిల్లేటట్లు హుంకరించినాడు ఈసాణుడు. నెత్తురోడుతున్న జయసేనుణ్ని ఇద్దరు భటులు బరబరా ఈడ్చుకుంటూ చీకటి కొట్టువైపు తోడుకొని పోయినారు. అక్కడి నుంచి ఈసాణుడు తన మందిరానికి వెళ్లకుండా, అనుచరులతో అత్యవసర సమావేశం ఏర్పరిచినాడు. అతని పరిస్థితి ఇప్పుడు దెబ్బతిన్న పాములా ఉన్నది. ఇంతవరకూ ఎవరూ అతణ్ని ఎదిరించలేదు. మహారాజు, మహారాణి, మంత్రులు, సైన్యాధ్యక్షుడు, పరివారం, భటులు, పరిచారకులు.. ఎవ్వరూ అతనికి ఎదురు తిరగలేదు! ఒక పరదేశి, నిర్బంధితుడు, బాధితుడు, క్షత్రియేతరుడు అందునా వైశ్యుడు.. ఎన్ని మాటలన్నాడు?! వాణ్ని అప్పుడే చంపేయాలన్నంత ఆవేశం కలిగింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కొత్త సమస్యలను తెస్తుందేమో అన్న జంకు జయసేనుని ప్రాణాలను అడ్డుకున్నది. “ఇప్పుడేం చేయడం?” వచ్చిన వాళ్లందరి ముందు తన సందేహాన్ని వ్యక్తపరిచినాడు.
ఎవరూ పెదవి విప్పలేదు. అందరికీ ఈసాణుడి స్వభావం తెలుసు. అతను ఎవరి సలహాలూ వినడు. అందరూ అతను చెప్పినట్లు వినవలసిందే! వినకుంటే శిక్షలూ, దురవస్థలూ తప్పవు! ఎంతసేపైనా ఎవరూ మాట్లాడక పోవడంతో ఈసాణుడిలో అసహనం పెరిగింది. “మిమ్ములనే అడుగుతున్నా! ఇప్పుడేం చేద్దాము చెప్పండి!” మరింత కఠినంగా అన్నాడు. ఫలితంలో మార్పు లేదు! ఆలోచనలో పడ్డాడు ఈసాణుడు. ‘నేనంటే అందరూ భయపడతారు కాబట్టి సమాధానం చెప్పలేకపోతున్నారు. పైగా విషయమేమీ తెలియకుండా ఏం చేద్దామంటే వాళ్లు మాత్రం ఏం చెబుతారు? అందుకే ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటేనే ఆశించిన ఫలితం లభించవచ్చు!’ అనుకొని.. “చూడండి మిత్రులారా! మీ అందరి సహకారం వల్లనే నేను ఈ రాజ్యం నడుపగలుగుతున్నాను” అంటూ ఆరంభించినాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘ఇదేమి విచిత్రం! మన సహకారంతో రాజ్యం నడపడమా?’ అన్న అర్థం అందరి ముఖాల్లోనూ ప్రతిఫలించింది. అదేమీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించినాడు ఈసాణుడు. “అవును! ఇది నిజం! అందరూ నేను చెప్పినట్లు వినాలని అధికార దర్పం చూపించక తప్పడం లేదు కానీ, మీ పట్ల నాకు ఏ విధమైన అనాదర భావమూ లేదు. మనం అందరం కలిసికట్టుగా పనిచేయకపోతే ఈ రాజ్యాన్ని కాపాడుకోవడం కష్టం. రాజ్యంపోతే మనం బానిసలమైపోతాం. బానిస బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో మీకు చెప్పనవసరం లేదు!”
“ఇప్పుడంతా బాగానే గడిచిపోతుంది కదా ప్రభూ! తమ ఏలుబడిలో ఏ లోపమూ లేదు!”.. తిని కూర్చుంటూ, కనిపించినప్పుడల్లా ఈసాణుడిని పొగుడుతూ కాలక్షేపం చేసే అవణాయరుడు గొంతు విప్పినాడు. అతను రాజ కుటుంబానికి దగ్గరివాడు కావడంతో ఏమీ అనలేని బలహీనత ఈసాణుడిది. “మీకు తెలియదు అవణామత్యా! మీ బాధ్యత అంతఃపుర యోగక్షేమాలకు పరిమితమై ఉన్నది కాబట్టి బయట జరుగుతున్న పరిణామాలు తమరికి తెలిసే అవకాశం లేదు!” అవణాయరుడు గాక, ఇతరులు మాట్లాడాలని ఈసాణుడి ఉద్దేశం. “బయట ఏం జరిగింది మహాప్రభూ!” చేతులు జోడించి, అతివినయం ప్రదర్శించినాడు అవణాయరుడు. “పోదన నగరానికి చెందిన సార్థవాహుడైన కుసుమ శ్రేష్ఠిని బంధించిన నాటినుంచి అన్నీ విపరీత పరిణామాలు ఎదురవుతున్నాయి అవణాయరా!” అన్నాడు ఈసాణుడు. వెంటనే.. “అయితే అతణ్ని వదిలేస్తే అన్నీ చక్కబడతాయి కదా ప్రభూ!” అన్నాడు కల్లణసీహుడు. అతను ఈసాణుడి ముఖ్యమైన అనుచరుడు, ఆంతరంగికుడు కూడా.
ఆ మాట ఎంత మాత్రమూ రుచించలేదు ఈసాణుడికి. అయినా నిగ్రహించుకుంటూ.. “అదెట్లా?” అన్నాడు. “వాళ్లు కేవలం వ్యాపారస్థులు కారు! బలవంతులు; రాజులతో సత్సంబంధాలు కలిగిన వాళ్లు; ప్రజలకు ఇష్టమైన వాళ్లు; వాళ్ల కోసం స్వచ్ఛందంగా ప్రాణాలు ఇచ్చే యోధులను అనుచరులుగా కలిగిన వాళ్లు; న్యాయవర్తనులు; ధర్మ స్వరూపు..” కల్లణసీహుని నోట శత్రువుల ప్రశంసను వినడం ఈసాణుడిలో మంట పుట్టించింది. వెంటనే వెనుకా, ముందు ఆలోచించకుండా ఒక్క కత్తి వేటుతో అతని తలను నరికేసినాడు. కోపం తలకెక్కినప్పుడు వివేకం పక్కకు తప్పుకొంటుంది. అప్పుడు అన్నీ ఇటువంటి దుష్పరిణామాలే చోటు చేసుకుంటాయి. ఆ సంఘటనతో ఈసాణుడి అనుచరుల్లో భయం భయంకరంగా పెరిగింది. తాను చేసింది ఎంత పెద్ద తప్పో ఈసాణుడికి అప్పుడు అర్థం కాకపోవడం కాల మహిమ!
సీహాదేవి! రోహాదేవి ముద్దుల చెల్లెలు! అహయాదేవి-మేఘచంద్రుల చిన్న కూతురు! మల్లికాగిరికి మకుటం లేని యువరాణి! తన అల్లరితో అందంతో చీకటిలో వెన్నెల నింపగల సౌదామిని. పోదన నగరం నుంచి.. అక్కగారి అత్తగారి ఇంటి నుంచి రమ్మన్న పిలుపునందుకొని రథం లాంటి బండిలో బయలుదేరింది. ఆమెను చూస్తుంటే అందాల రథంలో అంతకు మించిన అందాల పూలరథంలా ఉన్నది. తోడుగా ఒక పరిచారిక ఉన్నది. దాని పేరు కజ్జల. పేరుకు తగినట్లుగా నల్లగా ఉన్నా, ఉత్పలమాలికలా ఆకర్షణీయంగా ఉన్నది ఆ చిన్నది కూడా. ఆ రథాన్ని అనుసరించి పదిమంది అశ్వికులు వస్తున్నారు. ఇరవై మంది బంట్లు వీళ్ల కంటే ముందు దాదాపు పరుగెత్తుతున్నట్లు నడుస్తున్నారు. దొంగలు, దారిదోపిడి గాళ్లు, అనుమానితులు ఎవరైనా కనిపిస్తే మట్టికరిపిస్తూ; ఏ ఆటంకం లేకుండా ప్రయాణం కొనసాగేటట్లు చూసుకోవడం వాళ్ల పని. మల్లికా గిరి నుంచి బయలుదేరిన క్షణం నుంచీ తన అక్క రోహకు సంబంధించిన ఆలోచనలు, జ్ఞాపకాలు, ఊహలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది సీహ.. రోహ! నిజంగా అమాయకత్వం, అందం సమపాళ్లలో కలిపితే ఏర్పడే రూపానికి అద్దం పట్టినట్లుంటుంది. ఏదీ వెంటనే గ్రహించదు. నర్మగర్భంగా మాట్లాడిన ప్రతిసారి అంతా తానే వివరంగా చెప్పవలసి వచ్చేది. బావ జయసేనుడు దాన్ని ఎంత ఆటపట్టిస్తున్నాడో..! అందగాడు; వీరుడు; మంచి మనసున్న వాడు; అన్నిటికీ మించి అక్క పట్ల అపారమైన ప్రేమ పెంచుకున్నవాడు.. నిజంగా అటువంటి భర్త లభించడం ఎన్నో జన్మల్లో తపస్సు చేసుకుంటే గానీ సాధ్యం కాదు. పూర్వజన్మలో బహుశా వీళ్లిద్దరూ పార్వతీ పరమేశ్వరులు అయ్యుంటారు.
అత్తమ్మకు కూడా కోడలంటే ఎంత అభిమానం! జ్యోతిషుని మాటలు కూడా లెక్కచేయకుండా రోహను కాపురానికి తోడుకొని పోయింది. చాలా అదృష్టవంతురాలు అక్క. లేకుంటే అంత మంచి భర్త, అంతకు మించిన మంచి కుటుంబం లభిస్తుందా?! ‘రాత్రీ పగలు మొగుడిని చూస్తూ గడపడంతో మొహమ్మొత్తిందేమో! ఈ చెల్లి గుర్తుకొచ్చినట్లున్నది. అక్కడికి వెళ్లిన తర్వాత ఉంటుంది దానికి. జన్మంతా గుర్తుంచుకునేటట్లు దాన్నొక ఆటాడుకుంటా..’ అనుకుంటూ రథం తెర తొలగించి బయటికి చూసింది. అడవిలో ఒక ఎండిన మోడును అల్లుకున్న తీగ పచ్చగా కళకళలాడుతూ పువ్వుల నవ్వులు విరజిమ్ముతున్నది. అది చూసి సీహ..
‘ఆడుచుండు నామె ఆతడాడించిన
యట్లు ప్రేమ నిండి నందు వలన
మోడయిన నదేమి వీడని కౌగిలి
యందు తీగ మురిసినట్లు గాను!
(మోడును అల్లుకొని మురిసిపోతున్న తీగలాగా అతడు స్తబ్దంగా ఉన్నా, అపారమైన ప్రేమ వలన ఆయన మనసు తెలుసుకొని అనుకూలంగా ప్రవర్తిస్తూ మురిసిపోతూ ఉంటుంది ఆమె)’ అనుకొని, తనలో తాను నవ్వుకుంటున్నది. “అమ్మా.. అమ్మ గారూ.. అమ్మాయి గారూ.. యువరాణి గారూ.. పోదనకు వచ్చేసినాం..” కజ్జల అరుపులతో ఊహాలోకం నుంచి వాస్తవంలోకి వచ్చి పడ్డది సీహాదేవి. “ఏందే అప్పుడే వచ్చేసినామా..” ఆశ్చర్యానందాలతో రథం దిగింది. చుట్టూ పరికించి చూసింది. అంతకుముందే దిగి తన పక్కనే నిలబడి ఉన్న కజ్జల చెంప మీద గట్టిగా ఒక్కటిచ్చింది. “ఏయ్! ఏందే? నాతోనే ఆడుకుంటున్నావా? ఎవరితోనైనా ఈ సీహాదేవి ఆడుకోవాల్సిందే! సీహతోఎవ్వరూ ఆడుకోరాదు! అది ఈ యువరాణి సహించదు!” అంది అసహనంగా. “అమ్మా! ఇది పోదన నగరమే! కాలి బూడిదైన ఈ భవనం కుసుమ శ్రేష్ఠి ప్రభువులదే!” ముందుగానే అక్కడికి చేరుకున్న పదాతిదళ సభ్యుడొకడు విచార వదనంతో మనవి చేసినాడు.
ఉలిక్కిపడ్డది సీహాదేవి. వెర్రిదానిలా ఆ భవనం మొండి గోడలను, పరిసరాలను చూడ సాగింది. అప్పటికే అక్కడ గుమిగూడిన మనుషుల్లో నుంచి ఒక ముసలమ్మ.. “దేవుండ్ల వంటి మణుసులు.. ఇంద్ర భవనం వంటి కోట ఒక్క రాత్రిలో బుగ్గి అయిపోయింది. ఎవ్వరూ మిగులలేదు. అందరూ మంటల్లో..” చివరి మాట పూర్తి కానేలేదు. అది వింటూనే స్పృహ తప్పి పడిపోయింది సీహాదేవి.