కుసుమ శ్రేష్ఠి తనకు విధించిన మోయలేని సుంకాన్ని ఓడల్లోని సరుకులు అమ్మి చెల్లించాలని నిర్ణయించుకుంటాడు. వామదేవుని దృష్టిని చిలుకవాడలో ఓ సుందరాంగి ఆకర్షిస్తుంది. చంద్రహత్థితో కలిసి మునిపల్లెకు చేరుకుంటాడు పోటిసుడు. ఆ తర్వాత..
హఠాత్తుగా మాట పడిపోయిన వామదేవుణ్ని చూసి.. అతని దృష్టి ఎక్కడ ఉన్నదో గమనించిన జయసేనుడు ఉలిక్కిపడ్డాడు. పదహారేండ్ల వయసున్న పసిమి ఛాయ గల ఓ కమలముఖి కమలముల సరస్సు పక్కనే నిలబడి, సాయంకాలపు ఎండకు కొంగును అడ్డంపెట్టి గుంభనంగా నవ్వుతున్నది. ఆ నవ్వుకే పడిపోయినాడో, వయసుకే పరవశుడైనాడో, సొగసుకే దాసోహమన్నాడో తెలియదు.. వామదేవుణ్ని వెంటనే కాపాడుకోకపోతే ప్రమాదమని. “దేవా!” అని గట్టిగా అరిచినాడు జయసేనుడు. “అమ్మా!” అన్నది సరిగ్గా అప్పుడే ఆ నెరజాణ, కాలికి ఏదో గుచ్చుకోగా. “అయ్యో!” అన్నాడు వెంటనే బాధగా వామదేవుడు. ఆ సుందరి కోసం వామదేవుడు; వామదేవుని కోసం జయసేనుడు ఒకేసారి గుర్రాల మీదినుంచి దిగినారు. ఒక్క ఉదుటున ఆ నెరజాణ పాదాల వద్దకు చేరుకున్న వామదేవుడు, నేల నుంచి నాలుగు అంగుళాలు పైకెత్తి ఉన్న ఆమె ఎడమ పాదంలోని ముల్లును ఒడుపుగా తీసేసినాడు. ‘ఇవన్నీ వాళ్లు ఆడే నాటకాలు రా నాయనా!’ అని వామదేవుణ్ని మందలించాలని అనుకొని.. మాట మరిచి, వాళ్లను చూస్తూ ఉండిపోయినాడు జయసేనుడు. “ప్రేమకు మంచితనం తోడైతే అది నీలాగే ఉంటుంది అందగాడా!” అని ఛమత్కరించి, సన్నజాజి పువ్వు విచ్చుకున్నట్లు నవ్వింది ఆ సుందరి. అంతటితో ఆగక, ముల్లు తీసిన ఆ చేతిని మృదువుగా నిమిరింది. సాయంకాలపు నునువెచ్చని సూర్యుని కిరణాలకే తన ముఖ కమలం వాడిపోతుందేమోనని సన్నని చీర చెంగు అడ్డం పెట్టుకున్నది ఆ సౌందర్యలహరి.
అప్పుడు వామదేవుడు.. కొంగు తోడ అడ్డుకొన జూచెద వదేల? తరుణి! యినుని కరము తగలనీయి నీరజమ్ము సుఖమొ! నీ ముఖము సుఖమో! ఎరుగనీయు మతని నిందువదన! (ఓ సుందరీ! నీ ముఖానికి అడ్డంగా ఉన్న చీర కొంగును పక్కకు తొలగించు. నీ ముఖకమల స్పర్శ సుఖంగా ఉంటుందో; కమల పుష్పాల స్పర్శ సుఖంగా ఉంటుందో తెలుసుకోనివ్వు)” అంటూ.. సుతారంగా ఆమె కొంగును పక్కకు తొలగించి, అందాన్ని కళ్లతో జుర్రుకోసాగినాడు.
నిజంగానే వెన్నెల విరిసినట్లు నవ్వింది ఆ సుందరి. “ఒరే దేవా! ఏం చేస్తున్నావురా? నేను నిన్ను హెచ్చరించి ఒక్కక్షణం కూడా కాకముందే ఉచ్చులో చిక్కుకున్నా వేందిరా?” దాదాపు ఏడుస్తున్నట్లే అన్నాడు జయసేనుడు. “ఎవరు మీ మిత్రుడా? ఇద్దరూ ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు! ఇంతకుముందు ఎప్పుడూ మిమ్ములను ఇక్కడ చూసినట్టు లేదు. ఇదే మొదటిసారా?” ముద్దుముద్దుగా, ముద్దముద్దగా అడిగింది ఆ ముగ్ధ. వామదేవుణ్ని దూరంగా లాగి, ఇద్దరి మధ్యలో వచ్చి నిలబడి.. “తల్లీ! ఒక ముఖ్యమైన పనిమీద పోతున్నాం. దయచేసి మా పని చెడగొట్టకు!” రెండు చేతులతో దండం పెట్టినాడు జయసేనుడు.
“అయ్యో స్వామీ! నన్ను చూసిన వాళ్లు ఎవరూ తమ పని చెడగొట్టుకోలేదు. పని పూర్తి చేసుకునే వెళ్లినారు” ఆమె ధోరణి వృత్తిపరమైంది. ఇంక ఆమెతో మాట్లాడి లాభం లేదని.. “నీకు ఎన్ని కర్షాపణాలు కావాలెనో చెప్పు! నీవు అడిగినదానికంటే ఎక్కువే ఇస్తా! మమ్మల్ని పోనీ..” అన్నాడు బతిమాలుతున్నట్లు జయసేనుడు. “నేను బిచ్చగత్తెను కాను! చేసిన పనికి బహుమతిని తీసుకుంటాను. నాదంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణి” ఆమె తగ్గలేదు. “పోనీ లేరా! కొంచెంసేపు మాట్లాడి పోదాం. ఆమెతో మాట్లాడుతుంటే మనసు తేలిక అవుతున్నది రా!” అన్నాడు దేవ. “తర్వాత జీవితం మోయలేనంత బరువవుతుంది!” కటువుగా అడ్డుకున్నాడు జయసేనుడు . “నా మాట విని, సమయం మించిపోక ముందే పోదాం పద!” మిత్రుని చేయి పట్టుకొని లాక్కొని పోసాగినాడు.
“వీరులారా! పొండి. కానీ, ఏం పని మీద పోతున్నారో చెప్పండి. నేను మీకు సాయం చేస్తా!” బలవంతంగా చేయి విడిపించుకున్నాడు వామదేవుడు. “అబ్బా! ఆగరా! ఏదో సాయం చేస్తానంటున్నది కదా!” విసుగ్గా అన్నాడు “అది మాయం చేసే మనిషిరా! సాయం చేస్తుందని ఎట్లా నమ్ముతావు?” బాధగా జయసేనుడు. “మనుషుల్ని నమ్మాలి రా! నమ్మకపోతే పనులెట్లా అయితయ్?” అంటూనే.. మళ్లీ ఆ చంద్రముఖిని చేరుకున్నాడు వామదేవుడు. “అబ్బా!” తల పట్టుకున్నాడు జయసేనుడు.
అక్కడ మునిపల్లెలో.. పోటిసుడు, చంద్రహత్థి మాటిమాటికీ ఆశ్చర్యానందాలకు లోనవుతున్నారు. మొదట ఈ సమావేశాలకు పదుల సంఖ్యలో జనం వచ్చేవాళ్లట. అది క్రమక్రమంగా వందలై, వేల సంఖ్యకు చేరింది. సంఖ్య పెరుగుతున్న కొద్దీ మైదానం విశాలంగా మారుతున్నది. ఆ ప్రదేశాన్ని నిరంతరం చదును చేస్తూ, విశాలం చేస్తూ, పరిశుభ్రంగా ఉంచేది ఈ మునిపల్లె వాసులే. రాత్రి రెండో జాము మొదలైంది. అందరూ కలిసి “బుద్ధం శరణం గచ్చామి” “ధర్మం శరణం గచ్చామి” “సంఘం శరణం గచ్చామి” అని మంద్ర స్వరంలో, రాగయుక్తంగా పలికినారు. అంతవరకూ అక్కడక్కడ వినిపిస్తున్న మాటలు కూడా ఇప్పుడు పూర్తిగా ఆగిపోయినాయి. శ్రమణకుల్లో అందరికంటే పెద్దవాడుగా ఉన్న మాధవుడు లేచి నిలబడి తన ప్రసంగాన్ని ప్రారంభించినాడు.. “సత్యాన్ని గ్రహించి సత్యమార్గంలో పయనింప చేయడానికి బుద్ధుడు చేసిన బోధనలే బుద్ధ ధర్మం..” అంటూ మొదలైన అతని ప్రసంగం అనర్గళంగా కొనసాగింది. ఈ లోకంలో సర్వత్రా దుఃఖమే వ్యాపించి ఉన్నది. దీన్ని గూర్చి బుద్ధ భగవానుడు ఇదం ఖోపన భిక్కవే దుఖ్కం అరియ సచ్చం అంటే ‘ఓ బిక్షుకా! దుఃఖమే మొట్టమొదటి ఆర్యసత్యం’ అన్నాడు. అదేవిధంగా నాలుగు సత్యాలను ఉపదేశించినాడు. ఆ నాలుగు.. దుఖం; దుఃఖ సముదయం; దుఃఖ నిరోధం; దుఃఖ నిరోధగామినీ ప్రతిపద్. ఇవే మాటలను ఇంకా సరళంగా చెప్పాలంటే.. ఒకటి దుఃఖం; రెండు దుఃఖ కారణం; మూడు దుఃఖ కారణ నివారణ; నాలుగు దుఃఖ కారణ నివారణ మార్గం.
ఈ జగత్తంతా దుఃఖమయం. పుట్టుక దుఃఖం; ఎదగడం దుఃఖం; జీవనం దుఃఖం; మరణం దుఃఖాల్లోకెల్లా దుఃఖం. పుట్టిన ప్రతి జీవితోపాటు మరణం పుడుతుంది. అది జీవితమంతా వెంట ఉండి, దుఃఖాన్ని జీవితంలో భాగం చేస్తుంది. దుఃఖం ఉన్నదంటే దుఃఖానికి కారణం కూడా తప్పకుండా ఉంటుంది. ఎవడూ ఏడుస్తూ బతకాలి అనుకోడు; బతుకంతా ఏడవాలనీ అనుకోడు. మరి ఎందుకు ఏడుస్తున్నాడు? అందుకు కారణం కోరిక. రకరకాల కోరికలు.. ఒకటి నెరవేరితే ఇంకొకటి; అది తీరితే మరొకటి; అది పూర్తయితే ఇంకొకటి! వాగు అంచున చెలిమెలో తోడుతున్న కొద్దీ నీళ్లు ఊరుతున్నట్లే.. కోరికలు కూడా ఎప్పుడూ ఊరుతూనే ఉంటాయి. అవి కలిగిన నాడు దుఃఖం; నెరవేర్చుకునే ప్రయత్నంలో దుఃఖం; సరిగ్గా నెరవేరకపోతే దుఃఖం; మనకంటే ఇతరులకు ఎక్కువైతే దుఃఖం.. ఇట్లా అనంతమైన కోరికలు అనంత దుఃఖానికి హేతువులు. ఈ కోరికలు మూడు విధాలు.. కామతృష్ణ , భవతృష్ణ, విభవ తృష్ణ. అనేక విషయాలు కావాలని కోరుకోవడం కామతృష్ణ. ఈ ప్రపంచం, జీవితం శాశ్వతమని నమ్ముకోవడం వల్ల కలిగే కోరికలు భవతృష్ణ. సుఖవంతమైన, భోగవంతమైన జీవితాన్ని కోరుకోవడం విభవతృష్ణ. అందుకే దుఃఖ నివారణ తప్పనిసరి!
దుఃఖాన్ని నివారించాలంటే దుఃఖానికి గల కారణాలైన కోరికలపైన అదుపు సాధించాలి. అది సాధించాలంటే నాలుగవ సత్యాన్ని ఆశ్రయించాలి. అదే దుఃఖ కారణ నివారణ మార్గం! ఈ దుఃఖ నివారణకు ఎనిమిది మార్గాలు ఉన్నాయి. అవే.. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వచనం, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. ఇదే అష్టాంగ మార్గం. సమ్యక్ అంటే సరియైన, సమగ్రమైన, యోగ్యమైన, తగిన అని అర్థం. సమ్యక్ దృష్టి – అంటే ఏది సత్యం, ఏది అసత్యం; ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం; ఏది తగినది, ఏది తగనిది; దేన్ని అనుసరించాలి, దేన్ని అనుసరించకూడదు.. అనేది సరిగ్గా అర్థం చేసుకొని నిర్ణయించగలగడమే. సమ్యక్ సంకల్పం – అంటే ఆలోచనలు సక్రమమైన మార్గంలో నడిపించడం. కోరికలను విసర్జించడం. ఉత్తమ ఆశయాలను లక్ష్యాలను కలిగి ఉండటం. సమ్యక్ వచనం – అంటే సరియైన మాటనే మాట్లాడటం. సత్యం మాట్లాడటం. మృదువుగా మాట్లాడటం. ఇతరులను తక్కువ చేయకుండా, హేళన చేయకుండా, నిందించకుండా మాట్లాడటం. సమ్యక్ కర్మ – అంటే మంచి నడవడిక కలిగి ఉండటం. హింస, దొంగతనం, పరస్త్రీ వ్యామోహం, మత్తు పానీయాల సేవనం వంటి దురాలోచనలను విడిచిపెట్టాలి.
సమ్యక్ జీవనం – అంటే ఇతరులకు అన్యాయం చేయకుండా, ఇతరులను మోసగించకుండా, ఎవరినీ బాధ పెట్టకుండా జీవించాలి. ఆయుధాలను, మాంసాన్ని విక్రయించకూడదు; ఆశించకూడదు. సమ్యక్ ప్రయత్నం – అంటే మనసులోకి ఎటువంటి చెడు ఆలోచనలను రానీయకుండా అరికట్టడం. సమ్యక్ స్మృతి – అంటే మనసును నిర్మలంగా, చైతన్యంగా ఉంచుకొని.. మంచి విషయాలను మరువకుండా అనుసరించడం. ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టడం. సమ్యక్ సమాధి – సమాధి అంటే ఏకాగ్రత. ధ్యానమగ్నమైన స్థితి. అసలు ఏ రకమైన ఆలోచనలు లేని అవ్యక్తానందాన్ని అనుభవించే స్థాయికి చేరుకోవడం. మృదుమధురమైన శైలిలో గంభీరమైన గళంలో మాధవుడు బుద్ధ ధర్మాన్ని గురించి వివరిస్తున్నాడు. అందరూ మంత్రముగ్ధులై వింటున్నారు.
అనేక విషయాలు కావాలని కోరుకోవడం కామతృష్ణ. ప్రపంచం, జీవితం శాశ్వతమని నమ్ముకోవడం వల్ల కలిగే కోరికలు భవతృష్ణ. సుఖవంతమైన, భోగవంతమైన జీవితాన్ని కోరుకోవడం విభవతృష్ణ. అందుకే దుఃఖ నివారణ తప్పనిసరి! దుఃఖాన్ని నివారించాలంటే దుఃఖానికి గల కారణాలైన కోరికలపైన అదుపు సాధించాలి. అది సాధించాలంటే నాలుగవ సత్యాన్ని ఆశ్రయించాలి. అదే దుఃఖ కారణ నివారణ మార్గం!