జరిగిన కథ
పోటిసుడు, చంద్రహత్థి మునిపల్లెకు వెళ్తుంటారు. కోడల్ని కలవకుండా సిరిసత్తిని అడ్డుకుంటుంది అణులచ్చి. కుసుమ శ్రేష్ఠిని కలిసేందుకు మంత్రి వస్తున్న సమాచారం అందుతుంది. మిత్రుడు వామదేవునికి చిలకవాడ గురించి చెప్తుంటాడు జయదేవుడు. తర్వాత..
కళింగ నగరపు రాజకోటలోని భూగృహంలో మహామంత్రి ఈసాణుడు.. కుసుమ శ్రేష్ఠితో సమావేశమైనాడు. వాళ్ల చర్చ ఇలా సాగింది.. “కుసుమ శ్రేష్ఠుల వారికి కుశలమే కదా! సకాలంలో అన్నీ సమకూరుతున్నాయి కదా!” “తమ దయ మహామాత్యా! సౌకర్యాలకు కొరతలేదు. మనసుకే సమాధానం కలగడం లేదు. మేం చేసిన నేరమేమో, మాకీ శిక్ష విధించడానికి కారణమేమో తెలియక సతమతమవుతున్నాం..” “మన్నించాలి. మిమ్ములను ఇబ్బంది పెట్టడం మహారాజుల అభిమతం కాదు. కొంతకాలంగా మీ నుంచి సుంకాలు రావడం లేదన్న ఆరోపణ ఉన్నది. మీలాగే ఇంకొందరు పరదేశీయులైన వణిక్ ప్రముఖులకూ ఇదే ‘మర్యాద’ లభించింది..”
“తమరి అభియోగం నిరాధారం మహామాత్యా! వాణిజ్య సుంకాలను మేము ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. గత పర్యటనలో మహారాజుల సరసన కూర్చొని ఒక వేడుకలో కూడా పాల్గొన్నాం. ఆ సంగతి తమరు విస్మరించినట్లున్నారు.” “సరసన కూర్చునే చనువిచ్చినారని సుంకాలకు ఎగనామం పెట్టడం..” “మన్నించండి అమాత్యా! మేము ఎప్పటికప్పుడు సుంకాలు చెల్లిస్తున్నాం. రాజముద్ర గల ఆధార పత్రాలు కూడా మావద్ద ఉన్నాయి.” ఆ మాటలకు పగలబడి నవ్వినాడు ఈసాణుడు. “ఎందుకు నవ్వుతున్నారు?” అయోమయంగా అన్నాడు కుసుమ శ్రేష్ఠి. “మీ అమాయకత్వానికి నవ్వక..” అంటూ.. “అంతఃపురంలోని అంతరంగ చోరులు ఇటువంటి వంచనలతో ప్రతిరాజ ముద్రలు తయారు చేయించి, మీవంటి వారి నుంచి ధనం కొల్లగొట్టి, పలాయనం చిత్తగించినారు” ఆలోచనలో పడిపోయినాడు శ్రేష్ఠి.
“అది మీ అంతర్గత సమస్య. అందులో మా దోషమేమున్నది?” అన్నాడు నెమ్మదిగా తేరుకుంటూ.. “ఆవేశంలో మర్యాదను అతిక్రమిస్తున్నారు శ్రేష్ఠీ!” కటువుగా అన్నాడు అమాత్యుడు. “మీకు ప్రశ్నించే అధికారం ఉండదు. ఈ తలబిరుసుతనం మీరు చెల్లించవలసిన ధనాన్ని రెట్టింపు చేస్తుంది” హెచ్చరించినాడు. “క్షమించండి!” పరిణామాన్ని ఊహించి, నిగ్రహించుకుంటూ.. “మేం చెల్లించవలసినది చెల్లించినాం. వాళ్లు సరైన అధికారులు కాదని తెలుసుకోక పోవడంలో మా దోషం కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడేం చేయవలెనో సూచించండి..” అన్నాడు తన నిస్సహాయతను ప్రకటిస్తూ. “మీరు చాలా తెలివిగలవారు” నవ్వుతూ తనతోపాటు తెచ్చుకున్న పత్రాలలో నుంచి వెతికి, ఒక పత్రం తీసి చూస్తూ.. “గత వార్షిక సుంకం ఎనిమిది వేల కర్షాపణాలు; సకాలంలో చెల్లించనందుకు ఐదు వేల కర్షాపణాలు; అనుమతి లేకుండా సముద్రంలో ఓడలు నిలిపినందుకు పన్నెండు వేల కర్షాపణాలు; ఈ సంవత్సరం చెల్లించవలసిన సుంకం ఎనిమిది వేలు; మీ అధిక ప్రసంగానికి ఆరు వేలు.. మొత్తం ముప్పై తొమ్మిది వేల కర్షాపణాలు” మహామాత్యుని మాటలు విని కళ్లు తిరిగి పడిపోయినాడు కుసుమశ్రేష్ఠి. ఇది ముందే ఊహించిన ఈసాణుడు.. చల్లని నీటిని శ్రేష్ఠి మొఖాన చల్లి మళ్లీ లేపినాడు. ఒళ్లంతా పట్టిన చెమటను తుడుచుకుంటూ..
“ప్రభూ! నాది అధిక ప్రసంగం అనుకుంటే క్షమించండి. ఈ సుంకాల వడ్డన దారిదోపిడీని మించిపోయింది. నా మొత్తం సరుకు విలువ ముప్పై వేలకు మించదు. ఒక్కసారిగా ఇంత మొత్తం నేనెక్కడి నుంచి తేగలను?” అప్రయత్నంగా అతని కళ్లు వర్షించసాగినాయి. “మీరు ఒక్కసారిగా మొత్తం చెల్లించవలసిన పనిలేదు. ఈ మొత్తం రెండు పర్యాయాలుగా చెల్లించవచ్చు” అన్నాడు అమాత్యుడు. ఆలోచనలో పడ్డాడు శ్రేష్ఠి. ‘వ్యాపారులు ప్రజలను దోచుకుంటారన్న అపవాదు ఉన్నది కానీ.. దారిదోపిడీ గాళ్లను మించిన దొంగలు దుర్మార్గులైన పాలకులు. ఇప్పుడు నేను బందీని. వ్యతిరేకంగా మాట్లాడితే మరింత చిక్కుల్లో పడటం తప్ప ప్రయోజనం ఉండదు. ఇక్కడ ఓడలో ఉన్న సరుకుల విలువ 30 వేల కర్షాపణాలు ఉంటుంది. ఉన్నపళంగా అమ్మితే 25 వేలైనా రాకపోవు. అందులో పరివారానికి, పనివారికి ఇవ్వవలసిన సొమ్ము ఇచ్చేసి; మిగతా సొమ్ము సుంకం కింద చెల్లించి ఇంకా ఇవ్వవలసిన మొత్తం తర్వాత చెల్లించగలనని ఇక్కడి నుంచి బయట పడటమే తక్షణ కర్తవ్యం’ అనుకొన్నాడు. “నన్ను ఓడరేవుకు తీసుకొని పొండి. అందులో ఉన్న సరుకులన్నీ ఒక్క మొత్తంగా అమ్మి సుంకం కడతాను. మిగిలినది ఏమైనా ఉంటే ఇంటికి వెళ్లిన తర్వాత వీలు చూసుకుని పంపించగలను” “శుభమస్తు! మంచి నిర్ణయం తీసుకున్నారు. రేపే తమరిని మల్లసు పర్వతానికి తీసుకొని పోతాం. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోండి” అంటూ లేచినాడు మంత్రి. అప్పుడు అర్థమైంది శ్రేష్ఠికి.. అది రాత్రి అని. కానీ, చీకటి పడటానికి ఇంకొక జాము పొద్దున్నదని అతనికి తెలియదు.
సరిగ్గా అదే సమయానికి అక్కడ మిత్రులు ఇద్దరూ ఇట్లా సంభాషించుకుంటున్నారు. జయసేనుడు తనతో పరిహాసమాడుతున్నాడు అనుకున్నాడు వామదేవుడు. “పరిహాసం కాదు మిత్రమా! వాస్తవం! ఇక్కడ చిలుకవాడకు గొప్ప చరిత్ర ఉన్నది. ఇది ఇటు సముద్రానికి అటు కళింగ పట్టణానికి నడుమ ఉంటుంది. సముద్ర తీరం చేరడానికి; సముద్రం నుంచి రాజధానికి చేరడానికి ఇదొక్కటే దారి. ఊరినిండా సుందరాంగులే. వాళ్లదే రాజ్యం. మగవాళ్లు నామమాత్రం. ఉన్నవాళ్లంతా ఆడవాళ్ల చెప్పుచేతల్లో ఉన్నవాళ్లే. రాజ్య రహస్యాలు తెలుసుకోవడానికి శత్రుదేశాల గూఢచారులు కూడా ఇక్కడికి తరచూ వస్తుంటారని చెప్పుకొంటారు” “మరి.. వయసు వచ్చిన తర్వాత కనీసం ఏడు ఎనిమిదేండ్లు తమరు ఈ దారిన వెళ్లి ఉంటారు కదా! ఎప్పుడూ దారి తప్పలేదా మిత్రమా?”.. నర్మగర్భంగా నవ్వుతూ అన్నాడు వామదేవుడు. “నీ అనుమానం నిజమే వయస్యా! కానీ, నాకు ఆ పరిస్థితి ఇంతవరకూ ఎదురు కాలేదు. అందుకు కారణం మా నాయన గారు. ఆయన ప్రతి సంవత్సరం ఈ వాడకు కొంత ధనం చెల్లిస్తాడు. తమ బృందాన్ని ఎవరూ ఆటంక పరచకూడదని. అట్లాగే మా ప్రయాణం రథాలలో, తెరల గూటిబండ్లలో సాగేది.
మేము బయటి వాళ్లని చూడటం గానీ; మమ్ములను బయటివాళ్లు చూసే అవకాశం గానీ కలిగేది కాదు” అన్నాడు జయసేనుడు. “అయ్యో పాపం! మీ నాయనగారి వెంట ఉన్నందుకు సేవక పరివారం అంతా.. మంచి అనుభవాన్ని కోల్పోయేవారు అన్నమాట” అన్నాడు జాలి పడుతున్నట్లుగా వామదేవుడు. “అంత లేదురా దేవా!” నవ్వుతూ అన్నాడు జయసేనుడు.. “మావాళ్లు మహా ఘటికులు. ఇక్కడ కుక్కిన పేనుల్లా ఉండి మల్లసు పర్వతం చేరుకున్నాక ఏదో ఒక మిశ చెప్పి, ఈవాడలో అనుభవం కోసం వచ్చేవాళ్లు. కొందరైతే తమ జీతం సరిపోక అప్పులు చేసి మరీ వెళ్లేవాళ్లు” బిగ్గరగా నవ్వినాడు వామదేవుడు. అంతలోనే అతనికి మరో అనుమానం వచ్చింది. “మరి నీ సంగతి??? నేనేమీ అనుకోను. ఎవరికీ చెప్పను. చెప్పు చెప్పు..” అన్నాడు స్నేహితుణ్ని పరిశీలనగా చూస్తూ. “నువ్వు నమ్మినా, నమ్మకపోయినా.. నేను మాత్రం ఇప్పటిదాకా చూడలేదు. మొన్నటిదాకా భార్య ముఖమే చూడకుండా తథాగతుని మార్గంలో వెళ్లాలనుకున్న వాడిని. ఆ సంగతి నీకు కూడా బాగా తెలుసు” అన్నాడు నిజాయతీగా. “అవును. నిజమే! నేను కూడా ఆ ఆలోచనతోనే ఇంతవరకూ పెళ్లిమాట ఎత్తలేదు. కా..” గుర్రాల మీద మెల్లగా చర్చించుకుంటూ తమకు తెలియకుండానే చిలుకవాడ పొలిమేరలో ప్రవేశించినారు మిత్రులు. హఠాత్తుగా వామదేవుని దృష్టి చందమామలాంటి మోమున్న సుందరాంగి మీద పడింది. అతని గొంతులో మాట గొంతులోనే ఆగిపోయింది.
మునిపల్లె తథాగతుని శిష్యుల బోధనల ముల్లె! ఒకప్పుడు దొంగలకు, దోపిడీగాండ్రకు, శృంగార కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న కాముని పల్లె.. శ్రమణకుల బోధనలతో శాంతి కేంద్రమై, వేల మందిని తన దారిలోకి రప్పించుకోగల బౌద్ధారామంగా మారింది. ఆ ఊరి పొలిమేరలోకి ప్రవేశించగానే ఏదో దివ్యానుభూతి చంద్రహత్థి-పోటిసులను చుట్టేసింది. జన ప్రవాహం పెరిగింది. అందరూ బృందగానం లాగా, మంద్ర స్థాయిలో “బుద్ధం శరణం గచ్ఛామి” “ధర్మం శరణం గచ్ఛామి” “సంఘం శరణం గచ్ఛామి” అని పాడుకుంటూ వెళ్తున్నారు. ఆ శబ్దం చెవుల్లో అమృతం నింపినట్లు ఉన్నది; మనసులో శాంతి వనాలు నాటుతున్నట్లు అనిపిస్తున్నది. అప్పుడు సూర్యాస్తమయాన్ని చూసిన పోటిసుడు ఆ దృశ్యాన్ని తన హృదయేశ్వరి చంద్రహత్థికి చూపిస్తూ..
“గౌరవమున వెలుగు ఘనులీ జగమునందు నట్లె వెలుగ గలరు హత్థి చూడు అస్తమించు వేళనైన యశః కాంతి పైకి ప్రాకు సూర్యువలెను నిజము (చంద్రహత్థీ! గౌరవంగా బతికేవాళ్లు సూర్యునిలాగే ఉంటారు. అదిగో ఆ సూర్యుణ్ని చూడు! తాను మునిగిపోతున్నా, తన కిరణాలు పైకే చూస్తున్నాయి కదా!)” అంటూ.. పడమటి కొండల దాపునకు వెళ్తున్న సూర్యుని కిరణాలు ఊర్ధ్వముఖంగా ప్రసరించడాన్ని గమనించమన్నాడు. ప్రకృతిని బట్టి, పరిస్థితులను బట్టి, పరిసరాలను బట్టి మానవ ప్రకృతి వికసిస్తుంది. అంతవరకూ మోహంతో ఒకరినొకరు చూసుకున్న ఆ యువతీ యువకులు.. బుద్ధుడిని తలచుకోగానే ప్రకృతిలోని ఔన్నత్యం అంతా వాళ్ల కళ్లకు ఉదాత్తంగా కనిపిస్తున్నది. ఆ సూర్యునికి, తన హృదయాకాశంలో వెలిగే పోటిసుడనే సూర్యునికి ఏకకాలంలో నమస్కరించింది చంద్రహత్థి. మునిపల్లెలో ఎవరిని అడిగినా ‘ఈ పక్కనే ఆ సభాస్థలి’ అని చెప్తున్నారు కానీ, ఆ పక్కన ఒక ఉత్సవాన్ని తలపించే శబ్దం మాత్రం వాళ్లకు వినిపించడం లేదు. చివరికి ఒక సమూహంతో కలిసి ఆ సమావేశ స్థలానికి చేరుకున్నారు. ఆ దృశ్యం వాళ్లని మైమరిపింపజేసింది. పిండి ఆరబోసినట్లున్న వెన్నెలలో విశాలమైన మైదానం. ఆ మైదానం నడుమ ఒక వేదిక. ఆ వేదిక ముందు వేలాది మంది కూర్చుని ఉన్నారు. అక్కడ మనుషులు ఉన్నారన్న విషయం మాత్రం చూసి గ్రహించవలసిందే. అంతమంది మనుషులు అక్కడ ఉన్నా, చిన్న ఆకు కదిలిన శబ్దం కూడా లేదు. అందరూ శ్రమణకులు చెప్పే మాటల కోసం నిలువెల్లా చెవులు చేసుకొని, ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూస్తున్నారు.
(సశేషం)
దారిదోపిడీ గాళ్లను మించిన దొంగలు దుర్మార్గులైన పాలకులు. ఇప్పుడు నేను బందీని. వ్యతిరేకంగా మాట్లాడితే మరింత చిక్కుల్లో పడటం తప్ప ప్రయోజనం ఉండదు. ఇక్కడ ఓడలో ఉన్న సరుకుల విలువ 30 వేల కర్షాపణాలు ఉంటుంది. ఉన్నపళంగా అమ్మితే 25 వేలైనా రాకపోవు. అందులో పరివారానికి, పనివారికి ఇవ్వవలసిన సొమ్ము ఇచ్చేసి; మిగతా సొమ్ము సుంకం కింద చెల్లించి ఇంకా ఇవ్వవలసిన మొత్తం తర్వాత చెల్లించగలనని ఇక్కడి నుంచి బయట పడటమే తక్షణ కర్తవ్యం..